కొత్తదనం నిండిన కథల కోసం చూస్తున్నా..
‘ఈరోజుల్లో’, ‘టాక్సీవాలా’.. ఈ చిత్రాలు చాలు నిర్మాతగా ఎస్‌కెఎన్‌ అభిరుచి ఎలాంటిదో చెప్పడానికి. నవతరం అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ, చిన్న చిత్రాలతోనే అసాధారణ విజయాలు సొంతం చేసుకొన్నారు. చిత్రసీమలో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆదివారం ఎస్‌కెఎన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు..


*
‘‘దాదాపు పదిహేనేళ్లకు పైగా చిత్రసీమతో నా అనుబంధం కొనసాగుతోంది. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి అభిమానిని. ఆ అభిమానంతోనే అప్పట్లో ఆయన సినిమాల పాటలు, రికార్డులు, రివ్యూలను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేస్తుండేవాడిని. ఇదే నన్ను చిరు అభిమానులకు, మెగా ఫ్యామిలీకి దగ్గర చేసింది. మొదట్లో అల్లు శిరీష్‌ స్నేహితుడయ్యారు. ఆయన ద్వారా బన్నీకి దగ్గరయ్యా. అప్పటికి ఆయన హీరోగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు. నా వ్యక్తిత్వం, పని నచ్చి నన్ను ఆయన దగ్గర పీఆర్‌వోగా పెట్టుకున్నారు. ఆ తర్వాత వారి అండతోనే దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు, నేను కలిసి తూర్పు గోదావరిలో కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లుగా చేశాం. ఈ క్రమంలోనే సినిమాలు, కథలు ఎలా ఉండాలి తదితర విషయాలపై అవగాహన ఏర్పడటంతో తర్వాత క్రమంగా నిర్మాతగా మారా. తొలి ప్రయత్నంగా మారుతిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అతి తక్కువ బడ్జెట్‌లో ‘ఈరోజుల్లో’ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాం. అక్కడి నుంచి నా ప్రయాణమంతా మీకు తెలిసిందే’’.

* ‘‘ఈ పరిశ్రమలో నిర్మాతగా అల్లు అరవింద్‌ వంటి వారే నాకు స్ఫూర్తి. ఆయన లాంటి వ్యక్తి మాకు వెనుక అండగా ఉండటం వల్లే ఎప్పుడూ ఇక్కడ ఇబ్బందులు పడలేదు. నిర్మాతగా అసలు సవాలు మాత్రం కథలు ఎంపిక చేసుకోవడంలోనే ఉంటుంది. కానీ, నాకు డిస్ట్రిబ్యూషన్‌లో అనుభవం ఉండటం వల్ల ఎలాంటి కథలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఏ సన్నివేశాలకు వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది వంటివన్నీ ముందుగానే అర్థమైపోతాయి. మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఓడిపోతే ఏమౌతుందోనన్న భయం మనసులో ఉంటుంది. అందుకే ఎంచుకునే ప్రతి కథను ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తుంటా. హీరో ఎవరు సరిపోతారు. వారి మార్కెట్‌కు తగ్గట్లుగా ఎంత ఖర్చు పెట్టొచ్చు అన్నదానిపై పూర్తి క్లారిటీతో ఉంటా’’.

*
‘‘మెగా ఫ్యామిలీతో మాకు ఎలాంటి అనుబంధం ఉందో.. మిగతా హీరోలతోనూ అలాంటి చక్కటి బంధమే ఉంది. ‘టాక్సీవాలా’ పైరసీ అయినప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్‌ వంటి హీరోలంతా మాకు అండగా నిలుచున్నారు. ఆ సమయంలో వారి అభిమానుల నుంచి వచ్చిన ప్రోత్సాహం కూడా మరువలేనిది. వైవిధ్యమైన కథలను కమర్షియల్‌ హంగులతో చూపించడమంటే నాకిష్టం. అవెంజర్స్, స్పైడర్‌మ్యాన్‌ వంటి ఫిక్షనల్‌ పాత్రలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. మనకు రాముడు, హనుమంతుడు వంటి రియల్‌ హీరోలున్నారు. అలాంటి వారి కథలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని ఉంది’’.

* ‘‘టాక్సీవాలా’ తర్వాత చాలా స్క్రిప్ట్స్‌ విన్నా కానీ, వేటిలో ఆసక్తికర కథాంశం దొరకలేదు. కొత్తదనం నిండిన కథల కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. ప్రస్తుతం రెండు కథలు స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి. వాటితో ఇద్దరు కొత్త దర్శకుల్ని చిత్రసీమకు పరిచయం చేయనున్నా. ప్రస్తుతం మారుతి - సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో వస్తున్న ‘ప్రతిరోజు పండగే’కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా. మారుతి గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమా నిర్మాణంపైనే ఉంది. వెబ్‌సిరీస్‌ల వైపు వెళ్లాలని లేదు. కొత్తగా వచ్చే నిర్మాతలకు చెప్పేది ఒకటే. వినోదానికి అనేక ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటివి వెబ్‌సిరీస్‌లతో సరికొత్తగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే.. వాటిలేని ఇంకా కొత్తదనాన్ని మనం చూపించగలగాలి. అలాంటి వాటిని వెతికి పట్టుకోండి. మన అదృష్టం కొద్దీ తెలుగులో ఇలాంటి కొత్తదనం నిండిన కథలు తీసుకొస్తున్న దర్శకులు చాలా మందే వస్తున్నారు’’.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.