రవీంద్ర సంగీత సారథి... పంకజ్ మల్లిక్

చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలురు కొద్దిమందే వుంటారు. వారిలో పంకజ్ మల్లిక్ ఒకరు. ఆయన మంచి గాయకుడు, సంగీత దర్శకుడు, ఉపాధ్యాయుడు, రచయిత.... ఇవికాకుండా మరెన్నో అంశాలలో నిష్ణాతుడు. ముఖ్యంగా బెంగాలీ సినీ పరిశ్రమకు ఇతోధికంగా సేవలు అందించి బెంగాల్ కళారంగ అభివృద్ధికి పాటుబడిన కళాకారుడు. పుట్టుకతోనే గానకళ అబ్బిన అదృష్టవంతుడు మల్లిక్. మోనోమోహిని, మోనిమోహన్ ల గారాల బిడ్డడు పంకజ్ మల్లిక్. అతడు పుట్టింది మే నెల 10, 1905 న కలకత్తాలోని సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో. చిన్నతనంలో మల్లిక్ శ్లోకాలు, భక్తి గీతాలు ఆలపిస్తూవుండేవాడు. భారతీయ సంప్రదాయ సంగీతంలో వున్న ఖాయల్, ద్రుపద్, తప్పా వంటి విభాగాలలో దుర్గాదాస్ బందోపాధ్యాయ వద్ద శిక్షణ పొందాడు. రవీంద్రనాథ్ టాగూర్ కు సన్నిహిత బంధువైన దీనేంద్రనాథ్ టాగూర్ పర్యవేక్షణలో గురుదేవుని రవీంద్ర సంగీతంలో మెలకువలు నేర్చుకున్నాడు. పంకజ్ ప్రజ్ఞను రవేంద్రుడు కూడా గుర్తించి అతనికి ప్ర్తోత్సాహం ఇచ్చారు. రవీంద్ర సంగీతంలో ‘తబలా’ వాద్యాన్ని ప్రవేశపెట్టిన ఘనత మల్లిక్ దే. 1926 లో వీలోఫోన్ కంపెనీ వారికి కమర్షియల్ రికార్డింగ్ చేసి పెట్టింది కూడా మల్లికే. ముఖ్యంగా రవీంద్ర సంగీతంలో పంకజ్ మల్లిక్ ఆలపించిన ‘ఆజ్ ప్రోతోమ్ బాదల్’ అనే రికార్డు మల్లిక్ కు మంచి పేరుతెచ్చిపెట్టింది. మే నెల 10న 115వ జయంతి జరుగుతున్న సందర్భంగా పంకజ్ బాబు ను గురించి కొన్ని విశేషాలు....


ఆల్ ఇండియా రేడియోలో తొలి ఉద్యోగం...

1927లో ఇండియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ యేర్పడి, దరిమీలా ఆల్ ఇండియా రేడియో గా అభివృద్ధి చెందినప్పడు అందులో ప్రఖ్యాత బెంగాలీ సంగీత దర్శకుడు రాయ్ చంద్ బోరల్ తో కలిసి అందులో ఉద్యోగం చేసిన తొలితరం కళాకారుడు పంకజ్ మల్లిక్. అక్కడే 1929 నుండి 1975 వరకు నాలుగు దశాబ్దాల పాటు పంకజ్ మల్లిక్ సంగీత సమర్పకునిగా, కార్యక్రమ అధ్యాపకునిగా సేవలు అందించారు. ‘సంగీత్ శిఖర్ అషర్’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి జనరంజకంగా ప్రసారం చేయించిన ఘనత కూడా మల్లిక్ దే. ఆయన ఆధ్వర్యంలోనే రవీంద్ర సంగీత్ లో భాగంగా ‘మహిషాసుర మర్దని’ అనే రూపకాన్ని 1932 లో మల్లిక్ ప్రసారం కావించారు. ముఖ్యంగా మధ్యతరగతి శ్రోతల్ని ఆ రూపకం యెంతగానో అలరించింది. ఎక్కువగా దసరా వారోత్సవాలలో ఈ రూపకం ప్రసారమవుతూ వుండేది. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన సుప్రభా ఘోష్, సుప్రీతి ఘోష్, అంగుర్ బాల, ఆరతీ ముఖర్జీ వంటి కళాకారులు పాల్గొనేవారు. ఈ రూపకాన్ని తరవాతికాలంలో రికార్డులుగా ముద్రిస్తే, ఈరోజుకి కూడా ఆ రూపకం బెంగాలీ బాబుల్ని అలరిస్తూనే వుంది.

సినిమాలలోప్రవేశం...

పంకజ్ మల్లిక్ సినీ ప్రస్థానం మూకీ యుగంతో ప్రారంభమైంది. చిత్రా సినిమా ధియేటర్ కు అనుసంధానంగా ఒక ఆర్కెస్ట్రా బృందం వుండేది. ఆ బృందం మూకీ సినిమాలకు సమయోచితంగా సంగీతాన్ని అందిస్తూ వుండేది. 1931 లో బి.ఎన్. సర్కార్ నిర్మించిన ‘చషర్ మెయే’, ‘చొర్ కంట’ అనే బెంగాలీ మూకీ చిత్రాలకు ఆ ధియేటర్ లో మ్యూజిక్ అరేంజర్ గా మల్లిక్ సినీరంగ ప్రవేశంగావించారు. తరవాత సర్కార్ న్యూ ధియేటర్స్ సంస్థను ప్రారంభించినప్పుడు పంకజ్ బాబు ఆ సంస్థలో చేరారు. ఆ సంస్థ నిర్మించిన తొలి బెంగాలీ టాకీ సినిమా ‘దేనా పవోనా’ (1932)కు పంకజ్ రాయ్, రాయ్ చంద్ బోరల్ సంయుక్తంగా సంగీతం సమకూర్చారు. 1933లో న్యూ ధియేటర్స్ వారు బెంగాలీ, హిందీ భాషల్లో నిర్మించిన ‘యాకుది కా లడ్కి’ చిత్రానికి పంకజ్ మల్లిక్ స్వతంత్రంగా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని పాశ్చాత్య వాద్య పరికరాలు వుపయోగించి సమర్పించడం ఆ రోజుల్లో గొప్ప ప్రయోగంగా చెప్పుకున్నారు. 1935లో ఆర్.సి. బోరల్ తో కలిసి న్యూ ధియేటర్స్ వారు నిర్మించిన ‘భాగ్యచక్ర’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘ధూప్ చావోం’ పేరుతో సమాంతరంగా నిర్మించారు. నితిన్ బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే నేపథ్య గాయనీ గాయకుల వినియోగం మొదలైందని చెప్పాలి. ఈ ప్లే బ్యాక్ ప్రక్రియ కోసం పంకజ్ బాబు హాలండ్ దేశపు సౌండ్ ఇంజనీరు డెమ్మింగ్ సాయం తీసుకొని ముందుగా పాటలు రికార్డు చేసి, లిప్ సింకింగ్ పద్ధతిలో ఆ పాటలను చిత్రీకరింప జేశారు. అలా తొలి నేపధ్య గానంతో రికార్డు వెలువడింది. ‘మై ఖుష్ హోనా చాహూం’ అనే ఈ తొలి ప్లే బ్యాక్ రికార్డును ఆలపించింది కె.సి.డే, హరిమతి, సుప్రభ సర్కార్, పరుల్ ఘోష్ లు. ఈ పాటను విశ్వనాథ్ భాదురి, విక్రమ్ కపూర్, కె.సి. డే, పహాడి సన్యాల్ మీద చిత్రీకరించారు. ఈ చిత్ర విజయం తరవాత పంకజ్ మల్లిక్ ఆర్.సి. బోరల్ తో కలిసి అనేక బెంగాలీ, హిందీ, ఉర్దు వర్షన్ల సినిమాలకు సంగీతం అందించారు. వాటిలో పి.సి. బారువా నిర్మించిన ‘దేవదాస్’ (1935), హేమచంద్ర నిర్మించిన ‘ది మిలియనీర్ (1936), పి.సి. బారువా నిర్మించిన ‘మంజిల్’ (1936), నితిన్ బోస్ నిర్మించిన ‘డీడీ’ (1937) కొన్ని మాత్రమే.

స్వతంత్ర సంగీత దర్శకుడిగా...

1937 లో పంకజ్ మల్లిక్ స్వతంత్రంగా సంగీత దర్శకత్వం నిర్వహించడం మొదలుపెట్టారు. ఆయన సంగీతం అందించిన తొలి చిత్రం పి.సి. బారువా నిర్మించిన ‘ముక్తి’ సినిమా. అందులో ఒక తాత్విక గాయకుని పాత్రను కూడా పంకజ్ బాబు నిర్వహించడం విశేషం. ఈ సినిమా బెంగాలీ వర్షన్ ‘లో పంకజ్ బాబు తొలిసారి రవీంద్ర సంగీతాన్ని నేపథ్య సంగీతం కింద వాడుకున్నారు. రవీంద్రుని అనుమతితో ‘దినేర్ శేషే ఘుమేర్ దేశే’ అనే పాటకు స్వరాలు కట్టి రికార్డుగా విడుదల చేస్తే, ఈనాటికీ ఆ రికార్డు ఇంటింటా వినిపిస్తూనే వుండడం పంకజ్ బాబు గొప్పతనమే! ఇందులో పంకజ్ మల్లిక్ ‘షరాబీ సొచ్చా నా కర్’ అనే పాటను అద్భుతంగా పాడారు. ‘ముక్తి’ చిత్రం విజయవంతమయ్యాక పంకజ్ మల్లిక్ వెండితెర మీద కనిపించడం కూడా ఎక్కువైంది. 1939లోవచ్చిన ఫణి మజుందార్ చిత్రం ‘కపాల కుండల’లో పరిణితి చెందిన గాయకుడి వేషం ధరించారు. మనం తరచుగా వినే ‘పియా మిలన్ కొ జానా’ పాట ఇందులోదే. ఆ పాటను ఆలపించింది కూడా పంకజ్ బాబే. తరవాత హిట్టయిన దేవకీ బోస్ చిత్రం ‘నర్తకి’ (1940) లో నిత్యనూతనమైన ‘ఏ కౌన్ ఆజ్ ఆయా’; ‘మధుబరి రుత్ జవాన్ హై‘ వంటి పాటలు పాడి మంచి గాయకుడిగా కూడా పంకజ్ బాబు పేరు తెచ్చుకున్నారు. 1941 లో సుబోధ్ మిత్రా నిర్మించిన ‘డాక్టర్’ చిత్రంలో అటు నటుడుగా ఇటు గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘మహాక్ రహి ఫుల్వారీ’ ; ‘కబ్ తక్ నిరాష్ కి’; ‘ఆజ్ ఆపని మెహనతోమ్ కా’ ; ‘గుజర్ గయా ఓ జమానా’ పాటలు నేటికీ కలకత్తా నగరంలో ఎక్కడో ఒక దగ్గర వినపడుతూనే వుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో న్యూ ధియేటర్స్ సంస్థ మూతపడడంతో అధికశాతం కళాకారులు బొంబాయికి వెళ్ళిపోయారు. అయితే పంకజ్ మల్లిక్ మాత్రం కలకత్తా లోనే వుండిపోయారు. సంగీతకారుడుగా ఎక్కువ అవకాశాలు రావడంతో నటన మీద ధ్యాసను తగ్గించుకున్నారు. రవీంద్ర సంగీతానికి మెరుగులు దిద్దుతూ, ఆధునిక సంగీతానికి స్వాగతం పలికి సంగీత దర్శకుడుగా నిలదొక్కుకున్నారు. 1944 లో పంకజ్ మల్లిక్ ‘మేరీ బెహన్’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తూ కె.ఎల్. సైగల్ చేత పాటలు పాడించారు. సైగల్ ఆలపించిన గొప్ప పాటల జాబితాలో చేరిన ‘దో నైనా మత్వారే’, ‘చుపో నా చుపో నా’ పాటలు ఈ చిత్రంలోనివే. 1952 లో ఆర్ట్ ఫిల్మ్ ఆఫ్ ఆసియా సంస్థ నిర్మించగా దేవానంద్, గీతాబాలి నటించిన ‘జల్జలా’ చిత్రానికి పంకజ్ బాబు సంగీతం సమకూర్చారు. 1942-57మధ్య కాలంలో ‘మీనాక్షీ’, ‘కాశీనాథ్’, ‘దుయ్ పురూష్’, ‘నర్స్ సిస్సీ’, రామర్ సుమతి’, ‘ప్రతిబంద్’, ‘రూప్ కహానీ’, ‘మహాప్రస్థానర్ పతి’, ‘బనాహంసి’, యాత్రిక్’, ‘రాయ్ కమల్’, ‘చిత్రాంగద’, ‘లౌహకపత్’ వంటి విజయవంతమైన బెంగాలీ, హిందీ సినిమాలకు పంకజ్ మల్లిక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంగీత దర్శకునిగా పంకజ్ మల్లిక్ సంగీతం అందించిన ఆఖరి సినిమా ‘జాహ్నవి జమునా బిగోలితో కరుణా’ అనే బెంగాలీ చిత్రం. 1945 లో విడుదలైన ‘దుయి పురూష్’ అనే బెంగాలీ సినిమాకు అందించిన సంగీతానికి పంకజ్ మల్లిక్ ఉత్తమ సంగీత దర్శకుని బహుమతి అందుకున్నారు.

మరిన్ని విశేషాలు...

హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం మీద పంకజ్ బాబు చాలా పుస్తకాలు లిఖించి ప్రచురించారు. భారత జాతీయ గీతానికి జవహర్ లాల్ నెహ్రూ సూచనమేరకు బాణీ కట్టింది కూడా పంకజ్ మల్లిక్ కావడం విశేషం. బెంగాల్ ప్రభుత్వ ‘ఫోక్ ఎంటర్టెయిన్మెంట్ విభాగానికి గౌరవ సలహాదారుగా వ్యవహరించారు. సత్యజిత్ రాయ్ నిర్మించిన ‘పథేర్ పాంచాలి’ (1955) చిత్రానికి ఆర్ధిక సహాయాన్ని ఈ విభాగం ద్వారా పంకజ్ బాబు అందించడం విశేషం. పంకజ్ మల్లిక్ ‘యాత్రిక్’, ‘రాయ్ కమల్’ చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని బహుమతి గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 1970లో పంకజ్ మల్లిక్ కు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. 1973లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహేబ్ ఫాల్కే’ అవార్డును కూడా పంకజ్ బాబు అందుకున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా 2006 ఆగస్ట్ 4 న భారత తపాలా శాఖ స్మారక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. పంకజ్ శతజయంతి సందర్భంగా దూరదర్శన్ వారు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు. ‘అమర్ యుగ్ అమర్ గాన్’ పేరుతో పంకజ్ మల్లిక్ ఆత్మకథ పుస్తకంగా వెలువడింది. పంకజ్ మల్లిక్ 19 ఫిబ్రవరి 1978 న కలకత్తా నగరంలో కాలంచేశారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.