25 రోజులు వీల్‌ ఛైర్‌లో కూర్చునే నటించా!
తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసుల్ని ఝుమ్మనిపించిన అందం... తాప్సి. ఆ తర్వాత వరుసగా అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకొంది. ప్రస్తుతం హిందీలో వరుస విజయాలతో దూసుకెళుతున్నా... తెలుగుని మాత్రం మరిచిపోలేదు. యేడాదికొక సినిమా చొప్పున చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని మురిపిస్తోంది. ఆమె ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తాప్సి సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...


* కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలే చేస్తున్నట్టున్నారు...
- సినిమా అనేది దర్శకుల మాధ్యమం. మిగిలినవాళ్లంతా సినిమాకి ఒకొక్క పనిముట్టుగా ఉపయోగపడతాం. ఐదారేళ్లుగా దర్శకుల ఆలోచనలకి తగ్గట్టుగానే పనిచేస్తున్నా. ‘గేమ్‌ ఓవర్‌’ మొదలైన సమయంలో ఇది సోలో హీరోయిన్‌ కథ, ఈ కథ మొత్తాన్ని నా భుజాలపైనే మోయాలనే విషయాలు గుర్తుకే రాలేదు. కానీ విడుదల సమయం దగ్గర పడుతున్నకొద్దీ ఒత్తిడి పెరిగింది. నాకు గుర్తింపు ఉన్న మూడు భాషల్లోనూ విడుదలవుతున్న చిత్రమిది. సినిమాల్లో 90 శాతం నేనే కనిపిస్తాను కాబట్టి... నటిగా నాకు నిజమైన పరీక్ష ఇది.

* హిందీలో కథాబలమున్న చిత్రాలు చేస్తూ విజయాలు అందుకొంటున్నారు. దక్షిణాదిలో ‘గేమ్‌ ఓవర్‌’ చేయడానికి ప్రేరేపించిన విషయాలేమిటి?
- యేడాదిన్నర కిందట అశ్విన్‌ శరవణన్‌ ఇచ్చిన ఈ స్క్రిప్టుని చదివాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే నిర్మాత శశికాంత్‌కి ఫోన్‌ చేసి తెలుగు, తమిళంలోనే కాదు... ఇంకే భాషలోనైనా ఈ సినిమా చేయడానికి నేను సిద్ధం అని చెప్పా. ఇలాంటి కాన్సెప్ట్‌ని భారతీయ సినిమాల్లోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా చూడలేదు. దర్శకుడు ఇదివరకు తమిళంలో ‘మాయ’ చేశారు. ఆ చిత్రం తెలుగులో ‘మయూరి’గా విడుదలైంది. నేను కూడా తమిళంలో ‘కాంచన2’ తర్వాత సినిమా చేయలేదు. అలా ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో మొదలు పెట్టాం. అనురాగ్‌ కశ్యప్‌ ఈ సినిమాని చూసి హిందీతో పాటు, విదేశాల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించారు.

* ప్రచార చిత్రాల్లో వీల్‌ ఛైర్‌పై కూర్చుని కనిపిస్తున్నారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
- వీడియో గేమ్‌ ప్రోగ్రామ్‌ డిజైనర్‌గా కనిపిస్తా. హైటెక్‌ మోడ్రన్‌ వీడియో గేమ్స్‌ని డిజైన్‌ చేస్తుంటుంది కానీ... పాత కాలపు గేమ్స్‌ ఆడుతుంటుంది. అదెందుకనేది తెరపైనే చూడాలి. సినిమాలో 60 శాతం వరకు వీల్‌ ఛైర్‌లో కూర్చునే కనిపిస్తాను. ఒక పెద్ద ప్రమాదానికి గురైన అమ్మాయిగా నటించాను. ఆ ప్రమాదం ఎలా జరిగింది? యేడాది తర్వాత మళ్లీ ఆ అమ్మాయి జీవితం ఎలాంటి ఆటుపోట్లకి గురైందన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమా కోసం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో శ్రమించాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడూ నేను వీల్‌ ఛైర్‌లో కూర్చోలేదు. 25 రోజులు వీల్‌ ఛైర్‌లో కూర్చునే నటించాల్సి వచ్చింది.


* హిందీ చిత్రం ‘బద్లా’తో రూ: వంద కోట్ల కథానాయిక అనిపించుకొన్నారు. ఇక నుంచి మీపైన అంచనాలు మరింత పెరుగుతాయేమో కదా?
- అంచనాలు లేకపోతే నటుల జీవితంలో కిక్కే లేదు. సినిమా గురించి ప్రేక్షకులు ఎదురు చూడటం, మాట్లాడుకోవడం నటులకి ఎప్పుడూ ఆనందాన్నిచ్చే విషయమే. ఇకపైన నా ప్రతి సినిమా వంద కోట్లు సాధించాలని కోరుకుంటున్నా.

* అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంటుంది?
- అభిషేక్‌ బచ్చన్‌తో నటిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో... అమితాబ్‌తో నటించడం కూడా అంతే. ఇతర సహనటుల్లాగే ఆయన కలిసిపోతుంటారు. దాంతో నేనెప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. మేమిద్దరం కలిసి చేయబోయే మూడో చిత్రం కూడా ఇలాగే విజయవంతం కావాలి.

* కథల ఎంపికలో ఇటీవల ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఆ విషయంలో మార్పు ఎక్కడ మొదలైందంటారు?
- ఆరంభంలో చాలా తప్పులు చేశాను. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే కాకుండా, ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నా. అదే నా ప్రయాణంలో మార్పు తీసుకొచ్చింది. ప్రేక్షకుడు నా సినిమాకి ఎందుకు రావాలి? ఆ విలువ నేను వింటున్న కథల్లో ఉందా లేదా? అనే ప్రశ్నలు వేసుకొని సినిమాల్ని ఎంపిక చేయడం అలవాటు చేసుకొన్నా.* వాణిజ్య ప్రధానమైన చిత్రాలు... గ్లామర్‌తో కూడిన పాత్రలకి దూరమయ్యాననే అభిప్రాయం ఎప్పుడైనా కలిగిందా?
- బాగా డ్యాన్స్‌ చేయడంతోపాటు.. అందంగా కనిపించే కథానాయికలు చాలామంది ఉన్నారు. భిన్నమైన కథల కోసం నాలాంటి కథానాయికల్ని ఎంపిక చేసుకుంటున్నారు. గ్లామర్‌ ప్రధానమైన పాత్రలు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అందులో కూడా మంచి కథ ఉండాలి.


* తెలుగు నుంచి ఎలాంటి కథలు వస్తున్నాయి?
- తెలుగు సినిమా చాలా మారింది. మంచి కథలు వస్తున్నాయి. అందుకే తప్పనిసరిగా యేడాదికొక సినిమా చేస్తున్నా. ఈమధ్య కూడా మూడు కథలు విన్నాను. తమిళంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. తెలుగు సినిమా గురించి చర్చలు సాగుతున్నాయి.

‘‘నెంబర్‌ గేమ్‌లతో అలసిపోయాను.
నీ స్థానం 3, 2 అంటూ 1 దగ్గరికి వచ్చేసరికి నువ్వు కాదు, మరొకరు అనేవాళ్లు (నవ్వుతూ). అందుకే ఆ పోటీ నుంచి నేను తప్పుకుని, ప్రత్యేకంగా నాదైన దారిని ఎంచుకొన్నా. ఇప్పుడు ఆ దారిలోనే నేనొక్కదాన్నే. దక్షిణాది ప్రేక్షకులకి సినిమాలపై ప్రత్యేకమైన ప్రేమ. ప్రతి వారం సినిమా కోసం ఎదురు చూస్తుంటారు. నటులపై ప్రేక్షకులకుండే ప్రేమ కూడా ఎక్కువే. హిందీలో అయితే సినిమా బాగుందంటే చూసొద్దామని థియేటర్‌కి వెళ్లేవాళ్లే ఎక్కువ. పరిశ్రమల మధ్య నేను గమనించిన తేడా అదే’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.