నిర్మాతగా మారాలి.. విలన్‌గా చేయాలి!!
‘‘ఎంత పెద్ద స్టార్‌ హీరోని తెచ్చిపెట్టుకున్నా.. కథలో విషయం లేనప్పుడు అది ఆడదు. అందుకే నేను కథను మించిన కథానాయకుడు లేడని విశ్వసిస్తా’’ అంటున్నారు తేజస్‌ కంచర్ల. గతేడాది ‘హుషారు’ వంటి హిట్‌తో నటుడిగా సత్తా చాటిన తేజస్‌.. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ చిత్రంతో సినీప్రియుల్ని పలకిరించబోతున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. శంకర్‌ భాను దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌ నిర్మించారు. అక్టోబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు తేజస్‌.


*
‘‘హుషారు’ వంటి హిట్‌ తర్వాత నాయికా ప్రాధాన్య చిత్రం చేశారేంటి అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను బ్యానర్‌ విలువను చూసి సినిమా ఒప్పుకున్నా. దీనివల్ల నేను ఎక్కవ మంది ప్రేక్షకులకు చేరువఅవుతా. చిత్ర విడుదల విషయంలో ఎలాంటి సమస్యలుండవు. నేనీ చిత్రంలో కథానాయకుడిని అని చెప్పుకోను కానీ, పాత్ర పరిధి చాలా బాగుంటుంది. నా పాత్ర పేరు సిద్ధు. ఓ లవర్‌బాయ్‌లా కనిపిస్తా. పాయల్‌ అలివేలు అనే పాత్రలో కనిపిస్తుంది. సినిమాలో ఆమె తన గమ్యం చేరుకోవడానికి నేనే కారణమవుతా. మా ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? నేను ఫలానా వాళ్ల అబ్బాయి అని తెలిశాక.. మా ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ఆమె ఊరి కోసం ఏం చేసింది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి’’.

*
‘‘ఇందులో పాయల్‌ పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. నా పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. ఆమె చాలా అనుభవమున్న నటి. ఈ చిత్రంతో మగవాళ్లకు కుటుంబ బాధ్యతల గురించి చెప్పబోతున్నాం. ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలను చర్చించాం. నిజానికి టీజర్‌ చూసి.. బోల్డ్‌ సినిమానేమో అనుకుంటున్నారు. అదేం కాదు.. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికే అలా టీజర్‌ కట్‌ చేయించారు కల్యాణ్‌ సర్‌. నాకు, పాయల్‌కు కూడా టీజర్‌ అలా ఉంటుందని తెలియదు. విడుదలయ్యాక మాత్రం షాక్‌ అయ్యాం. అవన్నీ కేవలం ఓ పాటలో ఉన్న సన్నివేశాలు మాత్రమే. పాయల్‌ అనగానే ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ ఉంది. వాళ్లని సంతృప్తి కోసమే కొంత రొమాన్స్‌ పండించారు’’.


*
‘‘నేను చిత్రసీమలోకి సహాయ దర్శకుడిగా అడుగుపెట్టా. తేజ సర్‌ వద్ద ‘నీకు నాకు డ్యాష్‌ డ్యాష్‌’ చిత్రానికి పని చేశా. తర్వాత ప్రకాష్‌రాజ్‌ గారి ‘ఉలవచారు బిర్యాని’ చేశా. ‘కేటుగాడు’తో కథానాయకుడిగా మారా. దాని ఫలితం మాత్రం నాకు ఓ గుణపాఠం నేర్పింది. అప్పటి నుంచే కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. దర్శకత్వం వైపు వెళ్లాలన్న ఆలోచన లేదు. కానీ, నిర్మాతగా మారతా. నాకు తెలిసింది ఈ సినిమా పరిశ్రమ ఒక్కటే. అందుకే ఇక్కడ సంపాదించింది.. ఇక్కడే పెట్టాలనుకుంటున్నా. కథ, నా పాత్ర పరిధి బాగుండాలే కానీ ఏ తరహా పాత్రలు చేయడానికైనా నేను సిద్ధమే. నిజానికి హీరోగా చేయడం కన్నా విలన్‌గా నిరూపించుకోవాలనుంది. కానీ, ప్రస్తుతానికి నా పర్సనాలిటీకి అలాంటి పాత్రలు దొరకడం కష్టమే. నితిన్‌.. ‘భీష్మ’ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. ఈ ఏడాది చివర్లో అది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.