భయమేస్తుంది... గర్వంగా అనిపిస్తుంది

యువ సంచలనం విజయ్‌ దేవరకొండ. ఐదేళ్ల కిందట ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ ఎదురు చూశారు. అంతలోనే స్టార్‌ స్థాయికి ఎదిగారు. విజయ్‌ దేవరకొండ అంటే ఇప్పుడొక బ్రాండ్‌. రౌడీ హీరో అంటూ ఎంతోమంది అభిమానించే ఓ యువ తార. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కరోనా ప్రభావంతో వచ్చిన ఈ విరామంలో తన ఫౌండేషన్‌ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయ్‌తో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. ఆ విషయాలివీ...ఇంట్లో నన్ను పని చేయనివ్వడం లేదు, చేస్తే మా అమ్మకి పని రెట్టింపు అవుతుందట అంటూ మీరు ట్వీట్‌ చేశారు. ఎందుకలా?

నేను తినే తిండిలో ఉప్పు, కారం, నూనె తక్కువ మోతాదులో ఉండాలి. మా ఇంట్లో వాళ్లకేమో అలా ఇష్టముండదు. అందుకే రోజూ రెండు రకాల వంటలు చేస్తుంటారు మా అమ్మ. ఒక్కరే అంత పని చేయడం చూసి సాయం చేయడానికెళ్లా. రెండు రోజుల తర్వాత ‘నువ్వు చేసే సాయం ఏమో కానీ, పని డబుల్‌ అవుతోందిరా’ అని కిచెన్‌ నుంచి వెళ్లగొట్టింది అమ్మ. కూరగాయలు తరిగినా, ఇంకే పనైనా అమ్మ చేసినంత శుభ్రంగా చేయలేం కదా. అది అర్థమై ఆ రోజు నుంచి మా దుస్తులు మేం సర్దుకోవడంలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నామంతే.  

హీరో అయ్యాక ఇంటిని బాగా మిస్‌ అయ్యుంటారు. చాలా కాలం తర్వాత ఇన్ని రోజులు ఇంట్లో గడపడం కొత్తగా అనిపిస్తోందా?

పూరి జగన్నాథ్‌ సినిమా కోసం దాదాపు రెండు నెలలు ముంబయిలోనే గడిపా. అమ్మ అప్పుడప్పుడు నేనొస్తా అనేది. పని చేసేటప్పుడు నేనొక జోన్‌లో ఉంటా. అలాంటప్పుడు అమ్మ నాతోపాటే ఉందంటే... సౌకర్యంగా ఉందో లేదో, బోర్‌ కొడుతుందేమో అనే ఆలోచనలొస్తుంటాయి. అందుకే రావొద్దని చెప్పా. లాక్‌డౌన్‌కి ముందే ఇంటికొచ్చా. చిన్నప్పుడు హాస్టల్లో ఉంటూ అమ్మానాన్నకి దూరంగా  పెరిగాను. ఏడాదికి రెండు నెలలే సెలవులు దొరికేవి.అమ్మానాన్నల్ని బాగా మిస్‌ అయ్యేవాణ్ని. ఆ విలువ తెలిసినవాణ్ని కాబట్టి చిత్రీకరణ ఎక్కడ జరిగినా.. ఇంటికొచ్చి కాసేపు అమ్మానాన్నతో గడపడం అలవాటు. పని వల్ల వాళ్లతో గడిపే సమయం దొరకలేదనే పరిస్థితి ఎప్పుడూ లేదు. పూరి సినిమా కోసం ముంబయి వెళ్లినప్పుడే తొలిసారి అమ్మానాన్నల్నీ మిస్‌ అయినట్టు అనిపించింది. ఇప్పుడు అందరం కలిసి తింటున్నాం, ముచ్చట్లు చెప్పుకుంటున్నాం.  

కరోనా అందరినీ ఇళ్లకి కట్టిపడేయడంపై మీ ఆలోచనేంటి?

జీవితం అనూహ్యమైనది. మనం అది మరిచిపోయి ఏవో ప్రణాళికలు వేసుకుంటుంటాం. కానీ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఎవరూ బయటకెళ్లకుండా ఇంట్లో కూర్చోవడం, దుకాణాలన్నీ బంద్‌ చేయడం..ఇలా ఎప్పుడైనా ఊహించామా? అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... వాటి నుంచి బయటికి రావడానికి దారులు వెతుక్కోవాలి. మనుగడ సాధించాలి. మన పెద్దవాళ్లకీ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ముందుకొచ్చారు. మనమూ అంతే.  


ఈ విపత్తు నుంచి మనం నేర్చుకోవల్సింది ఏమైనా ఉందా?

ప్రకృతి గురించి ఆలోచించాలి. బతుకు, బతకనివ్వు అనేది మన సిద్ధాంతం కావాలి. పది తరాలకి సరిపడా సంపాదించాలనే దురాశ  ఎప్పటికీ చేటే. ఇప్పటి పరిస్థితిని చూస్తే మూడు రకాల మనుషులు కనిపిస్తారు. కుటుంబాలకి దూరమై కష్టాలు పడినవాళ్లు కొందరైతే, వాళ్లకి మేమున్నాం అని భరోసానిస్తూ సాయంగా నిలిచినవాళ్లు మరికొందరు. ఇదే అదనుగా 10 రూపాయల మంచి నీళ్ల సీసాని 20కి, 20 రూపాయల మాస్క్‌ని వందకి అమ్ముతున్నవాళ్లని చూస్తున్నాం. ఒక్కడు తప్పు చేసినా, దాని ప్రభావం ప్రపంచమంతా చూసింది కదా. ప్రకృతిని గౌరవించాలి, ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకోవాలి.

మీది రౌడీ ఇమేజ్‌. పూరి హీరోలూ అలాగే ఉంటారు. ఆయన కథ వింటే ఏమనిపించింది?

మస్తు మజా వస్తుంది చూడండీ (నవ్వుతూ). సినిమా అంతా ఒక పండగ వాతావరణంలా ఉంటుంది. ఇంతకంటే ఏం చెప్పలేను ఇప్పుడు.

ఐదేళ్ల కిందట మధ్య తరగతి కుర్రాడిగా ఉండి ఇప్పుడు స్టార్‌ కావడంపై ఆలోచిస్తుంటారా?

నా జీవితం సినిమాలాగే ఉంటుంది. కొన్నిసార్లు భయమేస్తుంది, కొన్నిసార్లు గర్వంగా అనిపిస్తుంది. అయితే మళ్లీ ఆ రోజులు చూడాలనిపించదు. నా స్నేహితులంతా నా చిన్ననాటి నుంచి కలిసున్నవాళ్లే. వాళ్లు ‘అప్పుడలా అనేవాడివి రా, ఇలా ఉండేవాడివి కదా’ అంటుంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు  తెలియని భావోద్వేగానికి లోనవుతా. ఏదీ అసాధ్యం కాదు. ప్రతి ఒక్కరం ఒక నిర్ణయం దూరంలో ఉంటామంతే. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా పనిచేశామంటే ఏదైనా జరిగి తీరుతుందంతే. నా జీవితమే అందుకు ఉదాహరణ.

ఈ విరామ సమయంలో ఏమైనా కొత్త కథలు విన్నారా?

కొత్తగా కథలేమీ వినలేదు. ఎందుకంటే నా తర్వాతి రెండు ప్రాజెక్టులు ఇప్పటికే ఫిక్స్‌ అయిపోయాయి. పూరితో సినిమా  పూర్తయిన వెంటనే శివ నిర్వాణతో సినిమా చేస్తా. ఆ తర్వాత దిల్‌రాజు సర్‌ నిర్మాణంలో ఓ సినిమా ఉంటుంది. ఇప్పటికే కథ,       దర్శకుడు ఫైనల్‌ అయిపోయారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతాం. కొత్త సినిమాల కబుర్లు ఇప్పుడే చెబితే మజా పోతుంది.

లాక్‌డౌన్‌ తొలగించగానే మీరు చేసే తొలి పనేమిటి?

ముందు నా స్నేహితుల్ని కలవాలి. వాళ్లందరినీ మా ఇంటికి పిలవడమో.. లేకపోతే బయట ఎక్కడైనా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటానికో ప్లాన్‌ చేయాలి. ఈ మధ్య వాతావరణం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి బయట సరదాగా ఎంజాయ్‌ చేయాలని ఉంది. లాక్‌డౌన్‌ ఒకేసారి పూర్తిగా  తొలగించరనుకుంటా. వివిధ దశల్లో ఆ ప్రక్రియ సాగొచ్చు. నాకు తెలిసి వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఎలాంటి పనులు చేయలేం. మాస్క్‌లు లేకుండా తిరగడం, సమూహాలుగా చేరడం ఇవన్నీ రెండేళ్ల వరకు సాధ్యం కాకపోవచ్చు  అనుకుంటున్నా. షూటింగ్‌కైతే సెప్టెంబరు.. అక్టోబరు నాటికి వెళ్లే అవకాశం ఉండొచ్చు.

మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌ పేరుతో సాయం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

ఐదేళ్ల కిందట మాది మధ్య తరగతి కుటుంబమే. కానీ మాకు రేషన్‌ కార్డ్‌ లేదు. ఐదేళ్ల కిందట ఇప్పటి పరిస్థితి వచ్చి ఉంటే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందేది కాదు. ఇప్పుడు వలస కూలీలకి సాయం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొస్తున్నారు. రేషన్‌ కార్డ్‌ ఉన్నవాళ్లకి ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. మధ్య తరగతివాళ్లకి మాత్రం ఎలాంటి సాయం అందదు. ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉంటాయని నాకు తెలుసు.కొంచెం డబ్బు సేకరించి స్వచ్ఛంద సంస్థలకి ఇస్తే? లేదంటే కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేసి నేనే అందరికీ అన్నం వండి పెడితే? ఇలా చాలా ఆలోచించా. కానీ ఏం చేసినా ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది. అందుకే మిడిల్‌క్లాస్‌ ఫండ్‌ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో ఉన్నవాళ్లకి సాయంగా నిలిచేలా ప్రణాళిక రూపొందించా. నేను రూ.25 లక్షలతో ప్రారంభిస్తే.. రూ.50 లక్షలు బయటి నుంచి వచ్చాయి. మేం 2500 కుటుంబాలకి సాయం చేయాలనుకుంటే, 7 వేల కుటుంబాలకి సాయం చేసే స్థాయిలో నిధులు సమకూరాయి. కానీ 70 వేల మంది సాయం కోరారు. నిధులున్నంతవరకు సాయం జరుగుతూనే ఉంటుంది. దీనిపై స్వచ్ఛందంగా వేల మంది వాలంటీర్లు, నా టీం సభ్యులు పనిచేస్తున్నారు.


‘‘పూరి సినిమా  ఫైటింగ్‌ నేపథ్యంలో సాగుతుంది . ప్రత్యేకంగా బాక్సింగ్‌ కాదు కానీ... మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ను చూడొచ్చు. సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తానా లేదా అంటే... ట్రై అయితే చేస్తున్నా. నా దేహం దానికి తగ్గట్లు సహకరిస్తుందో లేదో చూడాలి’’Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.