ఎస్వీఆర్‌ పుస్తకం వెనుక 20 ఏళ్ల కష్టం!

‘‘తెలుగు చిత్రసీమలో ఎన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావు. అంతటి గొప్ప నటుడిపై జీవితంపై ఇంతవరకు పూర్తిస్థాయిలో ఏ పుస్తకం రాలేదు. ఇది నిజంగా సినీప్రియుల్లో అసంతృప్తిని కలిగించే అంశం. ఇప్పుడా లోటును తీర్చేందుకే ‘మహానటుడు: ఎ ఫొటో బయోగ్రఫీ ఆఫ్‌ ఎస్వీఆర్‌’ పుస్తకాన్ని తీసుకొచ్చా’’ అన్నారు ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ సంజయ్‌ కిషోర్‌. గతంలో అక్కినేని జీవితగాథను ‘మన అక్కినేని’ పేరుతో ఫొటో బయెగ్రఫీగా పుస్తక రూపంలో తీసుకొచ్చిన సంజయ్‌.. ఇప్పుడు సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఎస్వీఆర్‌పై ఫొటో బయోగ్రఫీని తీసుకొచ్చారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రముఖ కథానాయకుడు చిరంజీవి చేతుల మీదుగా జరిగింది. ఈ నేపథ్యంలో ‘మహానటుడు’ పుస్తకం గురించి సితార.నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.


*
‘‘నాకు చిన్నప్పటి నుంచి పాత తరం నటులంటే చాలా ఇష్టం. సావిత్రి, అక్కినేని, ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ వంటి గొప్ప నటుల సినిమాలు చూస్తూ పెరిగాను. వీరిలో ఎస్వీఆర్‌ అంటే నాకు విపరీతమైన అభిమానం. తెరపై ఆయన నటన చూసినప్పుడల్లా ఓ గొప్ప అనుభూతికి లోనయ్యేవాడిని. అలాంటి గొప్ప నటుడికి సంబంధించి పుస్తకాలేమైనా ఉన్నాయేమోనని ఓ సందర్భంలో వెతగ్గా.. ఆయనపై ఒక్కటంటే ఒక్క పుస్తకం కూడా దొరకలేదు. ఇది నాకు బాధను కలిగించింది. అప్పుడే ఆయనపై పుస్తకం తీసుకురావాలని నిర్ణయించుకున్నా. అందుకే కళాశాలలో చదివే రోజుల నుంచే ఆయనపై పరిశోధన చేయడం మొదలు పెట్టా. నాకు మొదటి నుంచి ఫొటోల సేకరించడమనేది ఓ హాబీ. ఇదే నన్ను ఆయనపై ఫొటో బయోగ్రఫీ చేయగలిగేలా చేసింది. ప్రస్తుతం రాబోతున్న పుస్తకం వెనుక దాదాపు 20 ఏళ్ల కష్టముంది. ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌పై ఇలా ఓ సమగ్రమైన ఫొటో బయోగ్రఫీ తీసుకురావడం దేశంలోనే ఇదే తొలిసారి కూడా’’.


*
‘‘ఈ పుస్తకం తీసుకొచ్చే క్రమంలో ఎస్వీఆర్‌ సతీమణి లీలావతి రంగారావు కూడా ఎంతో సహాయ సహకారాలందించారు. ఆమె ద్వారా వారి వారసుల ద్వారా ఎస్వీఆర్‌ ఫ్యామిలీ ఫొటోలను చాలా వరకు సంపాదించగలిగా. ఇక అసలైన సవాలు ఆయన సినీ జీవితం దగ్గర ఎదురైంది. ఎందుకంటే అప్పటి ఫొటోలు సేకరించడానికి.. ఆ తరం నటీనటులు కానీ, స్టిల్‌ ఫొటోగ్రాఫర్లు, దర్శకులు చాలా మంది ఇప్పుడు లేరు. ఉన్న కొద్దిమంది పాతతరం నటీనటులను, అప్పటి డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, దర్శకులను వెతికి పట్టుకోని మరీ ఎస్వీఆర్‌కు సంబంధించిన ఫొటోలను సేకరించా. దీని కోసం ఎన్నో ఊర్లు కూడా తిరగాల్సి వచ్చింది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి దాదాపు 400పైగా ఫొటోలతో ఆయన ఫొటో బయోగ్రఫీకి కావల్సిన పూర్తి సమాచారాన్ని సేకరించా. ఇక వీటన్నింటినీ సందర్భానుసారంగా ఒక దగ్గర అందంగా కూర్చి, ఆకట్టుకునేలా తయారు చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఈలోగానే అక్కినేని నాగేశ్వరరావు మీద ‘మన అక్కినేని’ పేరుతో ఓ ఫొటో బయోగ్రఫీ తీసుకొచ్చా. దానికి మంచి పేరు వచ్చింది’’.


*
‘‘ఇదంతా నేను లాభాన్ని ఆశించి చేస్తున్న పని కాదు. భావి తరాలకు ఇలాంటి గొప్ప నటుల గురించి తప్పక తెలియాలనే ఈ పనికి నడుంబిగించా. వాస్తవానికి అక్కినేని వంటి స్టార్‌ హీరోల గురించి సమాచారం సేకరించడం చాలా సులభమే. ఎందుకంటే వారికంటూ అభిమాన సంఘాలు ఉంటాయి. ప్రత్యేకంగా వార్తా కవరేజీలు ఉండేవి. కాబట్టి వారి ఫొటోలను సేకరించడం చాలా వరకు సులువు. కానీ, ఎస్వీఆర్‌ వంటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు ఇలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇదొక సవాల్‌తో కూడిన ప్రక్రియ. ఏదేమైనా అందరి సహాయ సహకారాలతో, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో దీన్ని విజయవంతంగా పూర్తి చేశా. ఎస్వీఆర్‌ శత జయంతి సంవత్సరంలో తెలుగు జాతికి ఈ ‘మహానటుడు’ పుస్తకాన్ని కానుకగా ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నా. త్వరలోనే నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా మరో ఫొటో బయోగ్రఫీ తీసుకురాబోతున్నా. ప్రస్తుతం దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలోనే ఉన్నా’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.