సంగీత సింధువులో ముత్యమైన బిందువు!
జీవితమొక జీవనది. ప్రవహించాల్సిందే. కన్నీరొక ఆత్మ బంధువు. ఆదరించాల్సిందే. దుఃఖాశ్రయం జీవితమైతే.. సుఖాశ్రయం జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాలెన్నింటినో మనకు ఇచ్చాడు ప్రముఖ సినీ గాయకుడు కట్టశేరి జోసఫ్‌ యేసుదాసు (కేజే యేసుదాసు). ఇటు తెలుగు, కన్నడ, తమిళ, మళయాల రాష్ట్రాల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మ విభూషణ్‌’ (2017), పద్మభూషణ్, (2002), పద్మశ్రీ, (1977)లాంటి అవార్డులను అందజేసింది. ఇవాళ ఆయన (10-01-1940) పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనపై ప్రత్యేక కథనమిది.


సింధువు చెంత బిందువు
కే కులం, ఒకే మతం అందరు ఒకటేనన్నది నారాయణ గురు ఉపదేశం. యేసుదాసు కూడా దానినే ఆచరిస్తారు. గురోపదేశాన్ని శిరసావహిస్తారు. ఔను... గాలికి కులమేది? నీటికి మతమేది? ఈ రెంటికీ లేని తేడా మనుషుల కెందుకబ్బా... అన్నది ఈ మహాగాయకుడి ఆంతరంగం. 1961 నవంబర్‌ 14న మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగిడి అనేకానేక భాషల్లో పాటలు పాడి శ్రోతల హృదయ విజేతగా నిలిచారు. మొత్తంగా ఏడు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. మొట్టమొదటి జాతీయ అవార్డు (1972) ‘అచనమ్‌ బప్పాయం’ అనే మలయాళీ సినిమాకు దక్కడం విశేషం. తెలుగులో ‘మేఘ సందేశం’గాను 1985లో జాతీయ అవార్డు వరించింది.

తొలి అడుగు..వేదన భరితం
నాన్న ఉంటేనే జీవితం. కానీ అతని జీవితం వేరు. నాన్న లేడు. అమ్మ ఉన్నా ఆమె పరిస్థితీ అంతంత మాత్రమే. యేసుదాస్‌ జీవితం వడ్డించిన విస్తరా... వండి వార్చిన వైనమా అంటే ఏం చెబుతాం? ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ‘నేను ఎవరినీ తప్పు పట్టను. ఆ...రోజుల్లో నాన్నకు ఆపరేషన్‌ అయిన తరువాత చనిపోయారు. ఆసుపత్రి ఫీజు ఎనిమిది వందల రూపాయలు. అది కూడా చెల్లించలేక నానా అవస్థలు పడ్డాను’ అంటూ దుర్భరంగా గడిచిన బాల్యాన్ని గుర్తుచేసుకొంటారాయన. అటుపై నాన్న పంచి ఇచ్చిన స్ఫూర్తితోనే గాయకుడిగా ఎన్నో శిఖరాలు అధిరోహించారు ఆయన. పాట ఆయన ప్రాణం. అది ఏదైనా, ఏ భాషదైనా, ఎలాంటిదైనా. ‘పాటను పాడాలంతే. ఇందులో ఎక్కువ తక్కువలకు తావే లేదు’ అని వినమ్రంగా చెబుతారు యేసుదాస్‌.


నాన్నకు ప్రేమతో...
తండ్రి అగస్టీన్‌ జోసెఫ్‌. స్వతహాగా కళాకారుడు. నాటకాల్లో కొడుకుతో పాడించేవారు. ఐదో ఏటే యేసుదాసు న్వరాభ్యాసం మొదలయ్యింది. ఆయన తొలి గురువు నాన్నే. అటుపై ఎందరో ప్రముఖుల దÞ్గర శిష్యరికం చేశారు. ఆయన గురువులతో అగ్రగణ్యులు చెంబే వైద్యనాథన్‌... ఆరాధకుల్లో ప్రాతః స్మరణీయులు మహ్మద్‌ రఫీ. 1957, 58లలో వరుసగా కేరళ యువజనోత్సవాల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు. అటుపై ఎస్సెస్సీ పూర్తయ్యాక ఓ గురువు సాయంతో త్రిప్పునిథుర సంగీత అకాడమీలో చేరారు. ఇదంతా 1960ల మాట. ఐదు రూపాయల ఫీజు చెల్లించలేని దశ నుంచి ఎన్నో అవస్థలు దాటుకుని ఇంతవారయ్యారు. 1967లో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ పాటతో ప్రాచుర్యం పొందారు. ఔను! దేవుడు వీధిని ఇస్తాడు. విధిని పరిచయం చేస్తాడు. ఆ తరువాత ముందుకు సాగాల్సింది సొంతంగానే. అందుకు తార్కాణం ఆయన జీవితమే. సలీం చౌదరి పరిచయం అయ్యాక హిందీ చిత్రసీమలో అడుగిడి ‘ఆనంద్‌ మహల్‌’ సినిమాలో ‘జానేమన్‌’ పాటతో పాపులర్‌ అయ్యారు. రవీందర్‌జైన్‌ వరుసగా ఆయనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడమే కాదు... ఆయనకు వరుసగా మూడో సారి జాతీయ అవార్డు వరించేందుకు కారకులయ్యారు. అంతేనా 1970లో అతి పిన్న వయసులో కేరళ సంగీత నాటక అకాడమీకి అధ్యక్షులయ్యారు.
   

తొలి తెలుగు సినిమా పాట..
‘నిండు చందమామ..నిగనిగల భామ’ అంటూ ‘బంగారు తిమ్మరాజు’ కోసం ఓ పాట పాడారు ఏసుదాసు. అదే ఆయన తొలి తెలుగు సినిమా పాట. అప్పటి నుంచి స్వర రాగ గంగా ప్రవాహం..ఉరకలెత్తుతూనే ఉంది. విషాద గీతాల గురించి ఎప్పుడు చెప్పుకొన్నా ఏసుదాసు పేరు ప్రస్తావించుకోకుండా ఉండలేం. ‘గాలి వానలో వాన నీటిలో’ (స్వయం వరం), ‘కుంతీ కుమారి తన కాలుజారి’ (కుంతీపుత్రుడు), ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ (అంతులేని కథ), ‘చుక్కల్లే తోచావే’ (నిరీక్షణ), ‘సృష్టి కర్త బ్రహ్మ’ (అమ్మా రాజీనామా), ‘ఆకాశ దేశాన ఆషాడ మసాన’ (మేఘసందేశం) ఇలాంటి పాటలు ఎప్పుడూ వినిపించినా... కదిలే కాలం కూడా కాసేపు ఆగి, ఏసుదాసు ఆలాపన ఆస్వాదిస్తుంది. ‘దారి చూపిన దేవత..’ (గృహప్రవేశం), ‘అమృతం తాగిన వాళ్లు అమ్మానాన్నలు’ (ప్రతిభావంతుడు)లాంటి భావోద్వేగమైన పాటలూ ఆ గాత్రం నుంచి వచ్చినవే. ఆయన ఖాతాలో హుషారు గీతాలూ ఉన్నాయి. ‘గీతా..ఓ గీతా’ (కటకటాల రుద్రయ్య), ‘కొమ్మా కొమ్మా కొమ్మా రెమ్మలో’ (బ్రహ్మ) ‘అందమైన వెన్నెలలోన..’ (అసెంబ్లీ రౌడీ) అలాంటి పాటలే. మోహన్‌బాబు సినిమా అంటే ఆయన పాట కచ్చితంగా వినిపించేది.

                                

యెల్ల మతముల సారమొకటే...
’నేను మతాలను కాదు అక్షరాలను ప్రేమిస్తాను. వాటిని సంగీతంతో అర్చిస్తాను’ అని తరుచూ అంటుంటారాయన. ఎంత గొప్ప భావన. మనుషులంతా ఒక్కటే అన్నది శాస్త్రం.. మతములంతా ఒక్కటే అన్నది జీవన వేదం. ఇదే యేసుదాసు బోధించే తత్వం. ఇదే ఆయన వ్యక్తిత్వానికి తార్కాణం. అవమానాలు ఎదురైన వేళ ఎదురు నిలిచారు. నిలిచి గెలిచారు... సవర సన్నిధిలో అన్ని మతాలూ ఒక్కటే అని వెలుగెత్తారు. తన సంగీతానికి వయసు వార్థక్యంతో సంబంధం లేదని నిరూపించారు. అవే గనుక ఉంటే తాను ఎడారిలో కోయిలనేనని అంటారాయన.

లాంగ్‌ లివ్‌ యేసయ్యా..!
ఎన్నో గీతాలు ఆయనకు పేరు తెచ్చాయి. అయప్ప స్వామి గీత గానలహరిలో ఓలవాడించాయి. ఉపదేశ సారాలు వినిపించాయి. ప్రభువుకి జోలపాడి జాతిని మేల్కోలిపాయి. అదీ ఆయన గాన మహిమ. అదీ ఆయన మహత్తు. అది వానకారు కోయిల కాదు... రాలు పూల తుమ్మెద కాదు... నిరంతరం మనల్ని వెన్నాడే ఓ మలయ మారుతం. సంగీత జగత్తు చెంత ఆయనొక హిమవత్‌ శిఖరం. అనండిప్పుడు ‘యేసయ్యా! లాంగ్‌ లివ్‌’ అని!


వరించిన అవార్డులివి..


* 1973లో పద్మశ్రీ

* 1974లో సంగీత రాజా

* 1989లో అన్నామలై యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌

* 1992లో మధ్యప్రదేశ్‌ సర్కార్‌ నుంచి లతామంగేష్కర్‌ పురస్కారం

* 1994లో నేషనల్‌ సిటిజన్స్‌ అవార్డ్‌

* 2002లో బాలీవుడ్‌ నుంచి లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌

ఇలా ఎన్ని అవార్డులు అందుకున్నా వినయ సంపన్నుడతడు. ‘సంగీత సింధువు చెంత బిందువు నేను’ అని చెప్పే సంస్కారి అతడు. అందుకే అతడి రాగం.. గానం.. అమేయం.. అమోఘం. వర్థిల్లునిక కలకాలం. ఓ గొప్ప ఉషస్సు ఇది. ఓ గొప్ప యశస్సు ఇది. అందుకే అంటున్నాం ‘యేసుదాసు అనే అనంత వాహిని చెంత ఆగేనా బిళహరి’అని..!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.