సినిమాలంటే కాళ్లు విరగ్గొడతా అన్నారు

‘‘విజయం ఎప్పుడూ భయాన్ని కలిగిస్తుంది. నాకిది తొలి చిత్రమైనా భలే తీశాడే అని ప్రేక్షకులు నన్ను భుజాలకెత్తుకున్నారు. కాబట్టి తర్వాతి చిత్రంతో వాళ్లను నిరుత్సాహపరచకూడదనే భయం మనసులో వెంటాడుతుంటది. ఒకరకంగా ఈ భయం నాకు మంచి ప్రోత్సాహాన్నే ఇస్తుంది. ఎందుకంటే చేసే ప్రతి చిత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని చెయ్యమని గుర్తు చేస్తుంటుంది’’ అన్నారు శైలేష్‌ కొలను. ‘హిట్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నూతన దర్శకుడీయన. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రముఖ కథానాయకుడు నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శైలేష్‌.


*
‘‘ఈ చిత్ర ఫలితంపై చాలా సంతృప్తిగా ఉన్నా. నేనేదైతే ప్రేక్షకులకు చూపించాలనుకున్నానో దాన్ని వాళ్లు ఆదరించారు. అందరూ నేను ఎంతో విభిన్నంగా తీశానని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకున్నందుకు ఆనందంగా ఉంది. రానా, మంచు లక్ష్మీ, కొంత మంది యువ దర్శకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది. ఆ పిచ్చే నన్ను డాక్టర్‌ వృత్తిని వదిలి సినిమాల వైపు వచ్చేలా చేసింది. నిజానికి నేను చిత్ర పరిశ్రమలోకి వస్తానన్నప్పుడు నాన్న వద్దన్నారు. మంచి ఉద్యోగం వదులుకోని నీకివన్నీ ఎందుకన్నారు. ఇటు వైపు వస్తే కాళ్లు విరగ్గొడానని హెచ్చరించారు (నవ్వుతూ). కానీ, ఆయనకు తెలియకుండా ఇటువైపు అడుగులేశా. తెరపై నాన్న ఈ సినిమా చూసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యారు. ‘ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావురా?’ అన్నారు. ఆ క్షణం నాకు చాలా సంతోషమనిపించింది’’.

* ‘‘నేనీ లక్ష్యాన్ని ఇంత చక్కగా చేరుకోగలిగానంటే అదంతా నాని వల్లే. నేను ఆయనకు వీరాభిమానిని. మొదటి నుంచి నాకు కథలు చెప్పడమంటే చాలా ఇష్టం. ఉద్యోగరిత్యా ఆస్ట్రేలియా వెళ్లిపోయాక అక్కడ స్క్రిప్ట్‌ రైటింగ్‌ నేర్చుకోవడానికి మంచి సమయం దొరికింది. అక్కడున్న 8ఏళ్లలో సినిమాలకు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా. 2016లో తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ కథ రాసుకున్నాక.. నానికి అయితే ఇలాంటి కథలు నచ్చుతాయని తెలిసి స్నేహితుల సహాయంతో ఆయన్ని కలిశా. అక్కడి నుంచి ఆయనతో నా ప్రయాణం మొదలైంది. తర్వాత ఆయనకు ఓ పీరియాడికల్‌ కథ.. మరో సైన్స్‌ ఫిక్షన్‌ కథ చెప్పా. ఆయనకవి నాచ్చాయి కానీ భిన్నంగా ఏదన్నా చేద్దామన్నారు. అప్పుడే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంగా ‘హిట్‌’ను సిద్ధం చేసుకున్నా’’.

* ‘‘ఇది ఏ హాలీవుడ్‌ చిత్రానికి స్ఫూర్తి కాదు. నాకు మొదటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రమైన నేర వార్తలను సేకరించే అలవాటుండేది. అలాంటి కథనాలతో నేనొక డైరీనే తయారు చేసుకున్నా. అందులోని నేర కథనాలన్నింటిలో ఉన్న కొన్ని ఆసక్తికరమైన అంశాలతో మంచి థ్రిల్లర్‌ రాసుకోవాలి అనుకునేవాడిని. అలా వాటి నుంచి బయటకు తీసిన ఆలోచనే ఈ ‘హిట్‌’. ఇంకా ఆ డైరీలో నుంచి ఇలాంటి కేసులను అనేకం బయటకు తియ్యొచ్చు. అందుకే ఈ కథ చెప్పగానే నాని సినిమా చెయ్యడానికి అంగీకరించారు. నిజానికి నేనెప్పుడూ కథ రాసుకునేటప్పుడు ఫలానా హీరోని దృష్టిలో పెట్టుకోని స్క్రిప్ట్‌ రాయను. రాయడం మొదలయ్యాక ఎవరికైతే బాగుంటుంది అనిపిస్తుందో తొలుత వాళ్లకే కథ వినిపిస్తా. ఈ స్క్రిప్ట్‌ కొంత రాసుకున్నాక హీరో పాత్రకు నా మదిలో మెదిలిన తొలి రూపు విశ్వక్‌ సేనే. అందుకే ముందు తనకే కథ చెప్పా. వినగానే నేను చేస్తానని నానికి ఫోన్‌ చేసి చెప్పారు. నిజానికి ఈ చిత్రం కన్నా ముందే ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాల్లో తన నటనను చూసి ఎప్పటికైనా తనతో సినిమా చెయ్యాలనుకునే వాడిని. అదిలా తొలి ప్రయత్నంలోనే నెరవేరడం సంతోషాన్నిచ్చింది’’.

* ‘‘విశ్వక్‌కు కథ వినిపించే ముందు కాస్త భయపడ్డా. ఎందుకంటే తనలో ఓ దర్శకుడున్నాడు. స్క్రిప్ట్‌లో ఏమన్నా వేలు పెడతాడేమో అనుకునే వాడిని. కానీ, కథ విన్నాక చిన్న మార్పు కూడా చెప్పలేదు. నా దర్శకత్వంలోనూ ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తన పాత్ర నుంచి ఏదైతే కోరుకున్నానో అదిచ్చాడు. నాని స్క్రిప్ట్‌ దశలో కొన్ని చిన్న చిన్న మార్పులు చెప్పారు. ప్రస్తుతం నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయి. ముందు ‘హిట్‌ 2’ను పట్టాలెక్కిస్తా. కాస్త విరామం తీసుకోని జూన్‌ చివరి నాటికి ఈ చిత్రం సెట్స్‌పైకి వెü™్ల అవకాశముంది. ఈలోపు స్క్రిప్ట్‌ పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటా. ఇందులోనూ విశ్వక్‌తో పాటు తొలి భాగంలో కనిపించిన వాü™్ల ఉంటారు. కథాంశాన్ని బట్టి మరిన్ని కొత్త పాత్రలు తెరకు పరిచయమవుతాయి. వచ్చే ఏడాదిలోనే విడుదల చేస్తాం. మంచి కథ దొరికితే నానితో చేస్తా. ఆయనకి గతంలో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథ చెప్పా. ఆయనకది బాగా నచ్చింది’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.