సంగీత శిఖామణి.... శివమణి
ఆ వాద్యం హృద్యం. రసికజన నైవేద్యం. గుండెల్లో మార్మోగే సంగీత నాదం. ఆ వాద్యం వింటుంటే... శ్రోతలు పూనకాలతో ఊగిపోతారు. సర్వం మరిచి స్వర్గసీమలో తేలియాడుతారు. మెస్మరైజ్‌ చేసే ఆ వాద్య రసధునిలో తలారా స్నానిస్తారు. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... అన్న ఆర్యోక్తికి అసలు సిసలైన సంగీతానువాదం ఆయన శైలి. ఆయనే... భారతీయ సంగీత ప్రపంచాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అనేకమంది అంతరంగాల్ని స్పృశించిన విఖ్యాత కళాకారుడు. పేరు శివమణి. అంతా... ఆయనలోని కళని గుర్తించి ‘డ్రమ్స్‌ శివమణి’గా అభివర్ణిస్తారు. డ్రమ్స్, ఆక్టోబాన్, దర్బుకా, ఉడుకాయి, కంజరలతో పాటు మరికొన్ని సంగీత వాద్యాలను వాయిస్తారు.  ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు సితార.నెట్‌ కోసం.


ఐపీఎల్‌ ద్వారా గుర్తింపు
2008, 2010 సంవత్సరాలలో ఐపీఎల్‌ ఛాంపియన్‌ షిప్స్‌ జరుగుతున్నప్పుడు శివమణి డ్రమ్స్‌ వాయించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీంతో ఈయనకు అనుబంధం ఉంది. అయితే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రహమాన్‌ సారధ్యంలో సంగీత సాధనాలు వాయించినందుకు శివమణికి ఎక్కువ గుర్తింపు లభించింది. ఏ.ఆర్‌.రెహమాన్, శివమణి చిన్ననాటి స్నేహితులు. 2019లో భారత ప్రభుత్వం శివమణికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
కుటుంబ నేపథ్యం
శివమణి చెన్నైకి చెందినవారు. ఏడు సంవత్సరాల వయస్సు నుంచి డ్రమ్స్‌ వాయించడం మొదలుపెట్టారు. పదకొండు సంవత్సరాల వయసు నుంచి సంగీతాన్ని వృత్తిగా స్వీకరించారు. రసజ్ఞులను అలరించే కెరీర్‌ని మొదలుపెట్టారు. ఆ తరువాత ముంబైకి మకాం మార్చారు. శివమణి నోయెల్‌ గ్రాంట్, బిల్లే కోభామ్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. అంతే కాదు, ఎం.ఎస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌ తదితరులతో పని చేసి ప్రతిభ కనబరిచారు. 1990లో, బిల్లే కోభామ్‌తో ముంబైలోని రంగ్‌ భవన్వేదికను పంచుకున్నారు. ఆయన ప్రముఖ గాయకుడు ఎస్‌.పీబాలసుబ్రహ్మణ్యాన్ని గాడ్‌ ఫాదర్‌గా చెప్పుకుంటారు.


కర్ణాటక సంగీతంలోనూ అసమాన ప్రతిభ
కర్నాటిక్‌ సంగీత విద్వాంసులైన కున్నాకుడి వైద్యనాథన్, టి.వి.గోపాల్‌కృష్ణన్, వల్లీయాపట్టి సుబ్రమణ్యం, పళణివేల్‌ ,ఎల్‌.శంకర్‌లతో మొదట సంగీత ప్రయోగాలను చేసేవారు శివమణి. కెరీర్‌ తొలి దశలో కోలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్శకుడైన టి.రాజేందర్‌తో అనేకసార్లు పని చేశారు. ముంబైలో జరిగిన కచేరీలో తబలా విద్యాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ తనతో మరియు త్రిలోక్‌ గుర్తుతో వేదికను పంచుకోవాలని ఆహ్వానించారు. అప్పటి నుంచి శివమణి లూయిస్‌ బ్యాంక్స్‌తో సహా ఎంతోమంది సంగీత విద్వాంసులతో కలిసి పనిచేసారు. ఏ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి ఎన్నో ప్రపంచ ప్రదర్శనలు ఇచ్చారు. రెహమాన్‌తో కలిసి ‘బొంబాయి డ్రీమ్స్‌’కు పని చేశారు. ‘శ్రద్ధా’ అనే సంగీత బృందంలో శివమణి భాగస్వాములు. ఈ బృందంలో శంకర్‌ మహదేవన్, హరిహరన్, యూ.శ్రీనివాస్, లాయ్‌ మెన్డోన్సాలు ఉన్నారు.
‘ఏషియా ఎలెక్టిక్ర్‌’ బ్యాండ్‌ వ్యవస్థాపకుడు
శివమణికి ‘ఏషియా ఎలెక్టిక్ర్‌’ అనే బ్యాండ్‌ ఉంది. ఈ సంగీత బృందంలో నీలాద్రి కుమార్, లూయిస్‌ బ్యాంక్స్, రవి చారిలు సభ్యులుగా పనిచేస్తున్నారు. ‘సిల్క్‌ అండ్‌ శ్రద్ధ’ అనే మరొక ప్రపంచ సంగీత బ్యాండ్‌కు కూడా శివమణి సభ్యుడిగా ఉన్నారు.


తమిళనాడుకు చెందిన అనేక సంగీత దర్శకులతో శివమణి పని చేశారు. ‘రోజా’, ‘రంగ్‌ దే బసంతి’, ‘స్వదేశ్‌’, ‘తాల్‌’, ‘లగాన్‌’, ‘దిల్‌ సే’, ‘గురు’, ‘కాబుల్‌ ఎక్స్‌ ప్రెస్‌’, ‘రాక్‌ స్టార్‌’ సినిమాలకు డ్రమ్స్‌ని వాయించారు. అత్యంత పెద్ద హిట్టు అయిన ‘కాదల్‌ రోజవే’ (తెలుగులో ‘నా చెలి రోజా), ‘చెయ్య చెయ్య’ అనే పాటలకు శివమణి వర్క్‌ చేశారు. శివమణి ‘పడమటి సంధ్య రాగం’, ‘సిరివెన్నెల’ అనే రెండు తెలుగు సినిమాలలో నటించారు. 2016లో వచ్చిన ‘మదారి’ అనే హిందీ సినిమాలో కూడా నటించారు.


* దుబాయ్, మాస్కో, న్యూ యార్క్, టొరంటో తదితర ప్రదేశాలలో శివమణి ప్రదర్శన ఇచ్చారు. 2005లో జరిగిన ముంబై ఫెస్టివల్లో ప్రఖ్యాత దిగ్గజ శీతల పానీయ సంస్థ ‘కోకాకోలా’వారు ‘లిమ్కా ఫ్రెష్‌ ఫేస్‌ 2005’ ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వమని శివమణిని ఆహ్వానించారు. ఆ వేడుకలో లిమ్కా బాటిల్స్‌తో శివమణి మెలోడీ సృష్టించారు. ‘కార్టూన్‌ నెట్‌ వర్క్‌’, ‘పోగో’ ఛానల్‌లో ‘గాలీ సిమ్‌ సిమ్‌’ అనే విద్యా సంబంధిత కార్యక్రమానికి కూడా శివమణి పనిచేశారు.
పురస్కారాలు
2009లో, కళారంగంలో అత్యున్నత రాష్ట్ర గౌరవం అయిన ‘కలైమమణి’ బిరుదును శివమణికి తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసింది. 2019లో శివమణికి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదును ప్రదానం చేసింది.


ఆల్బమ్స్‌
1994లో, కర్నాటిక్‌ సంగీత ప్రయోగాత్మకమైన ‘గోల్డెన్‌ కృతిస్‌ కలర్స్‌’ అనే ఆల్బంకు ఏ.ఆర్‌.రెహమాన్, జాకిర్‌ హుస్సేన్, శ్రీనివాసన్, కున్నాకుడి వైద్యనాథన్లతో కలిసి పనిచేశారు శివమణి. ఆ తరువాత 2000వ ఏడాదిలో ‘ప్యూర్‌ సిల్క్‌’, ‘కృష్ణ కృష్ణ’, 2003లో ‘డ్రమ్స్‌ ఆన్‌ ఎర్త్‌’, ‘కాష్‌’, ‘మహాలీల’, తదితర ఆల్బమ్స్‌కు వర్క్‌ చేశారు శివమణి. ‘కృష్ణ కృష్ణ’ అనేది యూకేలో విడుదలైన ఒక క్లబ్‌ ట్రాక్‌. ఈ ట్రాక్‌ని మలయాళం కంపోజర్‌ రాహుల్‌ రాజ్‌తో విడుదల చేశారు. ‘కాష్‌’ అనేది హరిహరన్‌తో చేసిన మొట్టమొదటి గజల్‌ ఆల్బం. ‘మహాలీల’ అనే ఆల్బంని శివమణి మొట్టమొదటగా చేసిన వ్యక్తిగత ఆల్బం. ఇంకా ‘అరిమా నంబి’, ‘కనితన్‌’ సినిమాలకూ సంగీతాన్ని అందించారు. ఇటీవలే మనకు తెలుగులో ‘కనితన్‌’ సినిమా ‘అర్జున్‌ సురవరం’గా రీమేక్‌ అయింది. శివమణి సంగీతం కోసం ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.