తరుణ్‌ నిర్మాణంలో.. దేవరకొండ దర్శకుడిగా!!
‘పెళ్లి చూపులు’ చిత్రంతో విజయ్‌ దేవరకొండను కథానాయకుడిగా తెలుగు చిత్రసీమలో నిలబెట్టారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడీ రుణాన్ని తరుణ్‌ను కథానాయకుడిగా పరిచయం చేసి తీర్చుకున్నారు విజయ్‌. తాజాగా ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్స్‌’ బ్యానర్‌లో తరుణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రాన్ని తీసుకొచ్చారు. కొత్త దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వం వహించారు. అభినవ్‌ గోమఠం, అనసూయ, అవంతిక, పావని గంగిరెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ సరికొత్త కామెడీ డ్రామా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


* నిర్మాత అవ్వాలనుకోలేదు..
‘‘నిజానికి నేను ఓ నిర్మాణ సంస్థను పెడతానని, ఓ చిత్రాన్ని నిర్మిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే.. మొదట్లో నాకీ చిత్రసీమలో అసలు నటుడిగా అవకాశం దొరుకుతుందో, లేదో? అనిపించేది. కానీ, ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్ల ఇంతస్థాయికి చేరుకున్నా. నిజానికి ఈ చిత్రాన్ని కూడా నేనే చేయాల్సింది. ‘అర్జున్‌రెడ్డి’తో నాపై అంచనాలు పెరగడం, తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పేశా. వాళ్లు రెండేళ్ల పాటు అనేక మంది చుట్టూ తిరిగి మళ్లీ నా దగ్గరకే వచ్చారు. అప్పుడు మరో కథ చెప్పారు. కానీ, ముందు చెప్పిన కథే బాగుంది. దాంట్లో నేను చేయకపోయినా, నిర్మిస్తా అని మాటిచ్చా. వాస్తవానికి వాళ్లు చెప్పిన కథ కూడా కాదు కానీ, పెద్దగా పెట్టుబడి లేకుండానే చక్కటి విలువలతో వాళ్లు లఘు చిత్రాలు తెరకెక్కించారు. అది చూసినప్పుడు నాకు తరుణ్‌ భాస్కర్‌ షార్ట్‌ ఫిలింస్‌ గుర్తొచ్చాయి. అందుకే ఆ ప్రతిభను మెచ్చే నిర్మాతగా చేయడానికి ముందుకొచ్చా’’.

                                 

* రెండోదీ కొత్తవాళ్లతోనే..
‘‘నిర్మాతగా వరుసగా చేసేయాలి అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను నిర్వహించడం చాలా కష్టమైన పని. ఇందులో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఒకవేళ మంచి ప్రతిభ ఉండి, సరైన అవకాశలు దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్లు ఎవరైనా ఉంటే.. వాళ్ల టాలెంట్‌పై నాకూ నమ్మకం కుదిరితే.. కచ్చితంగా నావైపు నుంచి అవకాశాలు అందివ్వడానికి ప్రయత్నిస్తా. త్వరలో నా బ్యానర్‌ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని సైతం కొత్తవాళ్లతోనే చేయబోతున్నా. సృజన్‌ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. త్వరలోనే దీని గురించి క్లారిటీ ఇస్తా’’.

* దర్శకత్వం ఇష్టమే.. కానీ..
‘‘దర్శకత్వం అంటే ఇష్టమే.. భవిష్యత్తులో చేస్తానేమో. కాకపోతే చిన్న సమస్య ఉంది. నాకు సంభాషణలు రాయడం అంతగా తెలియదు. తరుణ్‌ భాస్కర్‌ ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా తరుణ్‌ మాట కలుపుతూ.. ‘విజయ్‌ దర్శకత్వం చేస్తానంటే.. కచ్చితంగా దాన్ని నేనే నిర్మిస్తా’ అని మాటిచ్చారు. అంతేకాదు.. కచ్చితంగా సంభాషణలు కూడా రాసిపెడతా అన్నారు.

* తరణ్‌తో మల్టీస్టారరా?
తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా మారారు కదా.. భవిష్యత్తులో తరుణ్‌తో కలిసి నటిస్తారా? అని ప్రశ్నించగా విజయ్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘అదేంటండి.. నేను తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఎదురు చూస్తుంటే.. కలిసి నటిస్తారా? అని అడుగుతున్నారు’’ అంటూ నవ్వేశారు. అంతేకాదు.. తరుణ్‌ నటుడిగా మీకన్నా మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు ఈర్ష్యగా ఉందా? అని అడగ్గా.. ‘‘అసలు అలాంటిదేం లేదు. కచ్చితంగా చెప్పాలంటే ఓ స్టార్‌ హీరో స్నేహితుడిగానో, సోదరుడిగానో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వాళ్ల పేరు చక్కగా ఉపయోగించుకుంటూ హ్యాపీగా గడిపేసేయొచ్చు. ఇంతగా చెమటలు చిందిస్తూ కష్టపడాల్సిన అవసరం నాకూ ఉండదు’’ అని సరదాగా బదులిచ్చారు.

మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.