మంచు విష్ణు... ‘ఢీ’ అంటూ నవ్వులు పంచగలరు. ‘రౌడీ’గా నటనలో గాఢతని చూపించగలరు. ‘దేనికైనా రెడీ’ అంటూ నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘మోసగాళ్లు’ చిత్రంతో బిజీగా ఉంటూనే... ‘కన్నప్ప’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వెబ్ సిరీస్లు కూడా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘మోసగాళ్లు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
పేరుకు తగ్గట్టే చెడ్డవాడిగా కనిపిస్తా. తొందరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో వేలమంది జీవితాల్ని నాశనం చేసిన కొంతమంది కథ ఇది. ప్రపంచంలోనే భారీ ఐటీ కుంభకోణం చుట్టూ సాగుతుంది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.
మీ నుంచి సినిమా వచ్చి చాలా కాలమైంది కదా?
కావాలని తీసుకున్న విరామమే ఇది. ‘ఆచారి అమెరికా యాత్ర’ తర్వాత ఎక్కడ తప్పు జరుగుతోందో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా. అమెరికాలో ఓ కంపెనీని పెట్టి అక్కడివారిని, మన తెలుగు రచయితలను కలిపి స్క్రిప్టులు రాయించా. ఒకేసారి నాలుగు సినిమాలు, రెండు మూడు వెబ్ సిరీస్లను నిర్మించేలా నిర్మాణసంస్థని తీర్చిదిద్దుకున్నా.
హాలీవుడ్లోనే కథలు రాయించాలని ఎందుకు అనుకున్నారు?
మన దగ్గర ఫలానా సినిమాలా రాద్దామని ఆలోచించేవాళ్లే ఎక్కువ. దీంతో ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకోలేకపోయా. ‘మోసగాళ్లు’తో నేనేం చేయాలనుకున్నానో, నాకేం కావాలో అదే చేశా. ఆరంభంలోనే నేనిలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండుంటే ఇప్పటికే నాదైన ఒరిజినాలిటీ కనిపించేది. స్క్రిప్టుల ఎంపిక విషయంలో నావైపు నుంచి తప్పులు జరగలేదు. ఆ స్క్రిప్టులు తెరపైకి వచ్చిన విధానంతోనే సమస్యలొచ్చాయి. ‘మోసగాళ్లు’ను మొదట హాలీవుడ్ సినిమాగా మొదలుపెట్టాం. ఆ తర్వాత తెలుగులోనూ తీసుకురావాలని నిర్ణయించాం. దీనితోపాటే ‘చదరంగం’ వెబ్సిరీస్ని ప్రారంభించాం.
జూన్లో ఓ సినిమా ప్రారంభిస్తాం అంటున్నారు. అది ‘కన్నప్ప’ సినిమానేనా?
అది వేరు. ‘కన్నప్ప’ వేరు. తనికెళ్ల భరణి అంకుల్, నేను మూడేళ్ల కిందటే ‘కన్నప్ప’ సినిమా చేయాలనుకున్నాం. హాలీవుడ్ నుంచి స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి యానిమేట్రిక్స్ చేయించాలనుకున్నాం. ఇంతలో భరణి అంకుల్ ‘నువ్వు అనుకుంటున్న విజన్ బాగుంది కానీ, అది నేను షూట్ చేయలేను. పరిమిత వ్యయంలో ఒక కళాత్మక సినిమాని చేస్తానేమో కానీ.. నువ్వు అంటున్న సినిమాని హ్యాండిల్ చేయలేను’ అన్నారు. నేను అనుకుంటున్న ‘కన్నప్ప’ స్థాయి ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ తరహాలో ఉంటుంది. భరణి అంకుల్ అలా చెప్పేసరికి నేను హాలీవుడ్ నిపుణుల్ని సంప్రదించా. ఆ సినిమా కోసం మేం వేసుకున్న బడ్జెట్ రూ.95 కోట్లు. దాన్ని ఎలా తగ్గించాలో ఆలోచిస్తూ పూర్వ నిర్మాణ పనులు చేస్తున్నాం. 2 వేల ఏళ్ల కిందట మన నీళ్లు, మన ఆకాశం, మన ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉండేవో అలాంటి ప్రదేశంలోనే ఈ సినిమాను చిత్రీకరించాలి. దాంతో న్యూజిలాండ్, అరకుల్లో చిత్రీకరణ చేయాలనుకున్నాం.
మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు?
తెలుగులో ముగ్గురు అగ్ర దర్శకుల్ని సంప్రదించా. వాళ్లు బడ్జెట్లో 30 శాతం పారితోషికం అడిగారు. అందుకే హాలీవుడ్ నుంచే దర్శకుడిని తీసుకు రావాలనుకున్నాం. హాలీవుడ్లో స్క్రిప్టు పూర్తయ్యాక, తెలుగుకి తగ్గట్టుగా బుర్రా సాయిమాధవ్ స్క్రిప్టుని సిద్ధం చేస్తారు. నేను కంటున్న ఈ కలలన్నీ నిజం కావాలంటే ముందు నా ‘మోసగాళ్లు’ బాగా ఆడాలి.
ఇటీవల ఓ సినిమా వేడుకలో సెట్లో కార్వ్యాన్ల గురించి మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం?
చిన్నప్పుడు మా నాన్నతో పాటు చిత్రీకరణలకి వెళ్లేవాణ్ని. సెట్లో అందరూ కలిసిమెలసి ఉండేవారు. కార్వ్యాన్లు వచ్చాక వాటిలోకి వెళ్లి కూర్చుంటున్నారు. నేను మాత్రం అలాకాదు. నలుగురు పిల్లలతో మీ కుటుంబం మరింత పెద్దదైంది.
ఈ కాలంలో నలుగురు పిల్లలంటే విశేషమే. మరి మీ స్నేహితులు ఏమంటున్నారు?
పిల్లలంటే నాకు ఇష్టం. నా స్నేహితులు కొంతమంది ఫోన్ చేసి... ‘మేమేమో ఒకరు చాలనుకుంటున్నాం, నీవల్ల మా ఇంట్లో తిట్లు తింటున్నాం’ అన్నారు. ఇంకొంతమంది ‘ఏం డార్లింగ్... ఇంకా సరిపోలేదా? కంటే కన్నావు కానీ ఆ విషయం ఇప్పుడే చెప్పాలా? పిల్లలకి పదహారేళ్లొచ్చాక చెప్పచ్చు కదా’ అన్నారు. వినీ వాళ్ల కుటుంబంలో అయితే జగనన్న కానీ, షర్మిలక్క కానీ ‘మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టడం ఆపేయ్’ అంటుంటారు. సుబ్బరామిరెడ్డి అంకుల్ అయితే ‘ఏమయ్యా... నీకు వేరే పనిలేదా’ అన్నారు
(నవ్వుతూ).