‘కొలవెరి’ మ్యూజికల్‌ మ్యాజిక్‌ కొనసాగుతుంది..
ప్రతిభకి వయసుతో సంబంధం ఉండదు.

సంగీతానికి భాష అవసరం లేదు.

‘కొలవెరి’ అనే ఒకే ఒక్కపాటతో ఈ రెండిటిని నిజం చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌.


 అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వస్తున్న రోజులవి (2011). ‘గంగ్నమ్‌ స్టైల్‌’ అంటూ వచ్చిన విదేశీ పాట యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఎక్కడ విన్నా, ఎవరు కన్నా.. దీని గురించే చర్చ. అయితే అది అంతర్జాతీయ గుర్తింపు పొందిన పాప్‌ సింగర్, డ్యాన్సర్‌ చేసిన వీడియో కావడంతో అంతగా ప్రాచుర్యం పొందింది. అప్పటి వరకు భారత్‌ తరఫున ఇలాంటి వీడియో రాలేదనే చెప్పొచ్చు. తన సంగీత ప్రతిభతో 21 ఏళ్ల వయసులో తొలి సినిమాతోనే దానికి సమాధానమిచ్చాడు అనిరుధ్‌. ‘కొలవెరి’ అంటూ ప్రపంచమంతా ఈ పాట గురించి మాట్లాడుకునేలా చేశాడు. పాట విన్న వాళ్లు మళ్లీ మళ్లీ విన్నారు తప్ప ఈ పాటను వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తమిళ అగ్ర నటుడు ధనుష్, శ్రుతి హాసన్‌ నాయకనాయికలుగా వచ్చిన ప్రేమకథ ‘3’ చిత్రం కోసం అనిరుధ్‌ స్వరపరిచిన పాటిది. అప్పట్లో ఇదొక సంచలనం. దీంతో కోలీవుడ్‌లోని అగ్ర కథానాయకులందరికీ సంగీతం అందించేందుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘జెర్సీ’, ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రాలకు సంగీతం అందించి అలరించాడు. ఇలా మొదటి అవకాశంతోనే భాషతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన అనిరుధ్‌ పుట్టిన (16 అక్టోబరు 1990) రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సంగీత సారథ్యంలో వచ్చి శ్రోతలను మైమరపించిన కొన్ని పాటలు మీ కోసం...


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.