తెలుగులోనూ అలాంటి మార్పు వస్తుంది..

‘తెలుగు సినిమాల్లో మహిళలకి మంచి పాత్రలు లభిస్తున్నాయి. అయితే హిందీ తరహాలో... 30 నుంచి 40 యేళ్ల మధ్య వయసున్న మహిళల నేపథ్యంలో మరిన్ని కథల్ని సృష్టించాల్సి ఉంది’’ అంటున్నారు భూమిక. కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈమె, కొంతకాలంగా సహాయ నటిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ‘ఎమ్‌.సి.ఎ’లో వదినగా మెరిసిన ఈమె, ‘యూ టర్న్‌’లో మరో విభిన్నమైన పాత్రలో సందడి చేయబోతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భూమిక సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...


* ‘‘ఒక నటికి విభిన్నమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు లభించే తృప్తే వేరు. కన్నడలో విడుదలైన ‘యు టర్న్‌’ చిత్రం కూడా చూశా. దానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఇదివరకు చేసిన అన్ని పాత్రలకంటే భిన్నంగా ఉంటుంది. స్వతహాగా నాకు హారర్‌ కంటే కూడా థ్రిల్లర్‌ కథలంటేనే ఇష్టం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు పవన్‌కుమార్‌. పాత్రని అర్థం చేసుకొని నా శైలిలో నటిస్తూనే, దర్శకుడికి కావల్సినట్టుగా కూడా కనిపించే ప్రయత్నం చేస్తా’’.

* ‘‘పాత్ర నిడివి ఎంతనేది ముఖ్యం కానే కాదు. మనం చేసిన పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదే కీలకం. ఇందులో సమంత చాలా బాగా నటించింది. తన హావభావాలు చాలా బాగుంటాయి. ఆమె నటించిన ‘ఈగ’, ‘రంగస్థలం’ చిత్రాలు చూశా. అప్పటికప్పుడు శక్తి కూడగట్టుకొని నటించే విధానం నాకు బాగా నచ్చుతుంది’’.

* ‘‘హిందీలో ‘తుమ్హారీ సులు’ లాంటి చిత్రాలొచ్చినట్టుగా, తెలుగులోనూ ఆ తరహా కథల్ని దర్శకులు రావాల్సి ఉంది. విద్యాబాలన్‌ వయసు 42 యేళ్లు. ఆ వయసు మహిళ నేపథ్యంలో ‘తుమ్హారీ సులు’లాంటి ఓ మంచి చిత్రం రూపొందిందంటే కారణం అక్కడి రచయితలే. మలైకా అరోరా, ఐశ్వర్యరాయ్, జ్యోతిక తదితరులు నలభయ్యేళ్ల వయసు దాటినప్పటికీ మంచి కథల్లో నటిస్తున్నారు. అది మంచి పరిణామం. తెలుగులో కూడా త్వరలోనే అలాంటి మార్పు వస్తుందని నమ్ముతున్నా. తెలుగు ప్రేక్షకులు వాణిజ్య ప్రధానమైన చిత్రాల్ని ఇష్టపడతారు. దాంతో నిర్మాతలు కూడా ఆ తరహా కథలపైనే మక్కువ చూపుతుంటారు. అయితే పెద్ద నిర్మాతలు వాణిజ్య ప్రధానమైన చిత్రాలు చేస్తూనే, ఇలాంటి విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తే ఫలితాలుంటాయి’’.

* ‘‘ప్రస్తుత నట ప్రయాణం పరంగా నా లెక్కలు నాకున్నాయి. నాకు నాలుగేళ్ల వయసున్న అబ్బాయి ఉన్నాడు. తనని కూడా దృష్టిలో ఉంచుకొని, ఆసక్తికరమైన కథలు లభించినప్పుడు వాటిలో భాగమవుతున్నా. వచ్చే యేడాదికి నా సినీ ప్రయాణం మొదలై ఇరవయ్యేళ్లవుతుంది. ప్రస్తుతం హిందీలో ‘ఖామోషీ’ అనే చిత్రం చేస్తున్నా. సినిమా విషయంలో ఎప్పుడూ నేనొక స్కూల్‌కి వెళ్లే విద్యార్థినిలాగే ఆలోచిస్తుంటా. ఉదయం సెట్‌కి వెళ్లడం, శ్రద్ధగా పనిచేయడం, సాయంత్రం తిరిగి ఇంటికి రావడం. మళ్లీ ఆ సినిమాల గురించి, పని గురించి ఇంట్లో అస్సలు మాట్లాడుకోం’’.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.