స్వరంలో భాస్వరం!

‘నే పాడితే లోకమే పాడదా...’ అనే పాట ఇప్పుడంటే వచ్చింది కానీ, ఒకప్పుడు ఎల్‌ ఆర్‌ ఈశ్వరి పాటల్ని లోకం అలాగే పాడుకునేది. స్వరంలో భాస్వరం ఉన్న గాయనిగా పేరు పొందిన ఆమె ఏ పాట పాడినా దానికో వేడిని, వేగాన్ని కలిగించేవారు. చెన్నైలో 1939లో లౌర్డ్‌ మేరీ రాజేశ్వరి ఈశ్వరిగా పుట్టిన ఆమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, తులు, ఇంగ్లిషు భాషల్లో పాటలు పాడి యువతను ఉర్రూతలూగించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కలైలామణి’ అవార్డు అందుకున్న ఎల్‌ ఆర్‌ ఈశ్వరి, ఎలాంటి శిక్షణ పొందకుండానే గొంతు సవరించుకున్నారు. తల్లి రెజీనా మేరీ నిర్మల సినిమాల్లో కోరస్‌ గాయనిగా ఉంటుండంతో తల్లితో పాటు రికార్డింగులకు వెళుతూ క్రమేణా పాటలు పాడడం అలవాటు చేసుకున్నారు. ఆమె గొంతులో విలక్షణమైన గమకం, ఆకట్టుకునే స్థాయి ఉండడంతో త్వరగానే అవకాశాలు వచ్చాయి. ‘మనోహర’ చిత్రంలో జిక్కీతో పాటు గొంతు కలిపిన ఆమె, తొలిసారి కె.వి. మహదేవన్‌ సంగీత సారధ్యంలో 1958లో ‘నల్ల ఇదత్తు సమ్మంధం’ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకులు అందరి సారధ్యంలో పాటలు పాడారామె. తెలుగులో ఆమె పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. ‘మసక మసన చీకటిలో...’ (దేవుడు చేసిన మనుషులు), ‘మాయదారి సిన్నోడు...’ (అమ్మమాట), ‘భలేభలే మగాడివోయ్‌...’ (మరోచరిత్ర), ‘అరె ఏమిటి లోకం...’ (అంతులేని కథ), ‘లే లే లే నా రాజా...’ (ప్రేమ్‌నగర్‌), ‘తీస్కో కోకోకోలా... ఏస్కో రమ్ము సోడా...’, ‘మల్లెపూవులు పిల్లగాలులు...’, ‘నూకాలమ్మను నేనే నీ పీకను నొక్కేత్తానే...’, ‘నందామయా గురుడ నందామయా...’, లాంటి ఓన్నో పాటలు అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. సినీ గీతాలతో పాటు ప్రైవేటుగా భక్తిగీతాలను కూడా ఆలపించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.