ఎన్ని చిత్రాల్లో నటించామన్నది ముఖ్యం కాదు!
మంచి అందం, చూడచక్కని రూపం. ఒక్కసారి చూస్తే మళ్లీ చూడబుద్దేస్తుంది. అలాంటిది చిత్రసీమకు వచ్చి చాలా సంవత్సరాలే అయ్యింది. కానీ సినిమాల సంఖ్య చూస్తే చాలా తక్కువ. తెలుగులో నాని సరసన ‘ఆహా కల్యాణం’లో నటిచింది. ఆరు సంవత్సరాల కెరీర్‌లో ఆరు సినిమాలే చేసిన ‘వార్‌’ కథానాయిక వాణీ కపూర్‌ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

*
ఏదో ఒక సినిమాలో నటించాలనుకుంటే, ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించేదాన్ని. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. మనకు నచ్చిన వారికోసం, మనల్ని మెచ్చేవారి కోసం పనిచేయడంలో ఉండే సంతోషం వేరుగా ఉంటుంది.

*
నాకు ఇలాంటి పాత్రల్లోనే నటించాలనే కోరిక లేదు. ప్రేక్షకులు కోరుకునే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. చేశాను కూడా. ఒకే మూస చిత్రాలు చేయలేను. మొదట బాలీవుడ్‌లో తనీష్‌ శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శుద్ద్‌ దేశీ రొమాన్స్‌’ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సరసన, తరువాత దక్షిణాది నుంచి చిత్రం ‘ఆహా కల్యాణం’లో శృతి సుబ్రహ్మణ్యం పాత్రలు మెప్పించినవే.

* ఒక్కోసారి అవకాశాలు ఈజీగా వచ్చినా వాటిని నిలబెట్టుకోవడం కష్టమైన పనే. సినీ పరిశ్రమ గ్లామర్‌తో కూడుకున్నది. మనం చాలా బాగా నటించామని అనుకుంటాం. కానీ ఆ విషయం చెప్పాల్సింది ప్రేక్షకులు. వారు తల్చుకుంటే ఏదైనా జరగొచ్చు.


* ‘వార్‌’ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ - టైగర్‌ ష్రాఫ్‌లు ఇద్దరూ హేమాహేమీలే. అయినా వారి మధ్య నటించడం గొప్పగా ఉంది. డ్యాన్స్‌ అంటే హృతిక్‌ రోషన్‌. మంచి హుషారుగా ఉంటారు. సెట్లో ఉన్నంత సేపు చాలా కలివిడిగా ఉంటారు. అలాంటి నటులతో కలిసి పనిచేయడం చాలా సులభం. సినిమా వసూళ్లు చూస్తుంటే మేం బాగా నటించాం అనిపిస్తుంది.

*
ఇప్పటి వరకు నేను యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లోనే నటించాను. మనల్ని మెచ్చేవారు, గౌరవం ఇచ్చేవారున్న చోటే పనిచేయడం బాగుటుంది కదా. చేసే పని మనసుకు నచ్చాలి కూడా. ఎన్ని సినిమాలు చేశాం అనేకంటే ఎంత బాగా చేశామనేది ముఖ్యం.

* ఇక ప్రేమ గురించి నేనేం మాట్లాడను. ప్రస్తుతం సినిమాలే జీవితం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.