వాళ్లు ఏడిపించినా.. నేను నవ్వించాల్సిందేనా?
సునీల్‌లో ఓ విజేత కనిపిస్తాడు. ఎక్కడో భీమవరం పిట్టగోడల మీద కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకునే సునీల్‌.. తానో వార్తగా నిలిచేంత వ్యక్తిగా మారాడు. కెమెరా ముందు కనిపించడానికి ఎన్నో ఆపసోపాలు పడ్డాడు. ఎత్తుపల్లాలు చవిచూశాడు. చివరికి అనుకున్నది సాధించేశాడు. ‘‘ఒకే కుర్చీ, ఒకే ఆఫీసు.. యాభై ఏళ్ల పాటు అలా చూస్తుండిపోతానేమో అనే భయం వేసింది. అలాంటి ఉద్యోగాలు చేయలేక సినిమాల్లోకి వచ్చాను. నిలదొక్కుకున్నాను. సినిమా రంగంవైపు అడుగు వేయడమే నా మొదటి విజయం’’ అంటున్నాడు సునీల్‌. ఇటీవల ‘చిత్రలహరి’లో సాయిధరమ్‌ తేజ్‌కి ‘గ్లాస్‌మేట్‌’గా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సందర్భంగా సునీల్‌తో చిట్‌ చాట్‌.


* ‘చిత్రలహరి’లో కథానాయకుడికి ‘గ్లాస్‌మేట్‌’గా కనిపించారు. నిజ జీవితంలోనూ అలాంటి గ్లాస్‌మేట్స్‌ ఉన్నారా?

- చాలా మంది ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచీ నా గ్లాస్‌మేట్స్‌ని లెక్కేస్తే పుస్తకాలకు పుస్తకాలు సరిపోవు. సినిమాల్లోకి వచ్చాక ఆ సంఖ్య మరింత పెరిగింది. అన్నట్టు గ్లాస్‌మేట్స్‌ అంటే వేరే వేరే అర్థాలేం తీసుకోకండి. గ్లాసులో మందూ తాగొచ్చు.. మజ్జిగా తాగొచ్చు (నవ్వుతూ)

* సంతోషాన్నిగానీ, బాధని గానీ పంచుకోవడానికి మీరెంచుకునే ‘గ్లాస్‌మేట్‌’ ఎవరు?
- త్రివిక్రమ్‌. నా ప్రతి మూమెంట్‌నీ తనతో పంచుకుంటా. చాలా విలువైన సలహాలు ఇస్తుంటాడు. తనతో మాట్లాడినప్పుడల్లా గొప్ప స్ఫూర్తి వస్తుంటుంది. నాకే కాదు.. ఎవరు బాధలో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా త్రివిక్రమ్‌ వాళ్లని ఉత్తేజపరుస్తాడు.

* అసలు మీరిద్దరి పరిచయం ఎప్పటిది?
- భీమవరంలో ఉన్నప్పుడే. త్రివిక్రమ్‌ నాకంటే ఓ సంవత్సరం సీనియర్‌. కలసి క్రికెట్‌ ఆడుకునేవాళ్లం. ముందు నేను హైదరాబాద్‌ వచ్చాను. ఆ తరవాత నా కోసం తనని తీసుకొచ్చాను.

* ‘చిత్రలహరి’... పరాజయాలతో యుద్ధం చేసిన ఓ విజేత కథ. మీ కథ కూడా అలానే ఉంటుందా?
-ఇంచుమించు అంతే. నటుడ్ని అవ్వాలని ఈ పరిశ్రమకొచ్చా. కానీ తొలుత సహాయ దర్శకుడిగా, డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా, కంపెనీ ఆర్టిస్టుగా ఇలా రకరకాల పనులు చేయాల్సి వచ్చింది. సహాయ దర్శకుడిగా నా తొలి జీతం అయిదు వేల రూపాయలు. పాత్రకు కావల్సిన నటులెవరైనా అందుబాటులో లేకపోతే ఆ పాత్రలు కూడా నేనే చేసేసేవాణ్ని. బంధువులంతా... ‘ఇలాంటి పాత్రలు చేయడానికేనా హైదరాబాద్‌ వెళ్లింది’ అని వెటకారం చేసేవారు. కానీ ‘నేను అదైనా చేస్తున్నా. మీలా ఖాళీగా కూర్చోలేదు’ అని చెప్పేవాణ్ని.
 
                                 
* పరిశ్రమకొచ్చాక మీరు బాధ పడిన సందర్భాలేమైనా ఉన్నాయా?
- విజయం సాధిస్తే పొగిడేవాళ్లు చాలామంది ఉంటారు. అలానే ఓడిపోతే తిట్టేవాళ్లూ కనిపిస్తారు. గెలిచినవాణ్ని పొగడకపోయినా ఫర్వాలేదు. పడిపోయేవాణ్ని మరింత లాగేయొద్దు. ‘నిన్ను మేం ఏడిపిస్తాం.. నువ్వు మాత్రం మమ్మల్ని నవ్వించాల్సిందే’ అనేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. ఈమధ్య సోషల్‌ మీడియాలో ‘సునీల్‌ చనిపోయాడు..’ అంటూ ప్రచారం చేశారు. మిలియన్‌ వ్యూస్‌ కోసం ఓ వ్యక్తిని చంపేయాల్సిన అవసరం లేదు కదా?

* కథానాయకుడిగా ఉన్నప్పుడు మీరెక్కువ జోక్యం చేసుకునేవారట నిజమేనా?
- నా సినిమాల్లో పేరున్న రచయితలు ఉండేవాళ్లు కాదు. నాకు తెలిసినవాళ్లని బతిమాలి తెచ్చుకునేవాణ్ని. నా చేతి డబ్బులు ఇచ్చిమరీ రాయించుకునేవాణ్ని. అలా నాతో హిట్టుకొట్టినవాళ్లంతా ఆ తరవాత ‘సునీల్‌ ఎక్కువగా జోక్యం చేసుకునేవాడు’ అని చెప్పుకున్నారు. అలా చెప్పినవాళ్లెవ్వరూ మళ్లీ హిట్టుకొట్టలేదు.

* హాస్య నటుడై ఉండి.. యాక్షన్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించారు. కథానాయకుడిగా మీ ఓటమికి అదే కారణం అనుకోవచ్చా?
- హాలీవుడ్‌లో చూడండి. తండ్రి పాత్రధారి కూడా సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాడు. ఇక్కడ హాస్యనటుడంటే మాత్రం లావుగా కనిపిస్తూ, బుగ్గలు బూరెల్లా ఊరిపోవాలనుకుంటుంటారు. నవ్విస్తూ, ఫైట్లు చేసే కథానాయకుడు ఎవరూ లేరు కదా.. నేనేందుకు ప్రయత్నించకూడదు? అనుకుని అలాంటి కథల్ని ఎంచుకున్నాను.


* మీమీద హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది?
- మన సినిమాలన్నీ అక్కడి నుంచి కాపీ కొట్టినవే కదా? ఏ సినిమా అయినా తీసుకోండి.. అందులోని ఏదో ఓ పాయింట్‌ పాత ఇంగ్లిష్‌ సినిమాల్లో కనిపిస్తుంటుంది. కెమెరా ముందు అక్కడే పుట్టింది. ఆ తరవాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లింది ఏదీ లేదు.

* కథానాయకుడిగా కొనసాగుతారా?
- ఇది వరకే రెండు సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకున్నాను. ఆ సినిమాల్ని పూర్తి చేయడం నా బాధ్యత. అవి అయిపోతే.. హాస్య పాత్రలపైనే దృష్టిసారిస్తా. ప్రస్తుతం త్రివిక్రమ్, అల్లు అర్జున్‌ సినిమాలో నటిస్తున్నా. రవితేజ సినిమాలో మంచి పాత్ర దొరికింది. ఓ అగ్ర కథానాయకుడి చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నా. ఆ వివరాలు త్వరలో చెబుతా.

* మమ్మల్ని చూసే అలాంటి జోకులు..
‘‘జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డిగారిలా.. కామెడీ సినిమాలు చేసేవాళ్లు బాగా తగ్గిపోయారు. ఒకరిద్దరు మినహా ఈ జోనర్‌పై దృష్టి పెట్టడం లేదు. వెంకటేష్‌గారిలో ఇంకా ‘నున్వు నాకు నచ్చావ్‌’ స్టైల్‌ ఉంది అని గమనించిన అనిల్‌ రావిపూడి తనతో ‘ఎఫ్‌ 2’ సినిమా తీసి మంచి హిట్టు కొట్టాడు. అలాంటి దర్శకులు మరింతమంది రావాలి. మేం ఫేస్‌బుక్‌ జోకులు చూసి సినిమాలు తీస్తాం అనుకోవడం చాలా పొరపాటు. మమల్ని చూసే అలాంటి జోకులు తయారు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జోకులుగా చలామణీ అయ్యేవన్నీ సామాన్య జనాల అనుభవాలే’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.