నేపథ్య గాన కోవిదుడు... మహమ్మద్‌ రఫీ

భారత ఉపఖండంలో అత్యంత ప్రతిభావంతుడైన నేపథ్య గాయకుడిగా గణుతికెక్కిన మహా ‘మనీషి’ మహమ్మద్‌ రఫీ. అభిమానులంతా రఫీని ‘ఫీకో’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ రఫీని ఇంటికి పిలిపించుకొని పాటలు పాడించుకున్న సందర్భాలు రెండున్నాయి. ఎనిమిది వేలకు పైగా పాటలు పాడిన రఫీ చనిపోతే ఆయన శవ యాత్రకు వర్షాన్ని లెక్క చేయకుండా పదివేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారంటే, అతడు ఎంతటి గొప్పవాడో ఊహించవచ్చు. ప్రేమగీతాలు, భక్తి గీతాలు, భజన పాటలు, విషాద గీతాలు, కవ్వాలీలు, గజళ్లు, జానపద గీతాలు, కవ్వింపు పాటలు... ఒకటేమిటి... రఫీ గొంతులోంచి వెలువడని విభిన్న రకాల పాటలు లేవంటే నమ్మాలి. వ్యక్తిగా సౌమ్యుడు, వినయ సంపన్నుడు, దాత, చెడు అలవాట్లు లేని సాధారణ పౌరుడు. జులై 31, 1980న ముంబైలో కన్నుమూశారు. అలాంటి మంచి మనిషి రఫీ వర్ధంతి నేడు.  ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని పరిశీలిద్దాం...


* తొలిరోజుల్లో రఫీ...

మహమ్మద్‌ రఫీ పంజాబ్‌ రాష్ట్రంలోని అమృతసర్‌కు దగ్గరలో వుండే కోట్ల సుల్తాన్‌ సింగ్‌ గ్రామంలో 24 డిసెంబరు 1924న జన్మించాడు. తండ్రి హాజీ ఆలి మహమ్మద్, తల్లి అల్లారఖీ బాయి. ఆరుగురు మగ సంతానంలో రఫీ ఐదవవాడు. రఫీకి చిన్నతనం నుంచే సంగీతం మీద మక్కువ ఎక్కువగా వుండేది. రఫీ పెద్దన్నయ్య బావమరది హమీద్‌ ఈ విషయాన్ని గమనించి అతనికి సంగీతంలో శిక్షణ ఇప్పిస్తే రాణిస్తాడని వారి తండ్రికి తెలిపాడు. దాంతో రఫీ హిందుస్తానీ సంగీత శిక్షణ కోసం పండిట్‌ జీవన్‌ లాల్‌ మట్టో వద్ద శిష్యరికం చేశాడు. హిందుస్తానీ రాగశాస్త్రంలోని మెళకువలు ఆకళింపు చేసుకున్నాడు. ముఖ్యంగా పహాడి, భైరవి, బసంత్, మల్హర్‌ రాగ లక్షణాలను ఆపోసన పట్టాడు. పంజాబీ జానపద రీతుల్ని అభ్యసించాడు. తరవాత ఉస్తాద్‌ అబ్దుల్‌ వాహాద్‌ ఖాన్‌ వద్ద మరికొన్ని సంగీత మెళకువలు నేర్చుకున్నాడు. లాహోర్‌లో ఉస్తాద్‌ బడే గులామ్‌ ఆలి ఖాన్‌ వద్ద శిక్షణ పొందాడు. తన 13వ ఏటనే లాహోర్‌లో కచేరీ చేశాడు. అక్కడే ఆల్‌ ఇండియా రేడియోలో సంగీత విభాగ అధిపతి ఫిరోజ్‌ నిజామి నేతృత్వంలో 1941 నుంచి పాటలు పాడుతూ వచ్చాడు. రఫీ ఆలపించిన ‘సోనియే నీ హీరియే నీ’ అనే తొలి గీతాన్ని జీనత్‌ బేగమ్‌తో కలిసి ఆలపించగా ‘గుల్‌ బాలోచ్‌’ అనే పంజాబీ సినిమా కోసం ఫిరోజ్‌ నిజామి రికార్డు చేశారు. ఆ చిత్రం 1944లో విడుదలైంది.


* బైజు బావరాతో గుర్తింపు...

సినిమాల్లో పాడే అవకాశాల కోసం బొంబాయిలో వున్న తన మిత్రుడు తన్వీర్‌ నఖ్వి ద్వారా ప్రయత్నించాడు. 1944లోనే రఫీకి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. రామనీక్‌ ప్రొడక్షన్స్‌ వారు కె.అమరనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘గామ్‌ కి గోరి’ అనే సినిమాలో శ్యామ్‌ సుందర్‌ సంగీత దర్శకత్వంలో ‘ఆయె దిల్‌ హో కాబు మే’ అనే తొలి పాట పాడాడు. నూర్జహాన్, నాజిర్‌ నటించిన ఈ సినిమా 1945లో విడుదలై డంకా బజాయించింది. తరవాత నౌషద్‌ సంగీత దర్శకత్వంలో పదేళ్లపాటు ఏకధాటిగా అనేక సినిమాలకు రఫీ పాటలు పాడాడు. వాటిలో ‘పెహలే ఆప్‌’ (1944), ‘అన్మోల్‌ ఘడి’ ఖీ ‘షాజహాన్‌’(1946), ‘దులారి’ (1949), ‘దీదార్‌’ (1951), ‘ఉరన్‌ ఖటోలా’ (1955) కొన్ని. ప్రకాష్‌ పిక్చర్స్‌ వారు విజయ భట్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘బైజు బావరా’ (1952) సినిమాలో దర్బారీ రాగంలో ఆలపించిన ‘ఓ దునియా కే రఖవాలే సున్‌ దర్ద్‌ భరే మేరె నాలే’, భైరవి రాగంలో ఆలపించిన ‘తూ గంగా కి మౌజ్‌ మై జమునా కా ధారా’, మాల్కౌంస్‌ రాగంలో ఆలపించిన ‘మన్‌ తర్పత్‌ హరి దర్శన్‌ కో ఆజ్‌’, తోడి రాగంలో ఆలపించిన ‘ఇన్సాన్‌ బనో’ వంటి క్లాసికాల్‌ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్‌ మెగాహిట్‌గా నిలిచి 100 వారాలు ప్రదర్శనకు నోచుకుంది. ‘మొఘల్‌-ఎ-ఆజం’ ((1960) చిత్రంలో రఫీ ఆలపించిన ‘జిందాబాద్‌ జిందాబాద్‌ ఆయె ముహబ్బత్‌ జిందాబాద్‌’ పతాక గీతంగా మన్ననలందుకుంది. మహమ్మద్‌ రఫీ గొంతుక విభిన్న స్వరాలను అవలీలగా పలికించేది. అది ‘ఆప్‌ కే పెహలో మై ఆకర్‌ రో దియే’ వంటి గజల్‌ ప్రక్రియ అయినా, ‘ఓ దునియా కే రఖ్‌ వాలో’ వంటి భజన పాటైనా, ‘చాహే కోయీ ముఝే జంగ్లి కహే’ వంటి కొంటె పాటైనా వాటిని అజరామరం చేసిన ఘనత రఫీదే! రఫీ ఒక మంచి తెలివైన గాయకుడు. ‘ప్యాసా’ చిత్రంలో ‘సర్‌ జో తేరా చక్రాయే’ అంటూ బర్మన్‌ దా స్వరపరచిన పాటకు జానీవాకర్‌ పాడినట్లే బాడీ లాంగ్వేజ్‌ని మార్చగలగడం ఒక్క రఫీకే చెల్లింది. అలాగని ఆయన గాత్ర లక్షణాన్ని ఎక్కడా మార్చలేదు. అలాగే ‘సి.ఐ.డి’ లో ‘ఆయ్‌ దిల్‌ హై ముష్కిల్‌ జీనా యహా’ పాటలో జానీవాకర్‌ ఎలా మాటలు పలుకుతాడో పాటకూడా అలాగే వుంటుంది. దీనిని ప్రతిభ కాక మరేమనాలి? బాలీవుడ్‌లో బిస్వజిత్, భరత్‌ భూషణ్, జాయ్‌ ముఖర్జీ పెద్దగా ట్యాలెంట్‌ వున్న నటులు కారు. కానీ తన పాటలతో వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసిన ఘనత కూడా రఫీ సాబ్‌ దే. ‘పుకార్‌ తా చలా హూ మై’ (బిస్వజిత్‌), ‘జిందగీ భర్‌ నహీ భూలేగీ వో బర్సాత్‌ కి రాత్‌’ (భరత్‌ భూషణ్‌), ‘బడే మియా దీవానే సే నా బనో’ (జాయ్‌ ముఖర్జీ) పాటలు చాలు ఈ నిజాన్ని చెప్పటానికి. రఫీ కేవలం ఒక మంచి గాయకుడే కాదు మంచి ‘మనీషి’ కూడా. కొంతమంది సంగీత దర్శకులు ‘మాది లోబడ్జెట్‌ చిత్రం. పారితోషికం పెద్దగా ఇవ్వలేను. సర్దుకో మిత్రమా’ అంటే ‘టోకన్‌’గా కేవలం ఒక రూపాయ మాత్రమే తీసుకొని పాటలు పాడిన సంఘటనలు కోకొల్లలు. నటుడు రాకేశ్‌ రోషన్‌ ఫిలిం క్రాఫ్ట్స్‌ బ్యానర్‌ మీద సొంతంగా తొలి ప్రయత్నంగా ‘ఆప్‌ కే దీవానే’ (1980) అనే సినిమా నిర్మాణం మొదలెట్టినప్పుడు రాకేశ్‌ పరిస్థితి చూసి తను పాడిన ఆరు పాటలకి పారితోషికం తీసుకోలేదు. అదే కిషోర్‌ కుమార్‌ మాత్రం చెవులు పిండి వసూలు చేశాడు. రఫీ మేధావి. మెలోడీ తగ్గకుండా మంచి ఎమోషన్, ఎనర్జీ మేళవించి యేపాటైనా పాడేవారు. అందుకే ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకి అత్యంత ఇష్టమైన గాయకుడు రఫీ. దేశభక్తి గీతాలైనా, గజళ్ళు అయినా, కవ్వాలీలైనా, విషాద గీతాలైన, ప్రేమ గీతాలైనా రఫీ గొంతుకలోని అమృతంలో తడిసి అద్భుత గీతాలుగా వెలువడేవి. హీరో దేవానంద్‌కు ‘కాలాపాని’, ‘బొంబై కా బాబు’, ‘నౌ దో గ్యారా’, ‘తేరే ఘర్‌ కే సామనే’, ‘తీన్‌ దేవియా’, ‘గైడ్‌’ వంటి సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు. దేవానంద్‌-బర్మన్‌ దా- రఫీ కలయికలో ‘దీవానా మస్తానా హువా దిల్‌’, ‘దిల్‌ కా భవర్‌ కరే పుకార్‌’, ‘తూ కహాఁ ఏ బతా’, ‘దేఖో రూఠా న కరో’, ‘అచ్చాజీ మై హరి’, ‘కోయా కోయా చాంద్‌’, ‘ఐసా తో న దేఖో’ వంటి కొన్ని మరువలేని ఆణి ముత్యాలు వెలువడ్డాయి. అలాగే సచిన్‌ దేవ్‌ బర్మన్‌ రఫీ గొంతును వాడుకున్నట్లు మరే ఇతర గాయకుని గొంతునువాడుకోలేదు. తరువాతి కాలంలో కిషోర్‌ కుమార్‌కు ఎక్కువ అవకాశాలు బర్మన్‌ సంగీత సారధ్యంలో రావడానికి హీరోలు కారణం కానీ బర్మన్‌ కాదు. అయితే గురుదత్, రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌లు రఫీ గొంతును ఎక్కువగా కోరుకున్నవాళ్ళే. ‘గున్‌ గునా రహే హాయ్‌ భవరే’, ‘తెరి బిందియా రే’ పాటలు వీటికి ఉదాహరణలే!

* ఓ.పి. నయ్యర్, శంకర్‌- జైకిషన్‌లతో...

ఓ.పి. నయ్యర్‌కు రఫీ చేత పాడించడమంటే చాలా ఇష్టం. ‘రఫీ లేకుంటే నేను సంగీత దర్శకుడిగా విజయాన్ని సాధించే వాడినే కాదు. రఫీ లేకుంటే నయ్యర్‌ లేడు’ అని స్వయంగా చెప్పుకున్నాడు నయ్యర్‌. పంతానికి లతా మంగేష్కర్‌ చేత ఒక్క పాట కూడా పాడించకుండా మెలోడీ విజార్డుగా గణుతికెక్కిన సంగీత దిగ్గజం నయ్యర్‌. ‘నయా దౌర్‌’, ‘కాశ్మీర్‌ కి కలి’ వంటి సినిమాల్లో రఫీ చేత ఎంత గొప్ప పాటలు పాడించాడో మనకు తెలియంది కాదు. ‘దీవాన హువా బాదల్‌’, ‘తుంసా నహీ దేఖా’, ‘ఉడే జబ్‌ జబ్‌ జుల్ఫే తేరి’, ‘జవానియా ఏ మస్త్‌ మస్త్‌’, ‘తారీఫ్‌ కారో క్యా ఉస్‌ కీ జిస్నే తుమ్హే బనాయా’ వంటి పాటలు మనసు దోచినవే కదా! బాఘి, షహజాదా, షరారత్‌ వంటి సినిమాల్లో కిషోర్‌ కుమార్‌కు రఫీ చేత పాడించిన ఘనత నయ్యర్‌ దే. నయ్యర్‌ రఫీ చేత 200 వందలకు పైగా పాటలు పాడించారు. రఫీ-శంకర్‌ జైకిషన్‌ల సంగీత సంబంధం విడదీయ రానిది. రఫీకి ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు తెచ్చిపెట్టిన పాటలలో మూడు వీరి కాంబినేషన్‌ లోవే కావటం విశేషం. ‘తేరి ప్యారి ప్యారి సూరత్‌ హో’(ససురాల్‌), ‘బహారోం ఫూల్‌ బరసావో’ (సూరజ్‌), ‘టల్‌ కే ఝరోకోం మే తుఝ్‌ కో బిఠా కర్‌’ (బ్రహ్మచారి) పాటలకు ఆ ఫిలింఫేర్‌ బహుమతులు దక్కాయి. షమ్మి కపూర్, రాజేంద్రకుమార్‌లకు రఫీ గళం అతికినట్లు సరిపోయేది. శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో రఫీ 340కి పైగా పాటలు పాడారు. బసంత్‌ బహార్, ప్రొఫెసర్, జంగ్లీ, సూరజ్, బ్రహ్మచారి, ఎన్‌ ఈవెనింగ్‌ ఇన్‌ పారిస్, లవ్‌ ఇన్‌ టోక్యో, దిల్‌ ఏక్‌ మందిర్, జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై సినిమాలలో రఫీ ఆలపించిన పాటలు చాలా గొప్పవి.


* ఇతర సంగీత దర్శకులతో...

రవి సంగీత దర్శకత్వంలో రఫీ ఆలపించిన ‘చౌద్వి కా చాంద్‌ హో’ పాటకు తొలి ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. అలాగే రఫీకి జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన పాట రవి సంగీత దర్శకత్వంలో ఆలపించిన ‘బాబుల్‌ కి దువాయే లేతీ జా’ (నీల్‌ కమల్‌) కావడం విశేషం. ఈ పాట రికార్డింగ్‌లో రఫీ కన్నీళ్లు పెట్టు కున్నాడు. చైనా టౌన్, కాజల్, దో బదన్‌ వంటి సినిమాల్లో రఫీ ఆలపించిన పాటలు వజ్రపు తునకలు. మదన్‌ మోహన్‌ సంగీత దర్శకత్వంలో కూడా రఫీ అద్భుతమైన పాటలు పాడారు. వాటిలో ‘కర్‌ చలే హమ్‌ ఫిదా’, ‘మేరి ఆవాజ్‌ సునో ప్యార్‌ కా రాజ్‌ సునో’, ‘తేమ్‌ జో మిల్‌ గయే హో’ , ‘తేరి ఆంఖోం కే శివా’ ఎప్పుడూ వినపడుతూనే వుంటాయి. ‘వో జబ్‌ యాద్‌ ఆయీ బహుత్‌ యాద్‌ ఆయీ’ పాట మీకు గుర్తుండే వుంటుంది. లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ తొలి సినిమా ‘పారస్‌ మణి’లో రఫీ సాబ్‌ ఆలపించిన గొప్ప పాట. అప్పటి నుంచి రఫీ లేకుండా లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ సినిమాలకు సంగీతం అందించలేదు. లక్ష్మీప్యారే సంగీత దర్శకత్వంలో వచ్చిన దోస్తీ సినిమాలో రఫీ ఆలపించిన ‘చాహుంగ మై తుఝే సాంఝ్‌ సవెరే’ పాటకు మహమ్మద్‌ రఫీ ఫిలింఫేర్‌ బహుమతి గెలుచుకున్నారు. వీరి సంగీత దర్శకత్వంలో రఫీ నాలుగు వందలకు పైగా పాటలు పాడారు. సామ్రాట్‌ చంద్రగుప్త, హసీనా మాన్‌ జాయేగీ వంటి సినిమాల్లో కళ్యాన్‌ జీ ఆనంద్‌ జీ లకు రఫీ రెండు వందలకు పైగా పాటలు పాడారు. ఆ రోజుల్లో అద్భుత సంగీతాన్ని అందించిన రోషన్, జయదేవ్, ఖయ్యామ్, చిత్రగుప్త, రాజేష్‌ రోషన్, రవీంద్ర జైన్, ఆర్‌.డి.బర్మన్, బప్పిలహరి, సపన్‌-జగ్‌ మోహన్, ఉషా ఖన్నా, ఎస్‌.ఎన్‌. త్రిపాఠి, ఎన్‌.దత్తా వంటి సంగీత దర్శకులవద్ద పాటలు పాడే అదృష్టం దక్కిన అదృష్టవంతుడు రఫీ. ‘క్రిస్‌ పెర్రీస్‌ కొంకణి’ అనే గోల్డన్‌ ఆల్బంలో రఫీ కొన్ని ప్రైవేటు పాటలు పాడారు. అలాగే మారిషస్‌ దీవులకు వెళ్లినప్పుడు కొన్ని పాటలు, ఇంగ్లీష్‌ ఆల్బంకు కొన్ని పాటలు ఆదశకంలో రఫీ గళంనుంచి కొన్ని అద్భుతమైన పాటలు వెలువడ్డాయి. ‘మై కహీ కవీ న బన్‌ జా’ (ప్యార్‌ హి ప్యార్‌), ‘ఏ దునియా ఏ మెహఫిల్‌’ (హీరా రాంఝా), ‘ఝిల్మీ సితారోం కా’ (జీవన్‌ మృత్యు), ‘గులాబీ ఆంఖే’ (ది ట్రెయిన్‌), ‘యూ హి తుమ్‌ ముఝ్‌ సే బాత్‌ కర్తీ హో’ (సచ్చా ఝూటా), ‘కితనా ప్యారా వాదా šïౖ’(కారవాన్‌), ‘చలో దిల్‌ దార్‌ చలోవ’ (పాకీజా), ‘చురాలియా హై తుమ్‌ నే’ (యాదోం కి బారాత్‌), ‘తేరి బిందియా రే’ (అభిమాన్‌), ‘ఆజ్‌ మౌసం బడా బెయిమాన్‌ హై’ (లోఫర్‌) పాటలు ఆ దశకంలో వచ్చిన కొన్నిమాత్రమే. లైలా మజ్ను, హమ్‌ కిసీ సే కమ్‌ నహీ, అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, బైరాగ్, ధరమ్‌ వీర్, సర్గమ్, షాన్, నసీబ్‌ వంటి సినిమాలలో రఫీ పాడిన పాటలన్నీ అద్భుతాలే.


* వ్యక్తిగతం...

రఫీ తొలుత తన మేనకోడలు బషీరా బీబీని వివాహమాడారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక భారత్‌- పాక్‌ విడిపోయే సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లలో బషీరా బీబీ తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో ఆమె భారత్‌ లో ఉండనని లాహోర్‌కు వెళ్లిపోయింది. తరువాత రఫీ బిల్క్విస్‌ బానోను వివాహమాడారు. రఫీకి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. సయీద్‌ పెద్ద కుమారుడు కాగా, అతడు తొలి భార్య సంతానం. 31 జూలై 1980న హృద్రోగంతో మహమ్మద్‌ రఫీ 55 ఏళ్ల ప్రాయంలోనే చనిపోయారు
 


వరస బహుమతులు...
‘హమ్‌ కిసీ సే కమ్‌ నహీ’ (1977) సినిమాలో రఫీ ఆలపించిన ‘క్యా హువా తేరా వాదా’ (రాహుల్‌ దేవ్‌ బర్మన్‌) పాటకు ఉత్తమ గాయకుడిగా జాతీయ బహుమతి లభించింది. ఇక ఫిలింఫేర్‌ బహుమతుల విషయానికి వస్తే 1960లో వచ్చిన ‘చౌద్వి కా చాంద్‌’ సినిమాలో టైటిల్‌ పాటకు, 1961లో వచ్చిన ససురాల్‌ సినిమాలో ‘తేరి ప్యారి ప్యారి సూరత్‌ కో’ పాటకు ఫిలింఫేర్‌ బహుమతులు వచ్చాయి. ఆ తరువాతి మూడు సంవత్సరాల్లో వరసగా ఘరానా సినిమాలో ‘హుస్న్‌ వాలే తేరా జవాబ్‌ నహీ’ (1961-రవి) పాటకు, 1962లో వచ్చిన ప్రొఫెసర్‌ సినిమాలో ‘ఆయ్‌ గుల్బదన్‌ ఆయ్‌ గుల్బదన్‌’ (శంకర్‌ జైకిషన్‌) పాటకు, 1963లో వచ్చిన మేరె మెహబూబ్‌లో ‘మేరె మెహబూబ్‌ తుఝే’ (నౌషాద్‌) పాటకు రఫీ పేరు ఉత్తమ గాయకుని ఎంపికకోసం నామినేట్‌ అయ్యాయి. 1964లో దోస్తీ సినిమాలో ‘చాహుంగ మై తుఝే సాంఝ్‌ సవేరే’ (లక్ష్మి ప్యారే) పాటకు ఫిలింఫేర్‌ బహుమతి దక్కింది. 1965లో కాజల్‌ సినిమాలోని ‘చూ లేనే దో నాజుక్‌ హోటోంకో’ (రవి) రఫీ పేరు నామినేట్‌ అయింది. తరువాత 1966, 1968 సంవత్సరాల్లో సూరజ్‌ సినిమాలో ‘బహారోం ఫూల్‌ బరసావో’ (శంకర్‌ జైకిషన్‌) పాటకు, బ్రహ్మచారి సినిమాలో ‘దిల్‌ కే ఝరోకోం మే తుఝ్‌ కో బిఠాకర్‌’ (శంకర్‌ జైకిషన్‌) పాటకు ఫిలింఫేర్‌ బహుమతి దక్కింది. 1969 నుంచి 70 వరకు వరసగా ‘బడీ మస్తానీ హై మేరె మెహబూబా’ (జీనే కి రాహ్‌-లక్ష్మీప్యారే), ‘ఖిలోనా జాన్‌ కర్డ్‌ (ఖిలోనా-లక్ష్మీప్యారే) పాటలు నామినేట్‌ అయ్యాయి. 1973-74లో ‘హమ్‌ కో తో జాన్‌ సే ప్యారీ’ (నైనా-శంకర్‌ జైకిషన్‌), ‘అచ్చా హి హువా దిల్‌ టూట్‌ గయా’ (మా బెహన్‌ అవుర్‌ బీవి- శారద)పాటలు ఫిలింఫేర్‌ బహుమతులకోసం పోటీ పడ్డాయి. 1977లో ‘క్యా హువా తేరా వాదా’ (హమ్‌ కిసీ సే కమ్‌ నహీ- ఆర్‌.డి. బర్మన్‌) పాటకు బహుమతి వచ్చింది. 1978-80 సంవత్సరాల మధ్య కాలంలో రఫీ పాటలకు నామినేషన్లు మాత్రమే దక్కాయి. అవి ...‘పరదా హై పరదా’ (అమర్‌ అక్బర్‌ ఆంథోనీ-లక్ష్మిప్యారే), ‘ఆద్మీ ముసాఫిర్‌ హై’ (అపనాపన్‌-లక్ష్మిప్యారే), ‘చలో రే డోలీ ఉఠాతో కహా’ (జానీ దుష్మన్‌-లక్ష్మిప్యారే), ‘మేరే దోస్త్‌ కిస్సా యే’ (దోస్తానా-లక్ష్మిప్యారే), ‘దర్ద్‌ యే దిల్‌ దర్ద్‌ యే జిగర్‌’ (కర్జ్‌-లక్ష్మిప్యారే), ‘మైనే పూచా చాంద్‌ సే’ (అబ్దుల్లా- ఆర్‌.డి. బర్మన్‌). 1948లో ప్రధమ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు రఫీకి బంగారు పతకం ప్రదానం చేశారు. 1967లో పద్మశ్రీ పురస్కారం లభించింది. భారత తపాలాశాఖ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. స్టార్‌ డస్ట్‌ మ్యాగజైన్‌ ‘బెస్ట్‌ సింగర్‌ ఆఫ్‌ ది మిలీనియం’ బహుమతి ప్రకటించింది.


మరిన్ని విశేషాలు...

* రఫీ, లత ఒక మంచి నేపథ్య సంగీత ద్వయం అని అందరూ అంగీకరించే మాటే. కానీ లతా మంగేష్కర్‌ రఫీతో ఒకసారి విభేదించి, అతనితో పాడనని భీష్మించుకుంది. వివరాలలోకి వెళితే...ఆరోజుల్లో నిర్మాతలకు పాటలమీద 5శాతం రాయల్టీ వస్తుండేది. ‘వారి సినిమాల్లో పాటలు పాడాము కనుక అందులో సగం వాటా మనకు పంచాలి’ అంటూ ఒక డిమాండ్‌ను ముందుకు నెడుతూ రఫీని మద్దతు యివ్వమంది. అయితే ‘నిర్మాత మనం పాడిన పాటకు పారితోషికం చెల్లించాక ఆ పాట మీద హక్కులు నిర్మాతకే చెందుతాయి కాబట్టి సింగర్స్‌ అభ్యర్ధన తప్పు’ అని జవాబిచ్చాడు రఫీ. దానిని మనసులో పెట్టుకోని ‘మాయా’ సినిమా కోసం ‘తస్వీర్‌ తేరి దిల్‌ మే’ పాట రికార్డింగులో అనవసర గొడవ పెట్టుకొని తను రఫీతో పాటలు పాడనని తెగేసి చెప్పింది. కొంతకాలం వేచివుండి జైకిషన్‌ వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే రఫీ ఇతర గాయనీమణులను ప్రోత్సహిస్తూ వారితో పాడుతున్నారనేది లతా అసలు మనోగతం. తన గిన్నిస్‌ రికార్డు మీద కూడా రఫీ అభ్యంతరం తెలిపారనేది లతా మంగేష్కర్, రఫీ మీద మోపిన మరో అభియోగం. కానీ రఫీ సౌమ్యుడు. గొడవలకు వెళ్ళేవాడు కాదు .


* నయ్యర్‌ సమయపాలన విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. ఒకసారి ‘సావన్‌ కి ఘటా’ సినిమా పాటల రికార్డింగుకు రఫీ రెండు గంటల ఆలస్యంగా వచ్చాడు. సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు. శంకర్‌-జైకిషన్‌ల రికార్డింగులో కొంత ప్యాచ్‌ వర్క్‌ ఉండడంతో ఆలస్యమైందని, మన్నించమని రఫీ అంటున్నా, ‘సమయపాలనకు నేను అత్యధిక పప్రాధాన్యమిస్తానని నీకు తెలుసుగా. అయినా నువ్వు ఖాతరు చెయ్యలేదు. రికార్డింగ్‌ క్యాన్సిల్‌ చేస్తున్నాను’ అంటూ ‘ఈ ఆలస్యం ఖరీదు పన్నెండువేలు. వసూలు చెయ్యండి’ అని మ్యుజీషియన్లను ఆదేశిస్తూ నయ్యర్‌ వెళ్ళిపోయాడు. ఆ తరువాత రఫీ చేత నయ్యర్‌ మూడు సంవత్సరాలు పాటలు పాడించలేదు. ఒకసారి రఫీ, నయ్యర్‌ ఒకే వేదికమీద కలవాల్సివచ్చింది. వేదికమీదకు వచ్చిన నయ్యర్‌ వద్దకు రఫీ వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి వచ్చి కూర్చున్నాడు. ప్రసంగించేందుకు నయ్యర్‌ వంతు వచ్చింది. మైకు వద్దకు వచ్చి ‘నాకు రఫీకి మధ్య వచ్చిన చిన్న సమస్య కారణంగా అతణ్ణి మూడు సంవత్సరాలు దూరం పెట్టాను. కానీ రఫీ ఈ విషయాన్ని ఎక్కడా, ఎవరిదగ్గరా ప్రస్తావించలేదు... నన్ను విమర్శించనూ లేదు. రఫీ వ్యక్తిత్వానికి ప్రణమిల్లుతున్నాను. ఇకపై నాపాటలన్నీ రఫీ చేతే పాడిస్తాను’ అని కంటనీరు పెట్టుకుంటూ రఫీని ఆలింగనం చేసుకున్నాడు.


* ఒకసారి రఫీ తన మిత్రుడుతో కలిసి వాకింగ్‌ చేసి వస్తున్నాడు. దారిలో ఒక వ్యక్తి వచ్చి సహాయం చెయ్యమని అడిగాడు. రఫీ జేబులోంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టాడు. కృతజ్ఞతలు చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోగానే స్నేహితుడు కల్పించుకొని ‘అదేంటి భాయీ.. లెక్కపెట్టకుండానే జేబులోంచి వచ్చినదంతా ఇచ్చేశావ్‌!’ అన్నాడు. ‘అల్లా నాకు లెఖ్ఖపెట్టి సంపద ఇస్తున్నాడా? అడిగినవాడికి నేను లెఖ్ఖ పెట్టి ఎందుకివ్వాలి. నా చేతిలోకి వచ్చింది అతనికి చెందాలి’ అని జవాబిచ్చాడు. రఫీ ఎన్నో గుప్త దానాలు చేసేవాడు. తన ఇంటికి కూసంత దూరంలో ఒక విధవరాలు ఒంటరిగా జీవిస్తూ వుండేది. ఆమెకు ప్రతి నెలా రఫీ మనియార్డరు పంపే వాడు. రఫీ మరణించడంతో ఆమెకు డబ్బు రాలేదు. పోస్టాఫీసుకు వెళ్లి విచారించింది. ఆ డబ్బు తనకు పంపుతూ వుండేది మహమ్మద్‌ రఫీ అని పోస్టు మాస్టారు చెప్పినప్పుడు ఆమె అవాక్కయింది.


* రఫీకి మల్లయోధుడు మహమ్మద్‌ ఆలీ అంటే చాలా అభిమానం. 1979లో రఫీ అమెరికాలోని 14 నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. విషయం తెలిసిన ఒక అభిమాని మహమ్మద్‌ ఆలితో రఫీకి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘రఫీ నువ్వు నాకు ఒక పంచ్‌ ఇవ్వు... నేను నిన్ను ఆలింగనం చేసుకుంటాను’ అంటే రఫీ ఎంత ఆనందించాడో మాటల్లో చెప్పలేం.

                             
 
* ఒకసారి కె.ఎల్‌. సైగల్‌ పాట కచేరీలో కరెంటు పోయింది. పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ‘మైకు లేనిదే నేను పాడలేను’ అని తన అశక్తతను వెల్లడించారు. వెంటనే రఫీ కల్పించుకొని కరెంటు వచ్చేదాకా నేను మైకు లేకుండా పాడతాను. సావధానంగా వుండండి అని కార్యక్రమాన్ని కొనసాగించాడు.

* ఒకసారి ఢిల్లీలో జరిగిన రఫీ సంగీత కచేరీకి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ హాజరయ్యారు. రఫీ పాడిన ‘చాహుంగ మై తుఝే సాంఝ్‌ సవేరే’ అనే దోస్తీ చిత్రంలో పాట పాడుతుంటే నెహ్రూ కళ్లు చెమర్చాయి. ప్రధాని రఫీని విందుకు పిలిచారు. తనకు ఇష్టమైన పదార్ధాలు చూపించి ఆరగించమంటే, ‘మన్నించండి మహోదయా, మీకు ఇష్టమైన పదార్ధాలు నాకు కూడా తినాలనే వుంది. కానీ వాటి వలన రేపు పాల్గొనాల్సిన రికార్డింగులో గొంతు నాకు సహకరించదు’ అన్నారు. వృత్తిమీద వున్న గౌరవానికి నెహ్రూ రఫీ భుజం తట్టి మెచ్చుకున్నారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.