సినీ గీతాలకు సితార్‌ సొబగులు!
ఆయన తీగలు సవరిస్తే చాలు స్వరాలు ప్రవహిస్తాయి. మీటితే చాలు... కోటి భావాలు పలుకుతాయి. ఒకటా రెండా... 25 వేల తెలుగు, తెలుగేతర పాటలకు సితార్‌ సొబగులు అద్దిన ఘనత ఆయనది. అటు శాస్త్రీయ సంగీతంలోనూ అందెవేసిన చేయే. ఆయనే హిందుస్తానీ సంగీత ప్రపంచంలో తెలుగు బావుటా ఎగరేసిన పండిట్‌ జనార్దన్‌ మిట్టా. ఆయన అరవయ్యేళ్ళ వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వృత్తిగత షష్టిపూర్తి’ వేడుకలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చొరవతో ఏర్పాటు చేసిన ‘సంగమం’ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నేపథ్యంలో సొంతంగా నేర్చుకోవడంతో మొదలుపెట్టి పండిట్‌ రవిశంకర్‌ శిష్యరికం దాకా... స్వాతంత్య్రానికి పూర్వం ఉండిన దక్కన్‌ రేడియోలో బాల కళాకారుడిగా పాల్గొనడం నుంచి జీవిత సాఫల్య పురస్కారం దాకా ఆయన కళా ప్రస్థానం వివరాలివి...ఆసక్తి, సాధనలే పెట్టుబడిగా...
అత్తగారింటికి వెళ్తూ అక్క వదిలేసిన సితార్‌ మీద బాల జనార్దన్‌ దృష్టి పడింది. ఎవరి శిక్షణా లేకుండానే ఆసక్తి కొద్దీ సరిగమలతో మొదలుపెట్టారు. అందుకు ఆయన తండ్రి, ప్రముఖ న్యాయవాది మిట్టా లక్ష్మీ నరసయ్య కళాపోషణే కారణం. హైదరాబాద్‌కు ఏ హిందుస్తానీ కళాకారులు వచ్చినా వీళ్ళ ఇంటికొచ్చి కచేరీ చేయవలసిందే. నిత్యం ఆ సంగీతం, ఆ కళాకారుల మధ్య గడిపిన జనార్దన్‌ వారి ప్రభావంతో, స్వయంకృషితో సితార్‌పై పట్టు సాధించారు. హైదరాబాద్‌ లోని అప్పటి దక్కన్‌ రేడియోలో బాల కళాకారుడిగా కచేరీలు చేశారు. 1952లో ఆలిండియా రేడియో హైదరాబాద్‌ కేంద్రంలో సితార్‌ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఇంజినీరింగ్‌ చదవడం కన్నా సంగీతాన్ని సాధించడం గొప్ప విషయమని కళల విలువ తెలిసిన లక్ష్మీ నరసయ్య జనార్దన్‌ బంగారు భవిష్యత్తుకు బాట వేశారు. 1955లో ఒకసారి ఆలిండియా రేడియోలో తన కచేరీ విన్న పండిత రవిశంకర్‌ దృష్టిలో పడ్డ జనార్దన్‌ ఆయన వద్ద శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఇందుకోసం ఢిల్లీ, వారణాసి వెళ్ళొస్తుండేవారు. మరొకవైపు ఇంజినీరింగ్‌ వదిలేసి సంగీతంలో డిగ్రీ, సోషియాలజీలో పీజీ, మ్యూజికాలజీలో డాక్టరేట్‌ పట్టాలను అందుకున్నారు.

ఆహ్వానించిన సినీ ప్రపంచం
సినీ ప్రపంచం జనార్దన్‌ మిట్టా ప్రతిభను గుర్తించి రెండు చేతులతో ఆహ్వానించింది. 1958లో జూన్‌ 6న హైదరాబాద్‌ సారథి స్టూడియోలో మాస్టర్‌ వేణు తెలుగులో ఇచ్చిన మొదటి అవకాశంతో ప్రారంభించి అనేక తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ చిత్ర సంగీత దర్శకులందరితో ప్రధాన సితార్‌ వాద్యకారులుగా పని చేశారు. దక్షిణాది చిత్రసీమకు మద్రాసు కేంద్రంగా ఉండడంతో 1959 జనవరి 20న చెన్నై వచ్చి స్థిరపడ్డారు. అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ, సినీ గీతాలల్‌ సితార్‌ మెరుపులు మెరిపించారు. మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శంకర్‌ గిరి తీసిన, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బాల నటిగా నటించిన ఇంగ్లీషు చిత్రం ‘ఎపిసెల్‌’లో కూడా జనార్దన్‌ సితార్‌ సొబగులను అద్దారు. కన్నడ సినీ దర్శకులు లక్ష్మీ నారాయణ తీసిన లఘు చిత్రం ‘బ్లిస్‌’కు సంగీతాన్ని అందించారు. మాటలు లేని ఈ చిత్రానికి సితార్‌తో పలు భావాలను పలికించారు. ఈ చిత్రం శాన్‌ ఫ్రాన్సిస్కో పురస్కారాన్ని అందుకోవడం విశేషం. సినీ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడిగా, ఆ సంఘం ట్రస్ట్‌కు కన్వీనర్‌గా మూడేసి సంవత్సరాలు సేవలందించారు.

శాస్త్రీయంలో కూడా రాణింపు
మరొకవైపు శాస్త్రీయ సంగీతానికి మెరుగులు దిద్దుకున్నారు. గాయకి, తంత్రకారి శైలులు రెండింటిపై పట్టు సాధించిన అరుదైన కళాకారుడిగా పేరుపొందారు. ప్రపంచమంతా పర్యటించి హిందూస్తానీ కచేరీలు చేశారు. వి. రాఘవన్, టీఎన్‌ కృష్ణన్, ఎం. చంద్రశేఖరన్, టీవీ గోపాలకృష్ణన్, ఎమ్మెస్‌ గోపాలకృష్ణన్, కన్యాకుమారి, రవికిరణ్‌ వంటి కర్ణాటక సంగీత దిగ్గజాలతో జుగల్బందీలు చేశారు. 1971లో ఐక్యరాజ్యసమితిలో కచేరి చేశారు. బాలమురళీకృష్ణ ప్రోత్సాహంతో తిరువయ్యారు త్యాగరాజ ఆరాధనలో కచేరి చేసి హిందూస్తానీ వాయిద్యంపై కర్ణాటక రాగాలను పలికించిన మొదటి కళాకారుడిగా ఖ్యాతి పొందారు.

కళాపోషణలో
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు జనార్దన్‌. ప్రముఖ వ్యాపారవేత్త వూరా లక్ష్మీ నరసింహారావుతో కలిసి ‘విశ్వ కళా సంగమ’ ప్రారంభించారు. 2000 నుంచి ఏటా ‘స్వామి హరిదాస్‌ సంగీత్‌ సమ్మేళన్‌’ పేరిట హిందూస్తానీ చెన్నైలో కచేరీలు ఎర్పాటు చేస్తున్నారు. కర్ణాటక, హిందూస్తానీలలో నిపుణులైనవారికి పురస్కారాలను అందజేస్తున్నారు. ఔత్సాహికుల కళా ప్రదర్శనకు వేదికను కల్పిస్తున్నారు.

సితార్‌ ప్రముఖంగా వినిపించే కొన్ని పాటలు...
‘మనసున మనసై’ (డాక్టర్‌ చక్రవర్తి), ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ (ఏకవీర), ‘అన్నయ్య సన్నిధి’ (బంగారు గాజులు), లవకుశ, గుండమ్మ కథ, చదువుకున్న అమ్మాయిలు, పాండవ వనవాసం, ఎన్టీఆర్‌ నటించిన దేవత పాటలు, ‘చెలియ చెలియ’ (హారిస్‌ జయరాజ్‌), ‘అదిరేటి డ్రస్సు మీరేస్తే’ (భారతీయుడు, ఏ ఆర్‌ రెహమాన్‌), ‘గురు’ హిందీ చిత్ర గీతాలు, ఎస్పీ బాలూ పాడిన మొదటి పాట (శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న), ఆయనకి మంచి పేరు తెచ్చిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’... ఇలా అనేక పాటలకు సితార్‌ సొబగులద్దారు జనార్దన్‌. పాడుతా తీయగాకు మూడుసార్లు ముఖ్య అతిథిగా వచ్చారు. సింగీతం శ్రీనివాసరావు అజరామరంగా తీసిన ‘పుష్పక విమానం’లో, ఉషా కిరణ్‌ మూవీస్‌ ‘మయూరి’ చిత్రం బీజీమ్‌లో, పాటలలో, ఎమ్మెస్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాలల ‘రామాయణం’లో జనార్దన్‌ మిట్టా సితార్‌ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన సంగీత దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘అగ్నిసంస్కారం’, బి. నరసింగరావు తీసిన ‘రంగుల కల’ ఉన్నాయి. మొత్తం మీద ఆయన సితార సొబగులు అందుకున్న సినీగీతాలు 25 వేలకు పైగా ఉండడం విశేషం. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.


-మాధురి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.