సరాగాల సంగీత రసధుని..శ్రీలేఖ

ఆమెకి అక్షరమాల అంతంత మాత్రం తెలుసు. కానీ, సంగీత సుస్వరాల సుమధుర పరిమళాల గురించి చాలా బాగా తెలుసు. ఎలాంటి గీతాన్నయినా అలరించే విధంగా సంగీత సృజనలో ఇమడ్చడం కూడా ఆమెకి సరిగమల్తో పెట్టిన విద్య. ఔను... ఆమె అక్షరాలా సరిగమల స్వర కోయిల. సరాగాల హేల. సన్నివేశానికి అనుగుణంగా రచయిత అక్షరాలూ అల్లితే... ఆ అక్షరాలకు వోణీ కట్టి, గీతాలకు బాణీ సమకూర్చి పదికాలాలు జనం నాలికలపై నిలిచే పాటల్ని సినీ కళామతల్లికి అర్చనా కుసుమాలుగా అందించిన సంగీత విద్వన్మణి. ఆమె మరెవరో కాదు... ఎం.ఎం.శ్రీలేఖ.

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, ప్రముఖ దర్శకులు రాజమౌళికి శ్రీ లేఖకి వరుసకు సోదరులవుతారు. పాటలు కంపోజ్‌ చేసేందుకు కీరవాణి కోసం ఇంటికి కారు రావడం చూసిన శ్రీలేఖ కూడా ఆ కారు రాక కోసం సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. బాల్యం నుంచి రాగాలతో సాన్నిహిత్యాన్ని, సాహిత్యంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తానూ కూడా కీరవాణిలాగ ప్రముఖ సంగీత దర్శకుడు కావాలనుకున్నారు. ఆ కలని నిజం చేసుకున్నారు. అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షక శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు.


ఆమె సంగీతం సమకూర్చిన పాటలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. మూవీ మొఘల్‌గా ప్రఖ్యాతి గాంచిన నిర్మాత డాక్టర్‌ రామానాయుడి సంస్థలో ఎదిగిన శ్రీలేఖ అనతి కాలంలోనే కొన్ని విజయవంతమైన చిత్రాలకు పనిచేసారు. కమర్షియల్‌ చిత్రాల్లోనూ మాధుర్యభరిత గీతాలకు ప్రాణం పోసిన కళాకారిణి శ్రీలేఖ. అంతేనా! మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీగా పేరు పొందిన టాలీవుడ్‌లో మహిళల శక్తి చాటుతున్నారు. ఈమె. ఇండస్ట్రీకొచ్చి 28 సంవత్సరాల అవుతోన్నా ఇప్పటికీ తన సత్తాతో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సెప్టెంబర్‌ 8న శ్రీలేఖ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర అంశాలు కొన్ని.

సరిగమల్లో ‘అఆ’లు

శ్రీలేఖ చదువు మొత్తం సినిమాల్లోనే సాగింది. చదువు అంటే కేవలం స్కూల్‌లో చదివేది కాదు, జ్ఞానం కలిగించే ఏదైనా చదువే అని అంటారు ఈవిడ. ఎల్‌కేజీలో ఉండగా ఎబిసిడీలు చెప్పలేదని టీచర్‌ స్కేలుతో కొడితే...ఆ స్కేలుతోటే తిరిగి ఆ టీచర్‌ని కొట్టేరట. ఈ విషయం తెలుసుకొన్న శ్రీలేఖ తండ్రి ఈవిడకు చదువబ్బదని భావించి ఓ సంగీతం మాస్టర్‌ దగ్గర జాయిన్‌ చేశారట. ఆ విధంగా తన వయస్సులో ఉండే తోటివారు పాఠశాలలకు వెళ్లి చదువుకునేటప్పుడు సంగీతంలో అఆలు నేర్చుకొన్నారు. అతి చిన్న వయస్సులోనే సంగీత దర్శకురాలిగా మారి ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేశారు.


‘కోకిలగా మారిన కాకి’ - ఎస్పీబాలు ప్రశంస

అప్పుడప్పుడే ఊహ తెలిసిన తరువాత ‘శంకరాభరణం’ సినిమాలో నటుడి సోమయాజులు పాత్ర పిల్లలకు సంగీతం నేర్పే సన్నివేశం చూసి ఆయనే నిజంగా పాటలు పాడారని శ్రీలేఖ అనుకొన్నారట. ఒకసారి వార్తా పత్రికలో ఎస్‌.పీ. బాలసుబ్రమణ్యం ఇంటర్వ్యూ వస్తే... ‘శంకరాభరణం’ సినిమాలో పాటలు పాడింది ఈయన అని బాలును చూపిస్తూ శ్రీలేఖ తండ్రి శ్రీలేఖకు చెప్పారట. ఆ సినిమాలో పాడింది బాలసుబ్రహ్మణ్యం అని తెలుసుకొన్న తరువాత ఆయన కలవాలనిపించింది శ్రీలేఖకు. ఈ విషయం చెప్పగా శ్రీలేఖ తండ్రి బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి తీసుకెళ్లారు. బాలసుబ్రమణ్యం పాడమని అడగగా... శ్రీలేఖ ‘శంఖరాభరణం’ సినిమాలోని ‘..శంకరాభరణమూ’ అని పాటను మొదలు పెడితే... ‘ఆపమ్మా’ అని శ్రీలేఖతో ఆ పాటను ఆపించి తన తండ్రితో ‘మీ అమ్మాయి గొంతు కాకి గొంతులా ఉంది’ అని అన్నారట’. ఈ మాటకు కోపం తెచ్చుకొన్న శ్రీలేఖ ఎలాగైనా సంగీతంలో దిట్ట అవ్వాలని గట్టి ప్రయత్నాలు చేశారట. అలా గట్టిగా సాధన చేసి ‘ఆయనకిద్దరు’ సినిమాలో బాలసుబ్రహ్మణ్యంతోనే ఓ డ్యూయెట్‌ సాంగ్‌ని పాడారు శ్రీలేఖ. మొదట ఈ పాటను పాడడానికి శ్రీలేఖ వెళితే ఆ సినిమా సంగీత దర్శకుడైన కోటీని పిలిచి శ్రీలేఖను ఎందుకు తీసుకొచ్చారని అన్నారట. కానీ శ్రీలేఖ స్వరంతో పాటను విన్న తరువాత కాకి కోకిల ఎప్పుడైందని ఆశ్చర్యపోవడం బాలసుబ్రమణ్యం వొంతు అయింది. ఇలా, మొండి తనంతో సంగీతాన్ని సాధన చేసి తానేంటో నిరూపించుకొన్నారు శ్రీలేఖ.

‘సౌందర్య లహరి’ దయ

తనకు సంగీతం రావడానికి కారణం అమ్మలనుగన్న అమ్మ అని చెబుతారు. అమ్మవారి ‘సౌందర్యలహరి’ పాడుతూ పూజించేవారు శ్రీలేఖ. దాంతో, అమ్మవారి కరుణ తనపై వచ్చి సంగీతంపై పట్టు వచ్చిందని చెబుతూ ఉంటారు. సంగీత దర్శకురాలిగా కొన్ని రాగాలని కంపోజ్‌ చేసి సోదరుడు కీరవాణికి చెబితే... ఆయన బాగుందనేవారట. రాగం బాగుంటే ఐస్‌ క్రీంలను కొనిపెట్టి ఎంతో ప్రోత్సహించారట కీరవాణి. ఆ తరువాత కీరవాణి వద్దే శిష్యరికం చేసి ఎన్నో విషయాలు నేర్చుకొన్నారు.తమిళ్‌ హీరో విజయ్‌ మొదటి సినిమాకి సంగీతం

ఇప్పుడు తమిళ్‌లో స్టార్‌ హీరోగా ఉన్న విజయ్‌ మొదటి సినిమాకి సంగీతం అందించింది శ్రీలేఖే. కానీ, మారుపేరుతో సంగీతాన్ని సమకూర్చారు. ఒకసారి విజయ్‌ ఇంటికి వెళ్లగా ఆయన తండ్రి చంద్రశేఖర్‌ శ్రీలేఖ గురించి ఆరా తీశారు. రాగాలు వినిపించమని అడగగా... ఏకంగా 20 రాగాలు వినిపించారు శ్రీలేఖ. ట్యూన్లు నచ్చడంతో విజయ్‌ మొదటి చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు శ్రీలేఖకు అప్పజెప్పారు. తెలుగులో దాసరి నారాయణరావు ‘నాన్నగారు’ చిత్రానికి ఆఫర్‌ ఇచ్చారు. శ్రీలేఖ కంపోజ్‌ చేసిన ‘తాజ్‌ మహల్‌’ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.


80సినిమాలకు సంగీతం

శ్రీలేఖ పేరు చెప్పగానే ‘మంచుకొండల్లోని చంద్రమా’, ‘చెప్పనా... చెప్పనా... చిన్న మాట’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా’, ‘నీకోసం నీకోసం’ వంటి ఎన్నో హిట్టు పాటలు గుర్తుకొస్తాయి. సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ 80 సినిమాలకు వర్క్‌ చేశారు. ‘తాజ్‌ మహల్‌’ సినిమా తన కెరీర్‌లో మైలు రాయని చెబుతారు. అయితే, సంగీత ప్రపంచంలో ఇంకా ఎదో సాధించాలన్న తపన తనని వెంటాడుతూ ఉంటుందని అంటూ ఉంటారు. అదే సమయంలో ‘ప్రేమించు’ సినిమాలో కంటేనే అమ్మ అని ఆంటీ ఎలా? అనే పాటకు అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి ప్రముఖుల మన్ననలు పొందారు. ఆ పాట విన్నవారి కళ్ళల్లో నీరు తిరక్క మానదు. ఆ పాటకు ఉత్తమ గీతరచయితగా డాక్టర్‌ సి.నారాయణరెడ్డికి పురస్కారం లభించింది.


నాలుగు వేల పాటలకు గానం

సంగీత దర్శకురాలిగానే కాకుండా ఎన్నో పాటలకు తన స్వరాన్ని అందించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు శ్రీలేఖ. శ్రీలేఖ నాలుగు వేలకు పైగా పాడారు. ఏ పాట పాడడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదని అన్నారు.క్రికెట్‌ దేవుడికి నచ్చిన శ్రీలేఖ పాట

కేరళా బ్లాస్టర్స్‌కు థీమ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేయమని వచ్చిన అనుకోని ఆఫర్‌ను కూడా శ్రీలేఖ తన ప్రతిభను చాటుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగించుకొన్నారని చెప్పాలి. ఎందుకంటే, దాదాపు ముప్పై మంది థీమ్‌ సాంగ్స్‌ని కంపోజ్‌ చేయగా... శ్రీలేఖ థీమ్‌ సచ్చిన్‌ టెండూల్కర్‌కు నచ్చడం అంటే మామూలు విషయం కాదు. సచినే స్వయంగా శ్రీలేఖ కంపోజ్‌ చేసిన థీమ్‌ సాంగ్‌ని విడుదల చేసి శ్రీలేఖపై ప్రశంసల వర్షం కురిపించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.