ప్రపంచ స్థాయిలో ‘హిరణ్య’ తీయబోతున్నాం..
                                         

‘‘రాజమౌళి, శంకర్‌ల వల్ల హాలీవుడ్‌ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన సినిమాలు రూపొందుతున్నాయి. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి చిత్రాలు బాగా అలవాటైతే ప్రేక్షకులు ఇంకా ఆస్వాదిస్తారు. రానున్న రోజులన్నీ కొత్త రకమైన కథలతో తెరకెక్కే చిత్రాలవే’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు. ఆయన నిర్మాణంలో... రవిబాబు దర్శకుడిగా రూపొందిన చిత్రం ‘అదుగో’. బుధవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో డి.సురేష్‌బాబు విలేకర్లతో మాట్లాడారు. ఆ విషయాలివీ..


* చంద్రబాబు నాయుడు కారు కూడా కనిపిస్తుంది..
‘‘రవిబాబుతో ‘అల్లరి’ నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. ‘అదుగో’ మేం ఎంతో శ్రమించి చేసిన సినిమా. పందిపిల్ల కీలకమైన బంటి పాత్రని పోషించింది. నగరంలో తిరిగే దాని కోసం నలుగురు ప్రతినాయకులు వెంటపడుతుంటారు. పంది పిల్లతో సరదా సరదాగా ఒకబ్బాయి, ఓ ప్రేమజంట తిరుగుతుంటారు. దాని కారణంగానే నాయకానాయికల ప్రేమ నెరవేరుతుంది. పంది వల్ల పట్టణ భూముల సమస్య, రౌడీషీటర్ల సమస్య కొంతమేర తగ్గుతాయి. అదెలా అనేది తెరపైనే చూడాలి. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు కారు కూడా కనిపిస్తుంది. పంది, కుక్క మధ్య సాగే పోరాటం, పిల్లులుతో కలిసి పంది గడిపే దృశ్యాలు... వీటన్నిటినీ ఓ లైవ్‌ యాక్షన్‌ యానిమేటెడ్‌ చిత్రం రూపంలో ఆద్యంతం అలరింంచేలా రవిబాబు చూపించారు. అందరూ పంది కోసమే వెతుకుతుంటారు కాబట్టి ‘అదుగో’ అనే పేరుని రవిబాబు నిర్ణయించారు. పైగా తనకి అల్లరి సినిమా నుంచి ‘ఎ’ అక్షరం సెంటిమెంటుగా కలిసొచ్చింది కదా! ‘అదుగో’కి సీక్వెల్‌ కూడా తీస్తాం’’.


* రానా నిర్మాతగా ‘హిరణ్య’..
వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్‌లో ‘వెంకీ మామ’ చిత్రాన్ని త్వరలో ఆరంభించనున్నాం. బాబి దర్శకత్వం వహిస్తారు. అలాగే వెంకటేష్‌ కథానాయకుడుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రసన్నకుమార్‌ రచయిత. మా సురేష్‌ ప్రొడక్షన్స్‌ మరో పెద్ద సంస్థతో కలిసి ‘హిరణ్య’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తుంది. నేను పర్యవేక్షణ బాధ్యతనే స్వీకరిస్తాను. రానా నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇది హాలీవుడ్‌ స్థాయి సాంకేతిక విలువలతో తెరకెక్కుతుంది.
* తరుణ్‌ భాస్కర్‌తో మరో మూడు చిత్రాలు..


* సమంత ‘మిస్‌ గ్రాని’
నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత కథానాయికగా ‘మిస్‌ గ్రాని’ని నిర్మించనున్నాం. అలాగే యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌తో మూడు సినిమాలు తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ఒక చిత్రాన్ని తన దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తుండగా, రెండో చిత్రాన్ని మా సంస్థతో కలిసి తనే దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తారు. విభిన్నమైన కథల్ని ఇతర సంస్థలతో కలిసి తీసే సన్నాహాలు చేస్తున్నాను. వీటితో పాటు రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో ఓ చిత్రం, మహేంద్ర దర్శకత్వంలో ‘దొరసాని’ అనే మరో చిత్రాన్ని నిర్మించనున్నాం. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక జంట ప్రేమకథ. అంతా కొత్తవారే నటిస్తారు’’.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.