మత్తు పాటల మాయదారి... ఎల్‌.ఆర్‌.ఈశ్వరి
అరవయ్యో దశకంలో తెలుగు సినీ సంగీత రంగంలో ఒక వినూత్న గళం వినిపించి సంగీత ప్రియులను ప్రభావితం చేసింది. బాలచందర్‌ చిత్రం ‘మరోచరిత్ర’ సినిమాలో బాలుతో కలిసి ‘బలేబలే మగాడివోయ్‌ బంగారు నాసామివోయ్‌’ అంటూ వినూత్న గళంలో పాడుతూవుంటే ఆ కొత్తదనానికి ప్రేక్షకులు జేజేలు పలికారు. ‘జిల్లాయిలే జిల్లాయిలే’ అంటూ అక్కినేని నాగేశ్వరరావును ‘రైతుకుటుంబం’ చిత్రంలో ఆటపట్టిస్తూ పాడితే ‘ఇదేదో బలేగా వుందే’ అని ఆస్వాదించారు. ‘ప్రేమనగర్‌’ చిత్రంలో ‘లే లే నా రాజా లేలేలే నా రాజా’ అంటూ జ్యోతిలక్ష్మి అక్కినేనిని నిద్రలేపుతూ నర్తిస్తుంటే ఆ పాటను పాడింది ఎల్‌.ఆర్‌.ఈశ్వరి అని వెంటనే ప్రేక్షకులు గుర్తుపట్టేశారు. అలాగే ‘కొప్పుచూడు కొప్పందం చూడు’ అంటూ ‘మానవుడు దానవుడు’ చిత్రంలో పాడినా, ‘మసక మసక చీకటిలో మంచే కాడ ఎనకాలా మాపటేళ కలుసుకో’ అంటూ ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో కాంచన కోసం ఆలపించినా, ‘సిపాయి చిన్నయ్య’లో ‘అరె మావా ఎసుకోర సుక్కా’ అనిగాని, ‘తీస్కో కోకాకోలా ఏస్కో రమ్ము సారా’ అంటూ ‘రౌడీలకు రౌడీలు’ సినిమాలోగాని క్లబ్‌ పాటలు పాడినా ఆ ప్రత్యేకత ఆమెకేగాని వేరే గాయనీమణులకు రాదు అనిపించుకున్న ఆ మత్తు పాటల మాయదారి ఎల్‌.ఆర్‌.ఈశ్వరి. అటు తమిళం ఇటు తెలుగు సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనదంటూ ఒక ప్రత్యేక శైలిని నిలుపుకున్న ఈశ్వరి పుట్టినరోజు డిసెంబర్‌ 8న. ఈ సందర్భంగా ఆమె పాటల గురించి, సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం...


లూర్థు మేరీ ఎల్‌.ఆర్‌.ఈశ్వరిగా...
ఈశ్వరిది తమిళనాడులో మదురై పట్టణానికి చేరువలో వున్న పరమకుడి గ్రామం. పుట్టింది డిసెంబర్‌ 08, 1939. కానీ పుట్టి, పెరిగింది మాత్రం మద్రాసు నగరంలోనే. తండ్రి ఆంటోనీ దేవరాజ్, తల్లి రేజీనా మేరీ నిర్మల. వీరిది రోమన్‌ కాథలిక్‌ కుటుంబం. వీరు వేళాంగిణి మాతను కొలుస్తారు. ఆ దేవతను రాజేశ్వరి అని కూడా అంటారు. పైగా ఈశ్వరి నాయనమ్మ వాళ్ళు హిందూ దేవతలను పూజించేవారు. అందుకే ఈశ్వరిని వాళ్ళ నాయనమ్మ ప్రేమగా ‘రాజేశ్వరీ’ అని పిలుస్తూ మాతను కొలుస్తున్న అనుభూతిని పొందేది. తన అమ్మ తరఫు వాళ్ళు మాత్రం ‘లూర్థు మెరీ’ అని పిలిచేవారు. తండ్రి పేరే తమిళులకు ఇంటిపేరు కావడంతో ‘దేవరాజ్‌ లూర్థు మెరీ రాజేశ్వరి’ (డి.ఎల్‌.రాజేశ్వరి) అనేది ఆమె పూర్తిపేరుగా స్థిరపడింది. ఈశ్వరి చదువు మద్రాసులోని ప్రెసిడెన్సీ గరల్స్‌ హైస్కూలులో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకా సాగింది. శాస్త్రీయ సంగీతం కూడా ఆమె వంటపట్టించుకున్నది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ జరిగే నాటకాలలోను, సమావేశాలలోను ఈశ్వరి పాటలు పాడి అలరించేది. ఆమె తొమ్మిదవ తరగతిలో వుండగా వై.ఎం.సి.ఎ నిర్వహించిన పాటల పోటీలో ప్రధమ బహుమతి అందుకుంది. తండ్రి దేవరాజ్‌ స్పెన్సర్‌ కంపెనీలో పనిచేసేవారు. అయితే ఈశ్వరికి ఐదేళ్ళ వయసున్నప్పుడే తండ్రి కాలం చేశారు. దాంతో ఇంటి పాలనాభారం తల్లి నిర్మలమీద పడింది. ఆమె రేడియోల్లో పాటలు పాడేది. కొన్ని తమిళ సినిమాలలో కూడా గాయనిగా పేరుతెచ్చుకుంది. తల్లి రికార్డింగ్‌ థియేటర్లకు వెళ్తున్నప్పుడు ఈశ్వరి కూడా అమ్మతో వెళ్ళేది. అలా వెళ్ళడం ఈశ్వరికి లాభించింది. అప్పుడప్పుడూ కోరస్‌ పాటలుంటే తనుకూడా కోరస్‌ పాడేది. కోరస్‌ గాయనిగా ఈశ్వరి పాల్గొన్న తొలి పాట ‘ఇన్బనాలిదే ఇదయం కానుదే’ అంటూ వినవచ్చే జానకి ముఖ్య గాయనిగా పాల్గొన్న ‘మనోహర’ (1954) చిత్రంలోనిది. ఆ చిత్రానికి ఎస్‌.వి.వెంకటరామన్‌ సంగీత దర్శకుడు. 1957లో పాటలు పాడేందుకు ఈశ్వరి తల్లి రికార్డింగ్‌ స్టూడియోకి వెళ్ళింది. ఆమెతో వెళ్ళిన ఈశ్వరి తనలో తాను పాడుకోవడం ఆ సినిమా సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్‌ గమనించారు. ఆమె గొంతు విని బాగుందన్నారు. 1958లో నాగరాజన్, నటుడు వి.కె.రామస్వామి సంయుక్తంగా శ్రీ లక్ష్మి పిక్చర్స్‌ బ్యానర్‌ స్థాపించి నిర్మించిన ‘నల్ల ఇడత్తు సంబంధం’ చిత్రంలో మహదేవన్‌ ఈశ్వరి చేత ‘ఇవరేత్తాన్‌ అవరు’, ‘తూక్కత్తిల్‌ సిరిక్కనుమ్’ అనే రెండు సోలో గీతాలను, ‘పొన్ను మాప్పిళ్లై’ (జి.కస్తూరితో), ‘పుత్తుపెణ్ణే’ (కస్తూరి, ఉడుతా సరోజినితో) అనే రెండు యుగళ గీతాలను పాడించారు. సినిమా బాక్సాఫీస్‌ హిట్‌ కావడంతో ఈశ్వరికి గాయనిగా గుర్తింపు వచ్చింది. ఈశ్వరి పాడిన పాటల రికార్డుల మీద గాయనిగా డి.ఎల్‌.రాజేశ్వరి అని వుంటుంది. ఎం.ఎల్‌.రాజేశ్వరి పేరుతో మరొక గాయని ఉండడంతో నిర్మాత నాగరాజన్‌ ఈశ్వరి పేరును ఎల్‌.ఆర్‌.ఈశ్వరిగా మార్చారు. ఇక సినిమా ప్రపంచంలో ఆమె ఎల్‌.ఆర్‌.ఈశ్వరి పేరుతోనే చలామణి అయింది. అయితే ఈశ్వరికి గుర్తింపుతోబాటు పేరు తెచ్చిపెట్టింది విశ్వనాథన్‌-రామమూర్తి సంగీతం సమకూర్చిన ‘పాశ మలర్‌’ (1961) చిత్రంలో ఆలపించిన ‘వారయేన్‌ థోళి వారయో’ అనే సోలో సాంగ్‌. తెలుగులో ‘బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే’ అంటూ ఈ పాటను తెలుగులో ’రక్తసంబంధం’లో మనం విన్నాము. పెళ్లి వేడుకల్లో ఈ పాటను వాయించని మంగళ వాద్యం ఉంటుందంటే నమ్మితీరాలి. శివాజీ గణేశన్, ఎం.ఎన్‌.రాజం, జెమిని గనేశన్, సావిత్రి నటించిన ఈ సినిమా సిల్వర్‌ జూబిలీ చేసుకుంది.

                               

తమిళంలో విజృంభించి...
ఈశ్వరి ఆలపించిన భక్తిగీతాలు కోకొల్లలు. ముఖ్యంగా తమిళనాడు దేవాలయాల్లో ఆమె ఆలపించిన పాటలు ఎప్పుడూ వినబడుతూనే వుంటాయి. ఇక క్రైస్తవ భక్తిగీతాల విషయం గురించి చెప్పనక్కరలేదు. ‘వరువాయ్‌ వరువాయ్‌’, ‘దైవం తంత దివ్య కుమరన్‌’ వాటిలో ముఖ్యమైనవి. ఈశ్వరి అనేక నిష్ణాతులైన సంగీత దర్శకుల వద్ద ఎన్నో తమిళ హిట్‌ పాటలు పాడింది. విశ్వనాథన్‌-రామమూర్తి, కె.వి.మహదేవన్, ఎస్‌.బాలచందర్, ఆర్‌.సుదర్శనం, టి.ఆర్‌.పాప, వి.కుమార్, వేదాచలం, ఎస్‌.పి.కోదండపాణి, శంకర్‌-గణేష్, జి.కె.వెంకటేష్, కున్నకుడి వైద్యనాథన్, రాజన్‌ నాగేంద్ర వారిలో కొందరు మాత్రమే. ఈశ్వరిది ప్రత్యేకమైన గళం. ఆమె గళంలో క్లబ్‌ డ్యాన్‌ పాటలు, జానపద గీతాలు అద్భుతంగా కుదిరేవి. విశ్వనాథన్‌-రామమూర్తి సంగీత దర్శకత్వంలో 1954లోనే ఈశ్వరి ‘కుటుంబ గౌరవం’, ‘మాలయిత్త మంగై’ సినిమాలలో కోరస్‌ పాటలు పాడింది. కె.వి.మహదేవన్‌ సంగీత దర్శకత్వంలో 1958లోనే ‘మనముళ్ళ మరుత్తరామ్’, ‘నీలవుక్కు నెరంజ మనసు’, ‘పెరియ కోయిల్‌’, ‘తాయ్‌ పిరందాల్‌ వాళి పిరక్కుం’ వంటి సినిమాలలో కోరస్‌ పాటలు పాడింది. 1960లో విశ్వనాథన్‌-రామమూర్తి నిర్దేశకత్వంలో ‘ఆలుక్కొరు వీడు’, ‘మన్నాడి మన్నన్‌’, ‘ఒండ్రుపట్టాల్‌ ఉండు వళువు’, ‘భాగ్యలక్ష్మి’, ‘పావమణిప్పు’, ‘ఆలయమణి’, ‘నిత్య తాంబూలం’, ‘పోలీస్‌ కారన్‌ మగల్‌’, ‘శెంతమరై’, ‘వీర తిరుమగన్‌’ వంటి తొలితరం సినిమాలలో పాటలు పాడింది. అలాగే కె.వి.మహదేవన్‌ సంగీత దర్శకత్వంలో ‘పడిక్కాద మేడై’, ‘పొన్ని తిరునాళ్’, ‘పావై విళక్కు’, ‘యాని పాగన్‌’, ‘ఎల్లం ఉనక్కాగ’, ‘పణిత్తిరై’, ‘శారద’, ‘సెంగమల త్తీవు’, ‘కంచి తలైవన్‌’ వంటి మరెన్నో విజయవంతమైన సినిమాలలో జనరంజకమైన పాటలు పాడింది. ఎంతమంది సంగీత దర్శకుల వద్ద ఎన్ని పాటలు పాడిందో లెక్క కట్టడానికి మన పరిధి చాలదు. ‘పిస్టన్‌ వాలి’ (తెలుగులో ‘రివాల్వర్‌ రాణి’) అనే హిందీ సినిమాలో సంగీత దర్శకుడు సత్యం ఈశ్వరి చేత ‘హే ఉడతీ హై చిడియా పసంద్‌ క్యా తుమ్‌ కో మేరా రాజా’ అనే పాటను అద్భుతంగా పాడించాడు. తెలుగులో అదే పాటను ‘నీలోన నీటుంది నాలోన గోటుంది’ అంటూ ఈశ్వరి పాడగా జ్యోతిలక్ష్మి, సత్యనారాయణ మీద చిత్రీకరించారు.

                                   

తనదైన శైలిలో తెలుగులో...
ఈశ్వరి కుటుంబం ఆమె చిన్నతనంలో తెలుగు వారి ఇంటిలో అద్దెకు వుండేది. ఆమూలంగా ఈశ్వరికి తెలుగు మాట్లాడటం బాగా అలవాటయింది. పెద్దబాలశిక్ష వంటి పుస్తకాల సహాయంతో చదవటం, రాయటం కూడా ఆమె నేర్చుకుంది. ఈశ్వరి తొలిసారి తెలుగులో ‘దొంగలున్నారు జాగ్రత్త’ (1958) అనే చిత్రంలో ‘చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు’ అనే శ్రీశ్రీ రాసిన పాటను మహదేవన్‌ సంగీత దర్శకత్వంలో కస్తూరితో కలిసి పాడింది. మహదేవన్‌కు కూడా ఇదే తొలితెలుగు చిత్రం కావడం విశేషం. 1965లో శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్‌ వారు బి.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీ సింహాచల క్షేత్ర మహిమ’ అనే చిత్రంలో సంగీత దర్శకుడు టి.వి.రాజు ఈశ్వరి చేత ‘నీలాటి రేవుకాడ నేరేడు చెట్టు నీడ ఆనాడు నాతో చేరి సై అన్నాడు మావ చేతిలో చెయ్యేసి నువ్వేనన్నాడు’ అనే రాజశ్రీ గీతాన్ని పాడించారు. కవ్వించి నవ్వించే ఆ పాట నూతనగాయనిగా ఈశ్వరికి తెలుగులో మంచిపేరు తెచ్చిపెట్టింది. తరువాత ఈశ్వరి పాడిన పాటలకు ఒక ప్రత్యేక ‘మార్కు’ లభించింది. ముఖ్యంగా రేఖా అండ్‌ మురళీ ప్రొడక్షన్స్‌ పతాకంపై నటుడు పద్మనాభం నిర్మించిన ‘కథానాయిక మొల్ల’ చిత్రంలో సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి ఒక అద్భుతమైన పాట పాడించారు. జ్యోతిలక్ష్మి నాట్యంతో వచ్చే ఈ పాట కన్నడ, మరాఠీ, తమిళ, తెలుగు, ఉర్దూ భాషల్లో సాగుతుంది. ‘నానే చెలువే కన్నడటి నాట్యగీత సంగాతి’ (కన్నడ- రచన: విజయ నరసింహం), ‘నావ్‌ గావ్‌ కాయ్‌ మణతా ఆవో మీ మహారాష్ట్రాచి’ (మరాఠీ- రచన: శ్రీనివాస్‌), ‘తమిళ్‌ తాయిన్‌ తలై మగళే ఇంద తరణి ఎల్లాం పాట్రుంకలై మగళే’ (తమిళ- రచన: ఆరుళ్‌ ప్రకాష్‌), ‘పొగరు గల పిల్లా ఇది తెలుగుజాతి పిల్లా’ (తెలుగు- రచన: దాశరథి), ‘పాబీహూ తేరి సాథీహూ తేరి బాహోమే రహతీహూ’ (ఉర్దూ- రచన: దాశరథి) అంటూ ఈ పాట ఒక ప్రశ్నకు సమాదానంగా సినిమాలో కనిపిస్తుంది. ఈ పాట ఈశ్వరి సంగీత ప్రజ్ఞకు నిదర్శనం. ఐదు పద్ధతుల్లో సాగే ఈ పాటను దాశరథి మెచ్చుకుంటూ ‘పంచ భాషా ప్రవీణ’ ఈశ్వరి అంటూ మెచ్చుకోలు మాటలతో ఆమెను అభినందించారు. అలాగే ‘నన్న గండ ఎల్లి’ అనే కన్నడ సినిమాలో ఈశ్వరి పది భాషల్లో సాగే పాటను ఆలపించి రికార్డు సృష్టించింది.


తెలుగులో ఈశ్వరి అద్భుతమైన పాటలు పాడింది. వాటిలో కొన్ని... ‘ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చెయ్యొద్దు (భార్యా బిడ్డలు), ‘అరె ఏమిటి లోకం పలు కాకుల లోకం (అంతులేనికథ), ‘బలే బలే మగాడివోయ్‌ బంగారు నా సామివోయ్‌’ (మరోచరిత్ర), ‘పట్నంలో శాలిబండ’ (అమాయకుడు), ‘బోల్తా పడ్డావు చిన్నవాడా’ (పుట్టినిల్లు మెట్టినిల్లు), ‘ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జలసాలు’ (కాలం మారింది), ‘హాపీ న్యూ ఇయర్‌’ (ధనమా దైవమా), ‘హరిలో రంగ అనవేలరా’ (శ్రీమంతుడు), ‘జంభైలో జోరు జంభల్‌ హైలెస్సా’ (అల్లూరి సీతారామరాజు), ‘జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ళ పాపాయిలే’ (రైతు కుటుంబం), ‘కంచెకాడ మంచెకాడ’ (మానవుడు దానవుడు), ‘కొప్పుచూడు కొప్పందం చూడు (మానవుడు దానవుడు), ‘లే లే నారాజా లేలేలే నా రాజా’ (ప్రేమనగర్‌), ‘లవ్‌ లవ్‌ లవ్‌ మీ చిన్నోడా’ (జరిగిన కథ), ‘మంగమ్మా నువ్వు వుతుకుతుంటే అందం’ (జమీందారుగారి అమ్మాయి), ‘అద్దరేత్తిరికాడ అత్తయ్య నాకు కలలోకి వచ్చింది మావో’ (కంచుకోట), ‘అంబవో శక్తివో ఆంకాళ దేవివో’ (నేనంటే నేనే), ‘పళ్ళోయ్‌ బాబు పళ్ళు’ (ఉక్కుపిడుగు), ‘నన్నే నన్నే చూడు’ (పాపకోసం), ‘మసక మసక చీకటిలో మల్లెతోట ఎనకాలా (దేవుడుచేసిన మనుషులు), ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు’ (అమ్మమాట), ‘నందామయా గురుడా నందామయా’ (జీవన తరంగాలు), ‘చూస్తే ఏముందోయ్‌ రాజా’(అన్నదమ్ములు), ‘నీవు నాకు రాజా’ (రాజకోట రహస్యం), ‘ఒరె మావా ఏసుకోర సుక్కా’ (సిపాయి చిన్నయ్య), ‘పాములోళ్ళమయ్యా మా పెగ్గి చూడరయ్యా’ (భక్తప్రహ్లాద), ‘పుట్టమీద పాల పిట్టోయి నాసామి’ (బాలమిత్రుల కథ), ‘తీస్కో కోకాకోలా ఏస్కో రమ్ము సారా’ (రౌడీలకు రౌడీలు). ఈ పాటలు సాధారణంగా అందరూ వినినవే. ఇవి కాకుండా మరెన్నో మంచిమంచి పాటలు తెలుగులో ఈశ్వరి పాడి అలరించింది. పైన పేర్కొన్న పాటల జాబితా చూస్తే ఇతర గాయనీమణులకన్నా ఈశ్వరి వైవిధ్యంగా పాడిన రీతి గమనించవచ్చు. తెలుగులో సంగీత దర్శకుడు సత్యం ఈశ్వరికి ఇచ్చిన ప్రోత్సాహం అద్వితీయం. అలాగే ఘంటసాల వంటి మహాగాయకులు ఫలాని పాటకు ఎల్‌.ఆర్‌.ఈశ్వరి అయితే న్యాయం చేస్తుందని సంగీత దర్శకులకు సూచించిన సందర్భాలు కోకొల్లలు. ‘ఉమ్మడికుటుంబం’, ‘ప్రేమనగర్‌’, ‘భలేరంగడు’, ‘రైతుకుటుంబం’ వంటి సినిమాలలో ఘంటసాలతో కలిసి ఈశ్వరి పాటలు పాడి హిట్‌ చేసింది. ‘కళారంగంలో ఇచ్చకాలు తెలియని వ్యక్తిత్వం ఘంటసాలది’ అని ఈశ్వరి ఎన్నోసార్లు ప్రశంసించింది. ‘ఇదాలోకం’ చిత్రంలో ఎస్‌.జానకితో కలిసి ‘గుడిలోన నాసామి కొలువై వున్నాడు’ అనే సంవాద గీతాన్ని వైవిధ్యంగా పాడి పేరుతెచ్చుకుంది. తెలుగులో ఆమె దాదాపు రెండువేల పాటలు పాడివుంటుంది. హిందీ చిత్రరంగంలో ఆశాభోంస్లే, మహమ్మద్‌ రఫీ ఆమెకు అభిమాన గాయనీగాయకులు. దక్షిణాదిన పి.సుశీల సంగీతాన్ని అభిమానిస్తుంది.

                                 

అవివాహితగా...
చిన్నతనంలోనే ఈశ్వరికి బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి. తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తన చెల్లెలు, తమ్ముడి భవిష్యత్తు గురించి పట్టించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె చెల్లెలు అంజలికి ఈశ్వరి పెళ్లి చేసింది. అయితే ఆమె దురదృష్టవశాత్తు మరికొంతకాలానికే చనిపోయింది. తమ్ముడు అమల రాజ్‌తో ఈశ్వరి వ్యాపారం పెట్టించి వృద్ధిలోకి తీసుకొనివచ్చింది. తనుమాత్రం అవివాహితగానే వుండిపోయింది. ఈశ్వరి తన తమ్ముడి వద్దే వుంటుంది. ఈశ్వరికి ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ అంటే పిచ్చి ప్రేమ... అంతకంటే ఆరాధనా భావం అనవచ్చు. చిన్నతనం నుంచి ఆయన్నే ఆరాదించేది. తనకు పాతికేళ్ళ వయసు నుంచి విశ్వనాథన్‌తోనే ఆమె జీవితం పంచుకుంది. ఆయనంటే తనకు ఇష్టం. తానంటే ఆయనకూ యిష్టమే. విశ్వనాథన్‌ తరచూ ఈశ్వరి వద్దకు వెళుతూ వుండేవారు. విశ్వనాథన్‌-రామమూర్తి విడిపోవడానికి ఒకరకంగా ఎల్‌.ఆర్‌.ఈశ్వరి కారణమని పెద్దలు చెబుతుంటారు. ఏదిఏమయినా ఈశ్వరిది ఒంటరి జీవితమే. అందుకే ఆమె సంగీమే తన భర్త అని చెబుతూవుంటుంది.


మరికొన్ని విశేషాలు...
* 1985 మార్చిలో ఈశ్వరి ఒక సంగీత కచేరీలో పాటలు పాడుతూవుంది. మధ్యలో ఆమె తల్లి చనిపోయిందనే వార్త తెలిసింది. వెంటనే కర్మక్రతువులకు అన్ని ఏర్పాట్లు చేయమని తమ్ముడికి ఫోనులో చెప్పి తను కచేరీ కొనసాగించింది. గాయనిగా గొప్ప పేరు తెచ్చుకోవాలనేది తన తల్లి ఆశయమని, ఆ ఆశయం చనిపోరాదని ఈశ్వరి భావించడమే అందుకు కారణం.


*
దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్‌ తమిళంలో నిర్మించిన ‘శివంద మణ్‌’ (1969) అనే సినిమాలో విశ్వనాథన్‌ సంగీత దర్శకత్వంలో కణ్ణదాసన్‌ రాసిన ఈశ్వరి ‘పట్టత్తు రాణి పార్కుం పార్వై’ అనే పాటను ఆలపించింది. ఆపాటలో మధ్య మధ్య కొరడా దెబ్బలు తింటుంటే మూలుగుతో పాట ఆలపించాలి. ఈశ్వరి ఆ పాటను అద్భుతంగా పాడితే అందరూ అభినందించారు. ఇదే చిత్రాన్ని శ్రీధర్‌ సొంతంగా 1970లో ‘ధర్తి’ పేరుతో పునర్నిర్మించారు. తమిళంలో శివాజీ గణేశన్, కాంచన నటించగా హిందీలో రాజేంద్రకుమార్, వహీదా రెహమాన్‌ నటించారు. ఇదే పాటను శంకర్‌ జైకిషన్‌ లతాజీతో పాడించాలని మాతృక గీతాన్ని వినిపిస్తే, లతాజీ ‘అమ్మో...నేను ఇలా పాడలేను’ అంటూ తప్పుకుంది. దాంతో ఈశ్వరితోనే హిందీలో పాడించారు. దురదృష్టవశాత్తు ఆమె పాటను చిత్రంలో తొలగించారు.

* ఈశ్వరి కచేరీలలో పాడేటప్పుడు తన్మయత్వంతో స్టేజి మీద తిరుగుతూ, ఊగుతూ పాడేది. అది కొందరికి నచ్చేది కాదు. ఆనాటి గాయనీమణులంతా ఈశ్వరి కచేరీకి వస్తే తాము పాల్గొనబోమని తేల్చి చెప్పడంతో కచేరీ నిర్వాహకులు కిమ్మనక తప్పలేదు. ఇటువంటి అసూయలు, ద్వేషాలు ఈశ్వరి మీద చాలా ప్రభావం చూపాయి.


*
ఎల్‌.ఆర్‌.ఈశ్వరి ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి చేతులమీదుగా 1984లో ‘కలైమామణి’ అవార్డు అందుకుంది. అలాగే ఉగాది పురస్కారాన్ని కూడా అందుకుంది. తెలుగు చిత్రాల్లో పాడిన గాయనీగాయకులకు మద్రాసు ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వారు ప్రదానం చేసే ‘ఉత్తమ గాయని’ బహుమతి ఈశ్వరికి 1969లో లభించింది. ఈశ్వరి తెలుగులో ‘చూసొద్దాం రండి’ (2000) అనే చిత్రంలో చివరిసారిగా పాడింది. అయితే 2011లో ఈశ్వరి రీ-ఎంట్రీ చేసి ‘ఒస్తే’ అనే తమిళ చిత్రంలో టి.రాజేందర్, సోలార్‌ సాయిలతో కలిసి తమన్‌ దర్శకత్వంలో ‘కళాశాల కళాశాల’ అనే పాట పాడింది. ఆ పాట బాగా హిట్టయింది. తరువాత ‘తడయ్యర థాక్క’ చిత్రంలో ‘నా పూందమల్లి దా’ అనే పాటను కూడా పాడింది.

* 2013లో ’ఆర్య సూర్య’ అనే చిత్రంలో టి.రాజేందర్‌తో కలిసి ‘తగదూ తగదు’ అనే పాటను పాడింది. ఆమె ఆనంద్, మధు సంగీత బృందంతో కలిసి ఎన్నో విదేశాలలో ఎన్నో సంగీత కచేరీలు చేసింది.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.