నవ్వుకోవడం ఖాయం
‘మేం కథానాయకులం కాదు. నవ్వించే వాళ్లమే. మమ్మల్ని చూసిన ప్రేక్షకులు నవ్వుకోవాలనే తపనతోనే నటిస్తున్నాం. ‘చంటిగాడు’, ‘పండుగాడు’గా మేమిద్దరం చేసిన పనుల్ని ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’ సినిమాలో చూసి ప్రేక్షకులు నవ్వేసుకోవడం ఖాయం’’ అని హాస్యనటులు ప్రవీణ్, మధునందన్‌ చెప్పారు. రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ నాయకానాయికలు. కిషోర్‌కుమార్‌ దర్శకుడు. ఎం. శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్‌.కె. రెడ్డి నిర్మాతలు. ఈ నెల 15న విడుదలవుతుంది.


* ‘‘పల్లెటూరులో ఆవారాగా తిరిగేవాళ్లం. కాబట్టి మాపై ఎవరికీ ప్రేమ, ఇష్టం, జాలీ ఇవేం ఉండవు. ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన టీచర్‌ మాపట్ల అభిమానాన్ని చూపిస్తుంటుంది. దాన్ని మేం ప్రేమ అని అపార్థం చేసేసుకుంటాం. ఆమెకి బాగా దగ్గరవ్వాలని చూస్తుంటాం. మామధ్య నడిచే దృశ్యాలు ప్రేక్షకుల్ని బాగా నవ్వించేస్తాయి. ఆకతాయిల్లాంటి మాతో ఆ ఊరికి ఉపయోగపడే మంచి పనులు చేయించడం అనేది ఈ కథలోని పెద్ద మలుపు. పాటలు బాగున్నాయి. దర్శకుడికిది తొలి సినిమా. దర్శకత్వ బృందం, సంభాషణలు రాసిన కిరణ్, నిర్మాతల సహకారాలు లభించడం వల్ల తను ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా తెరకెక్కించాడు’’.

* ‘‘హాస్యాన్ని పండించడం తేలికేం కాదు. చక్కని టైమింగుండాలి. చూడగానే నవ్వుకునే బాడీ లాంగ్వేజ్‌ సొంతమై ఉండాలి. ఇవి మాలో ఉన్నాయని ప్రేక్షకులు నమ్మబట్టే మేం వాళ్లని నవ్వించగలుగుతున్నాం. తెలుగులో ఉన్నంతగా ఎక్కువ మంది కమెడియన్లు ఇంకెక్కడా లేరు. ఎందరున్నా, కొత్త వాళ్లస్తే స్వాగతిస్తూనే ఉంటారు. తెలుగులో కామెడీ రాసే రచయితలు పుష్కలంగా ఉన్నారు. అందుకే మా అందరికీ కావల్సినంత పని దొరుకుతోంది. ఎన్నిరకాల పాత్రలు వేసినా, నవ్వించడంలోనే ఆనందం ఉంది’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.