సుస్వరాల ‘ఠీవి’ రాజు
ఇస్తిరీ మడతలు నలగని ప్యాంటు షర్టుతో కూర్చొని, బూజుపట్టిన పాత సంప్రదాయాలను పక్కనపెట్టి, రోజుకి రోజుకి మారుతుండే ప్రేక్షకుల మోజును గమనించి, మట్లు కట్టి రికార్డులుగా వదిలి ఈ నాటికీ విని ఆనందించే సంగీతాభిమానులను సంపాదించుకున్న సుస్వరాల రాజు టి.వి.రాజు పూర్తిపేరు తోటకూర వెంకట రాజు. సాయంత్రమైతే గ్లాస్గో పంచెకట్టి, జుబ్బా ధరించి, వేళ్ల సందున సిగరెట్‌ బిగించి పాండీ బజార్లో నడుస్తూ ఉంటే, కబుర్లాడటానికి ఎదురుచూసే మిత్రులకు ఆ నడకలో సరిగమలు వినిపించేవి. హిందీ, ఇంగ్లిషు సినిమాలు మద్రాసులో విడుదలైతే అవి టి.వి.రాజు చూడకుండా వెళ్లేవి కావు. మద్రాసులో క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంటే, ముందు సీట్లో కూర్చునేది ఆయనే. ఎన్టీఆర్‌ని ‘‘భాయీ’’ అని పిలిస్తే, ఆయన ‘‘ఏమిటి బ్రదర్‌’’ అనకుండా ‘‘గురూ’’ అని పిలిచింది ఈ ‘ఠీవి’ రాజు ఒక్కరినే. ఎన్టీఆర్‌ సినిమా వచ్చిందంటే సంగీత దర్శకుడెవరో చెప్పాల్సిన అవసరం లేని పేరది. చరిత్ర మరువని ‘‘జయ కృష్ణ ముకుందా మురారీ’’ పాటను అజరామరం చేసిన టి.వి.రాజు భౌతికంగా (ఫిబ్రవరి 20, 1973)ఈ లోకాన్ని విడిచారు. ఆ సుస్వరాల రాజుగురించి జ్ఞాపకాలు కొన్ని...


బాలరాజు
టి.వి.రాజు పుట్టింది రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం గ్రామంలో. ఆరేళ్ల ప్రాయంలో తండ్రి చనిపోవడంతో చదువు సాగలేదు. శ్రీనల్లాన్‌ చక్రవర్తుల వద్ద మూడేళ్ల పాటు సంగీతం నేర్చుకొని, సంగీత పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాటకాలు వేసేవారు. కృష్ణుడు, నారదుడు, కనకసేనుడు, భక్తకబీరు, లోహితాస్యుడు వంటి పాత్రల్లో రాణిస్తూ, సురభి కంపెనీకి, అంజనీకుమారి (అంజలీదేవి) నృత్య ప్రదర్శనలకు హార్మోనియం వాయించేవారు. అలా 1946 వరకు ఆంధ్రా, ఒరిస్సా ప్రాంతాల్లో పర్యటిస్తూ అనేక నాటకాలకు, నృత్య ప్రదర్శనలకు సంగీత సహకార మందించారు. మద్రాసు శోభనాచల స్టూడియోలో రమాజోషి అనే ఆవిడ టి.వి.రాజుకు తెలుసు. ఆ స్టూడియోలో హార్మోనిస్టు ఉద్యోగం ఖాళీ అవడంతో రాజును రమ్మని ఆమె టెలిగ్రాం పంపింది. రాజు మద్రాసు చేరడం ఆలస్యమవడంతో ఆ పోస్టు భర్తీ అయిపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తుంటే సంగీత దర్శకులు నాళం నాగేశ్వరరావు పనిచేస్తున్న ‘చంద్రవంక’ సినిమా యూనిట్‌లో పనిచేసే అవకాశం దొరికింది. సీనియర్‌ కాంచన, రఘురామయ్య టి.జి.కమలాదేవి నటించిన ఈ సినిమాకు నాళం నాగేశ్వరరావుతో పాటు ఘంటసాల, కళ్యాణరామన్‌ కూడా పనిచేశారు. అప్పుడే ఘంటసాలతో రాజుకు పరిచయమయింది.

టింగు రంగాతో బ్రేకు
ఎన్టీఆర్, యస్వీఆర్‌లతో కలిసి రాజు మాంబళంలో ఉండేవారు. వారి సాయంతో బియ్యే సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశారు. ఆ సమయంలోనే నిర్మాత పి.ఎస్‌.శేషాచలం సుబ్బారావు దర్శకత్వంలో తెలుగులో ‘టింగు రంగా’ పేరుతో, తమిళంలో ‘శ్యామల’ పేరుతో సినిమాగా నిర్మిస్తూ టి.వి.రాజును సంగీత దర్శకునిగా నియమించారు. యస్‌.బి.దినకరరావు రాజుకు సహాయ సహకారం అందించారు. తెలుగులో హీరోయిన్‌ శ్యామలగా యస్‌.వరలక్ష్మి, హీరోగా శ్రీరామమూర్తి నటించగా తమిళంలో నాటి ప్రసిద్ధ కర్ణాటక విద్వాంసుడు, సూపర్‌స్టార్‌ యం.కె.త్యాగరాయ భాగవతార్‌ హీరో పాత్ర ధరించారు. అందులో టి.వి.రాజు ‘ఉసేని’ (కరహరప్రియ జన్యం) రాగంలో స్వరపరచిన ‘‘రాజా మహారాజా రవికోటి విభ్రాజ సురలోక భూజా’’ పాటను ఘంటసాల పాడగా, అదే పాటను తమిళంలో ‘‘రాజన్‌ మహారాజన్‌ తిరువెట్రియూర్‌ గూర్మేవు తిరువాళల్‌ త్యాగరాజన్‌’’ అంటూ త్యాగరాయ భాగవతార్‌ పాడడమే కాదు తెలుగు మాతృకలో టి.వి.రాజు స్వరపరచిన విధానాన్ని కొనియాడారు. తమిళ చిత్రానికి టి.రామనాధన్‌ సంగీతం సమకూర్చారు. ఇదే సినిమాలో ‘‘శ్యామలా.. శ్యామలా.. లోకప్రియా హే శ్యామలా’’ అనే ఘంటసాల పాట కూడా చాలా పాపులర్‌ అయింది. ఈ పాటకు ప్రభావితమైన ఘంటసాల తన కూతురుకు ‘శ్యామల’ అని పేరు పెట్టారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఈ సినిమా విడుదలయ్యాక టి.వి.రాజుకు మంచి పేరొచ్చింది. తరవాత ఎన్టీఆర్‌ స్వంత బ్యానర్‌ నేషనల్‌ ఆర్ట్స్‌ స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘పిచ్చి పుల్లయ్య’ (53) నిర్మిస్తే దానికి సంగీతం టి.వి.రాజు సమకూర్చారు. ఆ తరవాత వచ్చిన ‘నిరుపేదలు’, ఎన్టీఆర్‌ సొంత సినిమాలు ‘తోడుదొంగలు’ (1954), ‘జయసింహ’ (1955)కు ఆయనే పనిచేశారు. ఇందులో పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా ‘‘ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి’’ సూపర్‌హిట్‌గా నిలిచి టి.వి.రాజు పేరును పాపులర్‌ చేసింది. ‘బేగడ’ రాగంలో సుశీల పాడిన జావళి ‘‘నడిరేయి గడిచేనే’’ మరింత పాపులర్‌ అయింది. 1957లో వచ్చిన ఎన్టీఆర్‌ సొంత సినిమా ‘పాండురంగ మహత్యం’లో రాజు అందించిన సంగీతం అజరామరమై నిలిచింది. ముఖ్యంగా ‘‘జయ కృష్ణా ముకుందా మురారీ’’, ‘‘అమ్మా అని అరచినా ఆలకించవేవమ్మా’’, ‘‘కనవేరా మునిరాజ మౌళీ’’, ‘‘తరంతరం నిరంతరం ఈ అందం’’, ‘‘వన్నెల చిన్నెల నెరా’’, ‘‘నేనని నీవని తలచితిరా...’’ పాటలకు జనం పట్టం కట్టారు. ‘‘జయ కృష్ణా ముకుందా మురారీ’’ పల్లవి బాణీని త్యాగరాయ భాగవతార్‌ తన ‘హరిదాస్‌’ సినిమాలో ఉపయోగించుకోవడం రాజు సంగీత కిరీటంలో ఒక కలికి తురాయిగా మిగిలింది. టి.వి.రాజు పేరు ఎంతలా ప్రభావితమైనదంటే ఆయన సంగీత దర్శకత్వంలో సినిమా తీస్తున్నామని నిర్మాత చెబితే చాలు ఎన్టీఆర్‌ కాల్షీట్లు ఇచ్చేవారట. టి.వి.రాజు వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా (స్లీపింగ్‌ పార్ట్‌నర్‌) ‘బాలనాగమ్మ’ సినిమా నిర్మించారు. ‘పల్లెటూరిపిల్ల’, ‘పిచ్చిపుల్లయ్య’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా వేశారు. ప్రముఖ సంగీత దర్శకులు సత్యం, జోసెఫ్‌ కృష్ణమూర్తి టి.వి.రాజు వద్ద చాలా కాలం సహాయకులుగా పనిచేశారు. 1971లో మధుమేహ వ్యాధి తిరగబెట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 1973లో హృద్రోగంతో హఠాత్తుగా మరణించిన టి.వి.రాజు భౌతికంగా మనముందు లేకున్నా అజరామరమైన ఆయన పాటలు నిరంతరం మనకు రాజు ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

* సూర్యనారాయణరాజు మాటల్లో...

టి.వి.రాజు పెద్దకుమారుడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు. ‘పెదరాజు’ అని ముద్దుగా పిలుచుకునే సూర్యనారాయణరాజు మంచి గిటార్‌ ప్లేయరు. ఆయన అనుభవాలు ఆయన మాటల్లోనే:


‘‘మా తల్లిదండ్రులకు నేను, తమ్ముడు సోమరాజు ఇద్దరమే సంతానం. మమ్మల్నిద్దరినీ బాగా చదివించాలని నాన్నగారు మద్రాసులో పేరుమోసిన హోలీ ఏంజెల్స్, కేసరి హైస్కూళ్లలో చేర్పించారు. మాకు చదువు వంటబట్టలేదు. గుంటూరు రవి ట్యుటోరియల్‌ కాలేజీ అధిపతి ‘సివియన్‌ ధన్‌’ నాన్నకు మంచి స్నేహితుడు. ఆయన ప్రోద్బలంతో నన్ను గుంటూరు పంపారు. అక్కడి వాతావరణం నాకు గిట్టక మద్రాసు వచ్చేశాను. నాన్న లంచ్‌ కోసం ఇంటికి వస్తే ఆ కారులో నేను, తమ్ముడు రికార్డింగు స్టూడియోలకు వెళ్లే వాళ్లం. అక్కడే ఆటా పాటా! చదువు వంటబట్టదని తెలిసి నాన్న మమ్మల్ని ధనరాజ్‌ మాస్టర్‌ వద్ద పియానో శిక్షణకు చేర్చారు. మా తమ్ముడు నాన్న అంచనాలకు మించి స్కూల్‌ ఫైనల్‌ పాసవ్వడంతో డాక్టరీ చదివించాలని ఉవ్విళ్లూరారు. ఎమ్మెస్‌ విశ్వనాథం సిఫారసుతో వివేకానంద కాలేజీలో చేర్చారు. తమ్ముడు మాత్రం కామర్సు కోర్సులో చేరేందుకు మొగ్గు చూపాడు. ఇక నా విషయానికొస్తే దర్శకుడు హేమాంబరధరరావు వద్ద సహాయ దర్శకునిగా చేరాను. ‘ఇంటిదొంగలు’, ‘పరివర్తన’, ‘మనవూరి కథ’, ‘ముగ్గురు మూర్ఖులు’ సినిమాల్లో ఆయన వద్ద పనిచేశాను. తరువాత ‘జీవితంలో వసంతం’ సినిమాకు సహాయకునిగా, ‘ఏది పాపం ఏది పుణ్యం’ సినిమాకు అసోసియేట్‌గా పనిచేశాను. సంగీతం మీద ఉన్న అనురక్తితో సాలూరు రాజేశ్వరరావు వద్ద గిటారిస్టుగా కుదిరాను. నా సోదరుడు సోమరాజు, రాజేశ్వరరావు కుమారుడు కోటేశ్వరరావు కలిసి ‘రాజ్‌-కోటి’ పేరుతో సంగీత దర్శకులుగా ప్రస్థానం ప్రారంభించినప్పుడు వారి తొలి చిత్రం ‘ప్రళయ గర్జన’ నుంచి ‘హలో బ్రదర్‌’ సినిమా దాకా గిటారిస్టుగా పనిచేశాను. ‘పుట్టింటి పట్టుచీర’, ‘నాగాస్త్రం’ సినిమాల తమిళ డబ్బింగ్‌ రికార్డింగు నేనే చేశాను. మా తల్లిగారికి పల్లెటూరు నివాసమంటే ఇష్టం. అందుకే మారంపల్లి గ్రామంలో ఆమె వద్ద ప్రశాంత జీవనం గడిపేందుకు మొగ్గు చూపుతుంటాను. సంవత్సరంలో ఎక్కువ కాలం అక్కడే ఉంటాను. ఇప్పుడు అడపాదడపా విద్యార్థులకు గిటారు పాఠాలు నేర్పుతున్నాను’’.


* సోమరాజు అనుభవవాలు...

రాజ్‌-కోటి సంగీత ద్వయంలో ‘రాజ్‌’గా కీర్తింపబడే వెంకట సోమరాజు సంగీత దర్శకుడిగా అద్వితీయుడు. ఆయన అనుభవాలు రాజ్‌ మాటల్లోనే:


‘‘నాన్నగారి ఆశయాలకు భిన్నంగా నేను బికాం చేశాను. రాజేశ్వరరావుకు నేను ప్రియశిష్యునిగా ఎదిగాను. హిందీ సంగీత దర్శకుడు సి.రామచంద్ర సంగీతమంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం నాన్నకు తెలుసు. ఒకసారి నా పుట్టిన రోజుకు సి.రామచంద్రను మా ఇంటికి తీసుకొచ్చి నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు నాన్న. రామచంద్రంతో కలిసి ఆ రోజు ఓడియన్‌ థియేటర్‌లో జేమ్స్‌బాండ్‌ సినిమా కూడా చూశాం. నాన్నగారి ప్రభావం నామీద ఎంతైనా ఉంది. ఆయన ఎటువంటి పాటకైనా సంప్రదాయబద్దంగా స్వరాలు కూర్చేవారు. ముఖ్యంగా జావళీలు స్వరపరచడంలో నాన్నకు నాన్నే సాటి అని ఘంటాపథంగా చెప్పగలను. ‘జయసింహ’లో ‘‘నడిరేయి గడిచేనే’’, ‘పాండురంగ మహత్యం’లో ‘‘కనవేర ముని రాజమౌళీ’’, ‘రాజనందిని’లో ‘‘నీమీద మనసాయెరా’’, ‘మంగమ్మ శపథం’లో ‘‘అందాల నారాజ అలుకేలరా’’ జావళీలు మచ్చుకు కొన్ని మాత్రమే. నాన్న మొదట్లో ఆది నారాయణరావు వద్ద ‘పల్లెటూరి పిల్ల’ సినిమా నుంచి సహాయకునిగా పనిచేశారు. పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా ఎదిగాక సంగీత దర్శకుడు సత్యం నాన్న వద్ద పనిచేశారు. నాటి తమిళ సూపర్‌స్టార్‌ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజ భాగవతార్‌ ‘శ్యామల’ (తెలుగు టింగ్‌ రంగా) తమిళ సినిమాలో ‘‘రాజన్‌ మహారాజన్‌’’ పాటను, ‘‘జయకృష్ణ ముకుందా మురారి’’ (హరిదాసులో) నాన్న స్వరపరచిన బాణీలోనే పాడారు. అదొక గొప్ప ప్రశంస. నాన్న స్నేహశీలి సాలూరు రాజేశ్వరరావు, మాస్టర్‌ వేణులతో యెంతో సన్నిహితంగా ఉండేవారు. అందుకే కోటితో కలిసి ‘రాజ్‌-కోటి’ పేరుతో కొన్ని వందల సినిమాలకు నేను పనిచేయగలిగాను. మాస్టర్‌ వేణుగారి అబ్బాయి పియానో స్పెషలిస్ట్‌ మూర్తిచందర్‌ కూడా నాకు మంచి మిత్రుడు.

* భార్య జ్ఞాపకాలు...
టి.వి.రాజు సతీమణి సావిత్రిది నిడదవోలు మండలం మారంపల్లి. ఆవిడ హైదరాబాదులో పెద్దకొడుకుతో ఉంటూ పల్లెటూరికి వెళ్లివస్తూ ఉంటారు. ఆమె అనుభవాలు ఆమె మాటల్లోనే:

మాకు 1951లో పెళ్లయింది. పెళ్లికి ముందు మద్రాసు వ్యాసారావు వీధిలో మావారు, ఎన్టీ రామారావు, యస్వీ రంగారావు, కమలదాస్‌లతో కలిసి ఒకే రూములో ఉండేవారు. పెళ్లయ్యాక మద్రాసులోనే కాపురం పెట్టారు. ఎన్టీఆర్‌ భార్య బసవతారకంతో నాకు మంచి స్నేహం. తరచూ కలుస్తుండేవాళ్లం. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘తోడు దొంగలు’, ‘జయసింహ’ ‘పాండురంగ మహత్యం’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’, ‘తల్లా-పెళ్లామా’, ‘కోడలుదిద్దిన కాపురం’ వంటి వరస సినిమాలకు సంగీతం అందించింది మావారే. ఎన్టీఆర్‌ జానపద సినిమాలకు మా వారినే సంగీత దర్శకునిగా నిర్మాతలు ఆహ్వానించేవారు. మా వారికి ఎన్టీఆర్‌ సినిమాల సంగీత దర్శకుడు అని ముద్ర పడటంతో అక్కినేని సినిమాలకు పనిచేసే అవకాశం రాలేదు. కానీ అన్నపూర్ణ సంస్థ సొంత చిత్రం ‘దొంగరాముడు’కు మొదట మావారినే స్వరకర్తగా నియమించారు. అయితే చివరి నిమిషంలో అది పెండ్యాల చేతుల్లోకి వెళ్లింది. ఆ తరవాత అక్కినేని నటించిన ‘శ్రీకృష్ణ మాయ’ సినిమాకు మాత్రం మా వారే మ్యూజిక్‌ చేశారు. ఎన్టీఆర్‌ గారికి నలభై సినిమాల దాకా సంగీతం అందించారు. ‘దేవకన్య’, ‘సప్తస్వరాలు’, ‘కాంభోరాజు కథ’ వంటి కొన్ని బయట సినిమాలకు పనిచేసినా అవి ఎన్టీఆర్‌ సిఫారసు మేరకే! నాకు పాండురంగ మహత్యం, జయసింహ, శ్రీకృష్ణపాండవీయం సినిమాల్లో పాటలంటే యెంతో ఇష్టం. హిందీ గాయకుడు మహమ్మద్‌ రఫీ మద్రాసు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు. ‘తల్లా-పెళ్లామా’, ‘భలే తమ్ముడు’ సినిమాల్లో రఫీ చేత మావారు పాడించారు. మావారి చివరి సినిమా ‘మనుషుల్లో దేవుడు’ (1974)లో కూడా ఎన్టీఆర్‌ హీరో’’.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.