జైకిషన్‌ గీతాలు... జయకేతనాలు!
‘అజీబ్‌ దాస్తాన్‌ హై యే, కహా షురూ కహా ఖతమ్, ఏ మంజిలే హై కౌన్‌ సి, న వో సమజ్‌ సఖే న హమ్‌’ ఇరవయ్యో పడిలో వున్న ఒక యువకుల బృందం కోలాహలంగా జరుగుతున్న పిక్నిక్‌లో ఆలపిస్తున్న ఈ కూనిరాగం ‘దిల్‌ అపనా అవుర్‌ ప్రీత్‌ పరాయి’ (1960) సినిమాలో లతా మంగేష్కర్‌ అద్భుతంగా పాడిన శైలేంద్ర గీతం. నటి మీనాకుమారి రాజకుమార్‌ బృందంతో కలిసి ఒక పడవ ప్రయాణంలో అభినయించిన ఈ గీతానికి స్వరాలు అల్లింది శంకర జైకిషన్‌ ద్వయంలోని జైకిషన్‌. అకార్డియన్, గిటార్, ట్రంపెట్‌ వాద్య జోరులో సాగే ఈ జీవిత సారపు పాట ఆ రోజుల్లో కాలేజి వేడుకల్లోను, రేడియో సిలోన్‌ బినాకా గీత్‌ మాలా కార్యక్రమంలోను తప్పకుండా వినపడుతూనే వుండేది. శంకర్‌ జైకిషన్‌ ద్వయం సృష్టించిన ఇలాంటి పాటలు కోకొల్లలు. అద్భుత సంగీతానికి కర్తలుగా కలిసి, స్నేహానికి ప్రతీకలుగా నిలచిన ఈ సంగీత ద్వయంలోని జైకిషన్‌ దయాబాయ్‌ పాంచాల్, శంకర్‌తో కలిసి 1949 నుంచి 1971 వరకు... దాదాపు ఇరవై రెండేళ్లు హిందీ చిత్రసీమకు అద్భుత సంగీతాన్ని అందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంగీత ప్రయోగాలు చేస్తూ, గొప్పగొప్ప పాటలకు జీవంపోస్తూ జంట సంగీత దర్శకులుగా చరిత్ర సృష్టించారు. అది సెప్టెంబరు 12, 1971 సాయంత్రం. బొంబాయి మెరైన్‌ డ్రైవ్‌ లోని జైకిషన్‌ ఇంటిముందు కోలాహలంగా వుంది. 41 ఏళ్ల పిన్న వయసులో తనువు చాలించిన జైకిషన్‌ ఆఖరి చూపు కోసం తండోపతండాలుగా అభిమానులు గుమికూడారు. శవయాత్ర మొదలై చర్చి గేటుకు దగ్గరలో వుండే ‘గేలార్డ్స్‌ రెస్టారెంట్‌’ వద్దకు చేరుకుంది. ‘ఏ మేరే దిల్‌ కహి అవుర్‌ చల్‌...డూండ్‌ లే అబ్‌ కోయీ ఘర్‌ నయా’ అంటూ ‘దాగ్‌’ (1952) సినిమాలో శైలేంద్ర రాయగా లతాజీ ఆలపించిన పాట మంద్రంగా వినిపిస్తోంది. ఆ రెస్టారెంట్‌కు జైకిషన్‌ కనీసం రోజుకు ఒక్కసారైనా వచ్చేవాడు. అక్కడకు వచ్చేవారి నందరినీ పేరుపేరునా పలకరించేవాడు. జైకిషన్‌ కూర్చునే టేబుల్‌ మీద ఆ రెస్టారెంట్‌ యజమానులు అతని ఫోటో వుంచి సంతాపం ప్రకటిస్తూ కొవ్వొతిని వెలిగించారు. జైకిషన్‌ చనిపోయిన నెలరోజుల వరకూ ఆ టేబుల్‌ను ఎవరికీ కేటాయించకుండా ‘రిజర్వుడ్‌ ఫర్‌ జైకిషన్‌’ అనే బోర్డు తగిలించారు. ఇప్పుడు ఆ కూడలికి ‘శంకర్‌ జైకిషన్‌’ చౌక్‌గా నామకరణం చేశారు. 1971లో జైకిషన్‌ చనిపోయాక కూడా 1987 వరకు శంకర్‌ జైకిషన్‌ పేరు మీదే సంగీత దర్శకత్వాన్ని కొనసాగించి శంకర్‌ స్నేహానికి కొత్త భాష్యం చెప్పారు. సెప్టెంబరు 12 జైకిషన్‌ 47వ వర్ధంతి. ఈ సందర్భంగా జైకిషన్‌ గురించిన కొన్ని జ్ఞాపకాలు...

శంకర్‌తో జైకిషన్‌ దోస్తీ...

శంకర్‌ జైకిషన్‌ జంటను గమనిస్తే బాపు-రమణల స్నేహం గుర్తురాక మానదు. గుజరాత్‌లో నవసారి జిల్లాలోని బంసద పట్టణంలో నవంబరు 4, 1929 జన్మించిన జైకిషన్‌ దయాబాయ్‌ పాంచాల్‌ చిన్నతనం నుంచే హార్మోనియం బాగా వాయించేవాడు. సంగీత విశారద వాడిలాల్‌ వద్ద హిందూస్తానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ప్రేమ్‌ శంకర్‌ నాయక్‌ అతనికి సంగీత పాఠాలు, మెళకువలు నేర్పారు. బొంబాయికి మకాం మార్చాక వినాయక తంబే వద్ద శిష్యరికం చేశారు. ఆరోజుల్లో శంకర్‌ సింగ్‌ రఘువంశి (శంకర్‌) పృథ్వీరాజ్‌ కపూర్‌ సంస్థ పృథ్వీ థియేటర్స్‌ ప్రదర్శించే నాటకాలకు సరోద్, అకార్డియన్, పియానో, హార్మోనియం వాద్యాలను అవసరాన్నిబట్టి వాయిస్తూవుండేవాడు. అలాగే గుజరాతి దర్శకుడు చంద్రవదన్‌ భట్‌తో శంకర్‌కు పరిచయం ఉండడంతో, ఒకసారి జైకిషన్‌ శంకర్‌కు అక్కడే తారసపడ్డాడు. శంకర్‌కు జైకిషన్‌కు మాటలు కలిశాయి. పృథ్వీ థియేటర్లో జైకిషన్‌ను శంకర్‌ హార్మోనియం ప్లేయర్‌గా నియమింపజేశాడు. పృథ్వీరాజ్‌ వారిద్దరిని ‘రామలక్ష్మణుల జోడీ’ అంటూ మెచ్చుకునేవారు. అప్పట్లో కేదార్‌ శర్మ వద్ద రాజకపూర్‌ సహాయ దర్శకుడిగా పనిచేసేవారు. తరవాత రాజ్‌కపూర్, మధుబాలను పరిచయం చేస్తూ ‘నీల్‌ కమల్‌’ (1947) సినిమా నిర్మించాడు. ఆ సమయంలోనే పృథ్వి థియేటర్లో రాజకపూర్‌కు శంకర్‌ జైకిషన్‌లతో పరిచయమైంది. అప్పుడే రాజ్‌కపూర్‌ దర్శకుడిగా మారి తన తొలి ప్రయత్నంగా ‘ఆగ్‌’ (1948) సినిమా నిర్మించే పనిలో వున్నారు. నర్గీస్‌ హీరోయిన్‌గా, రామ్‌ గంగూలీని సంగీత దర్శకుడిగా రాజ్‌కపూర్‌ నియమించారు. స్నేహధర్మంగా ఆ సినిమాకి శంకర్‌ జైకిషన్‌లు సంగీత సహకారం అందించారు. తరువాత 1949లో రాజ్‌కపూర్‌ నర్గీస్‌తో ‘బర్సాత్‌’ సినిమా ప్రారంభించినప్పుడు సంగీత దర్శకుడు రామ్‌ గంగూలీతో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పుడు రాజ్‌కపూర్‌ శంకర్‌ని సంగీత దర్శకుడిగా రమ్మని ఆహ్వానించారు. అయితే జైకిషన్‌ను భాగస్వామిగా తీసుకుంటానని రాజకపూర్‌తో చెప్పగా అందుకు రాజ్‌ అంగీకారం తెలిపారు. అలా ‘బర్సాత్‌’ సినిమాతో శంకర్‌ జైకిషన్‌ల ప్రస్థానం మొదలైంది. రైల్వేశాఖలో పనిచేస్తున్న శైలేంద్రను, బస్‌ కండక్టరుగా పనిచేస్తున్న హస్రత్‌ జైపురిలను గేయ రచయితలుగా రాజ్‌కపూర్‌ నియమించారు. శంకర్‌ జైకిషన్‌ల సిఫారసు మేరకు రాజ్‌కపూర్‌కు ప్లేబ్యాక్‌ పాడేందుకు ముఖేష్‌ను, నర్గీస్, నిమ్మిలకు ప్లేబ్యాక్‌ పాడేందుకు అప్పుడే వృద్ధిలోకివస్తున్న లతామంగేష్కర్‌ను తీసుకున్నారు. తొలి సినిమాతోనే శంకర్‌ జైకిషన్‌లు అందించిన సంగీతం సూపర్‌ హిట్టయింది. ప్లానెట్‌ బాలీవుడ్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వంద సినిమాలను ఎంపిక చేయగా, వాటిలో ‘బర్సాత్‌’ సినిమా సంగీతం తొలి స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా లో స్వరపరచిన ‘ఛోడ్‌ గయే బాలమ్‌’(ముకేష్, లత), ‘జియా బేఖరార్‌ హై’ (లత), ‘హవామే ఉడతా జాయే’ (లత), ‘పత్లి కమర్‌ హై’ (ముఖేష్, లత), ‘బిచ్డే హుయే పరదేశి’ (లత), ‘బర్సాత్‌ మే హమ్‌ సే మిలే’ (టైటిల్‌ గీతం) వంటి పాటలు డెబ్భై ఏళ్లయినా నేటికీ నిత్యనూతనాలుగా విలసిల్లుతూ ఎక్కడో ఒకదగ్గర వినపడుతూనే వున్నాయి. ‘బర్సాత్‌’ సినిమాతో వచ్చిన బ్రేక్‌ తో శంకర్‌ జైకిషన్‌లు సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు. ‘ఆవారా’ (1951) చిత్రంతో మొదలైన వారి సంగీత ప్రస్థానం వరసగా, బాదల్, పూనమ్, అవురత్, నాగినా, కాలి ఘటా, పర్బత్, ఆహ్, బాద్షా, మయూర్‌ పంఖ్, సీమా, శ్రీ 420, బసంత్‌ బహార్, హలకు, న్యూ ఢిల్లీ, కట్‌ పుత్లి, అనారి, చోరి చోరి, దాగ్, బేగునా, యాహుది, బూట్‌ పాలిష్, చోటి బెహన్, షరారత్, లవ్‌ మ్యారేజ్, ఉజాలా వంటి సినిమాలతో అందలం ఎక్కేశారు. ఈ చిత్రాలకు వారు అందించిన అద్భుతమైన సంగీతం పది కాలాలపాటు నిలిచి, అజరామరమైంది. సినిమాలో హీరోలకన్నా శంకర్‌ జైకిషన్‌ లు ఎక్కువ పారితోషికం అందుకునేవారు. ఈ పధ్ధతి వారి చివరి ప్రస్థానం వరకూ కొనసాగడం విశేషం.
                                                                                      

సంగీత సహచరులు...

శంకర్‌ జైకిషన్‌లు ఒక ప్రణాలికా బద్ధంగా మంచి టీంను రూపొందించుకున్నారు. గాయకులుగా మహమ్మద్‌ రఫీ, ముఖేష్, లతామంగేష్కర్, ఆశాభోస్లే; గేయరచయితలుగా హస్రత్‌ జైపురి, శైలేంద్ర ఈ బృందంలో ముఖ్య సభ్యులు. వీరితోనే శంకర్‌ జైకిషన్‌ల సంగీత ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోయింది. శంకర్‌ జైకిషన్‌లకు సహాయకులుగా దత్తారామ్‌ వాడ్కర్, సెబాస్టియన్‌ డిసౌజా వుండేవారు. వారిలో దత్తారామ్‌ రిథం శాఖను పర్యవేక్షిస్తుండగా, సెబాస్టియన్‌ శంకర్‌ జైకిషన్‌లు స్వరపరచే ట్యూన్లకు మ్యూజికల్‌ నోటేషన్లు రాసేవాడు. దత్తారాం, సెబాస్టియన్‌లు ఇద్దరూ గాయనీ గాయకులకు రిహార్సల్స్‌ చేయించడం వంటి పనులు కూడా చూసుకునేవారు. హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతుడైన మన్నాడేని కూడా శంకర్‌ జైకిషన్‌లు బాగానే పోషిస్తూ అవకాశాలు కలిపించేవారు. రాజకపూర్‌ ‘ఆర్కే’ బ్యానర్‌కు శంకర్‌ జైకిషన్‌లు ‘కింగ్‌ పిన్‌’లుగా గణుతికెక్కారు. రాజ్‌కపూర్‌ సినిమాలకు ముఖేష్, మన్నాడేలచేత ఎక్కువ పాటలు పాడించేవారు. ఆ రోజుల్లో సంగీత దర్శకులుగా రాణించడం నల్లేరు మీద బండి నడక కాదు. నిష్ణాతులైన సంగీత దర్శకులు నౌషాద్, సచిన్‌ దేవ్‌ బర్మన్, సి.రామచంద్ర, రోషన్, రవి, ఒ.పి.నయ్యర్, మదన్‌ మోహన్‌లతో పోటీపడాల్సి వచ్చేది. అందుకోసం ఒ.పి.నయ్యర్‌లాగే శంకర్‌ జైకిషన్‌ ఒక ప్రత్యేక శైలిని సంతరించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. నలభయ్యో పడిలోనే శైలేంద్ర చనిపోవడంతో గుల్షన్‌ బావరా, ఇందీవర్, నీరజ్, మజ్రూహ్‌ సుల్తాన్‌ పురి, రాజేంద్ర క్రిషన్‌లను గేయరచయితలుగా వీరు ప్రోత్సహించారు. రాజకపూర్‌ సంస్థకు ఆస్థాన సంగీతకారులుగా వున్న శంకర్‌ జైకిషన్‌ చివరిదాకా రాజ్‌కపూర్‌తోనే ప్రయాణం చేశారు. తీరిక సమయాల్లో రాజ్‌కపూర్‌ శంకర్‌ జైకిషన్‌లచేత బాణీలు కట్టించి ఆ స్వరసంపదను తనవద్ద నిక్షిప్తం చేసుకున్నారు. జైకిషన్‌ మరణానతరం నిర్మించిన సినిమాల్లో ఆ బాణీలను లక్ష్మికాంత్‌ ప్యారేలాల్‌ చేత అభివృద్ధి చేయించి ‘బాబీ’, ‘సత్యం శివం సుందరం’, ‘ప్రేమ్‌ రోగ్‌’ సినిమాలకు రాజ్‌కపూర్‌ వాడుకున్నారు. అలాగే ‘రామ్‌ తేరి గంగా మైలి’ సినిమాలో రవీంద్ర జైన్‌ చేత కొన్ని ట్యూన్లను అభివృద్ధి చేయించి వాడుకున్నారు. శంకర్‌ జైకిషన్‌ సంగీతాన్ని ఉపయోగించుకున్న హీరోల్లో మొదట షమ్మికపూర్, రాజేంద్ర కుమార్‌లను ఉదహరించాలి. వీరికి అత్యధిక హిట్లు శంకర్‌ జైకిషన్‌ సంగీతం అందించిన చిత్రాల ద్వారానే వచ్చాయి. దేవానంద్, సునీల్‌ దత్, మనోజ్‌ కుమార్, బిశ్వజిత్, జాయ్‌ ముఖర్జీ, ధర్మేంద్ర వంటి హీరోల చిత్రాలకు కూడా శంకర్‌ జైకిషన్‌ సంగీతం సమకూర్చారు. శంకర్‌ జైకిషన్‌లను దేవుళ్లుగా ఆరాధించే దత్తారాం చివరిదాకా శిష్యులుగా వారితోనే వుండిపోయారు. శంకర్‌ జైకిషన్‌లకు 1968లో సంయుక్తంగా భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు ప్రదానం చేసింది. అలాగే 2013లో భారత తపాలా శాఖ వీరి ప్రతిమలతో తపాల బిళ్లను విడుదల చేసింది. ఉత్తమ సంగీత దర్శకులుగా శంకర్‌ జైకిషన్‌ తొమ్మిదిసార్లు ఫిలింఫేర్‌ బహుమతులు అందుకున్నారు. పదకొండుసార్లు ఆ బహుమతికి నామినేట్‌ అయ్యారు. అంటే ఇరవైసార్లు ఫిలింఫేర్‌ బహుమతికి అర్హత సాధించి పోటీలో నిలిచారన్నమాట. నేటికీ ఈ రికార్డును సాధించిన వారు మరొకరు లేరు.

భాగస్వామ్యంలో వెలుగునీడలు

మనుషులన్నాక భిన్నాభిప్రాయాలు వుండడం సహజం. వాటికి ఎవరూ అతీతులు కారు. పైగా ఎవరైనా పచ్చగా వుంటే వారి మీద రాళ్లు చల్లడానికి ప్రయత్నించే లోకమిది. ఈ పరిస్థితి శంకర్‌ జైకిషన్‌లకూ తప్పలేదు. ఓ సందర్భంలో జైకిషన్‌ ఫిలింఫేర్‌ పత్రికకు వ్యాసం రాస్తూ ‘సంగమ్‌’ సినిమాలో హిట్‌ పాట ‘యే మేరా ప్రీమ్‌ పత్‌ప్రడ్‌ కర్‌’ పాటకు స్వరాలు కూర్చింది తానేనని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని కిట్టనివాళ్లు చిలవలు పలవలు అంటగట్టి ఇరువురి మధ్య చిచ్చు పెట్టేందుకు తయారయ్యారు. శంకర్‌ జైకిషన్‌ల మధ్య ఒప్పందం గోప్యమైనది. సంగీత రహస్యాలు మూడోకంటికి తెలుపరాదన్నది ఆ ఒప్పంద నిబంధన. ఇదే సమయంలో శంకర్‌ ‘శారద’ అనే నూతన గాయనిని ప్రోత్సహించి ఆమెకు అవకాశాలు ఇవ్వసాగాడు ‘తిత్లి వుడీ వూడ్‌ జో చలీ, ఫూల్‌ నే కహా, ఆజా మేరే పాస్‌’; ‘దేఖో మేరా దిల్‌ మచల్‌ గయా’ (సూరజ్‌), ‘జాన్‌-ఎ- చమన్‌ షోలా బదన్‌’ (గుమ్‌ నామ్). ‘లేజా లేజా లేజా మేరా దిల్‌’ (ఎం ఈవెనింగ్‌ ఇన్‌ పారిస్‌), ‘చలే జానా జరా టెహరో’ (అరౌండ్‌ ది వరల్డ్‌) వంటి వైవిధ్యమైన పాటలు ఆమె పాడినవే. శారద రాకతో జైకిషన్‌ వేరుగా, శంకర్‌ వేరుగా పాటలకు మట్లు కట్టి ఉమ్మడిగా రికార్డింగ్‌ చెయ్యడం మొదలెట్టారు.ఈ ఈ ప్రక్రియ చాలా గోప్యంగా జరిగేది. బయటకు మాత్రం ఇద్దరు కలిసే చేస్తున్నట్లు తెలిసేది. ఈ సమయంలో మహమ్మద్‌ రఫీ కలిపించుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడు. సయోధ్య అయితే కుదిరింది కానీ, వీరు సమకూర్చుతున్న సంగీతం నాణ్యత బలహీనపడుతూ వచ్చింది. ముఖ్యంగా ‘సచ్చాయీ’, ‘షత్రంజ్‌’, ‘యకీన్‌’, ‘ధర్తి’ సినిమాలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. శంకర్‌కు శైలేంద్ర, జైకిషన్‌కు హస్రత్‌ జైపురి పాటలు రాయడం మొదలైంది. వీరి పాపులారిటీని తగ్గించేందుకు కొంతమంది ఈ విభేదాలను బయట ప్రపంచానికి తెలిసేలా బాకా ఊదారు. శంకర్‌ కొన్ని శారద సినిమాలకు అజ్ఞాత సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని లతా మంగేష్కర్‌ అతనిమీద ధ్వజమెత్తింది. ‘సంగం’ సినిమాలో లతా చేత ‘మై క్యా కరూ రామ్‌ ముఝే బుడ్డా మిల్‌ గయా’ పాటను తన ఇష్టానికి విరుద్ధంగా పాడించారనే నెపంతో శంకర్, రాజ్‌కపూర్‌లకు లతా మంగేష్కర్‌ దూరం జరిగింది. అయితే జైకిషన్‌ పిలిస్తే మాత్రం వెళ్లి పాడుతుండేది.

మరిన్ని విశేషాలు...
* 1966లో ‘ఎన్‌ ఈవెనింగ్‌ ఇన్‌ పారిస్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు శంకర్‌ జైకిషన్, గేయ రచయిత హస్రత్‌ జైపురి కూడా పారిస్‌ వెళ్ళారు. ఒకరోజు జైకిషన్, హస్రత్‌ జైపురి ఒక నైట్‌ క్లబ్‌కు వెళ్ళారు. మిరుమిట్లుగొలిపే దీపాల వెలుగులో చాలామంది డ్యాన్స్‌ చేస్తూ వున్నారు. జైకిషన్‌కు ఆ సన్నివేశం చూస్తుండగా ఒక ట్యూన్‌ స్ఫురించింది. ఆ ట్యూనుకు సరిపోయే ప్రారంభ పాదాన్ని (ముఖడా) కూడా రాసి హస్రత్‌ జైపురికి చూపించాడు. అందుకు హస్రత్‌ అనుగుణంగా పల్లవితోబాటు చరణాలు అల్లారు. అలా పురుడుపోసుకున్నదే ‘బదన్‌ పే సితారే లబెతే హుయే’ పాట.

* ‘శంకర్‌ జైకిషన్‌: రాగా, జాజ్‌ స్టైల్‌’ అనే పేరుతో ఈ జంట ఒక ప్రైవేట్‌ ఆల్బంను తయారుచేసి విడుదల చేసింది. అందులో జానపద, జాజ్, హిందూస్తానీ రాగాల కలయికతో అద్భుతమైన శాస్త్రీయ పాటలకు స్వరాలు అల్లారు. తోడి రాగంతో మొదలై, మాల్కోస్, కళావతి, తిలక్‌ కామోద్, మియన్‌ మల్హర్, బైరాగి. జైజయవంతి, పిలు, శివరంజని రాగాల మేళవింపుతో కలిసి భైరవి రాగ మాలికతో ఈ ఆల్బం ముగుస్తుంది. ఈ ఆల్బంకు మంచి డిమాండ్‌ ఉంది. శంకర్‌ జైకిషన్‌ ఆల్బంలకు పాటలకు గ్రీస్‌ నుంచి గాజా స్టిప్ర్‌ దాకా, శ్రీలంక, రష్యా, జపాన్, యూరప్, అమెరికా దేశాల్లో అభిమానులు వుండేవారు. అక్కడ వీరి పాటలు ఎప్పుడూ వినిపిస్తూనే వుంటాయి.

* శంకర్‌ జైకిషన్‌ సమకూర్చే బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతంతో తరవాత నిర్మించిన సినిమాల్లో ఆ ట్యూన్లతో పాటలు స్వరపరచిన ఘనత శంకర్‌ జైకిషన్‌ ద్వయానిదే. ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాలో వినిపించే ‘జానే కహా గయే ఓ దిన్‌’ పాట స్వరాన్ని శంకర్‌ జైకిషన్‌లు ‘జిస్‌ దేశ్‌ మే గంగా బెహతీ హై’లో నేపథ్య సంగీతంగా వినిపించారు. ‘ఉజాలా’ సినిమాలో లతాజీ పాడిన ‘హో మోరా నాదాన్‌ బాలమా న జానే జీ కి బాత్‌’ పాటకు ‘మయూర్‌ పంఖ్‌’ సినిమాలో టైటిల్‌ మ్యూజిక్‌ ఆధారం. అలాగే ‘చోటి బెహన్‌’ లో వినిపించే ‘జావూ కహాఁ బాతా యే దిల్‌’ పాటను ‘న్యూ ఢిల్లీ’ సినిమాలో అందించిన నేపథ్య సంగీతం ఆధారంగా స్వరపరచారు. ‘కిసీ ముస్కురాతోంపే’ అంటూ ‘అనాడి’ సినిమాలో వినిపించే పాటకు ‘శ్రీ 420’ సినిమాలోని నేపథ్య సంగీతం ఆధారం.
* శంకర్‌తో విభేదించిన జైకిషన్‌ దూరం జరిగాడు. దాంతో మద్యం ఎక్కువగా తీసుకోవడం ఆరంభించాడు. అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వలన కాలేయం దెబ్బతిని 1971 సెప్టెంబరు 12న పిన్న వయసులోనే జైకిషన్‌ మరణించాడు. జైకిషన్‌ చనిపోయాక శంకర్‌ తమ జంట పేరుతోనే సంగీత దర్శకత్వం కొనసాగించాడు. కానీ శంకర్‌ అందిస్తున్న నాణ్యత రాజ్‌కపూర్‌కు నచ్చక లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌కు ‘బాబీ’ సినిమా అప్పగించాడు. పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ‘సత్యం శివం సుందరం’, ‘ప్రేమ రోగ్‌’ సినిమాలు కూడా వారికే అప్పజెప్పాడు.
* ఎ.వి.ఎంవారు హిందీలో నిర్మించిన ‘మై సుందర్‌ హూ’ సినిమాలో జైకిషన్‌ జైకిషన్‌ ఆనంద్‌ బక్షితో కలిసి ఒకచోట కనిపిస్తాడు. శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో గేయరచయిత ఆనంద బక్షి పాటలు రాసింది ఈ ఒక్క సినిమాకే కావడం విశేషం. అలాగే శంకర్‌ జైకిషన్‌ సంగీతం సమకూర్చిన ఒకే ఒక పౌరాణిక చిత్రం ‘కృష్ణ కృష్ణ’. అలాగే శంకర్‌ జైకిషన్‌ సంగీత దర్శకత్వంలో కిషోర్‌ కుమార్‌ దేవానంద్‌ కు ఒకే ఒక పాట పాడారు. ఆ చిత్రం ‘దునియా’. ఆశా భోస్లేతో కలిసి పాడిన ఆ పాట ‘దూరియా నజదీకియా బన్‌ గాయీ అజబ్‌ ఇత్తిఫాఖ్‌ హై’.

జైకిషన్‌ స్పూర్తితో శంకర్‌ జైకిషన్‌ పాటలుకొన్ని...

                                                                 * హవామే ఉడతా జాయే మోరా లాల్‌ దుపట్టా మల్మల్‌ కా (బర్సాత్‌)

* పత్లి కమర్‌ హై తిర్చీ నజర్‌ హై (బర్సాత్‌)

* ఆవారా హూ.. యా గర్దిష్మే హూ ఆస్మాన్‌ కా తారా హూ (ఆవారా)

* ఆజారే అబ్‌ మేరా దిల్‌ పుకారా (ఆహ్‌)

* మేరా జూతా హై జపానీ, ఏ పట్లూన్‌ ఇంగ్లీస్తాని (శ్రీ 420)

* ప్యార్‌ హువా ఇఖరార్‌ హువా హై ప్యార్‌ సే ఫిర్‌ క్యోం డరతా హై దిల్‌ (శ్రీ 420)

* సుర్‌ న సజే క్యా గాంవ్‌ మే, సుర్‌ కే బినా జీవన్‌ సూనా (బసంత్‌ బహార్‌)

* అజీబ్‌ దాస్తాన్‌ హై ఏ, కహా షురూ కహా ఖతమ్‌ (దిల్‌ అప్నా అవుర్‌ ప్రీత్‌ పరాయీ)

* బేగాని షాది మే అబ్దుల్లా దీవానా (జిస్‌ దేశ్‌ మే గంగా బహతీ హై)

* ఓ బసంతి పవన్‌ పాగల్‌ న జారే న జా రోకో కోయి (జిస్‌ దేశ్‌ మే గంగా బహతీ హై)

* యాహూ... చాహే కోయి ముఝే జంగ్లి కహే (జంగ్లీ)

* తేరి ప్యారీ ప్యారీ సూరత్‌ కో కిసీ కి నజర్‌ న లగే (ససురాల్‌)

* ఏ గుల్బదన్‌ ఫూలోం కి మెహక్‌ కాంట్నో కి చుబన్‌ (ప్రొఫెసర్‌)

* రుక్‌ జా రాత్‌ టెహర్‌ జా రే చందా బీతే నా మిలన్‌ కి యే (దిల్‌ ఏక్‌ మందిర్‌)

* ఏప్రిల్‌ ఫూల్‌ బనాయా తో ఉనకో గుస్సా ఆయా (ఏప్రిల్‌ ఫూల్‌)

* హర్‌ దిల్‌ జో ప్యార్‌ కారేగా వో గానా గాయేగా (సంగమ్)

* జాన్‌ పెహచాన్‌ హో,. జీనా ఆసాన్‌ హో (గుమ్‌ నామ్)

* జావో రే జోగి తుమ్‌ జావో రే , ఏ హై ప్రేమియోం కి నగరి (ఆమ్రపాలి)

* బహారోం ఫూల్‌ బరసావో మేరా మెహబూబ్‌ ఆయా హై (సూరజ్‌)

* ఎహసాన్‌ మేరే దిల్‌ పే తుమ్హారా హై దోస్తోం (గబన్‌)

* సజన్‌ రే ఝూట్‌ మత్‌ బోలో ఖుదా కే పాస్‌ జానా హై (తీస్రీ కసమ్)

* ఆస్మాన్‌ సే ఆయా ఫరిష్తా ప్యార్‌ కా సబక్‌ దిఖ్‌ లానే (ఎన్‌ ఈవెనింగ్‌ ఇన్‌ పారిస్‌)

* ఆజ్‌ కల్‌ తేరే మేరే ప్యార్‌ కే చరతే హర్‌ జబాన్‌ పర్‌ (బ్రహ్మచారి)

* పరదే మే రెహనే దో పరదా నా ఉటావో (షికార్‌)

* బదన్‌ పే సితారే లపేతే హుయే (ప్రిన్స్‌)

* ఏ భాయ్‌ జరా దేఖ్‌ కే చలో ఆగే భి నహీ పీచే భీ (మేరా నామ్‌ జోకర్‌)- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.