సోనూ నిగమ్‌.. స్వరం మధురం

యన ‘‘కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది.. విన్నావంటే సరదాగా ఉంటుంది’’ అంటే వినకుండా ఉండలేం. ‘‘హ్యాపీగా జాలీగా ఎంజాయ్‌ చెయ్‌రా’’.. అని చెప్తే చెయ్యకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన గళం నుంచి జాలువారిన సుస్వరం అలాంటిది మరి. ఇంతకీ ఎవరాయన? అంటే కచ్చితంగా సోనూ నిగమ్‌ అని చెప్పాల్సిందే. నాటి ‘జీన్స్‌’ చిత్రంలోని ‘‘రావే నా చెలియ’’.. పాట నుంచి నేటి ‘లవర్‌’ చిత్రంలోని ‘‘వాట్‌ ఏ అమ్మాయి’’.. పాట వరకు తన ప్రస్థానం గమనిస్తే పైన చెప్పుకున్న మాటలన్నీ అక్షర సత్యాలని అర్థమైపోతుంది. ‘‘ముద్దులెట్టి చెరిపెయ్‌’’ లాంటి ఫాస్ట్‌ బీటయినా.. ‘‘ఆకాశం సాక్షిగా’’ లాంటి మెలోడి గీతమైనా.. ఆయన గళం నుంచి బయటకొస్తే థియేటర్లో ప్రేక్షకులు మైమరచి ఉర్రూతలూగాల్సిందే. సోనూ హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్‌ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, ఉర్దూ, తెలుగు.. అనేక భాషల్లో వేలాది గీతాలు ఆలపించిన ప్రసిద్ధ గాయకుడు. సినిమాల్లోని పాటలే కాకుండా పాప్‌ ఆల్బమ్స్‌తోనూ సంగీత ప్రియులను అలరిస్తుంటారు. అంతేకాదు మైకేల్‌ జాక్సన్‌ మృతికి నివాళిగా ఓ పాటను పాడి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అన్ని భాషల్లోనూ రాణించగలిగే ఈయన తెలుగులో కొన్ని పాటలే పాడినా అవన్నీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన ఆణిముత్యాలే అని చెప్పొచ్చు. ‘లాహిరి లాహిరి లాహిరి’లోని ‘‘నేస్తమా ఓ ప్రియ నేస్తమా’’,‘మొదటి సినిమా’లోని ‘‘ఉరిమే మేఘం’’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లోని ‘‘ప్రియతమా’’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’లోని ‘‘అంతా సిద్ధంగా ఉన్నది’’,‘వరుడు’లోని ‘‘బహుశా ఓ చంచలా’’,‘శకుని’లోని ‘‘మనసులో మధువే’’,‘గోపాల గోపాల’లోని ‘‘నీదే నీదే’’... వంటి అత్యంత ప్రజాదరణ పొందిన గీతాలన్నీ ఆయన స్వరం నుంచి జాలువారినవే. తన స్వర ప్రస్థానంలో ఒక జాతీయ,రెండు ఫిల్మ్‌ ఫేర్‌(హిందీ),మూడు ఫిల్మ్‌ ఫేర్‌(సౌత్‌ ) అవార్డులు అందుకున్నాడు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, వ్యాఖ్యాతగా ప్రస్థానం సాగిస్తున్న సోనూ నిగమ్‌ పుట్టిన రోజు నేడు. ఆయన 1973 జులై 30న హర్యాణాలోని ఆగమ్‌ కుమార్‌ నిగమ్, శోభా నిగమ్‌ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రితోపాటు వేదికలపై పాటలు పాడటం ప్రారంభించిన సోనూ 18 ఏళ్లకు బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.