వాళ్లు ఏనాడూ.. దర్శకుడు ఎప్పుడవుతావని అడగలేదు
అబ్బా ఏం సస్పెన్స్‌ థ్రిల్లర్రా... తీసింది ‘ఎవరు?’
సినిమా మొత్తం ఊహించని మలుపులే... రాసింది ‘ఎవరు?’
‘ఎవరు?’ సినిమా చేసిన దర్శకుడు ఎవరు?
సినిమా పరిశ్రమలో అనేక విభాగాల్లో పదేళ్లుగా పనిచేసిన యువదర్శకుడు వల్లభనేని వెంకట్‌ రామ్‌జీ. రాఘవేంద్రరావు, సుకుమార్‌ వంటి స్టార్‌ దర్శకులు, అల్లు అర్జున్‌ వంటి హీరోల నుంచి ప్రశంసలు అందుకొని టాక్‌ అఫ్‌ది టాలీవుడ్‌గా నిలిచిన రామ్‌జీ గురించి... ఆయన మాటల్లోనే..‘నాకు యాక్షన్‌ థ్రిల్లర్స్‌ అంటే ముందు నుంచి ఇష్టం..ఏదైనా సినిమా చూస్తే థ్రిల్‌ ఉండాలనే సగటు ప్రేక్షకుడ్ని నేను. హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాలకు ఫిదా అయిపోతా. ‘లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’ సిరీస్‌ కొన్ని వందలసార్లు చూశా. నాకు సినిమాలే లోకం. నేను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సివిల్‌ ఇంజినీరింగ్‌ తర్వాత అమెరికాలో ‘కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎమ్‌.ఎస్‌. చేశా.

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని కథలుంటాయి. కొన్ని కథలు తెల్సుకుంటాం. అలా ఓ కథను నేను ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. అమెరికాలో ఉంటే అది సాధ్యం కాదు. ఎంత మంచి ఉద్యోగం చేసినా చేయాలనుకున్నది చేయలేకపోతే ఎలా? ఉన్నది ఒకటే లైఫ్‌.. అనుకున్నది ఎలాగైనా చేసేయాలని 2009లో సినిమా పరిశ్రమలోకి వచ్చా.

అన్ని విభాగాల్లో పనిచేశా..
మా నాన్నగారు కృష్ణారావు ఇంజినీరు. ఒక సంస్థకు డైరెక్టర్‌. అమ్మ రాధ గృహిణి. చెల్లి, బావ సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తారు. మా అమ్మకి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉంది. ఆమె పేరు శారద. తను గుణ్ణం గంగరాజుగారి చెల్లెలు. అలా వచ్చీరావటంతోనే గుణ్ణం గంగరాజుగారి దగ్గర ‘జస్ట్‌ ఎల్లో’ సంస్థలో పనిచేశా. ఆయన దగ్గర రైటింగ్‌ గురించి తెలుసుకున్నా. ‘లయ’ అనే టీవీ సిరీస్‌కి రాశా. ఆ తర్వాత ‘అనగనగా ఓ ధీరుడు’, ‘షిరిడీ సాయిబాబా’, ‘సైజ్‌ జీరో’ చిత్రాలకు పనిచేశా. మధ్యలో ఓ హిందీ సీరియల్‌కి లైన్‌ ప్రొడ్యూసర్‌ అయ్యా. ఎడిటింగ్‌లో అనుభవముంది. ప్రొడక్షన్‌లో పనిచేయటంతో పాటు ‘క్షణం’, ‘ఊపిరి’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలకు మార్కెటింగ్‌ విభాగంలో ఉన్నా. ఇలా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ తప్ప అన్ని శాఖల్లో పనిచేశా.

ఇలా మొదలై..
పీవీపీ బ్యానర్‌లో అడివి శేష్‌తో ఓ సినిమా చేసే అవకాశమొచ్చింది. అదే ‘ఎవరు’ చిత్రం. ‘ద ఇన్‌విజిబుల్‌ గెస్ట్‌’ కోల్డ్‌ఫిల్మ్‌. అయితే వాళ్ల నాలుగు ట్విస్ట్‌లు తీసేసి మేం కొత్తగా రాసుకున్నాం. ఎమోషన్స్‌ బాగా పండాయి. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌.. అన్ని టెక్నికల్‌ విభాగాలూ బాగా కుదిరాయి. డెబ్భై శాతం షూటింగ్‌ అయ్యాక నేను కచ్చితంగా సినిమా నిలబడుతుందనుకున్నా. అనుకున్నదే నిజమైంది. ప్రేక్షకులు మెచ్చారు. ‘ఎవరు’ చూశాక ‘సినిమా బావుంద’ని రాఘవేంద్రరావుగారు అభినందించారు. తర్వాత దర్శకులు సుకుమార్‌, క్రిష్‌, హీరో అల్లు అర్జున్‌ అభినందించారు.


అమ్మమ్మ నుంచి ఆ అలవాటు..
కథ చెప్పాలనే ఆలోచన, రాయాలన్న స్వభావం మా అమ్మమ్మ నుంచి వచ్చిందేమో. ఎందుకంటే అమ్మమ్మ భక్తి పాటలు రాసుకునేది. పాడేది. కథలు చెప్పేది. స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్ని పాటలు రాసిచ్చేది. వాటిని పాడేవాణ్ని. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నా. అక్కడే కథలు రాయటం అలవాటైంది. ఆర్ట్స్‌ని ఇష్టపడేవాణ్ని. బొమ్మలు గీసేవాణ్ని. అలా విజువల్‌ ఎఫెక్ట్స్‌పై ఆసక్తి పెరిగింది. అందుకే అమ్మమ్మ ప్రభావం నాపై ఉందని అనుకుంటా.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.