సరిగమ స్వరాల కోయిల...చిత్ర
మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా... నైటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా...అనగానే చిరునవ్వుల ఆమె రూపం అభిమాన శ్రోతల కళ్ళ ముందు కదలాడుతుంది. హృద్యంగా ఆమె ఆలపించిన సుమధుర గీతాలెన్నో ఆత్మీయంగా హలో చెప్తాయి. సరిగమల స్వర మాధురీ ఝరులు గుండెల్నిండా కుండపోతగా కురుస్తూ సందడి చేస్తాయి. ప్రేమ, బాధ, కోపం, కరుణలాంటి భావాలెన్నో ఆమె గొంతులో పలికి అమృతాల నదిలో మనల్ని తలమునకలు చేస్తాయి. అంతెందుకు? ఆమె నోట మామూలు మాట పాటవుతుంది. తీయతేనెల వూటవుతుంది.అలనాటి రావు బాలసరస్వతి మొదలుకుని లీల, జిక్కి, సుశీల, జానకి...ఇలా ఎంతోమంది గాయనీమణులు సంగీతాలతో సమ్మోహనపరిచి తమ ప్రగాఢ ముద్ర వేసుకున్న తర్వాత...ఆ స్థాయిలో సినీ సంగీతాన్ని ఉర్రూతలూగించే గాయని ఎవరెవరా? అని ఆశగా సంగీతాభిమానులంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఆమనిలా ఆమె విచ్చేసింది. మావి చివురులు థీన్ని మత్తెక్కిన కోయిలా గమ్మత్తయిన స్వరంతో గొంతు సవరించుకుంది. సరిగమల్ని ఔపాసన పట్టిన ఆమె అవటానికి మలయాళీ అయినా ... అన్ని భాషల్లోనూ అపురూపమైన పాటలు పాడి మెప్పించింది. ఆ మెలోడీ క్వీన్... నైటింగెల్ ఆఫ్ సౌత్ ఇండియా కె. ఎస్. చిత్ర.


ఆమె శ్వాసలో గాలి గాంధర్వమైన హేల
ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో... ఏ మూవీలో వాలితే మౌనమే మంత్రమవుతున్నదో... అన్న పాట కేవలం ఆమె కోసమే పుట్టిందా? అనిపిస్తుంది. ఆమె పెదాలపై వాలిన గాలి సామవేద సంగీత మంత్రమై భాసిల్లింది. గాన గాంధర్వమైనది. శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ హర్షాతిరేక వర్షమైనది. అనేక భాషల్లో సుమారు పాతికవేల పాటలు పాడిన ఈ సంచలన గళం... ఇసుమంతయినా గర్వం లేకుండా వినమ్రంగా తలవంచుకునే ఉంటుంది. అప్రతిహతంగా సాగుతున్న గాన విజయ ప్రస్థానం తలచుకున్న అభిమానులు...ఈ చిత్ర మా చిత్ర అని సగర్వంగా చాటుకుంటారే కానీ... తానింకా సాధించాల్సింది ఎంతో ఉందని ఆమె తరచూ చెప్తుంటారు. ముందు తరం గాయనీమణులు సృష్టించిన సంచలనాలు అందుకోవాలంటే మరింత కృషి అవసరమని...వారితో పోలిస్తీ...తానింకా సంగీతంలో సరళీ స్వరాలు నేర్చుకుంటున్నానని ఆమె అంటారు.అగ్ర సంగీత దర్శకులంతా చిత్ర గళం కోసం క్యూ కడుతుంటే... ఆమె ఆశ్చర్యపడుతుంటుంది. అలాంటి మహామహుల ఆశీస్సులు లభించడం వల్లనే గాయనిగా తన ప్రస్తానం విజయవంతంగా కొనసాగుతోందంటూ చిరునవ్వులు చిందిస్తుంటారు.
                                   

బాలీవుడ్ శ్రోతలకు పియ బసంతి
చిత్ర...బాలీవుడ్ శ్రోతల దృష్టిలో మరీ ప్రత్యేకం. ఆమెని పియ బసంతి అంటూ అక్కున చేర్చుకుని ఆప్యాయత పరుస్తారు. కారణం...చిత్ర మాటల్లోనే.. ఉస్తాన్ సుల్తాన్ సాబ్ తో కలసి పియ బసంతి అనే ఆల్బమ్ లో చిత్ర పాడారు. ఆ ఆల్బమ్ లో మొదటి పాట పియ బసంతి అంటూ సాగుతుంది. ఆ పాటని చిత్ర ఆలపించిన వైనం ఆద్యంతం మాధుర్య భరితం. ఆ పాట తర్వాత చిత్ర పేరు పియ బసంతి గా బాలీవుడ్ లో మార్మోగి పోయింది. హిందీలో చిత్ర పాడిన మొదటి పాట మధుర గాయకుడు పి.బి. శ్రీనివాస్ తో కలసి. అయితే... ఆ పాట విడుదలయిందో లేదో కూడా చిత్రకి తెలీదు. దాంతో... బాలీవుడ్ లో చిత్ర పాడిన మొదటి గీతం లవ్ సినిమాలో ఎస్.బి. బాలసుబ్రహమణ్యం తో కలసి సాదియా తూనే క్యా కియా అన్న పాట. ఈ పాట ఇప్పటికీ సంచలన గీతమై శ్రోతల నాలుకలపై నర్తిస్తూనే ఉంది. కేరళలో వనాంబడి గా ప్రఖ్యాతి గాంచిన చిత్ర తమిళ్ లో చిన్న కోయిల్ గా ప్రసిద్ధురాలు. కర్ణాటక లో కన్నడ కోగిలే అని పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో సంగీత సరస్వతి గా ఆమెని అభివర్ణిస్తారు. ఈ భాషలో పాడినా... ఆ భాష మాతృ భాష అన్నంతగా చిత్ర మమేకమై పోయారు. ఆదే...గాయనిగా ఆమె విజయ రహస్యం. మలయాళం సొంత భాష అయినా ...అచ్చ తెలుగు అమ్మాయిలా ఆమె ఇక్కడి శ్రోతలతో అనుబంధం పెంచుకుంది. అలాగే... భారత్ లోని అన్ని ప్రాంతాల్లోనూ చిత్ర హవా కొనసాగుతోంది.

జననం
1963 జులై 27న కేరళ తిరువనంతపురం లో చిత్ర జన్మించారు. కర్ణాటక సంగీతలో చిత్ర శిక్షణ తీసుకున్నారు. ఆమె సంగీత గురువు డాక్టర్ కె. ఒమన్ కుట్టి. చిత్ర కర్ణాటక సంగీతం లో ప్రధమ శ్రేణి లో బిఎ పట్టా పొందారు. కేరళ యూనివర్సిటీ నుంచి తృతీయ శ్రేణిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1978 నుంచి 1984 వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఉపకార వేతనాన్ని అందుకున్నారు.

బహు భాషా గాయని
చిత్ర బహు భాష గాయని. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, గుజరాతి, తులు, రాజస్థానీ, ఉర్దూ, సంస్కృతం భాషల్లో చిత్ర అనేక పాటలు పాడారు. విదేశీ భాషల్లోనూ చిత్ర పాటలు పాడడం...ప్రాచుర్యం పొందడం విశేషం. ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, అరబిక్ భాషల్లోనూ చిత్ర గొంతు సవరించుకున్నారు. ఫస్ట్ లేడీస్ ఇన్ ఇండియా పురస్కారాల్లో ఒకరుగా చిత్ర భారత రాష్ట్రపతి చేత సన్మానాన్ని అందుకున్నారు.

                                   

తెలుగులో మొదటి పాట అబ్బ దాని సోకు...సంపంగి రేకు
ఆఖరి పోరాటం...దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా ఇది. నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమాలో చిత్ర గళం అబ్బ దాని సోకు...సంపంగి రేకు పాట లో మొదటిసారి ప్రతిధ్వనించింది. ఇక... ఆ తర్వాత ఆమె సినీ గాన యానం అప్రతిహతంతా తెలుగులో సాగిపోయింది. పాడలేను...పల్లవైనా భాష రానిదానను... వెయ్యలేను తాళమైనా లయ నే నెరుగను... అన్న పాట తో చిత్రకి జాతీయస్థాయిలో ఆదరణ దక్కింది. సింధు బైరవి చిత్రంలోనిది ఈ పాట. ఆమె పాడిన ప్రతి పాట అద్భుతం...అపురూపం. ఆమె పాటలు వింటూ శ్రోతలు వొల్లంత థ్రిల్లింత చేసుకుంటారు. ఔను... గీతాంజలి సినిమాలో చిత్ర పాడిన లయరాజు ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి పాట జల్లంత కవ్వింత కావాలిలే.. వొళ్ళంతా త్రిల్లింత రావాలిలే... వింటూంటే వానజల్లుల్లో తడిసి ముద్దయిన అనుభూతి కలుగుతుంది. పెళ్లి సందడి చిత్రంలో కాబోయే శ్రేవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ... అంటూ మొదలై మా పెరటి జామచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే... మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే... రొమాంటిక్ సాంగ్ ని శ్రోతలు ఎప్పటికీ మరిచిపోలేరు. చిత్ర తెలుగులో పాడిన పాటలు అమృత తుల్యాలు..ఆనంద సాగరాలు. చిత్ర అనగానే గుర్తుకు వచ్చే పాటలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని... రోజా సినిమాలో ఏ .ఆర్. రహ్మాన్ సంగీత దర్శకత్వంలో తమిళ్, హిందీ, తెలుగు, మలయాళీ భాషల్లో పాటలు పాడారు. ఆ పాటలన్నీ విజయవంతమయ్యాయి.

గాయని కాకపోతే టీచర్ ని అయ్యేదాన్ని
చిత్ర గాయని కాకపోతే... ఏమై ఉండేవారని ఎవరైనా ఆమెని ప్రశ్నిస్తే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా టీచర్ ని అయ్యేదాన్నని సమాధానమిస్తారు. కారణం... ఆమె తల్లి తండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. తండ్రి ఎం. కృష్ణనః నాయర్, తల్లి శాంతకుమారి. తండ్రికి సంగీతం అంటే ఇష్టం. ఆ ఇష్టం తోనే ఆయన ఆకాశవాణిలో పాటలు పాడేవారు. తల్లి కూడా వీణ వాయించేవారు. చిత్రకి ఒక అక్క... బీనా, తమ్ముడు మహేష్ ఉన్నారు. వీరిద్దరూ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించుకున్నవారే. బీనా కూడా పాటలు పాడుతుంది. మహేష్ గిటార్ వాయిస్తాడు.

అవార్డులు -పురస్కారాలు
ఏ నేపధ్య గాయని అందుకొని విధంగా..చిత్ర ఆరు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ సంస్థ ద్వారా 8 అవార్డులు అందుకున్నారు.

2005లో పద్మశ్రీ
చిత్ర సీమకు చేసిన సేవలకు గుర్తుగా చిత్ర 2005లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. 1997లో బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారం పొందిన మొదటి మహిళా కళాకారిణిగా చిత్ర చరిత్ర పుటలకెక్కారు. 2009లో ఖింగై ఇంటెర్నేషనల్ మ్యూజిక్ అండ్ వాటర్ ఫెస్టివల్ చైనాలో జరగగా.... ఆ ఉత్సవంలో అక్కడి ప్రభుత్వం చే సత్కారం పొందిన కళాకారిణి చిత్ర. 2018లో న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఓపెరా హౌస్ లో ఇంటర్నేషనల్ వ్యూయర్స్ ఛాయిస్ ద్వారా ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు అందుకున్న ఘనత గాయని చిత్రదే. న్యూ జెర్సీ అసెంబ్లీ స్పీకర్ ద్వారా 2018లో సత్కారం పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైర్ మామని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారతరత్న లత మంగేష్కర్ అవార్డును, కర్ణాటక ప్రభుత్వం సంగీత సమ్మాన్ పురస్కార్ ని ఇచ్చి గౌరవించాయి. కేరళ ప్రభుత్వం కేరళ సంస్థాన వనిత రత్నం అవార్డును అందించి సత్కరించింది. అదే కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన హరివారసనం అవార్డును అందించి గౌరవించింది.


గౌరవ డాక్టరేట్
2011లో చెన్నయ్ లోని సత్యభామ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. 2018లో యుఎస్ లోని డ్ర్ ఇంటర్నేషనల్ తమిళ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. 2003లో లండన్ లోని గ్లోబల్ కౌన్సిల్ జీవన సాఫల్య పురస్కారం తో సత్కరించింది. అదే సంవత్సరం స్వరాలయ జేసుదాస్ అవార్డు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. 2005లో ఇండియా టుడే శిఖరం పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఇలా చిత్ర అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. తన పాటల కు సయితం గౌరవాన్ని తీసుకొచ్చారు.


-పి.వి..డి.ఎస్.ప్రకాష్  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.