మధుర గాయకుడు హరిహరన్‌

రిహరన్‌... ఈ పేరు వినని భారతీయ సంగీత ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. మలయాళంతో పాటు హిందీ, కన్నడ, మరాళీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. గజల్‌ గాయకుడిగా హరిహరన్‌కి ఎంతో పేరుంది. విదేశాల్లోనూ ఈయనకి అభిమానులున్నారు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారరంతో సత్కరించింది. తొలినాళ్లలో టెలివిజన్‌లో ప్రదర్శనలు ఇస్తూ ప్రాచుర్యం పొందిన హరిహరన్‌ ఆ తర్వాత సినీ నేపథ్య గాయకుడిగా మారారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఆయన్ని 1992లో తమిళ చిత్ర సీమకి పరిచయం చేశారు. ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాల్లో పాటలు పాడి దేశవ్యాప్తంగా శ్రోతల్ని అలరించాడు. రెహమాన్‌ సంగీతంలో పాటలు పాడిన గాయకుల్లో ముఖ్యులు హరిహరన్‌. తెలుగులో ‘జాబిలికి వెన్నెలనిస్తా... (అశోక్‌), ‘హిమ సీమల్లో హల్లో యమగుంది ఒళ్లో... (అన్నయ్య), ‘హరిమ హరిమ... (రోబో), ‘ఇంకా ఏదో కావాలంటూ... (నిన్నే పెళ్లాడతా), ‘ఈ రేయి తీయనిదీ.. (జానీ), ‘చిన్నగ చిన్నగ... (ఠాగూర్‌), ‘చంద్రకళ చంద్రకళ... (అదుర్స్‌), ‘భద్ర శైల రాజ మందిర... (శ్రీరామదాసు), ‘అత్తారింటికి నిన్నెత్తుకుపోతా.. (ఒక్కడు), ‘ఆడపిల్ల.. అగ్గిపుల్ల’ (సైనికుడు) తదితర పాటలు పాడి అలరించారు. హరిహరన్‌ కేరళలోని తిరువనంతపురంలో 1955 ఏప్రిల్‌ 3న ఓ తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్‌.ఎ.ఎస్‌.మణి ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీతకారులు. ముంబయిలోనే పెరిగారు హరిహరన్‌. పైన్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీల్ని పూర్తి చేసిన ఆయన చిన్న తనంలోనే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. హిందూస్థానీ సంగీతంలోనూ శిక్షణ పొందారు. మెహ్దీహసన్, జగ్జీత్‌ సింగ్‌ వంటి గాయకుల ప్రభావంతో గజల్‌ సంగీతం నేర్చుకున్నారు. ప్రతి రోజూ 13 గంటలకిపైగా సాధన చేసేవారట. లెస్లే లెవిస్‌తో కలిసి కొలోనియల్‌ కజిన్స్‌ పేరుతో బ్యాండ్‌ని ఏర్పాటు చేసిన హరిహరన్‌ పలు ఆల్బమ్‌లు రూపొందించారు. పలు చిత్రాలకి సంగీతం అందించారు. సినీ నేపథ్య గాయకుడిగా పలుమార్లు జాతీయ పురస్కారాలు పొందిన ఆయన దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. భక్తిగీతాలకి పెట్టింది పేరైన హరిహరన్‌ పుట్టినరోజు ఈ రోజు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.