పాటల తోటలో ‘ఓ గులాబి’!
ఒకసారి ‘మంగళ’ అనే ఓ ప్రముఖ కన్నడ వారపత్రిక ముఖచిత్రంగా ఒక కుచ్చు టోపీ బొమ్మ వేసి ‘ఈ టోపీ వాలా ఇంటర్వ్యూ వచ్చేవారమే’ అంటూ శీర్షిక రాసింది. కన్నడిగులకు వెంటనే తెలిసిపోయింది ఆ వ్యక్తి ఎవరోననే విషయం. అతడే, చంక నిండా పది పన్నెండు పుస్తకాల దొంతరలు, జేబునిండా రకరకాల రంగుల పెన్నులు, భుజం మీద శాలువా, చిరునవ్వు పెదాలతో ప్రసన్నంగా కనిపిస్తూ నిగర్విగా అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆ సంగీత స్రష్ట, బహుభాషా కోవిదుడు, మంచి రచయిత, జోతిష్య, సంఖ్యా శాస్త్ర నిపుణుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు, పేరులో ఉన్నంత భయంకరుడు కాని ప్రతివాది భయంకర శ్రీనివాసుడు. ఈ సంగీత కోవిదుణ్ణి ఎవరైనా కలవాలంటే మద్రాసు లోని వుడ్‌ ల్యాండ్స్‌ డ్రైవ్‌ ఇన్‌ హోటల్‌లో ఉదయం పూట వచ్చేవారు. అక్కడ శ్రీనివాస్‌ కు ఓ ప్రత్యేక టేబుల్‌ ఉండేది. ఎవరైనా వచ్చి ఆయన్ను కలిస్తే, నవ్వుతూ పలకరించి కాఫీకి ఆర్డర్‌ ఇచ్చేవారు. హైదరాబాదు వస్తే ఆయన అడ్డా మినర్వా కాఫీ హౌస్‌. ‘సంగీతం లేనిదే మనిషి జీవితంలో చలనమూ, సంచలనమూ లేదు. మనిషి ప్రతి కదలికలోనూ, మాటలోనూ లయబద్ధమైన స్వరబద్ధమైన సంగీతం వుంది’ అనేది శ్రీనివాస్‌ అభిప్రాయం. చిత్రసీమలో ఎవరి గురించీ చెడు మాట్లాడని సద్గుణ శీలుడు. లతా మంగేష్కర్, సంగీత దర్శకులు రవి, జయదేవ్‌లు అభిమానించే అరుదైన దక్షిణాది నేపథ్య గాయకుడుడాయన. ఏప్రిల్‌ 14 పి.బి శ్రీనివాస్‌ వర్ధంతి సందర్భంగా ఆయనను గురించి కొన్ని విశేషాలు.


నేపథ్యం...
పి.బి. శ్రీనివాస్‌ పూర్తిపేరు ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు. పుట్టింది 1930 సెప్టెంబరు 22న కాకినాడకు సమీపంలోని గొల్లప్రోలు గ్రామంలో. శేషగిరియమ్మ, ఫణీంద్రస్వామి తల్లిదండ్రులు. తండ్రి కోఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రారుగా పనిచేసేవారు. తల్లిది మంచి గాత్రం. ఆవిడ జానపదులు, సినిమా పాటలు పాడుతూ వుంటే శ్రీనివాస్‌ గళం కలుపుతూ వుండేవారు. శ్రీనివాస్‌కు చిన్నతనం నుంచి రేడియో వినడం అలవాటు. అందులో వినవచ్చే మహమ్మద్‌ రఫీ పాటలంటే అతనికి ప్రాణం. పన్నెండేళ్ళ వయసులో అతని మేనమామ శ్రీనివాస్‌ చేత ఒక నాటకంలో పాటలు పాడించారు. అలా సంగీతం మీద శ్రీనివాస్‌ ఆపేక్ష పెంచుకున్నారు. సంగీతం మీద ఆసక్తివున్నా అతని తండ్రి శాస్త్రీయ సంగీతం నేర్పించలేదు. కాకినాడలో పట్టభద్రుడవటమే కాకుండా, హిందీ విశారద పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యారు శ్రీనివాస్‌. తండ్రికి శ్రీనివాస్‌ను ప్రభుత్వ ఉద్యోగంలో నియమింపజేయాలనే ఆసక్తి వుండేది. కానీ శ్రీనివాస్‌ మద్రాసు వెళ్లి సినిమాల్లో పాటలు పాడుతానన్నారు. అప్పుడు తండ్రి అతణ్ణి ఒక జ్యోతిష్కుడి వద్దకు తీసుకెళ్ళి చూపిస్తే, గాయకుడిగా యితడు రాణించలేడని చెప్పాడు. దాంతో శ్రీనివాస్‌కు పట్టుదల పెరిగింది. ఆ జ్యోతిష్కుని జ్యోతిషం తప్పని రుజువు చేయాలనుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ పట్టుదల గ్రహించి 1951లో మద్రాసుకు తీసుకొనివెళ్లి తన బంధువైన ప్రముఖ వైణిక విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రికి అప్పజెప్పాడు. శంకరశాస్త్రి అప్పట్లో జెమినీ స్టూడియోలో ఉంటూ సాలూరు రాజేశ్వరరావు వద్ద సహాయకుడిగా పనిచేసేవారు. శంకరశాస్త్రి శ్రీనివాస్‌ను ఎస్‌.ఎస్‌. వాసన్‌కు పరిచయం చేశారు. వాసన్‌ ఎదుట శ్రీనివాస్‌ ‘దీదార్‌’ సినిమాలో మహమ్మద్‌ రఫీ పాడిన ‘హుయే హమ్‌ జిన్‌ కే లియే బర్బాద్‌’ పాటను పాడి వినిపించారు. వాసన్‌కు శ్రీనివాస్‌ పాడే తీరు నచ్చింది. జెమిని పతాకం మీద ఆర్‌.కె. నారాయణ్‌ నవల ఆధారంగా నిర్మించిన హిందీ చిత్రం ‘మిస్టర్‌ సంపత్‌’ (1952)లో శ్రీనివాస్‌ను నేపథ్యగాయకుడిగా వాసన్‌ పరిచయం చేశారు. ఆ చిత్రానికి ఈమని శంకరశాస్త్రి, కల్లా బాలకృష్ణ సంగీతం సమకూర్చగా పి.బి. శ్రీనివాస్‌ అందులో మూడు పాటలు పాడారు. తరవాత సౌండ్‌ రికార్డిస్ట్‌ జీవా సాయంతో దక్షిణ భారత చిత్రసీమలోకి ప్రవేశించారు. 1954లో రత్తిహళ్లి నాగేంద్రరావు మూడు భాషల్లో ఒకేసారి ‘జాదకం’ (తమిళం), ‘జాతక ఫలం’ (తెలుగు), ‘జాతకఫల’ (కన్నడం) పేర్లతో సినిమా నిర్మించాడు. అందులో సంగీత దర్శకుడు గోవర్ధనం శ్రీనివాస్‌ చేత రెండు పాటలు పాడించారు. ‘ఏలా దిగులేలా, ఈ కాలము మారునులే, మరువకే బేలా దిగులేలా’ అనే నేపథ్య గీతం తెలుగులో శ్రీనివాస్‌ పాడిన తొలిపాట. 1955లో ‘పుత్రధర్మ’ అనే మళయాళ సినిమాలో ‘మమలకల్‌ కప్పురత్తు’ అనే పాటను తొలిసారి పాడారు. నేటికీ ఆ పాట మళయాళుల ఇళ్ళలో వినిపిస్తూనే వుంటుంది.


నేపథ్య గాయకునిగా తెలుగు చిత్రాల్లో ...
శాస్త్రీయ సంగీతం గురుముఖంగా నేర్చుకోకుండా నేపథ్యగాయకునిగా రాణించిన వారిలో పి.బి. శ్రీనివాస్‌ పేరును ముందుగా చెప్పుకోవాలి. ‘భలేరాముడు’ సినిమాలో పాడిన ‘భయమేలా ఓ మనసా భగవంతుని లీల’ అనే పాటతో శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. పాటకు బాణీ కట్టిన సంగీత దర్శకుని అంచనాలకు మించి పాడడం శ్రీనివాస్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తమిళంలో ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ పీబీ తోనే ఎక్కువ పాటలు పాడించారు. తెలుగులో సాలూరు రాజేశ్వరరావుకి కూడా బేస్‌ వాయిస్‌లో పాడే శ్రీనివాస్‌ గాత్రమంటే చాలా ఇష్టం. 1960లో ‘భీష్మ’ చిత్రం కోసం ‘మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా’ అనే పాటను సాళ్వుడు, అంబ పాత్రల కోసం సుశీలతో కలిసి ఆలపించారు. కల్యాణి రాగంలో మట్లు కట్టిన ఈ పాట వినేందుకు యెంత హాయిగా వుంటుందో పాడేందుకు చాలా కష్టం. ఇలాంటి పాటలు పాడేందుకు పీబీనే సంగీత దర్శకులు ఎక్కువగా వాడుకునేవారు. అదే సంవత్సరం విడుదలైన ‘శాంతినివాసం’ చిత్రంలో నాగయ్య కోసం ‘శ్రీరఘురాం జయరఘురాం సీతా మనోభిరాం’ అనే పాటను ఘంటసాల సంగీత సారధ్యంలో అద్భుతంగా పాడారు. ‘శ్రీరామ చంద్రః’ అనే శ్లోకంతోబాటు హంసధ్వని రాగంలో పాట వినిపిస్తుంది. అలాగే ‘రంగులరాట్నం’ సినిమాలో రాజేశ్వరరావు అతి క్లిష్టమైన పటదీప్‌ రాగంలో స్వరపరచిన ‘మనసు మనసు కలిసేవేళా మౌనమేలనే ఓ చెలియా’ పాటను సుశీలతో కలిసి భావయుక్తంగా పాడారు శ్రీనివాస్‌. భక్తశబరి చిత్రంలో పిబి ఆలపించిన ‘ఏమి రామకథ శబరీ శబరీ, ఏదీ మరియొకసారి’ పెండ్యాల స్వరపరచిన గీతాల్లో ఒక రససుధ. అయితే ఆయన కొన్ని సరదాగా వుండే హాస్య గీతాలు కూడా ఆలపించారు. ‘కులగోత్రాలు’ సినిమాలో ‘రావే రావే బాలా హలో మై డియర్‌ లీలా’ (జమునారాణితో), ‘చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్వినచాలే’ (సుశీలతో), ‘దేవాంతకుడు’ సినిమాలో ‘గోగోగోగో గొంగూరా జైజైజైజై జైఆంధ్ర’ పాటలు ఈ కోవలోనివే. ఇక గుత్తా రామినీడు 1966లో ‘భక్తపోతన’ సినిమా నిర్మించారు. అందులో భోగినీ దండకం, భాగవత పద్యాలు శ్రీనివాస్‌ చేత పాడించారు. పీబీ ఎంత గొప్పగా పాడినా నాగయ్యగారి ‘భక్తపోతన’ సినిమా ముందు గుమ్మడి నటించిన సినిమా తేలిపోవడంతో పీబీ పాడిన పాటలు, పద్యాలు మరుగున పడ్డాయి. 1977లో బాపు నిర్మించిన ‘స్నేహం’, 1978లో నిర్మించిన ‘గోరంతదీపం’ సినిమాల్లో మహదేవన్‌ పీబీ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ఇవి కాకుండా ‘లేతమనసులు’ సినిమాలో విశ్వనాథన్‌ పీబీ చేతనే పాటలు పాడించారు. హీరో ఎన్టీఆర్‌ అయినా ‘ఆడబ్రతుకు’ సినిమాలో ‘బుజ్జిబుజ్జి పాపాయి’, ‘తనువుకెన్ని గాయాలైనా’ వంటి అద్భుతమైన పాటలు పాడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తెలుగులో పాడిన పాటలు కోకొల్లలు. తెలుగులో పీబీ ఎన్నో ప్రైవేట్‌ రికార్డుల కోసం పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా వున్నవి భక్తిపరమైనవే. కృష్ణశాస్త్రి రాసిన ‘పడవ నడపవోయ్‌’, ‘ఇదేకదా తొలిరేయి’, ‘ఉదయ సమీర సాంధ్య లాస్యము’, ‘ప్రణయసీమ పయనమౌదమా’, ‘రాదటే చెలి రాధికా’ వంటి లలితగీతాలు బహుళ జనాదరణ పొందాయి.


భాగేశ్రీతో ఘంటసాలను మైమరపిస్తూ..
ఒకే పాటను ఇద్దరు పాడితే సారూప్యం కోసం వెదకుతారు సంగీతాభిమానులు. ఎవరు బాగా పాడారనే విషయం మీద గొప్ప చర్చే జరుగుతుంది. అలాంటి సంఘటనలు అమరగాయకులు ఘంటసాలకు, పి.బి. శ్రీనివాస్‌కు ఎదురయ్యాయి. హిందీలో కిషోర్‌ కుమార్‌ నిర్మించిన ‘దూర్‌ గగన్‌ కి ఛావోం మే’ (1964) కథను ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్‌ అటు తమిళం, ఇటు తెలుగు లో ‘రాము’ (1966) పేరుతో సినిమాగా నిర్మించారు. తమిళ చిత్రానికి ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సంగీత దర్శకుడు. ఆయన సహాయకుడు ఆర్‌. గోవర్ధనం తెలుగు సినిమాకు సంగీతం కూర్చారు. ముఖ్యంగా కణ్ణదాసన్‌ రాసిన ‘నిలవే ఎన్నిడం నెరుంగాదే నీ నినైక్కుం ఇడత్తిల్‌ నాన్‌ ఇల్లై’ అనే పాటను విశ్వనాథన్‌ హిందూస్తానీ రాగం భాగేశ్రీలో స్వరపరచి హిట్‌ చేశారు. ఎంతో ఆర్ద్రతతో ఆ పాటను విషాదభరితంగా ఆలపించింది పి.బి. శ్రీనివాస్‌... అభినయించింది జెమిని గణేశన్‌. అయితే తెలుగు వర్షన్‌కి హీరో రామారావు కావడంతో ఈ పాటను ఘంటసాల పాడితే బాగుంటుందని సంగీత దర్శకుడు గోవర్ధనం భావించాడు. భాగేశ్రీ రాగంలో ఘంటసాల స్వీయ సంగీతంలో ఎన్నో పాటలకు జీవం పోసివున్నారు. ఘంటసాల ఈ పాట పాడాల్సి వచ్చినప్పుడు మాతృక గీతాన్ని విని, పి.బి. శ్రీనివాస్‌ పాడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘రామారావు గారికి కాబట్టి మీరే పాడాల’ని గోవర్ధనం పట్టుబట్టడంతో ‘తప్పనిసరై పాడుతున్నా’ అంటూ ఘంటసాల పాడడం జరిగింది.


తమిళ గాయకుడిగా ...
నరసూ స్టూడియోస్‌ 1957 లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘భలేఅమ్మాయిలు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. అందులో పిబి చేత ‘నాణెమైన సరుకుందీ లాహిరీ’, ‘చీటికి మాటికి చీటీ కట్టి వేధించే వా నాడు’ వంటి పాటలు పాడించారు. అదే సినిమాని ‘అడుత్త వీట్టు పెణ్‌’ (1960) పేరుతో అంజలీ పిక్చర్‌ వారు పునర్నిర్మించారు. అందులో కూడా పిబి ఆలపించిన ‘మాలయ్యిల్‌ మలర్‌ సొలయ్యిల్‌’, ‘కణ్ణాలే పేసి పేసి’, ‘వాడత్తా పుష్పమే వనిత్తా మణియే’ పాటలు సూపర్‌ హిట్లయ్యాయి. సంగీత దర్శకుడు రామనాథన్‌ పీబీని బాగా ప్రోత్సహించారు. జెమినీ గణేశన్‌కు శ్రీనివాస్‌ చేతనే సంగీత దర్శకులు ఎక్కువ పాటలు పాడించారు. తమిళంలో బలే పాండియన్, నెంజిల్‌ ఒరు ఆలయం (మనసే మందిరం), శుమైతాంగి, కాదలిక్క నేరమిల్లై (ప్రేమించి చూడు), పోలీస్‌ కారన్‌ మగళ్‌ (కానిస్టేబుల్‌ కూతురు), పాదకాణిక్కై, మణప్పందల్‌ (ఇంటికి దీపం ఇల్లాలే), వీర తిరుమగన్‌ సినిమాలకు శ్రీనివాస్‌ పాడిన పాటలు అద్భుతాలు సృష్టించాయి. పావమన్నిపులో జెమిని గణేశన్‌ కోసం విశ్వనాథన్‌ స్వరపరచిన ‘కాలంగళిల్‌ ఆవళ్‌ వసందం’ తమిళులకు యెంతో ఇష్టమైన పాట. శుమైతాంగిలో ‘మణిదన్‌ ఎన్బవన్‌ దైవమాఘళ్నా’ అంటూ పిబి పాడిన నిరాశా నిస్పృహలకు సంకేతమైన పాట కూడా తమిళులకు యెంతో ఇష్టం. ఇలా చెప్పుకుంటూపోతే రాయడానికి స్థలం చాలదు.


కన్నడ గాయకుడిగా ...
కన్నడ కంఠీరవ రాజకుమార్‌ తన సినిమాల్లో పాటల్ని తనే పాడుకునేవారు. జి.కె. వెంకటేష్‌కు పీబీ అంటే చాలా ఇష్టం. ఆయన ‘ఒహిలేశ్వర’ (1956) అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు పి.బి. శ్రీనివాస్‌కు పాడే అవకాశం ఇద్దామని ప్రతిపాదిస్తే పెద్దమనసుతో రాజకుమార్‌ ‘సరే’ అన్నారు. పీబీ ఆలపించిన ‘ఈ దేహదింద దూరనాడే ఏకే ఆత్మనే’ అనే భక్తి గీతం రాజకుమార్‌కు బాగా నచ్చింది. అది మొదలుకొని రాజకుమార్‌ సినిమాలకు 1974 వరకు శ్రీనివాసే పాడారు. ‘భక్త కనకదాస’ చిత్రంలో ఆలపించిన ‘బాగిలనున్‌ తెరెదుసే వెయను’ కీర్తన అంటే రాజకుమార్‌కు చాలా ఇష్టం. 74లో ఒక పాట రికార్డింగుకు శ్రీనివాస్‌ రాలేకపోయారు. ఆ పాటను రాజకుమారే పాడుకున్నారు. అప్పటినుంచి రాజకుమార్‌ అభిమానులు ఆయన గొంతునే అభిమానించడం మొదలవడంతో రాజకుమారే తన పాటలు పాడుకుంటూ వచ్చారు. రాజకుమార్‌ సమకాలికులు కళ్యాణ కుమార్, ఉదయ కుమార్‌లకు, ఆ తరవాతి తరంలో వచ్చిన గంగాధర్, శ్రీనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్‌ వంటి హీరోలకు కూడా కూడా శ్రీనివాసే పాటలు పాడారు. ఒకానొక సందర్భంలో రాజకుమార్‌ ‘నేను శరీరమైతే శ్రీనివాస్‌ నా శారీరం’ అని కీర్తించారు. ఆ ప్రియోక్తిని శ్రీనివాస్‌ తనకు పద్మ పురస్కారంతో సమానమని చెప్పుకున్నారు. కన్నడ చిత్రసీమకు అద్భుత సంగీతం సమకూర్చిన టి.జి. లింగప్ప, జి.కె. వెంకటేష్, విజయభాస్కర్, రాజన్‌ నాగేంద్ర, ఎం. రంగారావు శ్రీనివాస్‌ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ‘నాంది’ సినిమాలో ‘హోడొందు హాడువే నే కేళు మగువే’, ‘బెళ్లిమోడ’ చిత్రంలో ‘ఒడయితు ఒలవిన కన్నడి’, ‘ఉయ్యలె’ చిత్రం లో ‘నగుత హాడలె అళుత హాడలే’ పాటలు కన్నడలో హిట్టయిన వాటిలో కొన్ని మాత్రమే. విజయనగర వీరపుత్ర, గంధరగుడి, మన మెచ్చిద హడుగి, తాయి కరుళు సినిమాల్లో శ్రీనివాస్‌ అద్భుతాలు సృష్టించారు. విజయభాస్కర్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘గజ్జెపూజ’ చిత్రంలో ‘పంచమ వేద ప్రేమద నాద ప్రణయద సరిగమ’ పాట, ‘సౌభాగ్య’ చిత్రంలో వెంకటేష్‌ సంగీత సారధ్యంలో ఆలపించిన ‘రవివర్మన కుంచద కలే’ (తెలుగులో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో-రావణుడే రాముడైతే) పాటలు పిబి సంగీత చరిత్రలో కీర్తి కిరీటాలుగా నిలిచాయి.


శ్రీనివాస్‌ గురించి మరిన్ని విశేషాలు
నీల్‌ ఆర్మ్‌ స్టా్రంగ్‌ చంద్రునిపై తొలిసారి కాలుమోపిన సందర్భంగా శ్రీనివాస్‌ ‘మాన్‌ టు మూన్‌’, ‘మూన్‌ టు గాడ్‌’ అనే పాటలు రాసి, రికార్డు చేసి, ఆ ఆల్బంను అలనాటి అమెరికన్‌ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌కు అపోలో వ్యోమగాములకు పంపారు. చంద్రుని నేపథ్యంలో వచ్చే పాటలు పాడడంలో శ్రీనివాస్‌ ఘనుడని తమిళులు భావిస్తారు.
గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం తనకు బాగా ఇష్టమైన పాటగా కన్నెవయసు (1973) చిత్రంలో పాడిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ను ఉదహరిస్తూ వుంటారు. ఆ పాటను 1968లోనే పి.బి. శ్రీనివాస్‌ ‘గాంధీనగర’ అనే చిత్రంలో సత్యం సంగీత దర్శకత్వంలో పాడారు. బాలుకి శ్రీనివాస్‌ అంటే చాలా గౌరవం. ఒకసారి సంగీత దర్శకుడు ఎల్‌. వైద్యనాదన్‌ పీబీ పాడాల్సిన పాటను బాలును పాడమంటే, కాదని శ్రీనివాస్‌ చేతే పాడించారు. పైగా శ్రీనివాస్‌ ఆ పాటను పాడి రికార్డు చేసేదాకా అక్కడే వుండి పాట పాడాక ఆయనకు పాదాభివందనం చేసి మరీ వెళ్ళారు.

1956లో హిందీలో వచ్చిన ‘నయీ దిల్లీ’ సినిమాను తమిళంలో ‘కూడి వాగ్దాళ్‌ కోడి నణ్నై’గా నిర్మించారు. మాతృకలో కిషోర్‌ కుమార్‌ పాడిన ‘నఖరే వాలి దేఖనే మే దేఖ్‌ లో హై’ అనే పాటలో యూడిలింగ్‌ వస్తుంది. తమిళంలో కూడా యూడిలింగ్‌ రావాలని నిర్మాత పట్టుబట్టడంతో ఆ పాటను ఆలపించిన శ్రీనివాస్‌కు బ్రహ్మప్రళయమైంది. వారంరోజులు కుస్తీ పట్టి ఆ పాటను ఆలపించారు. యూడిలింగ్‌ అలవాటు లేని తమిళ ప్రేక్షకులు వాటిని నక్క కూతలు, కుక్క కూతలు అంటూ విమర్శించారు. కాదలిక్క నేరమిల్లై సినిమా వచ్చేసరికి యూడిలింగ్‌ ప్రక్రియ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

1958లో బి.ఎ. సుబ్బారావు నిర్మించిన చెంచులక్ష్మి చిత్రంలో బాగా హిట్టయిన పాట ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ను రాజేశ్వరరావు మొదట శ్రీనివాస్, సుశీల చేత పాడించారు. కారణాంతరాల వలన అదే పాటను ఘంటసాల చేత పాడించి సినిమాలో వాడుకున్నారు. అలాగే 1969లో ఎ.వి.ఎం. వారు నిర్మించిన మూగనోము సినిమాలో ‘ఊరుమారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా’ అంటూ నేపథ్యగీతంగా వచ్చే పాటను సంగీత దర్శకుడు గోవర్ధనం పీబీ చేత మొదట పాడించారు. ఆ పాటకూడా కారణాంతరాల వలన మరుగున పడింది. ఘంటసాల చేత మరలా పాడించి చిత్రీకరణలో వాడుకున్నారు. అయితే రెండు పాటలూ రికార్డులుగా వెలువడ్డాయి.
బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆకలిరాజ్యం’ సినిమాలో జానకి ఆలపించిన ‘తూ హై రాజా మై హూ రాణి’ పాటను రాసింది శ్రీనివాసే. పీబీ హిందీలో చాలా గజళ్ళు పాడారు. ‘మై భి లడ్కి హూ’ సినిమాలో చిత్రగుప్త సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్‌తో కలిసి పాడిన ‘చందా సే హోగా హో ప్యారా’ చాలా పాపులర్‌ అయ్యింది. ఇదే పాటను తెలుగులో ‘చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు’గా అనుకరించారు. తెలుగులో రాజనందిని (1958) సినిమాలో రాజా, సుశీల పాడిన ‘అందాలు చిందు సీమలో’ పాటను హిందీలో ‘నైనా జో నైన్‌ సే మిలే’ అంటూ శ్రీనివాస్‌ పాడడం విశేషం.

పి.బి. శ్రీనివాస్‌ బహుభాషా కోవిదుడు. ఆయనకు ఎనిమిది భాషల మీద మంచి పట్టుంది. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. సంగీత దర్శకత్వం నెరపారు. వేలకొద్దీ కవితలు రాశారు. ఆకాశవాణికి పాటలు పాడారు. మూడు నాలుగు కన్నడ సినిమాల్లో వేషాలు కూడా వేశారు. తమిళనాడు ప్రభుత్వం శ్రీనివాస్‌కు ‘కలైమామణి’ పురస్కారం అందించింది. కర్నాటక ప్రభుత్వం ‘రాజోత్సవ’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 14 ఏప్రిల్‌ 2013 న కాలం చేసిన ఆ మహానుభావుని గౌరవించని వారు ఎటొచ్చీ మన తెలుగువారే! అదే మన దౌర్భాగ్యం!!

శ్రీనివాస్‌ అలరించిన కొన్ని పాటలు ...
* శ్రీరఘురాం జయరఘురాం సీతా మనోభిరాం (శాంతినివాసం)
* చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా (కానిస్టేబుల్‌ కూతురు)
* వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినది (కానిస్టేబుల్‌ కూతురు)
* బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి (ఆడబ్రతుకు)
* తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు యేలాగైనా (ఆడబ్రతుకు)
* తలచినదే జరిగినదా దైవం ఎందులకో (మనసే మందిరం)
* అందాల ఓ చిలకా అందుకో నా లేఖా (లేతమనసులు)
* ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు (సత్తెకాలపు సత్తెయ్య)
* నీవున్నది నాలోనే నేనున్నది నీలోనే (మొనగాళ్ళకు మొనగాడు)
* నింగిలోన నీటిలోన నీవే వున్నావులే (వివాహబంధం)
* వెన్నెలరేయి యెంతో చలి చలి (ప్రేమించి చూడు)
* పాలవంక సీమలో పసిడి చిలక కులికింది (పాలమనసులు)
* మనసులోని కోరిక తెలుసు ప్రేమమాలిక (భీష్మ)
* నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన (గుడిగంటలు)
* ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని (తేనెమనసులు)
* ఆనంద మోహన ఖగరాజ వాహనా (కార్తవరాయని కథ)

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.