కొన్ని కథల్ని అప్పటికప్పుడే చెప్పాలి!

వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ సంచలనం... విజయ్‌ దేవరకొండ. తెలుగులోనే కాకుండా... పొరుగు భాషల్లోనూ ఆయన తొలి అడుగుల్లోనే అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ చేశారు. ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...* మీ సినిమాలు వివాదాల మధ్య విడుదల కావడం పరిపాటిగా మారింది. దీనిపై మీరెలా స్పందిస్తారు?
నేనే ఎందుకు దొరుకుతున్నానో అర్థం కావడం లేదు. ‘నోటా’ విషయంలో గొడవ చేస్తోంది కాంగ్రెస్‌ వాళ్లే. కానీ ఈ విషయంలో నేనేం ఇబ్బంది పడటం లేదు కానీ... ‘గీత గోవిందం’ పైరసీ కావడమే వ్యక్తిగతంగా బాగా కుంగదీసింది. ఇది విడుదలకి ముందే బయటికొచ్చింది. అప్పుడు చెప్పలేదు కానీ... మా సినిమా 2 గంటల 11 నిమిషాలైతే, సినిమాలో మేం చూపించని సన్నివేశాలతో కలిసి మొత్తం 2 గంటల 30 నిమిషాల కట్‌ బయటికొచ్చింది. ఇక థియేటర్లలో సినిమాని చూసే అవకాశమే లేదేమో అనిపించింది.

* తొలి అడుగుల్లోనే తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ క్రేజ్‌ సంపాదించుకొన్నారు. ఈ ప్రయాణం ఎలాంటి అనుభూతినిస్తోంది?
ప్రేక్షకుల్లో నాకున్న క్రేజ్‌ గురించి ఆలోచించే సమయమే లేదు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూ, వాటి ప్రచారంతో బిజీగా గడుపుతున్నా. ‘నోటా’ కోసం చెన్నై, బెంగుళూరు, కోచ్చి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశా. నిజానికి ‘ఎవడే సుబ్రమణ్యం’కి ముందు ఇక నటన కాకుండా, దర్శకత్వం, రచనవైపు దృష్టిపెడదామనుకొన్నా. అంతలోనే వరుసగా సినిమాలొచ్చాయి. ఇప్పుడు జీవితం ఎటుపోతోందో అర్థం కావడం లేదు. ఈ గుర్తింపు, ఈ క్రేజ్‌పై ఆనందంగా ఉన్నా.


* రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడానికి అగ్ర కథానాయకులు కూడా అంతగా ఆసక్తి చూపరు. మీరు ఈ సినిమా చేయడానికి గల కారణమేమిటి?
నాకు కథ ఆసక్తిగా అనిపించింది, చేశా. మనం ప్రతిసారీ రాజకీయ నాయకులపైనా, రాజకీయ వ్యవస్థలో జరిగే సంఘటనలపైన రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటాం. బొగ్గు కుంభ కోణమనీ, త్రీజీ కుంభకోణమనీ, వరదలనీ... ఇలా ఏది వినిపించినా ఎందుకు ఇలా జరుగుతోందనే ఓ ఆవేశం వస్తుంది. అందుకే ఈ కథ వినగానే నేను బాగా కనెక్ట్‌ అయ్యా. ఈ పాత్ర నేనే చేయాలనిపించింది. ప్రస్తుత పరిస్థితులకి చాలా దగ్గరగా ఉంటుందీ చిత్రం. ఇంకో రెండు మూడు సినిమాలు చేతిలో ఉన్నా... ఇది తప్పకుండా చేసేవాణ్ని. ప్రేమకథల్లాంటివి ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాజకీయ వ్యవస్థకి సంబంధించిన కథల్ని అప్పటికప్పుడు చెప్పాల్సిందే.

* నిజ జీవితంలో రాజకీయ పరిణామాల్ని గమనిస్తుంటారా?
మంచి అవగాహనతో ఉంటా. స్కాములు గురించి వింటున్నప్పుడు కళ్లు తిరుగుతాయి. ఒక భారతీయుడిగా ఆలోచిస్తే ‘అరే... లక్షల కోట్ల రూపాయలు దోచుకొంటారా? ఈ డబ్బంతా ప్రజల కోసం ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది? ఒక్కరే ఎన్ని తరాలకి కూడబెడతారు?’ అనిపిస్తుంది. రజనీకాంత్‌ సినిమాకి ఎంత ఖర్చు పెట్టినా పూర్తవదన్నట్టుగా... ఎంత దోచినా రాజకీయ నాయకుల దాహం తీరదనేలా ఉంటే ఏం చేయాలి? అంతా కాదు కానీ... ఇలాంటి విషయాలు సినిమాలో ఓ లేయర్‌గా ఉంటాయి.


* ‘నోటా’ అనే పేరు పెట్టడానికి కారణమేమిటి? ఇందులో యువ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు?
‘నోటా’ మీటకీ, ఈ సినిమాకీ సంబంధం లేదు. ‘నోటా’ అనే పేరు సినిమాకి పనికొచ్చిందంతే. నాయకులు నచ్చడం లేదు, మాకు కొత్త ప్రత్యామ్నాయాలు కావాలనే విషయాన్ని ఈ కథతో చెబుతున్నాం. త్వరలోనే జరగనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఒక మామూలు కుర్రాడిని లాక్కెళ్లి పోటీ చేయాలని రంగంలోకి దింపితే ఈ వ్యవస్థపై ఎలా ప్రతిస్పందిస్తాడనేదే నా పాత్ర. తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ చిత్రంలో చూపించాం. నాకు ఈ సినిమాకి ముందు తమిళనాడు రాజకీయం గురించి అంతగా తెలియదు. కానీ ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది.

* తెలుగు, తమిళ భాషల్లో ఒకేలా ఉంటుందా చిత్రం?
రెండూ ఒకటే. కానీ ఈ కథ గురించి, సన్నివేశాల గురించి చెప్పినప్పుడు ‘ఈ పరిస్థితుల్లో నేనే ఉంటే ఏం చేస్తాను? ఎలా స్పందిస్తాను?’ అనుకొని అదే విషయాన్ని దర్శకుడు ఆనంద్‌శంకర్‌తో చెప్పి రాయించాను. తెలుగులో అయితే ఆ సంభాషణల్ని నేనే నా శైలికి తగ్గట్టుగా మార్చుకొనేవాణ్ని. తమిళం నాకు రాదు కాబట్టి వాళ్లకు చెప్పి రాయించాను. మొదట తెలుగులోనే సినిమా చేద్దామన్నారు. కానీ నేను నాలుగు భాషల్లో చేద్దామని చెప్పా. చివరికి ఆ ధైర్యం చేయలేక తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేశాం.


* మీ పాత్ర కోసం ఏ రాజకీయ నాయకుడినైనా స్ఫూర్తిగా తీసుకొన్నారా?
నాకు వ్యక్తిగతంగా కేటీఆర్‌ అంటే ఇష్టం. ఆయన అందరు రాజకీయ నాయకులు వేసుకొన్నట్టుగా పూర్తిగా ఖాదీ కాకుండా, మామూలు చొక్కాలు కూడా వేస్తుంటారు. ఆయన ఫక్తు యువ నాయకుడిగా కనిపిస్తుంటారు కాబట్టి ఆయన్ని అనుసరించా. కొన్ని చోట్ల ఆయన లుక్స్‌ని మక్కీకి మక్కీకి దింపాం.

* మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు?
చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి బూమ్‌ వచ్చింది. సమయం గురించి ప్రభుత్వోద్యోగులు చాలా హడావుడి పడటం చూసేవాణ్ని. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన నాకు బాగా నచ్చింది. పాలనలో స్థిరత్వం కనిపిస్తోంది. కేటీఆర్‌ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. నాయకులు కెమెరాల ముందు చెప్పి, ఆ తర్వాత మరిచిపోయినట్టు కాకుండా, మా ఇంట్లో కూడా ఆయన ‘విజయ్‌ చిత్రీకరణల్లో ప్లాస్టిక్‌ని వినియోగించొద్దు. రాగి వస్తువులు కొనుక్కుని వాటితో నీళ్లు తాగు, మంచిది. నువ్వు యాక్టర్‌వి కదా. ఖాదీ వస్త్రాల్ని ప్రమోట్‌ చేయొచ్చు కదా?’ అని చెప్పారు. మన నగరాన్ని, రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్లు. నేను పోయినసారి కూడా తెరాసకే ఓటు వేశా. ఓటు అనేది నా వ్యక్తిగత విషయం.


* సొంతగా నిర్మాణ సంస్థని ఆరంభించారు. మీ సంస్థలో ఎలాంటి చిత్రాల్ని చేయబోతున్నారు?
దేవరకొండని ఇంగ్లిష్‌లో అనువదించి ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌’ అని నా సంస్థకి పేరు పెట్టా. ‘పెళ్లి చూపులు’ సమయంలో నేను, తరుణ్‌భాస్కర్‌ ఒక మంచి స్క్రిప్టుని తెరకెక్కిస్తున్నామని తెలుసు. ఆ రోజుల్లో మమ్మల్ని నమ్మి రూ:60 లక్షలు పెట్టేవాళ్లు లేరు. అది పెట్టినా విడుదల చేసుకోవడానికి చాలా తిరిగాం. అప్పట్లో మాలో విషయం ఉన్నట్టుగా, ఎవరైనా ఇప్పుడు మంచి స్క్రిప్టుని తీసుకొస్తే వాళ్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ పెట్టా. నాకు కథపైనా, వ్యక్తులపైనా నమ్మకం కుదిరితే తప్పకుండా సినిమా చేస్తా.

* ఈ మధ్య ఒక విదేశీ అమ్మాయితో కలిసి వున్న మీ ఫొటో ఆన్‌లైన్లో చర్చని లేవనెత్తింది. ఆ అమ్మాయి ఎవరు?
అందులో ఉన్నది నేను కాదని మాత్రం చెప్పను. అందులో కనిపించే అమ్మాయి చాలా మంచిది (నవ్వుతూ). ఇక మిగతా విషయాల్ని మరిచిపోండి.

* కొత్తగా మీరు చేయబోయే సినిమాలేమిటి?
మరో ద్విభాషా చిత్రం గురించి చర్చలు జరుగుతున్నాయి. అది చేస్తానా లేదా అన్నది ‘నోటా’ విడుదల, ఫలితం తర్వాత తెలుస్తుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మాత్రం ఓ సినిమా చేస్తున్నా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.