ఆర్ పి అంటే రాగం...పల్లవి

ఆయన... తన సంగీతంతో ప్రేమికులను మైమరపించగలరు, యువతను హోరెత్తించగలరు. బాణీలతో ప్రేక్షకులను ఏడిపించే సత్తా కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం. అంతేనా... ఆయనలో సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయగల ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా ఉన్నారు. ఇంత టాలెంట్ ఉన్న ఈయన తెరపై అంధుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించడం కూడా విశేషమే. ఇలా గాత్రంతో, నటనతో, దర్శకత్వంతో, సంగీత దర్శకత్వంతో ప్రేక్షకులకు అతి చేరువయిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు... ఆర్పీ పట్నాయక్. పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకొన్న ఈ బహుముఖ ప్రజ్ఞశాలి పుట్టినరోజు మార్చి 10న. ఈ సందర్బంగా ఆర్పీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా!కుటుంబం
ఆర్పీ పట్నాయక్ అసలు పేరు రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. 1970 మార్చి 10న జన్మించారు. పార్వతీపురం పక్కన సింగనాపురం వీరి స్వస్థలం. అయితే తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం ఒరిస్సాకు మారింది. ఆర్పీకి ఇద్దరు సోదరులు. ఆర్పీ అన్నయ్యకు కూడా సంగీతంలో ప్రవేశం ఉంది. అయితే ఆయన సంగీత వాయిద్యాలు వాయిస్తారు. అందువలన ఆర్పీ తండ్రి వీరిచే కచేరి పెట్టించుకునేవారట. చిన్నతనంలో, ఆర్పీ పాడుతూ ఉంటే ఆయన సోదరుడు సంగీత వాయిద్యం వాయిస్తూ ఉండేవారట. తన తల్లికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టమని ఓ సందర్భంలో ఆర్పీ పట్నాయక్ చెప్పారు. మొత్తానికి తాను సంగీతాన్ని ఆస్వాదించే కుటుంబంలో జన్మించినట్టు చెప్పుకొచ్చారు ఆర్పీ.

అలా పట్నాయక్ పేరు
ఒరిస్సాలో ఆర్పీ ఉన్న ప్రాంతంలో కొంతమందికి ఇంటిపేరుగా పట్నాయక్ వస్తుంది. ఆ విధంగా తమకు పట్నాయక్ అని వచ్చిందని ఆర్పీ చెప్పారు.

చదువు
ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్పేస్ ఇంజనీరింగ్ చదివారు ఆర్పీ. ఆ తరువాత సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు ఆర్పీ. కాని సినిమా పరిశ్రమపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆర్పీ.

అందరం కలిసే
కలసి ఉంటే కలదు సుఖం... అన్న మాటని నిజం చేస్తూ తన సోదరులతో కలిసి ఉంటున్నారు ఆర్పీ పట్నాయక్. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా 11 మంది ఒకే ఇంట్లో ఉంటామని ఆర్పీ చెప్పారు. సమస్యలు, సంతోషాలు కలసి పంచుకోవడం లోనే సంతృప్తి ఉందని ఆయన అంటారు.

వివాహం
ఆర్పీ పట్నాయక్ భార్య పేరు లావణ్య. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికి ఓక అమ్మాయి ఉంది. పేరు వెన్నెల. వెన్నెల కూడా సంగీతం నేర్చుకుంటోందని చెప్పారు ఆర్పీ పట్నాయక్.

శాకాహారి
ఆర్పీ పట్నాయక్ ఒక్కప్పుడు మాంసాహారం తినేవారు. ఇప్పుడు శాకాహారిగా మారిపోయారు. శాకాహారాలలో అన్ని ఆహారాలు ఇష్టంగా తింటారట ఆర్పీ. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఆర్డీ బర్మన్ తనకు ఇష్టమైన సంగీత దర్శకులని చెప్పారు. కిశోర్ కుమార్, ఎస్పీ బాలసుబ్రమణ్యం తాను మెచ్చిన గాయకులని కూడా అన్నారు.

మానసిక ప్రశాంతతే ఆరోగ్య రహస్యం
ఆర్పీ పట్నాయక్ ఏ షోకి వచ్చినా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అందుకు కారణం లేకపోలేదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తన ఆరోగ్య రహస్యమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆర్పీ.త్రివిక్రమ్, సునీల్ రూంమేట్స్

సినిమా పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తితో ఇటువైపు వచ్చారు ఆర్పీ. వచ్చిన కొత్తలో సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలిసి మూడేళ్లు ఒకే రూంలో ఉండేవారు. సినిమా ప్రయత్నాలు చేస్తుండేవారు సునీల్, త్రివిక్రమ్, ఆర్పీ పట్నాయక్. రాత్రివేళల్లో త్రివిక్రమ్ ఎదో రాస్తే దానికి ఆర్పీ పట్నాయక్ ట్యూన్ కట్టేవారు. వీరిద్దరి టాలెంట్ గురించి సునీల్ జడ్జ్ గా మారి తీర్పు చెప్పేవారట.

దర్శకుడు కావాలని సంగీత దర్శకుడై...
సినిమా దర్శకుడు అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి అడుగుపెట్టారు ఆర్పీ. 'నీకోసం' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తెరకు పరిచయమయ్యారు. దర్శకుడిగా మారిన కెమరామెన్ తేజ తన 'చిత్రం' సినిమాతో ఆర్పీ పట్నాయక్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత తన సంగీతంతో పరిశ్రమలో సునామి సృష్టించారు ఆర్పీ పట్నాయక్. 'ఫామిలీ సర్కస్', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే', 'నువ్వు లేక నేను లేను' వంటి సినిమాలతో యూత్ కు దగ్గరైన ఆరి పట్నాయక్ నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలకు కూడా వర్క్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2008లో 'అందమైన మనసులో' సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయమయ్యారు ఆర్పీ పట్నాయక్.

'నువ్వు నేను', 'సంతోషం' సినిమాలు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకొన్నారు ఆర్పీ. 'నువ్వు నేను' సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ నంది పురస్కారం కూడా అందుకొన్నారు. తన సంగీతానికి ఎన్నో సాంస్కృతిక సంస్థల నుంచి కూడా పురస్కారాలు కైవసం చేసుకొన్నారు.

ఆర్పీ సంగీత కచేరీకి ఆరులక్షల మంది
విశాఖపట్నం సముద్రతీరాన ఆర్పీ పట్నాయక్ నిర్వహించిన సంగీత కచేరీకి ఏకంగా ఆరు లక్షల మంది విచ్చేసారు. ఆ తరువాత యుఎస్, యూకే, దుబాయ్, కువైట్, సింగపూర్, ఢిల్లీ, చెన్నైలలో ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సంగీత కచేరీలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు ఆర్పీ. ఆర్పీ సంగీతం సమకూర్చిన 'జయం' వంటి సినిమాలు కేవలం ఒకేఒక్క ప్రాంతంలో 2.5 మిలియన్ యూనిట్లు (సిడిలు, క్యాసెట్‌లు) అమ్ముడయ్యాయి.


ఒక గాయకుడిగా కేవలం తన సంగీతంలోనే కాకుండా, ఇళయరాజా తదితర ఇతర సంగీత దర్శకుల పాటలకు కూడా గాత్రం ఇచ్చారు ఆర్పీ. అలా సుమారు ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన 300 పాటలకు గాత్రం ఇచ్చారు ఆర్పీ పట్నాయక్. 'చక్ర - ది సిగ్నేచర్ ఆఫ్ టైం' అనే అంతర్జాతీయ ఆల్బంకి కూడా వర్క్ చేశారు ఆర్పీ పట్నాయక్.

ఔత్సాహిక గాయకుల పరిచయం
ఆర్పీ పట్నాయక్ సినిమా పరిశ్రమకు ఎంతో మంది కొత్త గాయనీగాయకులని పరిచయం చేశారు. వారిలో రంజిత్, మల్లికార్జున్, రవివర్మ, నిహాల్, కౌసల్య ఉండడం విశేషం.

ఆర్పీ కొన్ని సినిమాలు
'సంతోషం', 'శ్రీరామ్', 'అల్లరి రాముడు', 'జయం', 'హోలీ', 'జెమినీ', 'నీ స్నేహం', 'ఈశ్వర్', 'దిల్', 'సంబరం', 'నిజం', 'నిన్నే ఇష్టపడ్డాను', 'నీకు నేను నాకు నువ్వు', 'అప్పుడప్పుడు', 'ఆ నలుగురు', 'అవునన్నా కాదన్నా', 'మా ఇద్దరి మధ్య', 'బొమ్మలాట', 'లక్ష్మి కళ్యాణం', 'స్వాగతం', తదితర చిత్రాలకు సంగీతం అందించారు.

నటుడిగా
అప్పటివరకు సంగీత దర్శకుడిగా ఉన్న ఆర్పీ 2004లో 'శీను వాసంతి లక్ష్మి' సినిమాలో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో అంధ గాయకుడి పాత్రను పోషించారు ఆర్పీ. ఆ పాత్రలో సహజమైన నటనని ప్రదర్శించి ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నారు ఆర్పీ. ఆ తరువాత 2010లో 'బ్రోకర్' సినిమాలో నటించారు.

తెలుగు షార్ట్ ఫిల్మ్ '22 మినిట్స్'తో దర్శకుడిగా మారారు ఆర్పీ. రాజా, అర్చన, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ షార్ట్ ఫిల్మ్ వ్యవధి 22 నిమిషాలు. సోదరుడు గౌతమ్ పట్నాయక్ తో ఆర్పీ పట్నాయక్ ఈ షార్ట్ ఫిల్మ్ కి స్క్రీన్ ప్లే అందించారు.

2016లో 'తులసి దళం' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా దర్శక, నిర్మాణ బాధ్యతలు చూసుకొన్నారు ఆర్పీ. అలాగే ఇందులో నటించారు కూడా. ఈ చిత్రానికి సంగీతం కూడా సమకూర్చారు ఆర్పీ. 2016లో లంచం నేపథ్యంలో 'బ్రోకర్' సినిమాను తెరకెక్కించారు ఆర్పీ. ఈ చిత్రానికి ప్రజల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత 'మనలో ఒకడు' సినిమాని కూడా రూపొందించారు ఆర్పీ. తమిళ, కన్నడ భాషలలో కూడా వర్క్ చేశారు ఆర్పీ. హిందీలో 'కుచ్ తుం కహో కుచ్ హం కహే', 'యే దిల్' సినిమాలకు నేపథ్య సంగీతం సమకూర్చారు.

పురస్కారాలు
2001లో 'నువ్వు నేను' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకొన్న ఆర్పీ ఆ తరువాత 2002లో 'సంతోషం' చిత్రానికి కూడా అదే విభాగంలో మరో ఫిలింఫేర్ పురస్కారాన్ని కైవసం చేసుకొన్నారు. 2003లో కన్నడ భాషలో తెరకెక్కిన 'ఎస్క్యూజ్ మీ' సినిమాకు కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా మూడవ ఫిలింఫేర్ పురస్కారం సొంతం చేసుకోగలిగారు ఆర్పీ. 'నువ్వు నేను' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా, 'అందమైన మనసులో', 'బ్రోకర్', చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారాలు అందుకొన్నారు ఆర్పీ. ఆ తరువాత ఆర్పీ దర్శకత్వం వహించి, నటించిన 'మనలో ఒకడు' సినిమాకు ఉత్తమ మూడవ చలన చిత్ర విభాగంలో నంది అవార్డు లభించింది.

- పి.వి.డి.ఎస్.ప్రకాష్


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.