దర్శకత్వం నా కల.. కథలు కూడా సిద్ధం !!
‘‘ఓ చిత్రానికి దర్శకత్వం వహించడమనేది నా కల’’ అంటున్నారు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో దక్షిణాదిలో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగిన ఈ యువ హీరో.. ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయకుడిగా మారిపోయారు. మనసుకు నచ్చినట్లుగా మాట్లాడటం. మిగిలిన హీరోలకు భిన్నమైన యాటిట్యూడ్‌. అభిమానుల పట్ల ఆయన కనబర్చే ప్రేమ దేవరకొండను యువతరానికి మరింత దగ్గరయ్యేలా చేశాయి. ప్రస్తుతం ఈ రౌడీ హీరో సినిమా చేసేందుకు అగ్ర దర్శకులు సైతం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ యువ కథానాయకుడు ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

* ‘‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఓ సరికొత్త ప్రేమకథతో నూతన దర్శకుడు భరత్‌ కమ్మ దీన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు దీన్ని వెండితెరపై చూసినప్పుడు ఓ కొత్త అనుభూతిని పొందుతారని నేను భావిస్తున్నా. ఇన్నాళ్లుగా వేచి చూస్తున్న నా అభిమానుల నిరీక్షణలకు తగిన ఫలితాన్ని చూపిస్తుంది’’.

* ‘‘నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అది నా కల. అయితే ‘మహానటి’, ‘టాక్సీవాలా’ చిత్రాల సమయంలో దర్శకులు పడే కష్టం చూసి.. ఇదంతా నా వల్ల కాదనిపించింది. ఎందుకంటే దర్శకుడైతే అనేక విభాగాలను ఒక్కడే మేనేజ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది నా వల్ల అయ్యే పని కాదు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత మెగాఫోన్‌ చేతబట్టొచ్చేమో. ఎందుకంటే నా దగ్గర కొన్ని కథలున్నాయి. వాటిని ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నా’’.

* ‘‘నేను ఎప్పటికప్పుడు నా నటనను మరింత మెరుగుపరచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నా. ఒకానొక రోజు ‘అర్జున్‌ రెడ్డి’ని చూసి నేను సిగ్గుపడే స్థాయికి (నటన పరంగా) ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కొన్నేళ్ల తర్వాత కూడా ‘అర్జున్‌ రెడ్డి’నే నా ఉత్తమ నటనగా ఉంటే.. దానర్థం నా పని అక్కడే ఆగిపోయిందని. ఈ వృత్తిలో ఎప్పుడే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టే ప్రతి చిత్రానికి నేను మరింత మెరుగవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

                                 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.