ఇటు లస్ట్‌ స్టోరీస్‌.. అటు విక్టరీ వెంకటేష్‌!!
‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు తరుణ్‌ భాస్కర్‌. మొదటి చిత్రంతోనే హిట్‌ అందుకున్నారాయన. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కీలకపాత్ర పోషిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మీకు మాత్రమే చెప్తా’ కథానాయకుడు తరుణ్‌ భాస్కర్‌ విలేకర్లతో ముచ్చటించారు.


విజయ్‌ ఫోన్‌ చేసి హీరో ఛాన్స్‌ గురించి చెప్తే నమ్మరా?
తరుణ్‌ భాస్కర్‌: విజయ్‌ దేవరకొండ ఫోన్‌ చేసి ఈ సినిమాలో హీరో ఛాన్స్‌ ఇచ్చినప్పుడు నేను నమ్మలేదు. చాలా భయపడ్డాను. ఈ సినిమాలో హీరో ఒక మధ్యతరగతి అబ్బాయి. చాలా సింపుల్‌గా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కనుక నువ్వు బయట ఎలా ఉంటావో ఈ సినిమాలో కూడా అలాగే ఉండు అని విజయ్‌ చెప్పాడు. విజయ్‌ ధైర్యం చెప్పడంతో నేను ఈ సినిమాలో హీరోగా చేసేందుకు ఒప్పుకున్నాను. కానీ ప్రీ ప్రొడెక్షన్‌ పనులు ప్రారంభించాక కొంచెం బరువు తగ్గమని చెప్పారు. తగ్గాను.

ఈ సినిమాలో మీకంటే ముందు ఎవరినైనా అనుకున్నారు?
తరుణ్‌ భాస్కర్‌: ‘మీకు మాత్రమే చెప్తా’ దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ తమిళంలో మంచి షార్ట్‌ ఫిలీమ్స్‌ను తీశారు. అయితే ఆయన ఒకరోజు విజయ్‌ దేవరకొండను కలిసి ఈ సినిమా కథను చెప్పారు. విజయ్‌కు కథ బాగా నచ్చింది. కాకపోతే తను వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయడం కుదరలేదు. ఇంత మంచి కథను వదులుకోవడం ఇష్టంలేని విజయ్‌ నిర్మాతగా మారి నన్ను కథానాయకుడిగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.

విజయ్‌తో సినిమా చేయడం ఎలా ఉంది?
తరుణ్‌ భాస్కర్‌: నేను విజయ్‌ మంచి స్నేహితులం. నేను దర్శకత్వం వహించిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో విజయ్‌ నటించాడు. ఇప్పుడు నేను విజయ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’లో హీరోగా నటిస్తున్నాను. విజయ్‌ మంచి నటుడు మాత్రమే కాదు మంచి నిర్మాత కూడా.


హీరోగా నటించడం పట్ల ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా?
తరుణ్‌ భాస్కర్‌: మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు ‘ఫిదా’ సినిమాలో ఆఫర్‌ వచ్చింది. మా చుట్టాలు అందరూ భర్త చనిపోయాక సినిమాల్లో నటించడం అవసరమా అని ఆమెను తిట్టారు. ఆ సమయంలో నేను అమ్మకు ఒక్కటే చెప్పాను. నీకు ఇష్టమైతే సినిమాలో నటించు. ఎవరో ఏదో అనుకున్నారని నువ్వు ఆలోచించకు. అయితే ప్రస్తుతం ‘మీకుమాత్రమే చెప్తా’ సినిమాలో హీరో ఛాన్స్‌ వచ్చినప్పడు మా అమ్మ నాకు అదే మాట చెప్పింది. ట్రైలర్‌ చూసిన తర్వాత మా అమ్మ చాలా సంతోషంగా ఉంది.

ఏదైనా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారా?
తరుణ్‌ భాస్కర్‌: వెంకటేశ్‌కు ఒక కథ చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. ఆ కథపై ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఈ కథలో నవాజుద్దీన్‌ను ఒక పాత్ర కోసం అనుకున్నాను. జనవరి, ఫిబ్రవరిలో ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభమయ్యింది. ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లో ఒక పార్ట్‌ను తెరకెక్కిస్తున్నాను.


హీరోగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఎలా ఉంది?
తరుణ్‌ భాస్కర్‌: హీరోగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం కొంచెం కష్టంగా ఉంది. పెళ్లి చూపులు సమయంలో కూడా నేను ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. కానీ అప్పుడు దర్శకుడిగా ఇంటర్వ్యూలు ఇచ్చాను.

హీరోగా బాగుందా? దర్శకుడిగా బాగుందా?
తరుణ్‌ భాస్కర్‌: నాకు దర్శకుడిగా పనిచేయడం అంటేనే చాలా ఇష్టం. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో మొదటి ఐదు రోజులు ప్రతి విషయానికి కోప్పడేవాడిని. ఆ తర్వాత నేనే తగ్గాను.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.