సినిమాల్లోకి రాకముందు అలాంటి అవమానాలు ఎన్నో..
హీరో పాత్రలు చేస్తూనే విలన్, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ నటిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు విజయ్‌ సేతుపతి. పలు భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ ఆ స్థాయికి ఎలా వచ్చాడో ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం..

సొంతూరు...
మాది తమిళనాడులోని రాజపాళయంలో పేద కుటుంబం. నాకో అన్నయ్యా, తమ్ముడూ, చెల్లీ. నాన్న సివిల్‌ ఇంజినీర్‌. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడే మేం చెన్నైకి వచ్చాం. అక్కడే బీకామ్‌ పూర్తి చేశా. అయితే నాన్నకి నన్ను చదివించే స్థోమత లేకపోవడంతో ఇంటర్‌ నుంచీ డిగ్రీ వరకూ పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ కాలేజీ ఫీజులు నేనే కట్టుకుని చదువుకున్నా.


సినిమాల్లోకి రాకముందు...
నా చదువు పూర్తయ్యేసరికి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దాంతో పీజీ చేయకుండా ఓ చిన్న షాపులో అకౌంటెంట్‌గా చేరా. జీతం సరిపోక చాలా ఇబ్బందయ్యేది. అన్నయ్య చదువుకుంటుండటంతో కుటుంబ బాధ్యత నాపైనే పడింది. అందుకే కొన్నాళ్ల తరవాత ఎక్కువ జీతం వస్తుందని దుబాయ్‌ వెళ్లిపోయా. ఓ ఐదారేళ్లు అక్కడ పనిచేశాక అమ్మ బాధపడుతోందని 2003లో చెన్నైకి తిరిగొచ్చా. ఓ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో చేరా. అలానే హోల్‌సేల్‌ సిమెంట్‌ వ్యాపారం కూడా చేశా.
ఒకే ఒక్క ఛాన్స్‌...
కొన్నాళ్లకి కూతుపట్టరై అనే ఓ థియేటర్‌ గ్రూపులో అకౌంటెంట్‌గా చేరా. ఆ థియేటర్‌ గ్రూపు సభ్యులు రకరకాల నాటకాలు వేసేవారు. వాళ్లను చూసినప్పుడు నటనపై ఆసక్తి ఏర్పడింది. అప్పట్నుంచీ వాళ్లని గమనిస్తూనే అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. చాలా చోట్ల ్ఞనీ మొహానికి సినిమాన్ఠా అన్నవాళ్లు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల నా ఫొటోలు ఇస్తే కూడా తీసుకునేవారు కాదు. ఇంకొందరు వేషం ఉందని పిలిచి చివరికి వేరే వాళ్లకి ఆ పాత్ర ఇచ్చేవారు. సినిమాల్లోకి రాకముందు అలాంటి అవమానాలు కోకొల్లలు. అయితే కొన్నాళ్లకి సీరియళ్లలో పనిచేసే అవకాశం వచ్చింది. నటుడిగా ఓమెట్టు ఎక్కాక అప్పుడే దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న కార్తీక్‌ సుబ్బరాజు పరిచయం అయ్యాడు. తన ఆసక్తికొద్దీ నన్ను హీరోగా పెట్టి షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేవాడు. ఒకసారి నార్వే తమిళ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది. అప్పుడే నాపైన నాకు నమ్మకం పెరిగింది. ఆ తరవాతే 2006లో తొలిసారి ్ఞపుధుపెట్ట్ఠైలో ధనుష్‌కి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌కి ఎంపికయ్యా.


బ్రేక్‌ నిచ్చింది...
క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రూవ్‌ చేసుకున్నాక కొంతకాలానికి హీరోగా అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత కార్తీక్‌ సుబ్బరాజ్‌ ‘పిజ్జా’ కథ రెడీ చేసుకుని సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ హారర్‌ సినిమాకి నేనైతే బాగుంటానని హీరోగా నన్ను ఎంచుకున్నాడు. అలా కార్తీక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పిజ్జా’ నాకు బ్రేక్‌నిచ్చింది. ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. ‘నేనూ రౌడీనే’, ‘నవాబ్‌’, ‘సైరా’, ‘విజయ్‌ సేతుపతి’తో తెలుగు ప్రేక్షకులకీ మరింత దగ్గరయ్యా. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీలోనూ నటిస్తున్నా.
మర్చిపోలేనిది...
నేను సినిమా ప్రయత్నాలు చేసే క్రమంలో దర్శకుడు బాలూ మహేంద్ర సర్‌ని కలవాలనుకున్నా. అపాయింట్‌మెంట్‌ కోసం దాదాపు నెలరోజుల పాటు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాశా. చివరికి ఒకరోజు నన్ను చూసి ఆయనే ఇంట్లోకి పిలిచారు. నటన మీదున్న ఆసక్తి చెప్పగానే ్ఞనీ ఫొటోలున్నాయ్ఠా అనడిగారు. ఇవ్వగానే ్ఞనీది ఫొటోజెనిక్‌ ఫేస్‌... నీకళ్లూ నవ్వూ చాలా బాగున్నాయి. నువ్వు తప్పకుండా హీరోవవుతావ్ఠు అన్నారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన అన్నట్టే మంచి స్థాయికొచ్చా.


కుటుంబం...
నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు కేరళ అమ్మాయి జెస్సీ నాకు ఆన్‌లైన్‌లో పరిచయం అయింది. కొన్నాళ్లకి అది కాస్తా ప్రేమగా మారింది. 2003లో నేను చెన్నైకి తిరిగొచ్చాక నేరుగా జెస్సీ ఇంటికే వెళ్లి కలిసొచ్చా. అప్పుడే మేం ఒకర్నొకరం చూసుకోవడం. కొన్నాళ్లకి ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకో పాపా, బాబూ. మా అబ్బాయి సూర్య కూడా ఛైల్డ్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.