సుస్వరాల హరిహరన్‌

ఆయన... రాగాలు ఆలపిస్తే వైన్‌ శ్రోతలకు అత్యంత ఆత్మీయమైన ‘లాలి లాలి’ పాటగా అనిపిస్తుంది. ఆయన ‘ఉరికే చిలకా’ అంటూ గళమెత్తితే వీక్షకులు ఊరికే ఉండలేక ఆయన స్వరంతో తమ స్వరాన్ని కలుపుతారు. ‘క్లాస్‌ రూములో తపస్సు చేయుట వేస్ట్‌ రా గురు’ అంటే యువతీయువకులంతా సల్సా డాన్స్‌ చేస్తారు. ‘మనసున మనసున’ అని లవ్‌ బర్డ్స్‌ మనసుని కొల్లకొట్టడంలో కూడా ఆయనకు ఆయనే సాటి అనిపించుకొన్న హరిహరన్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 3. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హరిహరన్‌ గురించి కొన్ని సంగీతాసక్తికర విషయాలు మీ కోసం.


మహా నగరి ముంబాయ్‌ పురి వాసి

హరిహరన్‌ అసలు పేరు హరిహరన్‌ అనంత సుబ్రమణి. 1955 ఏప్రిల్‌ 3న బొంబాయిలో పుట్టారు. హరిహరన్‌ది సంగీత నేపథ్యం ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబం. హరిహరన్‌ తల్లి తిరుపతి దేవస్థానంలో పాటలు పాడతారు. తల్లి దగ్గరే సంగీతంలో సరిగమల సాధన చేశారు. తల్లి తండ్రులకు హరిహరన్‌ ఒక్కరే సంతానం. బోస్కో పాఠశాలలో చదివారాయన. నాలుగు, ఐదు సంవత్సరాలప్పుడే పాడడం మొదలుపెట్టిన హరిహరన్‌ పాఠశాలలో చదువుతున్నప్పుడు తోటి విద్యార్థులతో కలసి ఇంగ్లీష్‌ పాటలు పాడేవారు. ఇంట్లో సంగీత వాతావరణం ఉంది కాబట్టి తానూ సంగీతం నేర్చుకున్నానని అంతేకాని సంగీతాన్ని వృత్తిగా ఎంచుకోవడం కోసమే సంగీతం నేర్చుకోలేదని అంటారు హరిహరన్‌. ఉర్దూ గజల్స్, భక్తి పాటలు, క్లాసికల్‌ సంగీతం పాడే ఈయన 1977 నుంచి పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా కొనసాగుతున్నారు.


చింతలు లేని చిన్న కుటుంబం

హరిహరన్‌ భార్య పేరు లలిత. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి కుమారుడు అక్షయ్‌ హరిహరన్‌ కూడా సంగీత విద్వాంసుడు, స్వరకర్త. మరో కుమారుడు కరన్‌ హరిహరన్‌ ‘మిస్సింగ్‌ ఆన్‌ ఎ వీకెండ్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలో నటించారు.

నేపధ్యగాయకుడిగా

సినీ కెరీర్‌ మొదట్లో... టీవీలో ప్రదర్శనలు ఇచ్చేవారు హరిహరన్‌. దూరదర్శన్‌ ఛానల్‌లో 1974లో హరిహరన్‌ తొలిసారి గజల్‌ కచేరి ఇచ్చారు. టీవీ సీరియళ్లకు పాటలు పాడేవారు. 1977లో ‘ఆల్‌ ఇండియా స్టార్‌ సింగర్‌ కాంపిటీషన్‌’లో విజేతగా నిలిచారు హరిహరన్‌. ఆ తరువాత దివంగత సంగీత దర్శకుడు జైదేవ్‌తో 1978నాటి హిందీ సినిమా ‘గమన్‌’కు వర్క్‌ చేయడానికి సైన్‌ చేశారు. తొలి పాట ‘అజీబ్‌ సానేహా ముజ్‌ పర్‌ గుజార్‌ గయా’ అనే పాట పెద్ద హిట్‌ అయింది. ఈ పాటతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకొన్నారు హరిహరన్‌. అలాగే జాతీయ పురస్కారానికి కూడా నామినేట్‌ అయ్యారు.

‘రోజా’తో తమిళ చిత్రసీమలోకి

1992లో సంగీత సంచలనం ఏ.ఆర్‌.రహ్మన్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకు అడుగుపెట్టారు హరిహరన్‌. 1995లో అరవింద స్వామి, మనీషా కొయిరాలా ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన ‘బొంబాయి’ సినిమాలో ‘ఉరికే చిలకా’ (తమిళ వెర్షన్‌లోనూ ఆయనే పాడారు) పాటను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాటకు ఆ సంవత్సరంలో బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సినిమా పురస్కారాన్ని అందుకొన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు హరిహరన్‌. ‘ముత్తు’, ‘జీన్స్‌’, ‘భారతీయుడు’, ‘తాల్‌’, ‘రంగీలా’, ‘ఇందిరా’, ‘ఇద్దరు’, ‘ప్రేమ దేశం’, ‘మిస్టర్‌ రోమియో’, ‘మెరుపు కలలు’, ‘రక్షకుడు’, ‘జోడి’, ‘ఒకేఒక్కడు’, ‘సఖి’, ‘ప్రియురాలు పిలిచింది’, ‘అమృత’, ‘నాని’ వంటి ఎన్నో సినిమాలకు రెహమాన్‌తో కలిసి వర్క్‌ చేశారు హరిహరన్‌.

1998లో జాతీయ పురస్కారం

1998లో అనుమాలిక్‌ కంపొజిషన్‌లో వచ్చిన ‘బోర్డర్‌’ సినిమాలోని ‘మేరె దుష్మన్‌ మేరె భాయ్‌’ పాటను మనోహరంగా ఆలపించినందుకు హరిహరన్‌కు జాతీయ పురస్కారం లభించింది. 2009లో ఓ మరాఠీ చిత్రానికి ఓ పాటను హరిహరన్‌ పాడగా ఆ పాటకూ మరో జాతీయ పురస్కారం లభించింది. సుమారు ఐదు వందలకుపైగా తమిళ పాటలు, రెండు వందల హిందీ పాటలు హరిహరన్‌ ఖాతాలో ఉన్నాయి. మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషలలో కూడా వందలలో పాటలు పాడారు హరిహరన్‌.

స్కీన్ర్‌పై కూడా

అలనాటి మేటి నటి ఖుష్బూతో 2005లో తమిళ సినిమా ‘పవర్‌ ఆఫ్‌ విమెన్‌’లో నటించారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయ్స్‌’లో కూడా హరిహరన్‌ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు.

గజల్స్‌

ముప్పైకి పైగా ఆల్బమ్‌లను కలిగి ఉన్న భారతీయ గజల్‌ గాయకులు, స్వరకర్తలలో హరిహరన్‌ కూడా ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో, ఎన్నో గజల్స్‌ను పాడారు హరిహరన్‌. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక విషయమేమిటంటే... కొన్నింటికి తన గజల్స్‌కు స్వయంగా ఆయనే రచన కూడా చేశారు. హరిహరన్‌ స్వరపరిచిన గజల్స్‌లో ‘అబ్‌ షహర్‌ - ఏ-గజల్‌’ అనే ఆల్బం బాగా అమ్ముడుపోయింది. ఇంకా ‘హల్కా నషా’, ‘కాష్‌’, తదితర ఆల్బమ్‌లు కూడా హరిహరన్‌కి పేరు తెచ్చాయి.

లైవ్‌ కచేరీల్లో

1990లో ‘హరిహరన్‌ ఇన్‌ కన్సర్ట్‌’, 1996లో ‘సప్తరుషి’, 2001లో ‘స్వర్‌ ఉత్సవ్‌’ అనే ప్రత్యక్ష కచేరీలు ఇచ్చారు హరిహరన్‌. ఇవి ఎంతో విజయవంతమయ్యాయి. ఒక ఆల్బం కోసం తబలా మాస్ట్రో జాకిర్‌ హుస్సేన్‌తో కూడా హరిహరన్‌ వర్క్‌ చేశారు. హరిహరన్‌ సృష్టించిన ‘లాహోర్‌ కె రంగ్‌ హరి కె సంగ్‌’ ఎన్నో రివ్యూస్‌ని సంపాదించగలిగింది. అలాగే దేశంలోనే కాకుండా విదేశాలలో నుంచి కూడా విమర్శనాత్మక ప్రశంసలు కూడా పొందగలిగింది. తమిళ ‘రోజా’ సినిమాలో హరిహరన్‌ చేత పాడించే ముందు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఆయన సృష్టించిన గజల్స్‌ను వినేవారు.

కలోనియల్‌ కజిన్స్‌

1996వ సంవత్సరం హరిహరన్‌ కెరీర్‌లో ఓ మైల్‌ స్టోన్‌ వంటిది. ముంబైకి చెందిన కంపోజర్, గాయకుడు లెస్లే లూయిస్‌తో కలిసి కలోనియల్‌ కజిన్స్‌ పేరిట ఓ బ్యాండ్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్యాండ్‌లో వచ్చిన మొట్టమొదటి ఆల్బం పేరు కూడా ‘కలోనియల్‌ కజిన్స్‌’. ఫ్యూజన్‌ ఆల్బం అయిన ఇది ఎంటీవీలో ప్రసారమయింది. ఎంటీవీ అన్‌ ప్లగ్డ్‌లో ప్రసారమైన మొట్టమొదటి భారతీయ ఆల్బంగా కీర్తి పొందింది. ఈ ఆల్బంకి ఎన్నో పురస్కారాలు లభించాయి. వాటిలో ఎంటీవీ ఇండియన్‌ వ్యూయర్స్‌ ఛాయస్‌ అవార్డ్‌ కూడా ఉంది. అలాగే బిల్‌ బోర్డ్‌ అవార్డ్‌ ఫర్‌ ది బెస్ట్‌ ఏషియన్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ పురస్కారం కూడా ఉంది.

ఈ ఆల్బంతో హరిహరన్‌ పేరు సంగీత ప్రపంచంలో మారుమోగిపోయింది. ఈ బ్యాండ్‌ నుంచి వచ్చిన తరువాతి ఆల్బమ్స్‌లో ‘ద వే వి డూ ఇట్‌’, ‘ఆత్మ’ ఉన్నాయి. ఇవి కూడా బాగా గుర్తింపునకు నోచుకున్నాయి. కలోనియల్‌ కజిన్స్‌ బ్యాండ్‌ నుంచి వచ్చిన నాలుగవ స్టూడియో ఆల్బం ‘వన్స్‌ మోర్‌’. ఇది యూనివర్సల్‌ అనే లేబిల్‌ ద్వారా 2012 అక్టోబర్‌ 29న విడుదల అయింది. 2009నాటి ఒక తమిళ సినిమాకి కలోనియల్‌ కజిన్స్‌ సంగీతం అందించింది. 2010నాటి తమిళ సినిమా ‘చిక్కు బుక్కు’కు కూడా ఈ బ్యాండ్‌ సంగీతం అందించింది.

తెలుగులో హరిహరన్‌

తెలుగులో హరిహరన్‌ అనేక పాటలు పాడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘నిన్నే పెళ్లాడతా’లో ‘‘కన్నుల్లో నీ రూపమే’’, ‘ఇంకా ఏదో’, ‘మాస్టర్‌’లో ‘‘తిలోత్తమా’’, ‘ప్రియరాగాలు’లో ‘‘చినుకు తడి’’, ‘ఎగిరే పావురమా’లో ‘‘రూనా లైలా వానలాగా’’, ‘చూడాలని ఉంది’లో ‘‘యమహా నగరి’’, ‘ఆవిడా మా ఆవిడే’లో ‘‘ఓం నమామి’’, ‘ఆటోడ్రైవర్‌’లో ‘‘చందమామ’’, ‘సూర్యవంశం’లో ‘‘రోజావే చిన్నిరోజావే’’, ‘గణేష్‌’లో ‘‘రాజహంసవో’’, ‘సుస్వాగతం’లో ‘‘సుస్వాగతం నవరాగమా’’, ‘బావగారు బాగున్నారా?’లో ‘‘నవమి దశమి’’, ‘శీను’లో ‘‘ప్రేమంటే ఏమిటంటే’’, ‘‘ఏమని చెప్పను’’, ‘మా అన్నయ్య’లో ‘‘నీలి నింగిలో’’, ‘యువరాజు’లో ‘‘తొలివలపే’’, ‘నిన్నే ప్రేమిస్తా’లో ‘‘ప్రేమలేఖ రాసెను’’, ‘అన్నయ్య’లో ‘‘హిమ సీమల్లో’’, ‘‘వాన వల్లప్ప’’, ‘బాగున్నారా’లో ‘‘కళ్ళు కళ్ళు కలిసాక’’, ‘మనోహరం’లో ‘‘చూడ చక్కని’’, ‘కలిసుందాం రా’లో ‘‘నువ్వే నువ్వే’’, ‘నువ్వు వస్తావని’లో ‘‘కొమ్మా కొమ్మా’’, ‘ఆజాద్‌’లో ‘‘సుడిగాలిలో తడి ఊసులు’’, ‘‘కల అనుకో కథ అనుకో’’, ‘చిరునవ్వుతో’లో ‘‘కనులు కలిసాయి’’, ‘నరసింహ నాయుడు’లో ‘‘నిన్నా కుట్టేసినాది’’, ‘బావ నచ్చాడు’లో ‘‘అనురాగం అనురాగంలో’’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’లో ‘‘మళ్ళీ కూయవే’’, ‘ఎదురులేని మనిషి’లో ‘‘ఏనాడైనా అనుకున్నానా’’, ‘‘మనసన్నది అన్నది’’, ‘‘ఏమైందమ్మా ఈనాడు’’, ‘మృగరాజు’లో ‘‘శతమానమన్నదిలే’’, ‘డాడీ’లో ‘‘గుమ్మాడి గుమ్మాడి’’, ‘సింహరాశి’లో ‘‘తెలుసా నేస్తమా’’, ‘అమృత’లో ‘‘ఏ దేవి వరమో నీవో’’, ‘నీతో’లో ‘‘నవ్వాలి నీతో’’, ‘ఇంద్ర’లో ‘‘భం భం బోలే’’, ‘నాగ’లో ‘‘ఒక కొంటె పిల్లనే’’, ‘జానీ’లో ‘‘ఈ రేయి తీయనిది’’ వంటి హిట్స్‌ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’లో ‘‘నీలిరంగు చీరలోనా’’, ‘సోగ్గాడే చిన్ని నాయన’లో ‘‘వస్తాలే వస్తాలే’’, ‘ఖైదీ నెంబర్‌ 150’లో ‘‘యూ అండ్‌ మీ’’ వంటి పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఇలా కేవలం తెలుగు ప్రేక్షకులని కాకా తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజపురి, బెంగాలీ ప్రేక్షకులను కూడా తన స్వరంతో మంత్రముగ్దుల్ని చేశారు.

‘యమహా నగరి’ కష్టమైనది

చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘చూడాలని ఉంది’ సినిమాలో హరిహరన్‌ ‘‘యమహా నగరి కలకత్తా పురి’’ అనే పాటను పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇంతపెద్ద హిట్టు అయిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే, ఈ పాటను పాడడానికి తాను ఎంతో కష్టపడవలసి వచ్చిందని గుర్తుకుతెచ్చుకుంటారు హరిహరన్‌. పాటలో ఎన్నో కష్టమైన పదాలు ఉన్న కారణంగా ఆ పాటను పాడడానికి రెండు మూడు గంటల సమయం పట్టిందని అన్నారు హరిహరన్‌.

పాటలు కాకుండా

సమయం దొరికితే సినిమాలు చూడడం హరిహరన్‌కు ఎంతో ఇష్టం. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తూ ఉంటారు హరిహరన్‌. థ్రిల్లర్, కామెడీ, అలాగే మంచి కథతో తెరకెక్కిన సినిమాలు చూడడం తనకు ఎంతో ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హరిహరన్‌. ఫుట్‌బాల్‌ చూడడం కూడా హరిహరన్‌కు ఎంతో ఇష్టం. అలాగే ప్రకృతిని కూడా ఇష్టపడే హరిహరన్‌ వీలున్నప్పుడల్లా ఫామ్‌ హౌస్‌కి వెళ్తుంటారు.

బుల్లితెరపై

హరిహరన్‌ బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరించారు. మొదటిసారిగా 2011లో మలయాళంలో ‘సూపర్‌ స్టార్‌ 2’కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2014లో బెంగాలీ భాషలో ప్రసారమైన ‘సరిగమపా’కు కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2017లో మలయాళంలో ‘సూపర్‌ స్టార్‌ జూనియర్‌ 5’కు జడ్జ్‌గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం అదే భాషలో ప్రసారమవుతోన్న ‘సూర్య సూపర్‌ సింగర్‌’కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

హరిహరన్‌ సలహాలు

సంగీతాన్ని కెరీర్‌గా తీసుకోవాలనుకుంటే... పాశ్చాత్య లేదా భారతీయ తరహా సంగీతాన్ని పరిపూర్ణంగా నేర్చుకోమని హరిహరన్‌ ఔత్సాహికులకు ఆయన ఇచ్చే సలహా. అలాగే సంగీత ప్రపంచంలో సృజనాత్మకంగా ఉండడం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉండీ జనం మీ ప్రతిభను గుర్తిస్తే మిగిలినవన్నీ వెంట వస్తాయని అన్నారు.

పురస్కారాలు

2004లో హరిహరన్‌కు పద్మశ్రీ పురస్కారం వరించింది. 2011లో బెస్ట్‌ సింగర్‌గా కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాన్ని అందుకొన్నారు. 2004లో భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో అత్యుత్తమ కృషి చేసినందుకు స్వరాలయ కైరాలి ఏసుదాస్‌ పురస్కారాన్ని అందుకున్నారు. హరిహరన్‌ ఖాతాలో తమిళనాడు రాష్ట్ర సినిమా పురస్కారాలు కూడా ఉన్నాయి. ‘అన్నయ్య’ సినిమాలో ‘‘హిమ సీమల్లో’’ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడు విభాగంలో నంది పురస్కారం హరిహరన్‌ను వరించింది. ఇంకా ఏషియా నెట్‌ ఫిల్మ్‌ పురస్కారాలు, కళాకర్‌ పురస్కారాలు, ఫిలింఫేర్‌ పురస్కారాలు, విజయ్‌ పురస్కారాలు కూడా హరిహరన్‌ ఖాతాలో ఉన్నాయి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.