ఘంటసాల ప్రియశిష్యుడు

‘జననీ జన్మ భూమిశ్చ...’, ‘అది ఒకటో నెంబరు బస్సు...’, ‘వీణ నాది.. తీగ నాది... తీగ చాటు రాగముంది’, ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ, ఎంతవరకీ బంధమూ’... ఈ పాటల్ని తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. రాబోయే తరాలు కూడా పాడుకొనే పాటలు ఇవి. వీటి సృష్టికర్త ఎవరో కాదు... ఘంటసాల ప్రియశిష్యుడైన జె.వి.రాఘవులు. ఇప్పుడు ఆపాత మధురాలు అనిపించే అనేక పాటల వెనక ఉన్న సంగీత దర్శకుడు జేవీ రాఘవులు. ఘంటసాల, కె.వి.మహదేవన్, ఎం.ఎస్‌.విశ్వనాథన్, రామానాయుడు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ తదితరుల చిత్రాలకి సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పనిచేసిన వ్యక్తి. గాయకుడిగా వంద సినిమాలకి, సంగీత దర్శకుడిగా 172 సినిమాలకి పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో పుట్టిన జేవీ రాఘవులు విజయవాడ రేడియో స్టేషన్‌లో లలిత గీతాలు పాడి ప్రాచుర్యం పొందారు. అక్కడే ఆయన ఘంటసాల దృష్టిలో పడ్డారు. మద్రాసు రావాలనుకొంటే నా దగ్గరికి వచ్చేయమంటూ ఆయనకి అడ్రస్‌ ఇచ్చి వెళ్లారట ఘంటసాల. దాంతో మద్రాస్‌ వెళ్లిన జేవీ రాఘవులు ఘంటసాలకి ప్రియశిష్యుడిగా మారిపోయారు. కచేరీల్లో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆర్కెస్టాత్రో ప్రాక్టీస్‌ చేయించడం వంటి పనులన్నింటినీ రాఘవులుకే అప్పజెప్పేవారట ఘంటసాల. ‘లవకుశ’ పాటలు గుర్తుండిపోయేలా నిలవడంలో రాఘవులు పాత్ర ఎంతో ఉందని ఘంటసాల పలు వేదికలపై మెచ్చుకొనేవారట. డి.రామానాయుడు నిర్మించిన ‘ద్రోహి’తో సంగీత దర్శకుడిగా మారిన జె.వి.రాఘవులు ఆ తర్వాత కూడా ఘంటసాల శిష్యుడిగానే కొనసాగారు. ‘జీవనతరంగాలు’, ‘బొబ్బిలిపులి’, ‘కటకటాల రుద్రయ్య’, ‘మొగుడు కావాలి’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ తదితర చిత్రాలకి సంగీతాన్ని అందించారు జేవీ రాఘవులు. ఆర్‌.నారాయణమూర్తి నటించిన ‘ఛలో అసెంబ్లీ’ వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. తన అక్క కూతురైన రమణమ్మని వివాహం చేసుకొన్న ఆయన జీవితకాలంలో సంపాదించుకొన్నదేమీ లేదు. జీవిత చరమాంకంలో ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మారాక ఆయనలో సందిగ్ధం మొదలైందని చెబుతారు. క్రమేణా ఆరోగ్యం సహకరించకపోవడంతో చిత్ర పరిశ్రమకి దూరమై, రాజమండ్రిలోని తన కుమారుడి ఇంట్లో గడిపారు. 82 యేళ్ల వయసులో 2013 జూన్‌ 7న తుదిశ్వాస విడిచారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.