‘కలర్‌ఫోటో’ విషయంలో అదొక్కటే బాధ!

‘నటుడిగా ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలే చేయాలని లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. కథ బాగుండి.. పాత్రలో కొత్తదనముంటే ఎలాంటి పాత్రలో నటించడానికైనా నేను సిద్ధమే’’ అన్నారు సుహాస్‌. ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో హాస్యనటుడిగా మెప్పించిన ఆయన.. ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. సందీప్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇటీవలే ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘ఈనాడు సినిమా’ (సితార)తో ముచ్చటించారు సుహాస్‌.

అందరి కథ..

అందరి జీవితాల్లో కనిపించే అనేక యదార్థ సంఘటనలు, దర్శకుడు సందీప్‌ నిజ జీవితంలోని కొన్ని అనుభవాల స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. మేం లఘు చిత్రాలు చేసే రోజుల నుంచీ.. ‘కచ్చితంగా ఒక పెద్ద సినిమా చేయాలి’ అని కలలు కనే వాళ్లం. ఎట్టకేలకు ఆ కల ‘కలర్‌ ఫొటో’ రూపంలో సాకారమైంది. దీనికి తోడు తొలి చిత్రంతోనే అందరూ మాట్లాడుకునేలా చేయడం మరింత గర్వంగా అనిపిస్తోంది. ఆటోల వెనుక ‘మీ ఏడుపులే మాకు దీవెనలు’ అని కొటేషన్లు చూసేవాడిని. ఇప్పుడది ఈ సినిమా విషయంలో నిజమైందనిపిస్తోంది (నవ్వుతూ).

భయపడ్డా.. అదొక్కటే బాధ

ఈ సినిమా విడుదలకు ముందు వరకు.. ‘ప్రేక్షకులు నన్ను కథా నాయకుడిగా ఆదరిస్తారా? వాళ్లని మెప్పించగలుగుతానా? లేదా?’ అని చాలా భయపడ్డా. ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘నువ్వు తెగ ఏడిపించేశావని, నిజాయితీగా తీశార’ని ఫోన్‌ చేసి ప్రశంసిస్తుంటే మాటలు రావట్లేదు. ఈ చిత్రాన్ని వెండితెరపై చూసుకోనుంటే.. ఆ అనుభూతి మరోలా ఉండేది. ఈ సినిమా విషయంలో నాకున్న బాధ ఇదొక్కటే.

కొరియోగ్రాఫర్‌ అవ్వాలనుకున్నా..!

పరిశ్రమలోకి రాకముందు నాకు కొరియోగ్రాఫర్‌ అవ్వాలని కోరిక ఉండేది. స్నేహితుల ప్రోత్సాహంతో పూర్తిగా నటనపై దృష్టి పెట్టా. నేను పుట్టిపెరిగిందంతా విజయవాడలోనే. అక్కడే బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్న చిన్న స్కిట్లు, డ్యాన్స్‌ షోలు చేస్తుండేవాడిని. ఈ క్రమంలోనే మా గురువు తేజ అన్న పరిచయంతో నటనపై మరింత ఆసక్తి పెరిగింది. డిగ్రీ తర్వాత సినిమాల వైపు వెళ్లాలనుందని ఇంట్లో చెప్పా. మొదట అమ్మానాన్న సానుకూలంగానే స్పందించారు. కానీ, ఏదైనా ఏడాదిలోపు సాధించు. కుదరకపోతే.. వేరే ఏదన్నా చూసుకోవాలని షరతు పెట్టారు. నేను ఇంకో ఆర్నెళ్లు.. ఏడాది.. అంటూ ఏడేళ్లు నెట్టుకొచ్చాశా.

కష్టాలు పడ్డా.. ఈ ప్రయాణం బాగుంది

నా జీవితంలోనూ సినిమా కష్టాలున్నాయి. అలాగని అవంత పెద్దవీ కాదు.. చిన్నవీ కాదు. జేబులో డబ్బుల్లేక ఇబ్బంది పడిన రోజులు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా రూ.500 ఇస్తే పండగలా అనిపించేది. చాలాసార్లు ఇవన్నీ మనకెందుకు తిరిగి వెళ్లిపోదామనిపించేది. అలా అనిపించినప్పుడల్లా.. ‘అసలు మనమెందుకొచ్చాం, ఏం సాధించాం? ఏదీ వెంటనే రాదు కదా!’ అని నాకు నేను సమాధానం చెప్పుకొనే వాడిని. ఇప్పుడవన్నీ గుర్తు చేసుకుంటే.. ఈ ప్రయాణం చాలా బాగుంది కదా అనిపిస్తుంటుంది.

నిజ జీవితంలో నా ప్రేమ..

నాది ప్రేమ వివాహమే. నా భార్య పేరు లలిత. మాది చాలా సింపుల్‌ లవ్‌స్టోరీ. ‘కలర్‌ ఫొటో’లో ఉన్నట్లు ఎలాంటి ట్విస్ట్‌లు, గొడవలు లేవు. డిగ్రీలో ఇద్దరం క్లాస్‌మెట్స్‌. మొదట మంచి స్నేహితులం. తర్వాత ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని అర్థమయ్యాక.. తనకి ప్రపోజ్‌ చేశా. వెంటనే ఒప్పుకొంది. డిగ్రీ పూర్తయ్యాక నేను పరిశ్రమలోకి రావడం, లఘు చిత్రాలతో బిజీగా మారడం చకచకా జరిగిపోయాయి. నేను కాస్త సెట్‌ అయ్యా అనుకున్నాక.. ఇద్దరం ఒకేసారి మా ఇళ్లలో ప్రేమ విషయం తెలియజేశాం. వాళ్లూ ఒకే అన్నారు. అలా మా ప్రేమకథ మూడేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కింది.

కొత్త సినిమాలు.. దర్శకత్వం

మెహర్‌ తేజ్‌ అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేశా. తనూ మా షార్ట్‌ ఫిల్మ్‌ బృంద సభ్యుడే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలవుతుంది. నితిన్‌తో ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నా. దీంతో పాటు మరికొన్ని చిత్రాలూ సెట్స్‌పై ఉన్నాయి. దర్శకత్వం చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఏం లేదు. అది చాలా పెద్ద బాధ్యత. అప్పుడప్పుడూ కొన్ని ఆలోచనలొస్తుంటాయి. కానీ, ఇప్పుడే ఎందుకు అనిపిస్తుంటుంది.

                               Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.