భాషాతీతం.. అద్నాన్‌ గాన మాధుర్యం!
ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు, పియానో కళాకారుడు అద్నాన్‌ సమీకి అరుదైన గౌరవం దక్కింది. సంగీత రంగంలో అద్నాన్‌ చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. 48 ఏళ్ల అద్నాన్‌ సమీ పూర్తి పేరు అద్నాన్‌ సమీ ఖాన్‌. లండన్‌లో జన్మించారు. ఆయన తండ్రి పాకిస్థానీ. తల్లి కశ్మీరీ. ఐదేళ్ల వయసు నుంచే పియానో వాయించడం నేర్చుకున్నారు. 9 ఏళ్ల వయసుకే తొలి ట్యూన్‌ రూపొందించారు. పదేళ్ల వయసు నుంచే సంగీత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ వయసులోనే అతని ప్రతిభ చూసి ప్రముఖ గాయకురాలు ఆశా భోంస్లే ముగ్ధురాలై అతణ్ని ప్రోత్సహించింది. 16 ఏళ్ల వయసులో ఇథియోపియాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం గురించి పాట రాసే అవకాశం వచ్చింది. ఆ పాటకుగానూ యూనిసెఫ్‌ పురస్కారం లభించింది. క్లాసికల్, వెస్ట్రన్, జాజ్, రాక్, పాప్, ఫ్యూజన్‌ సంగీతాల్లో ఆయనకు ప్రవేశముంది. పాక్‌ ప్రధాని నుంచి జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి గ్లోరీ ఆఫ్‌ ఇండియా అవార్డు అందుకున్నారు.


సంగీత సవ్యసాచి:
ఇంగ్లిష్‌ ఆల్బమ్స్‌తో కెరీర్‌ మొదలెట్టారు అద్నాన్‌. ఆ తర్వాత పాకిస్థానీ చిత్రం ‘సర్గమ్‌’కు సంగీతం అందించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించారు. దానికి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ఆశా భోంస్లేతో కలసి ‘కభీతో నజర్‌ మిలావ్‌’ ఆల్బమ్‌ రూపొందించారు. అది అద్నాన్‌కు అభిమానులను తెచ్చిపెట్టింది. దాంతోపాటు బాలీవుడ్‌ అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా సంగీత ప్రపంచంలో తన హవా కొనసాగించారు. 35 ఏళ్ల కెరీర్‌లో అద్నాన్‌ బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ తదితర ప్రాంతీయ చిత్రాల్లోనూ గాయకుడిగా మరుపురాని గీతాలను ఆలపించారు. తెలుగులో ‘ఓ మధు ఓ మధు..’ (జులాయి), ‘నేనంటే నాకు..’ (అశోక్‌), ఇన్‌ఫాచ్యుయేషన్‌ (100 పర్సెంట్‌ లవ్‌), ఓ ప్రియా ప్రియా (ఇష్క్‌), నచ్చావే నైజాం పోరీ (వర్షం), భూగోళమంత సంచిలోన (శంకర్‌ దాదా జిందాబాద్‌) లాంటి పాటలతో శ్రోతలను అలరించారు. ఏయ్‌ ఉడి ఉడి (సాథియా), బాతే కుచ్‌ ఆంఖే సి (లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో), నూర్‌ ఇ ఖుదా (మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌), భర్‌ దో జోలీ మేరీ (భజరంగీ భాయ్‌జాన్‌) లాంటి బాలీవుడ్‌ గీతాలకు అద్నాన్‌ తన గాత్రంతో ప్రాణం పోశారు. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో లిఫ్ట్‌ కరాదే, తేరా చెహ్రా, కసమ్, దిల్‌ కే రహా హై లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలను అందించారు. భారత రాష్ట్రపతి, ప్రధానితో పాటు ఎన్నో దేశాల ప్రముఖుల ముందు తన సంగీత ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు అద్నాన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.