అమూల్యరత్నం నౌషాద్‌ ఆలి
ఉత్తర ప్రదేశ్‌ రాజధాని నగరం లక్నోలో (25 December ) 1919 సంవత్సర పవిత్ర క్రిస్టమస్‌ పర్వదినాన ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్‌ ఆలి జన్మించారు. ఆయన తండ్రి వహీద్‌ ఆలి కోర్టు గుమాస్తా (మున్షి)గా పనిచేసేవారు. లక్నోకి పాతిక మైళ్ల దూరంలో బారాబంకి అనే పట్టణం వుంది. అక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున సంగీత మేళా జరిగేది. ఆ మేళాలో దేశంలో ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసులు, ఖవ్వాలి పాటగాళ్లు పాల్గొని అద్భుత ప్రదర్శనలు ఇస్తుండేవారు. తన తండ్రి అనుమతించకున్నా చిన్ననాటి నుంచే నౌషాద్‌ ఆ సంగీత మేళాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. లక్నోలో ప్రశిద్ధ హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్‌ గుర్బత్‌ ఆలి, ఉస్తాద్‌ యూసఫ్‌ ఆలి, ఉస్తాద్‌ బబ్బన్‌ సాహెబ్‌ల వద్ద నౌషాద్‌ హిందుస్తానీ సంగీతంలోని మెళకువలు క్షుణ్ణంగా నేర్చుకున్నారు. చిన్నతనంలోనే బాలానంద నాటక సంస్థలో చేరి వారి కార్యక్రమాలకు సంగీతం అందించేవారు. హార్మోనియం వంటి వాద్య పరికరాలకు మరమ్మత్తులు చేయడం కూడా నేర్చుకున్నారు. ఆరోజుల్లో రాయల్‌ థియేటర్లో నడిచే మూకీ సినిమాలను క్రమం తప్పకుండా చూడడం నౌషాద్‌ నిత్యకృత్యాల్లో భాగమైపోయింది. మూకీ సినిమా విడుదలకు ముందు తబలా, హార్మోనియం, వయోలిన్, సితార్‌ వాద్యకారులు ఆ సినిమా చూస్తూ ఎక్కడెక్కడ సంగీతం వినిపించాలో పుస్తకాల్లో నోట్సు రాసుకొని సినిమా ప్రదర్శన రోజు తెరముందు ఆసీనులై సంగీతం వినిపించేవారు. ఆ ప్రక్రియను నౌషాద్‌ నిశితంగా గమనించేవారు. సంగీత దర్శకునిగా అవతరించడానికి, బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీత మూలాలు తెలుసుకోవడానికి ఈప్రక్రియ నౌషాద్‌కు ఎంతగానో ఉపకరించింది. ఆ సమయంలోనే లద్దన్‌ ఖాన్‌ సంగీత దర్శకత్వం ఎలా చేయాలో నౌషాద్‌కు నేర్పారు. లక్నో నాటక సమాజంతో పంజాబ్, రాజస్థాన్‌ గుజరాత్‌ పర్యటనలు జరిపినప్పుడు ఆయా ప్రదేశాల జానపద సంగీత రీతులను నౌషాద్‌ కూలంకషంగా ఆపోసన పట్టారు. 1931లో టాకీయుగం ప్రారంభం నాటికి నౌషాద్‌ వయసు పదమూడేళ్లే. ఆరోజుల్లో సంప్రదాయ ఇస్లాం నిబంధనల ప్రకారం సంగీత పఠనం నిషిద్ధం. ఇస్లాం మత సంప్రదాయాలకు విలువనిచ్చే నౌషాద్‌ తండ్రి, తన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటే సంగీతం మీద ఆసక్తిని వదలుకోమని నౌషాద్‌ను ఆజ్ఞాపించారు. అందుకు విభేదించిన నౌషాద్‌ పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఇల్లువదలి నౌషాద్‌ బొంబాయి వెళ్లిపోయారు.


బొంబాయి ప్లాట్‌ ఫారంల మీద ...
లక్నోలో తనకు తెలిసిన ఒక మిత్రుని సాయంతో తొలుత కొలాబాలో ఉంటూ అనతికాలంలోనే బ్రాడ్వేకు దగ్గరలోని దాదర్‌ రైల్వే ప్లాట్‌ ఫారం మీదకు మకాం మార్చారు నౌషాద్‌. మెల్లగా ఉస్తాద్‌ ఝండే ఖాన్‌ అనే సంగీత దర్శకుని వద్ద నలభై రూపాయల జీతానికి కుదిరారు. అతని బృందంలో నౌషాద్‌ పియానో వాయించేవారు. రాత్రి మకాం దాదర్‌ రైల్వే ప్లాట్‌ ఫారం మీదే. మరొక సంగీత దర్శకుడు ఉస్తాద్‌ ముస్తాక్‌ హుసేన్‌ వద్ద పియానో వాద్యకారునిగా చేరారు. దురదృష్ట వశాత్తు అప్పుడు నిర్మాణంలో వున్న సినిమా ఆగిపోగా, ఆ కంపెనీ కూడా మూతపడింది. అప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఖేమ్‌ చంద్‌ ప్రకాష్‌ ‘కంచన్‌’ సినిమాకు పనిచేస్తూ నౌషాద్‌కు నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేసే షరతు మీద తన సహాయకునిగా వుండే అవకాశం కలిపించారు. నౌషాద్‌ జీవితం కూడా ఒక గాడిన పడింది. తనకు ఖేమ్‌ చంద్‌ ప్రకాష్‌ తొలిగురువు అని నౌషాద్‌ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.


కర్దార్‌ సంస్థలో సంగీత దర్శకునిగా ...
పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా నౌషాద్‌కు 1940లో అవకాశం వచ్చింది. మోహన్‌ దయారామ్‌ భావనాని నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పేరు ‘ప్రేమనగర్‌’. డి.ఎన్‌. మధోక్‌ మాటలు, పాటలు సమకూర్చిన ఈ చిత్రానికి నౌషాద్‌ సంగీతం సమకూర్చగా అందులో హుస్నాబాను, విమలకుమారి, రమానంద్, గుల్జార్‌ ముఖ్య తారాగణం. ఈ సినిమా కోసం గుజరాతీ జానపదరీతుల్లో సంగీతం అందించేందుకు నౌషాద్‌ చాలా అధ్యయనాలు చేశారు. హుస్నాబాను, రమానంద్, విమలకుమారిల చేతనే అన్ని పాటలూ పాడించారు. ‘మై కలీ బాగ్‌ కి తూ భవరా కాలా’ అంటూ హుస్నాబాను ఆలపించిన పాటలు ఆరోజుల్లో బాగా పాపులర్‌. తరువాత 1942లో నౌషాద్‌ ఎ.ఆర్‌.కర్దార్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలో చేరి ‘శారద’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంతోనే 13 ఏళ్ల సురయ్యాను గాయనిగా పరిచయం చేశారు. ‘మేరె దిల్‌ కో సజన్‌ సమఝా దో’ అనే పాటను ఆమె చేత తొలిసారి పాడించారు. అయితే కర్దార్‌ ఆ చిన్నారి సురయ్యా చేత హీరోయిన్‌ కి పాడించడానికి ముందు విముఖత చూపినా, నౌషాద్‌ ఆ పాటను రికార్డు చేసి వినిపించిన తరువాత అభినందించకుండా ఉండలేకపోయారు. అదే సంవత్సరం కర్దార్‌ ప్రొడక్షన్స్‌ వారే ‘నయీ దునియా’ సినిమా నిర్మిస్తే ఆ సినిమాకు కూడా నౌషాద్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో మన తెలుగునటుడు పైడి జైరాజ్‌ హీరోగా నటించగా శోభనా సామర్థ్‌ అతనికి జంటగా నటించింది. సురయ్యా ఆలపించిన ‘బూట్‌ కరూ మై పాలిష్‌ బాబూ’; రాజకుమారి, దుర్రాని ఆలపించిన ‘ఆజ్‌ మేరా మన్‌ డోలే సఖి రే’ పాటలు ఆ రోజుల్లో పెద్ద హిట్‌. తరువాతి సంవత్సరం షాహు మోదక్, మెహతాబ్‌ నటించిన ‘కానూన్‌’ సినిమాను అదే కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో నౌషాద్‌ మెహతాబ్‌కు సురయ్యా చేత పాడించారు. మెహతాబ్‌ మీద చిత్రీకరించిన ‘ఏక్‌ తుహో ఏక్‌ మై హూ అవుర్‌ నదీ కా కినారా హో’ అనే ఈ పాటలో ట్రంపెట్, పియానోల మీద పలికించిన వాద్యం ముప్పిరిగొలిపింది. నూర్‌ మహమ్మద్, మెహతాబ్‌లు జోడీగా అదే సంవత్సరం కర్దార్‌ ‘సంజోగ్‌’ సినిమా నిర్మించాడు. అందులో సురయ్యా ‘ఆ మోరే సావరే స్యా మోరా జియా లహరాయే’; ‘హో మోరి గాలి మోరే రాజా మోరి కసం ఆజా’; ‘కోయి చుట్కి సి మేరె దిల్‌ మే లియే జాయే’ వంటి మూడు సోలో పాటలు పాడి అలరించింది. 1944లో కర్దార్‌ నిర్మించిన ‘పెహలె ఆప్‌’, ఆ తరువాత నిర్మించిన ‘సన్యాసి’, ‘షాజహాన్‌’, ‘దర్ద్‌’ సినిమాలకు నౌషాద్‌ సంగీతం సమకూర్చారు. ‘దర్ద్‌’ సినిమాలో పెద్దగా స్టార్‌ నటీనటులు లేకున్నా అది గొప్ప మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. కర్దార్‌ సోదరుడు నుస్రత్‌ హీరోగా నటించగా, సురయ్యా గాయనిగానే కాకుండా ఇందులో రెండవ హీరోయిన్‌ పాత్ర పోషించింది. ఈ సినిమాతోనే ప్రముఖ ఉర్దూ రచయిత షకీల్‌ బదాయూని గేయరచయితగా పరిచయమై తరువాతి కాలంలో నౌషాద్‌ సంగీత దర్శకత్వంలో వందలకొద్దీ అద్భుతమైన పాటలు రాసి పేరు గడించారు. ముఖ్యంగా సురయ్యా దర్బారీ కానడ రాగంలో ఆలపించిన ‘బీచ్‌ భవర్‌ మే ఆన్‌ ఫసా హై’ వంటి అద్భుత పాటలతో సినిమా పెద్ద మ్యూజికల్‌ హిట్టయింది. ఉమాదేవితో సురయ్యా కలిసి ఆలపించిన ‘బేతాబ్‌ హై దిల్‌ దర్ద్‌ యే మోహబ్బత్‌ కే అసర్‌ సే’ అనే పాట అత్యుత్తమ ఇరవై హిందీ పాటల్లో ఒకటిగా నిలిచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఉమాదేవే తరువాతి కాలంలో ‘టున్‌ టున్‌’ పేరుతో కామెడీ నటిగా పేరుతెచ్చుకుంది. అలాగే శంషాద్‌ బేగమ్‌ ఆలపించిన ‘హమ్‌ దర్ద్‌ కా అఫసానా దునియా కో సునా దేంగే’, ‘ఏ అఫసానా నహీ జాలిమ్‌ మేరె దిల్‌ కి హకీకత్‌ హై’ పాటలు ఆమెకు ఎంతో పేరు గడించిపెట్టాయి. 1949లో కర్దార్‌ నిర్మించిన ‘దిల్లగి’లో సురయ్యా ఆలపించిన ‘చార్‌ దిన్‌ కి చాందిని థీ ఫిర్‌ అంధేరీ రాత్‌ హై’; ‘దునియా క్యా జానే మేరా ఫసానా’ మంచి హిట్లుగా నిలిచాయి. తరువాత కర్దార్‌ నిర్మించిన ‘దులారి’ (1949), ‘దాస్తాన్‌’ (1949), ‘జాదూ’, దీవానా’ సినిమాలకు నౌషాద్‌ సంగీతం అందించారు. ఆ తరువాత కర్దార్‌ సినిమాలకు గులామ్‌ మహమ్మద్, ఓ.పి.నయ్యర్‌ సంగీతం అందిస్తూ వచ్చారు. ఎం.సాదిక్‌ దర్శకత్వంలో కర్దార్‌ నిర్మించిన ‘రత్తన్‌’ (1944) సినిమా నౌషాద్‌ ఆలికి స్టార్డం సాధించిపెట్టింది. ఈ సినిమా పాటల రికార్డులు ఎంతగా అమ్ముడు పోయాయంటే ఆరోజుల్లో కర్దార్‌ కంపెనీకి మూడు లక్షల రూపాయలు కేవలం రాయల్టీగా గ్రామఫోను కంపెనీ అందజేసింది. ఈ సినిమాతోనే నౌషాద్‌ పారితోషికం పాతికవేలకు పెరిగింది. అయితే సంగీతానికి దూరంగా వుండే నౌషాద్‌ కుటుంబం లక్నోలో నౌషాద్‌ని దూరంగా ఉంచింది. నౌషాద్‌ పెళ్లిరోజు ‘రత్తన్‌’ సినిమాలో పాటలు పెళ్లి పందిరిలో స్వరనర్తన చేస్తూ ఆహూతులను ఆనందపరచాయి.నౌషాద్‌ స్వరప్రస్థానం...
1942 నుంచి అరవయ్యో దశకం దాకా నౌషాద్‌ హిందీ చిత్రరంగంలో ఒక గౌరవాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడిగా ఓ వెలుగు వెలిగారు. తన జీవిత ప్రస్థానంలో నౌషాద్‌ వంద సినిమాలకన్నా ఎక్కువగా సంగీతం అందించలేదు. కానీ ఆయన స్వరపరచి వెళ్లిన పాటలన్నీ అజరామరాలై నౌషాద్‌ కీర్తిని అంబరం దాటించాయి. పాతిక పైగా నౌషాద్‌ సంగీతం సమకూర్చిన సినిమాలు సిల్వర్‌ జూబిలీలు చేసుకున్నాయి. పది చిత్రాలకు పైగా గోల్డన్‌ జూబిలీలు, నాలుగు సినిమాలు డిమాండ్‌ జుబిలీలు చేసుకున్నాయి. ఈ గణాంకాలు చాలు నౌషాద్‌ సంగీత పటిమ ఎలాంటిదో తెలియజెప్పేందుకు! నౌషాద్‌కు బాగా నచ్చిన గేయ రచయితల్లో ప్రధమంగా చెప్పుకోవలసింది షకీల్‌ బదాయుని, మజ్రూహ్‌ సుల్తాన్‌ పురిలు. కొన్ని సినిమాలకు డి.ఎన్‌.మధోక్, ఖుమార్‌ బరబంక్వి, జియా సర్హది గేయరచయితలుగా నౌషాద్‌కు సహకరించారు. మహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘మదర్‌ ఇండియా’ చిత్రం భారత్‌ నుంచి ఆస్కార్‌ పోటీకి అర్హత సాధించిన తొలిచిత్రం అనే సంగతి మనకు తెలిసిందే. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు నౌషాద్‌ కావడం విశేషం. 2005లో తన 86 ఏళ్ల వయసులో నౌషాద్‌ ‘తాజ్‌ మహల్‌...ఎన్‌ ఎటర్నల్‌ లవ్‌ స్టోరీ’ అనే చిత్రానికి సంగీతం సమకూర్చడం ఆయన ప్రతిభా పాఠవానికి ఒక గీటురాయిగా చెప్పవచ్చు. ఈ సినిమా 18 నవంబరు 2005న విడుదల కాగా, ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ నౌషాద్‌ 5 మే 2006న తనువు చాలించారు. నౌషాద్‌కు ప్రియమైన శిష్యులలో గులామ్‌ మహమ్మద్, మాస్టర్‌ వేణు వుండడం కూడా గొప్ప విశేషం. నౌషాద్‌ జీవిత కథను గుర్తుచేస్తూ ఐదు సినిమాలు వచ్చాయి. ఆయన ఆత్మకథను మరాఠీ, గుజరాతి, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రచురించారు. అంతటి మేధావి అక్బర్‌ ఖాన్‌ నిర్మించిన ‘అక్బర్‌ ది గ్రేట్‌’ అనే టెలివిజన్‌ సీరియల్‌కు, సంజయ్‌ ఖాన్‌ నిర్మించిన ‘ది స్వోర్డ్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్‌’ అనే మరొక సీరియల్‌కు సంగీతం సమకూర్చారు. నౌషాద్‌ మంచి రచయిత కూడా. ‘ఆత్వాన్‌ సుర్‌’ పేరుతో నౌషాద్‌ రచించిన ఉర్దూ కవితలు పుస్తకంగా ప్రచురించారు. అలాగే కొన్ని గజళ్లను రాసి వాటికి సంగీత రూపకాన్ని సమకూర్చి వెలువరించిన పుస్తకాలు, కాంపాక్ట్‌ కేసట్లు విరివిగా అమ్ముడుపోయాయి. నౌషాద్‌ సంగీతంలో ఎక్కువగా హిందుస్తానీ క్లాసికల్‌ పోకడలు వుంటాయి. అలా వుండాలి అని గట్టిగా నమ్మే వ్యక్తి నౌషాద్‌. సంప్రదాయ వాద్యపరికరాలనే కాకుండా మాండలిన్, అకార్డియన్, క్లారినెట్‌ వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను నౌషాద్‌ అద్భుతంగా వాయించేవారు. ముఖ్యంగా 1946లో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘అన్మోల్‌ ఘడి’ గొప్ప మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ‘ఆవాజ్‌ దే కహా హై’, ‘జవాన్‌ హై మోహబ్బత్‌ హసీన్‌ హై జమానా’, ‘మేరె బచ్పన్‌ కే సాథీ ముఝే భూల్‌ న జానా’ పాటలు ఆరోజుల్లో శ్రోతలను ఉర్రూతలూగించాయి. మహమ్మద్‌ రఫీ ఎక్కువగా అభిమానించే ‘తేరా ఖిలౌనా టూటా’ పాట కూడా ఇందులోదే. ఇదే సినిమా తెలుగులో ‘మనసంతా నువ్వే’ (2001)గా వచ్చింది. 1955 నౌషాద్‌ సొంతంగా దిలీప్‌ కుమార్, నిమ్మి జంటగా ‘ఉరన్‌ ఖటోలా’ చిత్రాన్ని నిర్మించారు. అందులో ‘ఓ దూర్‌ కే ముసాఫిర్‌ హమ్‌ కో భీ సాత్‌ లే లే రే’ అనేది ఓ అద్భుతమైన పాట. ఆరోజుల్లో రికార్డింగ్‌కు పడిన కష్టాలను నౌషాద్‌ ఒకానొక సందర్భంలో వివరించారు. అప్పట్లో సౌండ్‌ ప్రూఫ్, ఎయిర్‌ కండిషన్‌ రికార్డింగ్‌ రూములు గానీ, మల్టీ ట్రాక్‌ రికార్డింగ్‌ వసతులుగానీ ఉండేవి కావు. అందుకోసం నౌషాద్‌ ఉద్యానవనాలను ఎంచుకునేవారు. అర్ధరాత్రి సమయాల్లో ఆ ఉద్యానవనాల్లో పాటలు రికార్డింగ్‌ చేసేవారు. ప్రతిధ్వని రావడంగానీ, అనవసర శబ్దాలు వినిపించడంగానీ ఆ ప్రదేశంలో ఉండేవి కావట. ముఖ్యంగా ‘అమర్‌’ వంటి చిత్రంలోని కొన్ని పాటలను నౌషాద్‌ 90 స్కేల్‌లో పాడించి వాటిని 70, లేక 60 స్కేలుకు కుదించేవారట. బైజుబావరాలో ‘దునియా కే రఖవాలే’ పాట అలాంటిదే. సౌండ్‌ మిక్సింగ్‌ అనే ప్రక్రియను హిందీ చిత్రసీమలో ప్రవేశపెట్టిన ఘనత నౌషాద్‌దే. ‘బైజు బావరా’, ‘ముఘల్‌-ఎ-ఆజం’ వంటి సినిమాల్లో అమీర్‌ ఖాన్, పులస్కర్, బడే గులాం ఆలి ఖాన్‌ వంటి నిష్ణాతుల స్వర రీతుల్ని స్పూర్తిగా తీసుకొని కొన్ని పాటలకు నౌషాద్‌ స్వరాలల్లారు. మహబూబ్‌ ఖాన్‌ చిత్రం ‘ఆన్‌’లో నౌషాద్‌ వంద వాద్యపరికరాలను వాడి సంగీతాన్ని సమకూర్చారు. ‘మొఘల్‌-ఎ-ఆజం’లో ‘జిందాబాద జిందాబాద్‌’ పాటకోసం వందమంది కొరస పాటగాళ్లను నియమించారు. అందులో ‘ప్యార్‌ కియా తో డర్నా క్యా’ పాటలో ఎకో అవసరం రావడంతో లతామంగేష్కర్‌ని బాత్‌ రూమ్‌లో నిలబెట్టి రికార్డింగ్‌ చేశారు. ‘గంగా జమునా’ చిత్రంలో పాటలకు భోజపురి సంగీత రీతుల్ని అనుసరించారు. అలాగే ‘మేరె మెహబూబ్‌’ సినిమా టైటిల్స్‌ కోసం కేవలం ఆరు వాద్యపరికరాలను మాత్రమే వాడి సంభ్రమపరచారు. 2004లో ‘ముఘల్‌-ఎ-ఆజం’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చినప్పుడు నౌషాద్‌ డాల్బి సిస్టంలో ఆ చిత్రానికి మ్యూజిక్‌ స్కోర్‌ అందించారు.మరిన్ని విశేషాలు...
నౌషాద్‌ స్వంతంగా ‘బాబుల్‌’ (1950), ‘ఉరన్‌ ఖటోలా’ (1955), ‘మాలిక్‌’ (1958) చిత్రాలు నిర్మించారు. ‘మాలిక్‌’ చిత్రానికి తన శిష్యుడు గులాం మహమ్మద్‌ చేత సంగీత దర్శకత్వం నిర్వహింపజేశారు. అలాగే ‘పాల్కి’, ‘తేరి పాయల్‌ మేరే గీత్‌’ సినిమాలకు కథను సమకూర్చారు. ‘బైజుబావారా’, ‘గంగా జమునా’ చిత్రాలకు నౌషాద్‌కు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సంగీత దర్శకుని బహుమతులు లభించాయి. 1981లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, 1992లో పద్మభూషణ్‌ అవార్డు నౌషాద్‌కు లభించాయి. తరువాత లతా మంగేష్కర్‌ అవార్డు, అమీర్‌ ఖుస్రో అవార్డు, సంగీత నాటక అకాడమీ బహుమతి, మహారాష్ట్ర ప్రభుత్వ గౌరవ సత్కారం లభించాయి. 2013లో తంతి తపాలా శాఖ నౌషాద్‌ స్మారక స్టాంప్‌ విడుదల చేసింది. సినీ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా, ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్స్‌ సొసైటీ చైర్మన్‌గా నౌషాద్‌ వ్యవహరిచారు. 5 మే 2006న నౌషాద్‌ ముంబైలో కాలం చేశారు.


- ఆచారం షణ్మఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.