స్వర మాంత్రికుడు

స్వ
రాల్ని సృష్టించడమే కాదు... అద్భుతంగా పాడతారు. పాడటమే కాదు... పాటకి సాహిత్యం సమకూర్చడంలోనూ ఆయనది అందెవేసిన చేయే. సంగీతం, గానం, రచన తెలిసిన అరుదైన సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. మరకతమణి... వేదనారాయణ.. ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌. అంతా మన కీరవాణే. 28 ఏళ్లుగా తెలుగు శ్రోతల్ని తన సుస్వరాలతో మైమరిపిస్తున్న కీరవాణి అసలు పేరు... కోడూరి మరకతమణి కీరవాణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఏ భాషలోకి వెళ్లినా తన పని తీరుతో విశిష్టతని చాటుకొన్న సంగీత దర్శకుడాయన. హిందీకి వెళితే ఆయన్ని ముద్దుగా ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌ అని పిలుచుకుంటారు. కన్నడకి వెళితే ఒకలా, తమిళంలో మరొకలా ఆయన శ్రోతలకి సుపరిచితం. ఒక సినిమా విజయంలో సంగీతం ఎంత కీలకపాత్ర పోషిస్తుందో ఆయన పనితీరే చెబుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన ఆయన 1990లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’, ‘భారతంలో అర్జునుడు’ తదితర చిత్రాలకి పనిచేశారు. తొలి ప్రయత్నంగా ‘కల్కి’ అనే చిత్రానికి స్వరాలు సమకూర్చారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. దాంతో సాంకేతికంగా ‘మనసు మమత’నే ఆయనకి తొలి చిత్రమైంది. 1991లో విడుదలైన ‘క్షణ క్షణం’తో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కథ ఎలాంటిదైనా దానికి తన సంగీతంతో కొత్త కళని తీసుకురావడంలో దిట్ట కీరవాణి. ‘అన్నమయ్య’ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారాయన. ‘రాజేశ్వరి కళ్యాణం’, ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్ళి సందడి’, ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’, ‘ఛత్రపతి’, ‘వెంగమాంబ’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకి ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాల్ని సొంతం చేసుకొన్నారు. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’, ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’ చిత్రాలకి ఉత్తమ నేపథ్య గాయకుడిగా పురస్కారాన్ని అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాగిరెడ్డి - చక్రపాణి జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారాయన. ఎనిమిది ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలతో పాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా అందుకొన్న ఘనకీర్తి ఆయనది. ‘బాహుబలి’ చిత్రాలతో ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. కీరవాణి ఇంటినిండా ప్రతిభావంతులే. ఆయన భార్య శ్రీవల్లి లైన్‌ ప్రొడ్యూసర్‌గా పలు చిత్రాలకి పనిచేశారు. తమ్ముడు కల్యాణి మాలిక్‌ సంగీత దర్శకుడు. తనయుడు కాలభైరవ గాయకుడిగా రాణిస్తున్నారు. జులై 4 కీరవాణి పుట్టినరోజుCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.