గళం వైవిధ్యం... గానం మాధురీ భరితం...
‘బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా? బొమ్మలా నువ్వే నను పుట్టించావనుకోనా? నమ్ముకుంటుందో...నవ్వుకుంటుందో..ఏమి అంటుందో నీ భావన... నీదీ నీదే... ప్రశ్న నీదే...నీదే నీదే... బదులూ నీదే’


 చిత్రం: గోపాలా...గోపాలా - గానం: సోను నిగమ్‌

2015లో విడుదలైన ఈ పాట సోను నిగమ్‌కి మంచిపేరు తెచ్చింది. సోనూ నిగమ్‌ నేపథ్య గాయకుడు, కంపోజర్, లైవ్‌ పెర్ఫార్మర్, హోస్ట్, యాక్టర్‌. వినోదసీమలో ఇలా వివిధ పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకుపోతున్న యువకళాకారుడు. ఆయన గళంలో సున్నితత్వం శ్రోతల్ని విశేషంగా అలరిస్తుంది. ఆర్దత్ర గుండె కింద తడిని హృద్యంగా స్పృశిస్తుంది.* ఎన్ని భాషలో...ఎన్ని పాటలో?
సోను నిగమ్‌ బహు భాషాగాయకుడు. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, అస్సామీ, ఒడియా, నేపాలీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, తుళు, మళయాళంలాంటి భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం పాటలు పాడిన గాయకుడు. ఇంగ్లీష్‌ భాషలో ఆయన పాడిన పాటలు జనహృదయాలకు చేరువయ్యాయి. ఇండియన్‌ పాప్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌లను తీసుకువచ్చారు. అంతేనా? కొన్ని సినిమాల్లో నటించారు. భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సోనూ నిగమ్‌ను మోడరన్‌ రఫీగా ఆయన అభిమానులు అభివర్ణిస్తారు. భారతీయ వినోద పరిశ్రమలో వైవిధ్యమున్న గాయకుడిగా సోను నిగమ్‌ ప్రత్యేకత సాధించుకున్నారు.* వ్యక్తిగతం
హర్యానా ఫరీదాబాద్‌లో 1973 జులై 30న సోను నిగమ్‌ జన్మించారు. ఆయన తండ్రి ఆగం కుమార్‌ నిగమ్. తల్లి శోభా నిగమ్. సోను నిగమ్‌ సోదరి తీసా నిగమ్‌ కూడా ప్రొఫెషనల్‌ సింగర్‌. నాలుగో సంవత్సరంలోనే సోను నిగమ్‌ మ్యూజిక్‌ కెరీర్‌ని ప్రారంభించారు. తండ్రి ఆగం నిగమ్‌ పెళ్లిళ్లు, పార్టీల్లో పాటలు పాడేవారు. ఆయన తోడుగా వెళ్లిన సోను నిగమ్‌ ఓసారి... తండ్రి మహ్మద్‌ రఫీ పాట ‘క్యా హువా...తేరా వాదా’ పాట పాడుతుండగా సోను నిగమ్‌ కూడా గళ సహకారం అందించారు. అప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో చిన్నవయసు నుంచే పాటలు పాడడం మొదలెట్టారు. 18 సంవత్సరాల వయసప్పుడు బాలీవుడ్‌లో ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు కుటుంబంతో సహా ముంబాయ్‌కి తరలి వెళ్లడం జరిగింది. ఉస్తాద్‌ గులాం ముస్తఫా ఖాన్‌ దగ్గర సోను నిగమ్‌ హిందుస్తానీ సంగీతంలో సాధన చేసారు. 2002 ఫిబ్రవరి 15న మధురిమా మిశ్రాతో సోను నిగమ్‌ వివాహం జరిగింది. ఈ దంపతులకు నివాన్‌ అనే కుమారుడు ఉన్నాడు.* ఎన్ని భావోద్వేగాలో?
సోను నిగమ్‌ గొంతులో పలకని భావం లేదు. అన్నిరకాల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా పాడడంలో ఆయన సృజన కనిపిస్తుంది. రొమాంటిక్, రాక్, డివోషనల్, శాడ్, గజల్స్‌తో పాటు దేశ భక్తి గీతాలు కూడా ఆయన లెక్కకు మిక్కిలి పాడారు. హిందీ, కన్నడ, ఒడియా భాషల్లో పాప్‌ ఆల్బమ్స్‌ని విడుదల చేశారు. హిందు, ఇస్లామిక్‌ డివోషనల్‌ గీతాలను కూడా ఆయన ఆలపించారు. బుద్దిస్ట్‌ ఆల్బమ్స్‌ కూడా విడుదల చేసారు.* విదేశాల్లో సంగీత కచేరీలు
విదేశాల్లో అనేక సంగీత కచేరీలు చేసిన ఘనత కూడా సోను నిగమ్‌ సొంతం. నార్త్‌ అమెరికా, యూరప్, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో 2007 మే, జూన్‌ నెలల్లో పర్యటించి సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సింప్లీ సోను పేరిట కెనడా, జెర్మనీ ల్లో పర్యటించి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. సోను నిగమ్‌ పాడిన తొలి పాట ‘జనం’ సినిమా కోసం పాడారు. అయితే...ఆ పాట అధికారికంగా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత సోను నిగమ్‌ ఓ పక్క సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఆకాశవాణి ప్రకటనల్లో గళమిచ్చారు. 1993లో సోను నిగమ్‌ మొదటి పాట ‘ఆజా మేరీ జాన్‌’ చిత్రం కోసం పడింది...ఓ ఆస్మాన్‌ వాలే విడుదలైనది. ‘ఆజా మేరీ జాన్‌’ చిత్రం కోసం టైటిల్‌ ట్రాక్‌ కూడా సోను ఆలపించారు. అయితే... ఆ టైటిల్‌ ట్రాక్‌ ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం డబ్‌ చేయగా విడుదలయింది. 1992లో సోను నిగమ్‌ రఫీకి ‘యాదోమే’ మొదటి ఆల్బమ్‌ విడుదల చేసారు. ఈ ఆల్బమ్‌ తరువాత సోనుకి మరిన్ని సినీ అవకాశాలు వచ్చాయి. ముఖాబ్లా, మెహర్బాన్, షబ్నమ్, ఆగ్, చీతా, ఖుద్దార్, హల్‌ చల్, స్టెంట్‌ మాన్, రాంజానే, గద్దర్, అజమాయిష్, బర్సాత్, నాజయాజ్, పోలీస్‌ లాకప్, జీత్, ఖిలాడీ యోమ్‌ కా ఖిలాడీ, హిమ్మత్‌ వాలా, సజినీ, పాపా కాహేఠే హై ఇలా బాలీవుడ్‌ లో అనేక చిత్రాలకు నేపథ్య గానం చేసారు. ‘కల్‌ హోం నహో’, ‘అగ్నిపధ్‌’ చిత్రాల్లో సోను నిగమ్‌ పాడిన పాటలు జన రంజకమయ్యాయి.

* మైఖేల్‌ జాక్సన్‌కి నివాళిగా
పాప్‌ సింగర్‌ మైఖేల్‌ జాక్సన్‌ చనిపోయిన తరువాత నివాళిగా ‘ది బీట్‌ ఆఫ్‌ అవర్‌ హార్ట్ú’Ã ఆల్బంని సోను రూపొందించారు.* బుల్లితెరపై కూడా
బుల్లితెరపై కూడా సోను తన ముద్ర వేశారు. సరిగామప...సంగీత కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. కిసీనే కిత్నా హై దం, ఇండియన్‌ ఐడల్‌ కొన్ని సీజన్స్‌కి ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు.* అవార్డులు

సోను నిగమ్‌ గాయకుడిగా అనేక అవార్డులు అందుకున్నారు. హర్యానా గౌరవ్‌ సన్మాన్‌ పురస్కారాన్ని హర్యానా ప్రభుత్వం నుంచి 2017లో అందుకున్నారు. ఆయే జహ ఆస్మాన్‌ ఇండియన్‌ పాప్‌ సాంగ్‌కి గాను 2016లో మిర్చి మ్యూజిక్‌ అవార్డు అందుకున్నారు. లయన్స్‌ గోల్డ్‌ అవార్డు, ఎంటీవి వీడియో మ్యూజిక్‌ అవార్డు, జీ సినిమా అవార్డు, బిగ్‌ స్టార్‌ ఎంటర్టైన్మెంట్‌ అవార్డు, గ్లోబల్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ అవార్డు, ఫిలిం ఫేర్‌ అవార్డులు, ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డు, బాలీవుడ్‌ మ్యూజిక్‌ అండ్‌ ఫ్యాషన్‌ అవార్డు...ఇలా అనేక అవార్డులను అందుకున్నారు.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.