సినిమా లేని నా జీవితాన్ని ఊహించలేను
‘‘చిన్నప్పటి నుంచి నేను మితభాషినే. అదే నా అలవాటు. నేనిలా నలుగురితో మాట్లాడటం మొదలు పెట్టింది కూడా నాకు 19 ఏళ్లు దాటిన తర్వాత నుంచే’’ అని చెప్తోంది సీనియర్‌ కథానాయిక టబు. గతేడాది ‘సంజూ’, ‘అంధాదున్‌’ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న ఈ సీనియర్‌ భామ.. ఇప్పుడు ‘దే దే ప్యార్‌దే’ చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇందులో అజయ్‌ దేవ్‌గణ్‌కు భార్యగా మంజు అనే పాత్రలో దర్శనమివ్వబోతుంది. అకీవ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది టబు.


* సోషల్‌ మీడియా వ్యతిరేకిని కాదు..

‘‘నేను సోషల్‌ మీడియాకు వ్యతిరేకం కాదు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారిని నేను అభినందిస్తా. కానీ, నేను మాత్రం వారిలాగా చేయలేను. అందుకే సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటా. నా అభిప్రాయాల్ని అందరితో పంచుకోవడం నాకంతగా నచ్చదు. నాకు ఫొటోలంటే ఇష్టం. నేనొక ఫొటోగ్రాఫ్‌ పర్సన్‌ని.


* నేను చిన్నప్పటి నుంచి అంతే..
‘‘ప్రజలు నా గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారనో? వారేదో అడిగారనో? వారికి నా గురించి చెప్పడం ఇష్టముండదు. అది నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించినప్పుడే చెప్తా. చిన్నప్పటి నుంచి నా వ్యక్తిత్వం ఇంతే. నేనంత సులువుగా నా మనోభావాలను వ్యక్తపరచలేను. నేను తొలిసారి నలుగురిలో మాట్లాడింది నాకు 19 ఏళ్లు దాటిన తర్వాతే. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నానంటే అది వృత్తిపరంగా అవసరం కాబట్టే. కానీ, ఇలా ఉండటాన్ని నేనెంతో ఆస్వాదిస్తున్నాను’’.


* ఆ జీవితాన్ని ఊహించలేను..
‘‘సినిమా లేని జీవితాన్ని నేను ఊహించలేను. ఇప్పుడు అందరూ నన్నింతగా అభిమానిస్తున్నారంటే దానికి కారణం నేను చేస్తున్న పనే. నటనే నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసింది. నేను చేసిన సినిమాలు, సహ నటులు అందించిన ప్రోత్సాహం నేను నటిగా ఎదిగేందుకు సహకరించాయి. సాధారణంగా చిత్ర పరిశ్రమ అనగానే నటీనటులు ఇమేజ్‌ వెంట పరుగులు తీస్తుంటారనుకుంటారు. కానీ, నేనెప్పుడూ అలాంటి పొరపాటు చేయలేదు. పాత్రలో ఒదిగిపోయేందుకు అవకాశమున్న కథల్లో నటించాలనేది నా బలమైన కోరిక’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.