మాటల్నే పాట చేసిన సంగీత దర్శకుడు

భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ..., వారెవా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసూ..., హాయ్‌రే హాయ్‌ జాం పండురోయ్‌..., ఐయామ్‌ వెరీ గుడ్‌ గాళ్‌... ఇలా గుర్తిండిపోయే బాణీలెన్నింటినో సృష్టించిన సంగీత దర్శకుడు శ్రీ. స్వరకర్తగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా కూడా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రవేశారాయన. ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి రెండో కుమారుడైన శ్రీ సెప్టెంబరు 13, 1966న గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పొన్నెకల్లులో జన్మించారు. అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. తెలుగు చిత్రసీమలో మాత్రం శ్రీ పేరుతోనే ప్రాచుర్యం పొందారు. ఇండిస్ట్రియల్‌ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన శ్రీ తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. సంగీతంపై మక్కువతో సినిమా రంగంపై దృష్టిపెట్టారు. ఓ టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి సంగీత కార్యక్రమానికి గాయకులు సునీతతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ షోతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘లారీడ్రైవర్‌’ సినిమాకి నేపథ్య సంగీతం అందించాడు. ‘పోలీస్‌ బ్రదర్స్‌’ ఆయనకి తొలి చిత్రం. కథానాయకుడిగా అవకాశాలు వచ్చినా కాదనుకొని సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించారు. ‘సింధూరం’ సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి ‘రుక్మిణి’లో కథానాయకుడిగా అవకాశం ఇచ్చినా ఆయన నో చెప్పడంతో వినీత్‌ని ఎంపిక చేసుకొని సినిమా చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘గాయం’ శ్రీ కెరీర్‌కి మలుపునిచ్చింది. అందులో సిరివెన్నెల రాసిన ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని...’ పాటతో ఆ చిత్ర దర్శకుడైన శ్రీకి కూడా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వర్మ దర్శకత్వంలో ‘మనీ’, ‘మనీ మనీ’, ‘అనగనగా ఒక రోజు’, ‘సింధూరం’, ‘లిటిల్‌ సోల్జర్స్‌’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అమ్మోరు’, ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘కాశీ’, ‘సాహసం’, ‘ఆడు మగాడ్రా బుజ్జీ’, ‘చంటిగాడు’, ‘నీకే మనసిచ్చాను’ తదితర సినిమాలకి శ్రీ సంగీతం అందించాడు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘అంజి’ చిత్రంలోని ఒక పాటని స్వర పరిచారు శ్రీ. ‘అప్పూ’ అనే బాలల చిత్రానికి చివరిగా శ్రీ సంగీతం అందించారు. హాయ్‌రబ్బా పేరుతో గాయకురాలు స్మితతో కలిసి రూపొందించిన ప్రైవేట్‌ ఆల్బమ్‌ శ్రీకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ‘చక్రం’లో జగమంత కుటుంబం నాది..., ‘ఖడ్గం’లో సత్యం పలికే హరిశ్చంద్రులం... పాటలతో గాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు శ్రీ. ‘అనగనగా ఒక రోజు’ చిత్రంలో మా ఫ్రెండు చెల్లెల్ని కొందరు ఏడిపించారు... పాట శ్రీ శైలిని చాటి చెబుతుంది. మామూలు మాటల్ని సైతం ఒక పాటగా మలచొచ్చని శ్రీ తన బాణీలతో చాటి చెప్పారు. ‘లిటిల్‌ సోల్జర్స్‌’ సినిమాలో రమేష్‌ అరవింద్‌కీ, ‘ఆనంద్‌’ సినిమాలో ఆకాశ్‌కీ, ‘143’ చిత్రంలో సాయిరాం శంకర్‌కి డబ్బింగ్‌ చెప్పారు శ్రీ. ఎంతో ప్రతిభ ఉన్నా... శ్రీ ప్రయాణం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. పరిశ్రమ నన్ను అర్థం చేసుకోలేదని ఆయన చెబుతుండేవారు. శ్రీ తన పక్కింటికి చెందిన అరుణని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారికి రాజేష్‌ చక్రవర్తి అనే అబ్బాయి ఉన్నారు. కిడ్నీ సంబంధించి సమస్యలతో కొంతకాలంపాటు బాధపడిన ఆయన ఏప్రిల్‌ 18, 2015న హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు శ్రీ వర్ధంతి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.