పంచమ స్వరం... ఆయన వరం

స్వరాలతో చెలిమి, రాగాలతో కలిమి, గీతాలతో జోడీ, పల్లవులతో పలకరింపులు, చరణాలతో నడక. అలా...అలా సుదూర తీరాల వరకూ సాగిన సంగీత యానం... ఇదీ స్థూలంగా ఆర్డీ బర్మన్‌ జీవితం. ఆర్‌.డి.బర్మన్‌ గురించి తలచుకుంటే చాలు...గుండెల్లో స్వరాల సందళ్లు వేనవేలు. ఆయన సృజించిన రాగాలు రెక్కలు విప్పుకుని విహాయసంలో విహరించే విహంగాలు. ఒక్కో పాట... తీయతేనియ ఊట. ఒక్కోసారి ఆయన స్వరపరిచిన పాట నరాల్లో విద్యుత్‌ ప్రకంపన. పాట వింటుంటే ఒక్క క్షణం కూడా కుదురుగా నిలువనీయని అలౌకిక స్థితి. ఆయన పాటని భరించడం... తీయని వేదనే. సంతోషంతో కళ్ల నీళ్లు ధారాపాతమవుతాయి. మళ్లీ మళ్లీ అదే అనుభవాన్ని, అదే చిత్ర హింసని కోరుకుంటూ వెర్రెత్తిపోయిన శ్రోతలెందరో? ఆర్‌.డి.బర్మన్‌...అంటే 1960 నుంచి 1990 దశకాల్లో అత్యంత ప్రభావశీలి అయిన మ్యూజిషియన్‌. మ్యూజిక్‌ తో మేజిక్‌ చేసిన జాదూగర్‌.నెలలబాలుడిగా స్వరనేస్తం

బాలానాం రోదనం బలం....అంటారు. ఆకలి తీర్చే అమ్మ పాల కోసం పసిబాలుడు సంధించే ఏడుపు స్వరం కూడా పంచమ స్వరమై... భవిష్యత్‌ వరమై ...రసజ్ఞ శ్రోతల సంబరమై, అంబరాన్నంటితే... ఆయనే ఆర్‌.డి.బర్మన్‌. భారతీయ సినీ సంగీతానికి కొత్త తావిలద్దిన స్రష్ట. అంతవరకూ నిర్మల మందాకినిలా సాగే సినీ సంగీతానికి వేగాన్ని, చిన్ని గుండె తట్టుకోలేనంత ఉద్వేగాన్ని సంతరింప చేసిన సాధకుడు. తన బాణీలకు వొళ్లు జల్లుమనిపించే విదేశీ వోణీల్ని కట్టబెట్టిన సృజనశీలి. ఇటు మాధురీ ఝరి, అటు నరాల్ని మీటే పడమటగాలి సోకిన సంగీత సిరి... వెరసి ఆర్‌.డి.బర్మన్‌. బాలీవుడ్‌లో పంచమ్‌ అంటే ఆర్డీ బర్మన్‌. నెలల పిల్లాడుగా ఉన్నప్పుడే పంచమ స్వరంలో ఏడునొక్క రాగాన్ని ఆలపించాడుట... ఆ ఆలాప్‌ పంచమంలో వినసొంపుగా ఉండడంతో అమ్మానాన్నలు, ఆత్మీయులందరూ ప్రేమగా పంచమ అని పిలిచేవారట. దాంతో, ఆర్‌.డి.బర్మన్‌ ముద్దు పేరు పంచమ్‌గా స్థిరపడింది. తండ్రి యస్‌.డి.బర్మన్‌ హిందీ సినీసీమలో విఖ్యాతి గాంచిన సంగీత దర్శకుడు. తల్లి మీరా దేవ్‌ బర్మన్‌ ప్రఖ్యాతిగాంచిన పాటల రచయిత్రి. ఇక, ఆర్‌.డి.బర్మన్‌ సతీమణి ఆశా భోస్లే కొన్ని తరాలు గుర్తుండిపోయే గానమాధురితో భారతీయ సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఓ ఊపు ఊపిన గాయనీ మణి. ఇలా...ఆర్‌.డి.బర్మన్‌ కుటుంబం సంగీత కుటుంబం.


జీవన నేపథ్యం

కలకత్తాలోని బెంగాలీ కుటుంబంలో 27 జూన్‌ 1939లో ఆర్‌.డి.బర్మన్‌ జన్మించారు. 1994 జనవరి 4న తనువు చాలించారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినీ సంగీత ప్రపంచంలో సృజనతో సరికొత్త చరిత్ర లిఖించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, స్కోర్‌ కంపోజర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్‌ ఆరెంజర్‌గా, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా... ఇలా బహుపాత్రల్లో ప్రజ్ఞ చూపించారు. ఆయన మొదటి భార్య రీటా పటేల్‌ని 1966లో పెళ్లి చేసుకుని... 1971లో అభిప్రాయభేదాలతో సరిపడక విడాకులు తీసుకున్నారు. తరువాత... ఆయన ప్రసిద్ధ గాయని ఆశ భోంస్లేని ద్వితీయ వివాహమాడారు. ఆ జంట సంగీత సుస్వరాల జంటగా అభినందనలు అందుకుంది. వారిద్దరూ కనిపిస్తే... బాలీవుడ్‌ సంగీతమే ఎదురైనట్లు అభిమానులు మధురానుభూతి లోనయ్యేవారట. ఆర్‌.డి.బర్మన్‌ పశ్చిమ బెంగాల్‌లో ప్రాధమిక విద్య పూర్తి చేశారు.


9వ ఏటనే పాట కట్టిన బర్మన్‌

ఆర్‌.డి.బర్మన్‌ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఓ పాటకు స్వరాభిషేకం చేశారు. అదే పాటని 1956లో ఆయన తండ్రి యస్‌.డీ బర్మన్‌ ‘ఫాంటూú’Ã సినిమా కోసం వినియోగించుకున్నారు. ‘ఆయే మేరీ టోపీ ఫలట్‌ కే ఆయా....’ అనే పాట అది. 1957లో గురుదత్‌ సినిమా ‘ప్యాసా’లో విశేష ప్రాచుర్యం పొందిన పాట.... ‘సర్‌ జో తేరా చక్రాయే’ గీతానికి చిన్నతనంలోనే ఆర్‌.డి.బర్మన్‌ స్వరం సమకూర్చారు. అలీ అక్బర్‌ ఖాన్‌ ముంబైలో సరోద్‌ వాద్య నిపుణుడు. ఆయన దగ్గర ఆర్‌.డి.బర్మన్‌ సరోద్‌లో శిక్షణ పొందారు. అలాగే, సమాత ప్రసాద్‌ దగ్గర తబలాలో శిక్షణ పొందారు. బాలీవుడ్‌లో మరో ప్రసిద్ధ సంగీత దర్శకుడు సలీల్‌ చౌదరిని ఆర్‌.డి.బర్మన్‌ గురువుగా ఆరాధించేవారు. తన తండ్రి యస్‌.డీ.బర్మన్‌ దగ్గర సంగీత సహాయకుడిగా కూడా పని చేశారు. 1958లో ‘చల్తీకా నామ్‌ గాడి’, 1959లో ‘కాగజ్‌ కె పూల్‌’, 1963లో ‘తేరా ఘర్‌ కె సామ్‌ û’ే, 1963లో ‘బందిని’, 1964లో ‘జిడి’్డ, 1965లో ‘గైడ్‌’ తదితర చిత్రాలకు సంగీత సహాయకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు, తన తండ్రి యస్‌.డీ.బర్మన్‌ సంగీతం సమకూర్చిన ‘సాల్వా సాల్‌’ చిత్రంలో గాయకుడు. హేమంత కుమార్‌ పాడిన ప్రసిద్ధ గీతం ‘హాయ్‌ అప్నా దిల్‌ తో ఆవారా’ కోసం ఆర్‌.డి.బర్మన్‌ మౌత్‌ ఆర్గాన్‌ కూడా వాయించారు.చోటి నవాబ్‌ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు

అనేక సినిమాలకు సంగీత సహాయకుడిగా పనిచేసిన ఆర్‌.డి.బర్మన్‌ 1961లో ‘చోటి నవాబ్‌’ చిత్రం ద్వారా స్వతంత్ర సంగీత దర్శకుడిగా శ్రోతలకు స్వర పరిచయం అయ్యారు. అంతకు ముందు సంగీత దర్శకుడిగా ఆయన పరిచయమయ్యేందుకు ఓ ప్రయత్నం జరిగింది. గురుదత్‌ అసిస్టెంట్‌ నిరంజన్‌ దర్శకత్వం వహించిన రాజ్‌ చిత్రం కోసం ఆర్‌.డి.బర్మన్‌ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో గురుదత్, వహీదా రెహమాన్‌ నాయికా నాయకులు. ఈ చిత్రం కోసం ఆర్‌.డి. బర్మన్‌ రెండు పాటల్ని కంపోజ్‌ చేశారు. మొదటి పాటను గీత దత్, ఆశ బోంస్లే పాడగా రెండో పాటను షంషాద్‌ బేగం పాడారు. కాగా, బాలీవుడ్‌ కమెడియన్‌ మహమూద్‌ చోటీ ‘నవాబ’్ చిత్రం కోసం మొదట యస్‌.డీ.బర్మన్‌ని సంప్రదించారు. ఆయన అందుకు అంగీకరించకపోవడంతో...ఆ అవకాశం ఆర్‌.డి.బర్మన్‌కి దక్కింది. ఆ రకంగా ‘చోటే నవాబ్‌’ చిత్రంతో ఆర్‌.డి.బర్మన్‌ స్వతంత్ర సంగీత దర్శకుడిగా పరిచయమై...తిరిగి వెనక్కి చూసుకోలేనంతగా బిజీగా మారారు. తర్వాత్తర్వాత మహామూద్‌తో ఆర్‌.డి.బర్మన్‌కి సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆ కారణంగానే, 1965లో మహామూద్‌తో కలసి ‘భూత్‌ బంగా’్ల చిత్రంలో హాస్య పాత్రలో ఆర్‌.డి.బర్మన్‌ నటించారు. 1966లో ‘తీస్రీ మంజిల్‌’ సినిమా ఆర్‌.డి.బర్మన్‌ని సంగీత దర్శకుడిగా విజయతీరాలకు చేర్చింది. మజ్రూ సుల్తాన్‌ పురి గీతాలు, ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం ఈ చిత్రానికి సరికొత్త సొగసుల్ని సమకూర్చింది. 1967లో ‘బాహారొంకే సప్నే’, 1968లో ‘పడో సన్‌’ , 1969లో ‘ప్యార్‌ కా మౌసమ’్, 1973లో ‘యాదోంకి బారత్‌’ తదితర చిత్రాల్లో మజ్రూ సుల్తాన్‌ పురి గీతాలు, ఆర్‌.డి.బర్మన్‌ సంగీతం శ్రోతల్ని ఉర్రూతలూగించింది. ఓ పక్క స్వత్రంత్ర సంగీత దర్శకుడిగా పనిచేస్తూనే...మరో పక్క తన తండ్రి యస్‌.డి.బర్మన్‌కి సహాయకుడిగా కొన్ని విజయవంతమయిన చిత్రాలకు పనిచేశారు. 1967లో ‘జ్యువెల్‌ తీఫ్‌’, 1970లో ‘ప్రేమ పూజారి’ తదితర చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. ఆరాధనా చిత్రంలో బహుళ ప్రజాదరణ పొందిన ‘మేరీ సప్నోంకి రాణి’ స్వర రచన యస్‌.డి.బర్మన్‌ ఖాతాలోకి వెళ్లినప్పటికీ...అది ఆర్‌.డి.బర్మన్‌ సృజనగానే సినీ విమర్శకులు పరిగణిస్తుంటారు.


పందెంతో పెళ్లి

పందిట్లో పెళ్లిళ్లు జరగడం షరా మామూలే. కానీ, పందెంతో పెళ్లి జరగడం ఆర్‌.డి.బర్మన్‌ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికర అంశం. రీటా పటేల్‌ ...బర్మన్‌ మొదటి భార్య. బర్మన్‌ని డార్జిలింగ్‌లో కలిశారు. తన స్నేహితులతో పందెం కట్టి మరీ బర్మన్‌ ప్రేమను చూరగొని ఆయనని పెళ్లి చేసుకున్నారు. పందెం కట్టి పెళ్లి చేసుకున్నప్పటికీ... అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. రీటా పటేల్‌తో విడిపోయిన తర్వాత 1977లో ‘పరిచయ’ సినిమా కోసం ‘ముషాఫిర్‌ హూ యారో...’ అనే పాటను స్వరపరిచారు. 1980లో ప్రముఖ గాయని ఆశా భోస్లేని పెళ్లాడిన ఆర్‌.డి.బర్మన్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ గీతాలు స్వరపరిచారు. అంతే కాదు... ఎన్నో స్టేజి షోలను సైతం ఇచ్చారు. 1970 దశకం ఆర్‌.డి. బర్మన్‌ సంగీత ప్రపంచంలో మెలి మలుపుగా అభివర్ణించవచ్చు. కిశోర్‌ కుమార్‌ గాయకుడిగా ఆయన సంగీతం సమకూర్చిన పాటలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. రాజేష్‌ ఖన్నా చిత్రాలకు కూడా ఆయన సంగీతం సమకూర్చి విజయవంతం చేశారు. 1970లో కటీ పతంగ్‌ సూపర్‌ హిట్‌. యే సామ్‌ మస్తానీ, యే జో మొహబ్బత్‌ హై పాటలు కిషోర్‌ గళంలో అమృతాన్ని కురిపించాయి. మహమ్మద్‌ రఫీ, ఆశ బొంస్లే, లతా మంగేష్కర్‌...తదితర గాయనీ గాయకులకు ఆర్దీ బర్మన్‌ ఎన్నో మంచి పాటలు అందించారు. 1971లో దేవా నంద్‌ చిత్రం హరే రామ, హరే కృష్ణ చిత్రానికి సమకూర్చిన సంగీతం సునామీని సృష్టించింది. ఆ చిత్రంలో ఆశా బొంస్లే ఆలపించిన ‘దమ్‌ మారో దమ్‌’ పాట సృష్టించిన పెను సంచలనం అంతా ఇంతా కాదు. అదే సంవత్సరం ‘అమర్‌ ప్రేమ్‌’ చిత్రం కోసం లతాజీతో ఆర్‌.డి.బర్మన్‌ పాడించిన పాట రైనా బీటీ జాయే ఇప్పటి శ్రోతల్ని సైతం అలరిస్తూనే ఉంది. ‘కార్వాû’Â చిత్రంలో ఆర్‌.డి.బర్మన్‌ కంపోజ్‌ చేసిన పాటలన్నీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. రాత్‌ కలీ ఏక్‌ క్వాబ్‌ మే, బుద్ధా మిల్‌ గయా, పియా తూ అబ్‌ తో ఆజా...ఇప్పటికీ జనం మరిచిపోలేరు. పియా తూ అబ్‌తో ఆజా...అనే పాటకి హెలెన్‌ చేసిన నృత్యాభినయానం అద్భుతం.


‘ సీత ఔర్‌ గీత’, ‘రామ్‌ ఔర్‌ లక్ష్మణ’Â, ‘మేరె జీవన్‌ సాధి’, ‘బొంబాయి టు గోవా’, ‘అప్నా దేశ్‌’, ‘ఆప్‌ కీ కసం’, ‘షోలే’, ‘ఆంధీ’ ఇలా ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘మా కీ పుకాô’Â పేరుతో నిర్మితమైన డాక్యుమెంటరీ కోసం ఓ పాటను కూడా కంపోజ్‌ చేశారు. 1975లో యస్‌.డీ బర్మన్‌ కోమాలోకి వెళ్లడంతో... ఆయన ఒప్పుకున్న చిత్రం ‘మిలీ’ కి సంగీతాన్ని ఆర్‌.డి.బర్మన్‌ సమకూర్చారు. 1977లో ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ చిత్రంలో క్యా హుటా తేరీ వాదా పాటకు గాయకుడూ మహ్మద్‌ రఫీకి బెస్ట్‌ మేల్‌ సింగర్‌గా జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఆర్‌.డి.బర్మన్‌ జనరంజకమైన ఎన్నో పాటలని కంపోజ్‌ చేశారు. ‘కసమే వాదే’, ‘ఘర్‌’, ‘గోల్‌ మాల్‌’, ‘కూబ్‌ సూరత్‌’ తదితర చిత్రాల్లో ఎన్నో మంచి పాటల్ని చేశారు. 1981లో ‘సనమ్‌ తేరి’ కోసం సినిమాకిగాను మొట్టమొదటిసారిగా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డు స్వీకరించారు.

చివరి రోజులు

ఆర్దీ బర్మన్‌ చివరి రోజులు కాస్త ఇబ్బందికరంగా మారాయి. బప్పీ లహరి రంగ ప్రవేశంతో ఆర్‌.డి.బర్మన్‌ హవా మసకబారింది. 1988లో గుండెపోటూ వచ్చింది. బై పాస్‌ సర్జరీ చేయించుకున్నారు. ‘1942 మై లవ్‌ స్టోరీ’ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఆర్‌.డి.బర్మన్‌... ఆ చిత్రం విడుదలను చూసుకోలేదు. ఆయన మరణించిన తరువాతే ఆ చిత్రం విడుదల అయింది. మ్యూజికల్‌ హిట్‌గా రసజ్ఞుల మన్ననలను అందుకుంది. ఆర్‌.డి.బర్మన్‌ మన మధ్య లేకున్నా... ఆయన స్వరపరిచిన ఎన్నో గీతాలు ఆయన స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి.- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.