
బాలీవుడ్ సినీగాయకుడు ఉదిత్ నారాయణ్ ఎన్నో బాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పాటలు పాడారు. ఆయన చిత్రసీమకు వచ్చి నలభైయేళ్లు పూర్తి చేసుకున్నాడు. ‘‘భారతీయ చలనచిత్ర, సంగీత పరిశ్రమలతో పాటు ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నా’’ అంటున్నారు గాయకుడు ఉదిత్ నారాయణ్. చిత్రసీమలోకి ప్రవేశించి నలభైయేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ..‘‘1980లో నేను గాయకుడిగా సినీ ‘అనీస్-బీస్’ చిత్రంతో నా ప్రస్థానం ప్రారంభించాను. దేవుడి దయవల్ల ప్రజల ఆశీర్వాదంతో నేటికి నలభైయేళ్లు ఈ సంగీత చిత్రసీమలో పూర్తి చేసుకున్నాను. అందరి గుర్తింపు వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. నా ఏకైక లక్ష్యం భారతీయ చలనచిత్రసీమ-సంగీత పరిశ్రమలో చోటు సంపాదించుకోవడమే. అంతేకాదు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నా..’’అంటూ చెప్పారు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభంలో ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలోని అన్నీ ప్రదేశాలను ఒకటిగా చేసింది. ఈ కొత్త ప్రయాణం ప్రారంభించడానికి నాన్నకు ఇదే సరైన సమయం అని నేను నమ్ముతున్నా. నాన్నకు అనేకమంది అభిమానులు ఉన్నారు. వారంతా ఈ ఛానెలోని సంగీతాన్ని, మ్యూజిక్ వీడియోల్ని కచ్చితంగా ఇష్టపడతారు ..’’అని చెప్పారు. తెలుగులో బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ‘‘ఎకిమీడా ... ఎకిమీడా నా జత విడనని వరమిడవా తగుదోడా నా కడ కొంగున ముడిపడవా సుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకుని.. ’’అంటూసాగే పాటను ఆలపించారు. ప్రభుదేవ - నగ్మా నటించిన ‘ప్రేమికుడు’ చిత్రంలో ‘‘..అందమైన ప్రేమరాణి చేయితగలితే..’’, చిరంజీవి నటించిన ‘చూడాలని వుంది’ చిత్రంలో ‘‘రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా ..పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ..ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల ..గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల..’’ అంటూ సాగే పాటలు తెలుగువాళ్లకు సుపరిచితమే.