పాటల్లో కైపుంది... జమునారాణి

‘ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం నా బుంగమూతి చందం నీ ముందరికాళ్ళ బంధం’ (మూగమనసులు), ‘హైలో హైలెస్సా హంసకదా నా పడవ’ (భీష్మ), ‘నాగమల్లి కొనలోన నక్కింది లేడి కూన’ (బంగారు తిమ్మరాజు), ‘ఎంత టక్కరివాడు నా రాజు ఏమూలనో నక్కినాడు’(మంచిమనసులు), ‘అందానికి అందం నేనే’ (చివరకు మిగిలేది), ‘కొత్తపెళ్లికూతురా రారా నీ కుడికాలు ముందు మోపి రారా’ (సుమంగళి), ‘మావా మావా మావా’ (మంచిమనసులు), ‘ఓ...దేవదా చదువు ఇదేనా’ (దేవదాసు), ‘హల్లో డార్లింగ్ మాటాడవా’ (శభాష్ రాముడు), ‘పదపదవే వయ్యారి గాలిపటమా’ (కులదైవం), ‘సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు’ (రాముడు భీముడు) పాటలు పాతతరం సంగీతాభిమానులకు కరతలామలకాలే. ఆ పాటలు జనబాహుళ్యంలో నిలిచిపోవడానికి కారణం ఆమె గళానికి ఓ ప్రత్యేకత వుండడమే! ఆ గళసామ్రాజ్ఞి జమునారాణి. ఆమె ముక్కుతో పాడే పాటల్లో తుళ్లింతలు కోకొల్లలు. ఆమె ‘చూపుల్లో కైపుంది’ అంటే శ్రోతలకు మత్తు ఎక్కుతుంది. ‘మావా మావా మావా’ అంటూ ఘంటసాలతో గళం కలిపితే ఆ దరువుతోపాటు లేచి నిలబడి ఎగరాలనిపిస్తుంది. ‘కంపుగొట్టు ఈ సిగరెట్టు ఇకకాల్చకోయి నాపై ఒట్టు’ అంటుంటే నిజంగా ఒట్టెయ్యాలనిపిస్తుంది. ‘ముక్కుమీద కోపం’ అంటూ పాడుతుంటే అక్కినేనిని ఆటాడించే జమునే మనకు దర్శనమిస్తుంది. అంతగా జమునారాణి ఆలపించిన పాటలు జనంలోకి వేగంగా వెళ్లిపోయాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, సింహళ భాషల్లో ఆరువేలకు పైగా పాటలు పాడి అలరించిన జమునారాణి 82వ జన్మదినం మే నెల 17న జరుగుతున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు...తొలిరోజులు...

జమునారాణి పుట్టింది 1938 మే నెల 17వ తేదీ మద్రాసు నగరంలో. పెరిగింది కూడా అక్కడే. ఆమె తండ్రి వరదరాజులు నాయుడు మద్రాసులోని షావాలిస్ కంపెనీలో పనిచేసేవారు. తల్లి ద్రౌపది మంచి సంగీత విద్వాంసురాలు. జమునారాణి సంగీత శిష్యరికం చేసింది తల్లివద్దే. తల్లి వీణ వాయించడంలో నిష్ణాతురాలు. ఆమె సాంబమూర్తి వాద్యబృందం లో వీణ వాయించేవారు. మద్రాసు రేడియోలో లలిత సంగీతం ఆలపించేవారు. అలా తల్లివద్ద జమునారాణికి స్వరజ్ఞానం అలవడింది. దర్శకనిర్మాత వై.వి. రావు 1944లో ‘తాసిల్దార్’ అనే చిత్రాన్ని నిర్మించారు. భానుమతి, వై.వి.రావు, కమలా కొట్నీస్, నారాయణరావు నటించిన ఈ చిత్రానికి హెచ్ ఆర్. పద్మనాభశాస్త్రి సంగీతం సమకూర్చారు. అందులో కృష్ణకుమారి అనే ఏడేళ్ళ బాలిక హీరో చెల్లెలుగా నటించింది. ఆ బాలిక మంచి గాయని కావడంతో ‘ఆహా! ఏమందునే చినవదిన నీనిక్కు నీటిక్కు’ అనే పాటను ఆమెతో పాడించి సినిమాలో చిత్రీకరణకోసం సిద్ధం చేశారు. ఆ బాలిక పాడిన పాట గ్రామఫోను రికార్డుగా విడుదలైంది. అయితే సంగీత దర్శకుడు పద్మనాభశాస్త్రి అదే పాటను జమునారాణి చేత మరలా పాడించి రికార్డుచేయగా, వై.వి. రావు కృష్ణకుమారిమీద చిత్రీకరణ జరిపారు. అప్పుడు జమునారాణికి కూడా కేవలం ఏడేళ్లే. అదే జమునారాణి సినిమా ప్రవేశం చేసి పాడిన తొలిపాట.

నాగయ్య, భానుమతి చిత్రాలలో అవకాశం...

రేణుకా ఫిలింస్ నిర్మాత, దర్శకుడు చిత్తూరు. వి. నాగయ్య 1946లో ‘త్యాగయ్య’ చిత్రనిర్మాణం చేపట్టారు. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా నిర్వహించిన నాగయ్య ఈ చిత్రంలో చిన్నపిల్లలకు పాడే గొంతుకోసం అన్వేషిస్తుండగా, ఆ చిత్రానికి సహాయదర్శకుడుగా పనిచేసిన పి. రామకృష్ణ(భానుమతి భర్త) జమునారాణి గాత్రం వినిపించారు. దాంతో ‘త్యాగయ్య’ చిత్రంలో పాడే అవకాశం జమునారాణికి దక్కింది. బాలకృష్ణుడు(బేబీ వనజ), రాధ (బేబీ శ్యామల) ఆలపించే ‘మధురా నగరిలో చల్లలమ్మబోను దారివిడుము కృష్ణా’ అంటూ ఆనందభైరవి రాగంలో ఆలపించే జావళిని ఏ.పి. కోమలతో కలిసి పాడారు. భరణీ సంస్థ 1948 లో నిర్మించిన ‘రత్నమాల’ చిత్రంలో ముత్తయిదులు పాడే అంపకాలపాట ‘పోయిరా మామ్మ పోయిరా మాతల్లి’ని భానుమతితో కలిసి పాడారు. అంతేకాదు, ఆ అంపకాలపాటలో భానుమతికి చెలికత్తెగా కూడా జమునారాణి నటించింది. అయితే జమునారాణికి సంగీతం మీద వున్న ఆసక్తి నటనమీద లేకుండడంతో, ఆ వైపు దృష్టి పెట్టలేదు. భానుమతి భర్త రామకృష్ణతో జమునారాణి తండ్రికి మంచి స్నేహం వుండేది. భానుమతి తో రామకృష్ణ వివాహం జరిపించే ప్రక్రియలో జమునారాణి తల్లి మేనమామ రామానుజులరావు నాయుడు సంధానకర్త. అప్పటినుంచి భానుమతి జమునారాణిని ప్రోత్సహిస్తూ వచ్చారు. 1947లో నటుడు సి.ఎస్.ఆర్ ‘శివగంగ’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. పెండ్యాల నాగేశ్వరరావు ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. భానుమతి సిఫారసుతో అందులో జమునారాణి కొన్ని మంచి పాటలు పాడారు. కానీ ఆ సినిమా విడుదల నిలచిపోవడంతో పాటలు కూడా వెలుగు చూడలేదు. 1948లో దర్శక నిర్మాత, నటుడు కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’ చిత్రంలో జమునారాణికి పాటలు పాడే అవకాశం పెండ్యాల కలిపించారు. అప్పటికి జమునారాణి వయసు కేవలం పదేళ్ళు మాత్రమే. అందులో లక్ష్మీరాజ్యం కోసం పెండ్యాల జమునారాణితో మూడు పాటలు పాడించారు. ప్రకాశరావు తొలుత సందేహించినా పాటలు విన్న తరవాత సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పాటలు ‘ఎందుకీ బ్రతుకు ఆశలే నిరాశలాయెనే’ అనే విషాద గీతం; ‘ఆలకించండి బాబూ ఆదరించండి’; ‘ఇదేనా నీ న్యాయము’ అనేవి. ఈ పాటలకు మంచి స్పందన వచ్చింది. తరవాత పదిహేనేళ్ళ వయసులో ‘దేవదాసు’ (1953) చిత్రంలో ‘ఓ దేవదా! చదువు ఇదేనా’ అనే పాటను జమునారాణి ఉడుతా సరోజినితో కలిసి ఆలపించింది. ఆపాట సూపర్ హిట్టయింది. తరవాత మోడరన్ ఆర్ట్ థియేటర్స్ సంస్థలో జమునారాణి రెండేళ్ళు కాంట్రాక్టు సింగర్ గా పనిచేశారు. ఆ రెండేళ్లలో ఎక్కువగా తమిళ సినిమాలకు, ‘అత్తింటి కాపురం’, ‘సవతిపోరు’ వంటి డబ్బింగ్ వర్షన్లలకు జమునారాణి పాటలు పాడారు. తమిళంలో ‘కల్యాణి’, ‘వళయాపతి’, ‘గులేబకావళి’ వంటి సినిమాలలో జమునారాణి ఆలపించిన పాటలకు మంచి పేరొచ్చింది. ‘గులేబకావళి’ హిందీ వర్షన్లో కూడా జమునారాణి పాడటం విశేషం. 1955లో సాధనావారు నిర్మించిన ‘సంతానం’ చిత్రంలో ఎస్.పి. కోదండపాణితో కలిసి ‘సంతోషమేలా సంగీతమేలా పొంగి పొరలేను మనసీవేళా’ అంటూ పాడిన పాటకు మంచి పేరొచ్చింది. అప్పట్లో సుసర్ల దక్షిణామూర్తి వద్ద ఎస్.పి. కోదండపాణి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేస్తూవుండేవారు.

మామతో... మావా మావా మావా...

1962లో బాబూ మూవీస్ వారు నిర్మించిన సూపర్ హిట్ సినిమా ‘మంచిమనసులు’ లో జమునారాణి పేరు మారుమోగింది. మహదేవన్ కు ‘మామ’ అనే పేరు సార్ధకంచేసిన ‘మావా మావా మావ’ అనే పాటను జమునారాణి ఘంటసాలతో కలిసి అద్భుతంగా పాడారు. అదే చిత్రాన్ని తమిళంలో ‘కుముదం’ పేరుతో నిర్మించినప్పుడు అదే పాటను జమునారాణి టి.ఏం. సౌందర్ రాజన్ తో కలిసి పాడారు. ఈ సినిమాతో జమునారాణికి ప్లేబ్యాక్ సింగర్ గా మంచి అవకాశాలు వచ్చాయి. ఆదే సినిమాలో జమునారాణి పాడిన ‘ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు’ అనే పాటకూడ హిట్టయింది. తరవాత ‘ముందడుగు’ (1958)సినిమాలో ‘అందాన్ని నేను ఆనందాన్ని నేను, అందీ అందక నిన్ను ఆడించుతాను’; ‘శభాష్ రాజా’ (1961)లో ‘ఓ వన్నెల వయారి చూసేవు ఎవరిదారి ’; ‘అన్నతమ్ముడు’ చిత్రంలో ‘రగులుతుంది రగులుతుంది ఎగురుతుంది’ వంటి పాటలు జమునారాణికి మంచిపేరు తెచ్చాయి. జిక్కి రాజాను పెళ్లాడినప్పుడు కొంతకాలం ఆమె ప్లేబ్యాక్ పాడలేదు. ఆ సమయంలో జమునారాణికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. వాటిల్లో హాస్యగీతాలు బాగా హిట్టయ్యాయి. ‘రాముడు-భీముడు’ చిత్రంలో ‘సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు’; ‘శభాష్ రాముడు’ చిత్రంలో ‘హల్లో డార్లింగ్ మాటాడవా మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా’; ‘మర్మయోగి’ చిత్రంలో ‘నావరాల గాడిదా’; ‘కులగోత్రాలు’లో ‘రావే రావే బాలా హలో మై డియర్ లీలా’; ‘ఆత్మబంధువు’ చిత్రంలో ‘దక్కెనులే నాకు నీ సొగసు ఈ టక్కులెందుకో తెలుసూ’; ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో ‘కాయండదు ఓరి నాయనో’ వంటివి జమునారాణి ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ తో కలిసి పాడిన మంచి హాస్యగీతాలు. అయితే జమునారాణి తెలుగులోకన్నా తమిళంలోనే ఎక్కువ పాటలు పాడారు. జమునారాణి బాగా అభిమానించే పాట ‘భీష్మ’ చిత్రంలో ‘హైలో హైలెస్సా హంస కదా నా పడవ’. తరవాత నచ్చిన పాట ‘మూగమనసులు’ చిత్రంలో జమునకు పాడిన ‘ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం’ అనే పాట. ఆమె తమిళంలో మహదేవన్, విశ్వనాథన్, జి.రామనాథన్ వంటి అనేక మంది సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు.

కిక్కిచ్చిన బంగారు తిమ్మరాజు...

సంగీత దర్శకుడు ఎస్.పి. కోదండపాణి ‘బంగారు తిమ్మరాజు’ (1964) సినిమాలో జమునారాణి చేత ‘నాగమల్లి కొనలోనా నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా’ అనే అద్భుతమైన పాటను పాడించారు. ఆ పాటలో ‘చూపుల్లో కైపుంది మావ, సొగసైన రూపుంది మావ’ అనే తొలి చరణంలోనూ, ‘నడకల్లో హోయలుంది మావ, నాట్యంలో నేర్పుంది మావ’ అనే రెండవచరణంలోను జమునారాణి విసిరిన విరుపులు కిక్కెంచాయి. అప్పుడప్పుడు జమునారాణి రేడియోలో కూడా ‘యమునా తీరం... సంధ్యా సమయం’ వంటి పాటలు పాడుతూ వుండేవారు. తరవాతి కాలంలో ‘సిగ్గులేని మామయ్యా’ (తల్లి కూతుళ్ళు-చక్రవర్తి); ‘మల్లెపూల పందిట్లోనా’ (వరకట్నం-టి.వి.రాజు), ‘నేనున్నది నీవనుకున్నది’ (కలెక్టర్ జానకి- వి.వి. కుమార్) వంటి అడపాదడపా పాటలు పాడినా 70 దశకం తరవాత జమునారాణి ప్రభంజనానికి బ్రేక్ పడింది. తరవాత ఇళయరాజా ఇచ్చిన అవకాశంతో సింహళ భాషలో ‘వరద కాగెడ’, ‘సూరయ’, ‘మతలన్’, ‘సేద శూలంగ్’ వంటి సినిమాలకు పాటలు పాడారు. జమునారాణి బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆమెకు జిక్కి తో అనుబంధం చాలా ఎక్కువ. తమిళనాడు ప్రభుత్వం జమునారాణికి ‘కలైమామణి’ పురస్కారం అందజేసి సత్కరించింది. 1996 లో అదే తమిళనాడు ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని కూడా జమునారాణికి ఇచ్చి గౌరవించింది. 2002లో అన్నాదురై అవార్డ్ జమునారాణికి బహూకరించారు.

- ఆచారం షణ్ముఖాచారి  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.