రెహమాన్‌ సంగీతం.. అలుపెరగని సంద్రం
హనుమంతుడు సంగీతంలో దిట్ట. నారదుడు, తుంబురుడు వంటి వారినే ఆశ్చర్యచకితుల్ని చేశాడు. రెహమాన్‌ కూడా అంతే. అందుకే అప్పుడు హనుమాన్, ఇప్పుడు రెహమాన్‌ అనాలనిపిస్తుంది.           
   - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ.


ప్రస్తుతంలో గతం తలచుకునే వారు కొందరైతే, గతంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించే వారు మరికొందరు. అందులో రెహమాన్‌ ఒకరు. కాదు ఒక్కరే! అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. తన సంగీత వర్షంలో తడిసి ముద్దైన వారిని అడిగితే ‘సుస్వరాల’ నిజం అంటారు. నేడు(జనవరి 6) రెహమాన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అందించిన మెలొడీల గురించి చెప్పే చిన్ని ప్రయత్నం...

- సాధారణంగా తెలుగులోనూ, తమిళంలోనూ ఆదరణ పొందిన పాటని ఉత్తరాదికి పరిచయం చెయ్యడానికి అంత ఉత్సాహం చూపరు. వేరే ట్యూన్‌తో ఆకట్టుకునే ప్రయత్న చేస్తారు. అలా కాకుండా మూడు భాషల్లోనూ ఒకే పాటతో పరిచయమై ఆ ఒక్క పాటతో సంగీత ప్రియ³ల్ని తనవైపు తిప్పుకున్న ఘనత రెహమాన్‌ది. అదే.. ‘రోజా’ చిత్రంలోని చిన్ని చిన్ని ఆశ.

అటు క్లాసిక్‌.. ఇటు లేటెస్ట్‌
‘జెంటిల్‌మన్‌’ సినిమాలోని మావేలే మావేలే పాట ప్రారంభంలో, రెండో చరణం (పానుపు నిద్దురకే పరిమితం కావొద్దు) మొదలయ్యే ముందు వయోలిన్‌తో వచ్చే ఇంటర్లూడ్‌ అలు క్లాసికల్‌ ఫార్మాట్‌ని ఇటు మెలోడి కలిసి శ్రోతలకు బాగా కనెక్ట్‌ అయింది. మరో పాటలో ప్రయోగం.. ‘నా ఇంటి ముందున్న పూదోటనడిగావో’లో ఫోక్‌ మెలోడిని తెలివిగా క్లాసికల్‌ ఫార్మాట్‌లోకి మార్చి, దానికి లేటెస్ట్‌ ఆర్కెస్ట్రా జతచేస్తూ రిథమ్‌ ఆపుతూ, కొనసాగిస్తూ కొత్త పోకడలు చవిచూపాడు.


ఫాస్ట్‌ బీట్‌లోనూ మెలొడీ:
అలాంటి ప్రయోగమే మళ్లీ ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’లో చేశాడు రెహమాన్‌. ‘అధరము ఉదరము నడుమ ఏదో అలజడి రేగెనులే’ అంటూ క్లాసికల్‌ ఫార్మాట్, ఇంటర్లూడ్‌లు పాడించిన విధానం అంతా మెలొడీ. ఈ పాటతో అటు యువత, ఇటు పెద్దలకు బాగా దగ్గరయ్యాడు. ‘ముత్తు’ చిత్రంలోని తిల్లానా.. తిల్లానా వంటి ఫాస్ట్‌బీట్‌లోనూ మెలొడీ పెట్టడం ఆయనకే సాధ్యమైంది. అప్పటి వరకు విన్న రిథమ్‌ని మరిచిపోయి చరణంలోని ‘పైట చెంగు పాడిందయ్యా పరువాల పాట’ లైన్‌ను వినాల్సిందే తప్ప ఎంత వర్ణించినా తక్కువే.


మరికొన్ని:

‘ఇందిర’ చిత్రంలోని లాలీ లాలీ అని రాగం పాడుతుంటే,

‘ప్రేమదేశం’లోని వెన్నెలా వెన్నెలా

‘డ్యూయెట్‌’లోని నా నెచ్చెలి నా నెచ్చెలి

‘మెరుపుకలలు’లోని అపరంజి మదనుడే

‘అమృత’లోని మరుమల్లెలలో

‘ఏ మాయ చేశావే’లోని వింటున్నావా

- ఇవన్నీ అతి తక్కువ వాయిద్యాలతో, ఒక్కో చోట అస్సలు వాద్యాలేవీ ఉపయోగించకుండా ఈ కాలంలో కూడా విజయం సాధించొచ్చని నిరూపించిన గీతాలు.


జీవ స్వరాలు:
కిరీటంలో ఏ రత్నాన్ని ఎక్కడ పెడితే ఎంత కాంతి వెదజల్లుతుందో తెలిసినట్లుగా గాయకుల గొంతులోని జీవ స్వరాలను పట్టుకుని పాటలో ఎక్కడ పొదగాలో తెలిసిన సంగీతజ్ఞుడు రెహమాన్‌. అందుకే ‘లవ్‌ బర్డ్స్‌’లోని మనసున మనసున, ‘తెనాలి’లోని ప్రాణమా, ‘కడలి’లోని గుంజుకున్నా వరకు ఎన్నో ఉదాహరణలు.


అన్ని సార్లూ నిజం కాదు:
రెహమాన్‌ పాటల్లో ఆర్కెస్ట్రా సాహిత్యాన్ని, మెలొడీని డామినేట్‌ చేస్తుందన్న ఆరోపణలు అన్ని సార్లూ నిజం కాదు. సన్నివేశాన్ని బట్టి, పాత్రల స్వభావాన్ని బట్టి, దర్శకుడి అభిరుచిని బట్టి దేనికెంత మోతాదులో ఇవ్వాలో తెలిసిన టెక్నిషియన్‌ రెహమాన్‌. ‘పద్మవ్యూహం’ చిత్రంలోని ‘కన్నులకు చూపందం’, ‘నిన్న ఈ కలవరింత లేదులే’ పాటలు ఈ మాటకు నిదర్శనం.

- రాజా (మ్యూజికాలజిస్ట్‌), సేకరణ: రవి సారథి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.