అప్పుడు కృష్ణలంకలో..ఇప్పుడు సినిమా సెట్‌లో
‘‘విజయం అనేది ఒక ప్రయాణం అని ‘మహర్షి’చిత్రంలో మహేష్‌బాబు చెప్పిందే నా సిద్ధాంతం కూడా. నటుడిగా ఈ ప్రయాణమే తృప్తినిస్తోంది’’ అంటున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. కృష్ణ అల్లుడిగా, మహేష్‌ బావగా ప్రేక్షకులకు పరిచయమైనా... ప్రేక్షకులపై తనదైన ముద్ర వేశారు సుధీర్‌. ‘సమ్మోహనం’తో నటుడిగానూ నిరూపించుకొన్న ఆయన ప్రస్తుతం మల్టీస్టారర్‌ చిత్రం ‘వి’తో బిజీగా గడుపుతున్నారు. తదుపరి పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కోసం రంగంలోకి దిగబోతున్నారు. శనివారం సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఈనాడు సినిమా’తో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు.


నాజూగ్గా మారిపోయారు. సినిమా కోసమేనా?
చేస్తున్న రెండు సినిమాల్లోనూ నాజూగ్గా కనిపించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్పు. పైగా ఈ రెండు సినిమాలు కూడా 20 రోజుల తేడాతో మొదలవుతాయి. ‘వి’ సినిమా మొత్తం ఇలా కనిపించినా ఫర్వాలేదు కానీ... పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో పాత్ర మూడు కోణాల్లో సాగుతుంది. ఆ పాత్ర కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉండాలి.

అలాంటి పాత్రలు నటులకి పెద్ద సవాల్‌ కదా?
శారీరకంగా ఎప్పటికప్పుడు మారుతూ నటించడం పెద్ద టాస్కే. కానీ నా దృష్టిలో అంతకి మించిన సవాల్‌ ఏంటంటే ఒక క్లిష్టమైన పాత్ర ఆత్మని అర్థం చేసుకొని నటించడం. బరువు తగ్గడం, పెరగడంపై తగిన అవగాహన ఉంటే సులభంగానే చేయొచ్చు. నేను ఆహార నియమాలతో పాటు... క్రమం తప్పకుండా గంట వ్యాయామం చేస్తుంటాను.

నానితో కలిసి నటిస్తున్న ‘వి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అందులో నేనొక పోలీసు అధికారిగా కనిపిస్తా. నాలోని నటుడికి... ‘సమ్మోహనం’లో చేసిన పాత్ర కంటే ఎక్కువ సవాల్‌ విసిరే పాత్ర అది. ‘సమ్మోహనం’లో పాత్రకి కొన్ని హద్దులు, ప్రత్యేకమైన ఐడియాలజీ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ పాత్ర కోసం ఏసీబీ అధికారి శ్రీకాంత్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా. గన్‌ ఎలా పట్టుకోవాలి? తోటి అధికారులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? ఛేజింగ్‌ సమయాల్లో బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది? ఇలా ఆ విషయాలన్నీ తెలుసుకొంటూ సిద్ధమయ్యా.
‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మళ్లీ మిమ్మల్నే హీరోగా ఎంచుకోవడానికి కారణమేంటి?
మోహనకృష్ణతో మళ్లీ సినిమా చేస్తాననుకొన్నాను కానీ.. ఇంత త్వరగా ఆ అవకాశం వస్తుందనుకోలేదు. ఆయనకి ఒక్కసారి నటులు నచ్చారంటే వాళ్లని పునరావృతం చేస్తుంటారు. నేనొక ప్రాజెక్టు గురించి చర్చించడానికి ఆయన దగ్గరికి వెళ్లా. ఆ సందర్భంలో నన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు తప్ప... ముందుగా మేం అనుకొన్నది మాత్రం కాదు.

నానితో కలిసి తెరను పంచుకొంటున్నారు. కలిసి నటించడం గురించి ఎప్పుడైనా మాట్లాడుకొనేవారా?
నటుడు కాక ముందు నుంచే నాకు నాని పరిచయం. మేం చాలాసార్లు కలిశాం కానీ.. ఎప్పుడూ ఇలా కలిసి నటించడం గురించి మాట్లాడుకోలేదు. అయితే హిందీలో నేను విలన్‌గా చేసిన ‘బాఘీ’ చూశాక తను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశాడు. ఆ సందర్భంలోనే మా ఇద్దరికీ మధ్య విలన్‌ పాత్ర గురించి చర్చ జరిగింది. తను ‘నేనూ విలన్‌గా ప్రయత్నిస్తా’ అన్నాడు. అనుకోకుండా మేమిద్దరం కలిసి చేస్తున్న ‘వి’లోనే తను వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్ర చేస్తున్నాడు (నవ్వుతూ).

పుల్లెల గోపీచంద్‌తో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. అది సినిమాకి బాగా ఉపయోగపడుతుంది కదా?

బయోపిక్‌ చేస్తున్నప్పుడు తెలుసుకోవల్సింది చాలా ఉంటుంది. పుల్లెల గోపీచంద్‌ నాకు సీనియర్‌. బెంగళూరులో శిక్షణ తీసుకొనేటప్పుడు మేం కలిసి ప్రయాణం చేశాం. ఒక వ్యక్తి పరిచయం ఉంటే వాళ్ల మేనరిజమ్స్‌ తెలుస్తాయి. పుల్లెల గోపీచంద్‌తో కలిసి చేసిన ప్రయాణం, ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు పాత్రని మరింతగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి.

ఫిట్‌నెస్‌ విషయంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది? దానికి ప్రేరణ ఏమిటి?
మా అమ్మ చలవే అదంతా. ‘ఎప్పుడూ హుషారుగా ఉండాలి. మంచి డ్రెస్సింగ్‌తో కనిపించాల’ని మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పేవారు. ఫిట్‌నెస్‌ గురించి నేనేమీ గంటల తరబడి జిమ్‌లో గడపను. తగిన సమయం కేటాయిస్తానంతే.

చిన్నప్పుడు పుట్టినరోజుని ఎలా జరుపుకొనేవారు? ఈసారి వేడుకలు ఎక్కడ?
చిన్నప్పుడు కృష్ణలంకలోని గుంటూరువారి వీధిలో ఉండేవాళ్లం. పుట్టినరోజు అనగానే నేను మా అక్క ఉదయాన్నే తయారైపోయేవాళ్లం. ఇంటింటికీ వెళ్లి చాకెట్లు, కేక్‌ పంచడం, ఆ తర్వాత వీధిలో బ్యాడ్మింటన్‌ ఆడటం. హీరో అయ్యాక అభిమానుల మధ్యనే వేడుకలు. ఈసారి ‘వి’ సెట్‌లోనే నా పుట్టినరోజు సందడి.

నిర్మాతగా ‘నన్ను దోచుకుందువటే’ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. కారణమేమిటి?
ఏడాదికి ఒకటైనా చేయాలని ఉంది. ఈమధ్య దర్శకులు నిర్మాణ సంస్థలతో కలిసే నా దగ్గరికి వస్తున్నారు. ఒకవేళ మంచి కథ ఉండి, నిర్మాతలెవ్వరూ లేకపోతే మా సంస్థ నుంచే నిర్మిస్తా.

కథానాయకుడిగా కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేమైనా ఉన్నాయా?
రచయిత, నటుడు హర్షవర్థన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. ఆయనతో పాటు ఇంకా ముగ్గురు దర్శకులు చెప్పిన కథలు కూడా నచ్చాయి. ఇకపై ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తా. నటుడిగా ఎక్స్‌పోజర్‌ పెరిగాక నా దగ్గరికి వస్తున్న కథల సంఖ్య కూడా పెరిగింది.

బాలీవుడ్‌ నుంచి మళ్లీ అవకాశాలు వస్తున్నాయా?
‘బ్రహ్మాస్త్ర’ మొదలుకొని చాలా అవకాశాలు వచ్చాయి. కానీ బాలీవుడ్‌లో సినిమా అంటే చాలా సమయం వెచ్చించాలి. అందుకే తెలుగు సినిమాలపైనే దృష్టిపెట్టా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.