విశ్వనాథుని వీడిన రాముడు... టి.కె. రామమూర్తి

ఎం.ఎస్. విశ్వనాథన్ పేరుతో కలిపి చెబితేనే రామమూర్తి ఎవరో అనేది తెలుస్తుంది. ఇది నిజం! రామమూర్తి పూర్తి పేరు తిరుచురాపల్లి కృష్ణస్వామి రామమూర్తి (టి.కె. రామమూర్తి). అతడు అద్భుత వయోలినిస్టు. ఆయనను ‘మెల్లిసై మన్నార్’ (లలిత సంగీత సామ్రాట్-కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) అని తమిళ సంగీతాభిమానులు కీర్తిస్తుంటారు. తమిళ, మళయాళ, తెలుగు చిత్రసీమల్లో రామమూర్తిని తెలియని ఆనాటి తరం సంగీతాభిమానులు వుండరు. ఎం.ఎస్. విశ్వనాథన్ తో కలిసి జంటసంగీత దర్శకులుగా రామమూర్తి సుపరిచితులు. 1950-60 మధ్యకాలంలో ఇద్దరూ కలిసి వంద సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం నిర్వహించారు. 1965లో రామమూర్తి తన భాగస్వామి ఎం.ఎస్. విశ్వనాథన్ ను వీడి సొంతంగా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. కానీ సంగీత దర్శకునిగా విశ్వనాథన్ కు వచ్చినంత మంచి పేరు ఎందుచేతో రామమూర్తికి రాలేదు. అయితే 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరవాత రామమూర్తి విశ్వనాథన్ తో కలిసి సంతాన భారతి దర్శకత్వంలో వి. సుందరన్ 1995లో నిర్మించిన ‘ఎంగిరుందో వందాన్’ అనే కామెడీ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రోజా, ఆమని, విజయకుమార్, భానుచందర్, కళ్యాన్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. ‘ఎంగిరుందో వందాన్’ సినిమా ఇంతటి సుదీర్ఘ విరామం తరవాత వీరిద్దరూ కలిసి పనిచేసిన ఒకే ఒకచిత్రం కావడం విశేషమే కాదు ఒకరకంగా విషాదభరితం కూడా. కారణం ఈ సినిమాకు వీరిద్దరూ కలిసి అందించిన సంగీతం ప్రేక్షకులను రంజింపజేయలేదు సరికదా, సినిమా కూడా ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. రామమూర్తి ఏప్రిల్ 17 2013 న తన 91 వ ఏట చెన్నై లో కన్ను మూశారు. ఆయన 7వ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం...


వయోలినిస్టుగా ఎదిగి...
రామమూర్తి 15 మే 1922న తమిళనాడు లోని తిరుచిరాపల్లి లో సంగీత నేపథ్య కుటుంబంలో జన్మించారు. రామమూర్తి తాతగారు మలైకొట్టై గోవిందసామి, తండ్రి కృష్ణస్వామి పిళ్ళై ఇద్దరూ తిరుచిరాపల్లి చుట్టుప్రక్కల అద్భుత వయోలినిష్టులు గా కీర్తి గడించారు. బాల్యంనుంచే తండ్రితో కలిసి రామమూర్తి అనేక సంగీత కార్యక్రమాల్లో వయోలిన్ వాయించేవారు. ఆరోజుల్లో సి. ఆర్. సుబ్బురామన్ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుడుగా పేరుతెచ్చుకున్నారు. సినిమాల్లోనే కాకుండా తన బృందంతో హెచ్.ఎం.వి రికార్డింగ్ సంస్థకు కూడా సంగీతం సమకూర్చుతూవుండేవారు. రామమూర్తి లోని ప్రతిభను గుర్తించిన సుబ్బురామన్ అతణ్ణి తన బృందంలో సభ్యునిగా చేర్చుకొని హెచ్.ఎం.వి సంస్థలో వయోలినిస్టు గా నియమించారు. ఆరోజుల్లో ఎ.వి.ఎం సంస్థ అధిపతి అవిచి మెయ్యప్ప చెట్టియార్ 1932లో కొందరు భాగస్వాములతో కలిసి మద్రాసులో ‘సరస్వతి స్టోర్స్’ అనే సంస్థను నెలకొల్పి తద్వారా పురాణాలు, నాటకాలకు సంబంధించిన గ్రామఫోను రికార్డులను తయారు చేసి వాటిని అమ్మే వ్యాపారం చేస్తుండేవారు. ఆ రికార్డులకు సంగీతం సమకూర్చింది సుబ్బురామన్, ఆర్. సుదర్శనం. వీరి బృందంలో రామమూర్తి వయోలిన్ స్పెషలిస్టుగా వుండేవారు. తరవాత మూడు సంవత్సరాలకు ‘సరస్వతి స్టోర్స్’ ను ‘సరస్వతి సౌండ్ ప్రొడక్షన్’ సంస్థగా మార్చి ‘అల్లి అర్జున’ అనే సినిమా నిర్మించారు. తదనంతరం ఆ సంస్థ ‘ప్రగతి పిక్చర్స్’ గాను, మరో మూడేళ్ళలో ఎ.వి.ఎం. సంస్థగాను అవతరించింది. ఆ సంస్థ ద్వారా విడుదలైన తొలి చిత్రం ‘నందకుమార్’ (1938). ఈ చిత్రం ద్వారానే తమిళ చిత్రపరిశ్రమకు ‘ప్లేబాక్’ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం. అలా సుదర్శనం సంగీతం సమకూర్చిన ఎ.వి.ఎం నిర్మించిన కొన్ని చిత్రాలకు రామమూర్తి వయోలినిస్టు గా పనిచేశారు. అదే సమయంలో రామమూర్తికి మళయాళ సంగీత దర్శకుడు పి.ఎస్. దివాకర్ తో పరిచయమై కొన్ని మళయాళ సినిమాలకు వయోలినిస్టు గా రామమూర్తి పనిచేశారు.


సుబ్బురామన్ బృందంలో విశ్వనాథన్ కు దగ్గరై...
40 వ దశకం చివర్లో సి.ఆర్. సుబ్బురామన్ సంగీతదర్శకుడిగా ఒక వెలుగు వెలుగుతూ ప్రకాశిస్తున్న రోజుల్లో రామమూర్తి వయోలినిస్టుగా ఆయన బృందంలో చేరి స్థిరపడ్డారు. ఆ బృందలోనే పనిచేసే మరొక వయోలినిస్టు, తదనంతర కాలంలో గొప్ప సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకున్న టి.జి. లింగప్ప, హార్మోనిస్టు గా వ్యవహరించే ఎం.ఎస్. విశ్వనాథన్ లతో రామమూర్తి కి స్నేహం పెరిగింది. రామమూర్తి కర్నాటక సంప్రదాయ సంగీతంలో ధిట్ట. అయితే వస్తుతః అణకువ, జంకు, బిడియం కలవాడు కావడంతో విశ్వనాథన్ లాగా చొరవ తీసుకునేవారు కాదు. మరోవైపు విశ్వనాథన్ దక్షత, సౌజన్యం, ప్రావీణ్యంతో చొచ్చుకుపోయే గుణం కలవాడు కావడంతో రామమూర్తి ఎప్పుడు వెనకడుగులోనే వుండేవారు. అదే సమయంలో గురువు సుబ్బురామన్ హటాత్తుగా మరణించడంతో, అర్ధాంతరంగా ఆగిపోయిన అతని ఆరేడు సినిమాలను విశ్వనాథన్ పూర్తిచేసి గురువుగారి ఋణం తీర్చుకున్నారు. రామమూర్తి విశ్వనాథన్ కు వాద్య సహకారాన్ని అందించి అండగా నిలిచారు. అలా సుబ్బురామన్ మొదలుపెట్టగా విశ్వనాథన్ పూర్తిచేసిన తొలి సినిమా వినోదా వారి ‘దేవదాసు’ చిత్రం. ఆ సినిమాలో వున్న మొత్తం పదకొండు పాటల్లో తొమ్మిదింటికి సుబ్బురామనే బాణీలు కట్టివుంచారు. మిగిలిన రెండుపాటలు “జగమే మాయ...బ్రతుకే మాయ”, “ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా” పాటలకు విశ్వనాథన్ మట్లు కట్టి నేపథ్యసంగీతం సమకూర్తి రికార్డింగ్ చేశారు. అలా గురువుగారి సినిమాల రికార్డింగు, రీ-రికార్డింగులు పూర్తిచేశాక, ఒకరోజు మిడ్ ల్యాండ్ థియేటర్ లో రామమూర్తితో కలిసి విశ్వనాథన్ సినిమాచూసి మౌంటురోడ్డులో నడుస్తుండగా “శంకర్-జైకిషన్ లాగా మనమిద్దరం జంటగా ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయకూడదు” అనే ప్రతిపాదన రామమూర్తి ముందుంచారు. అందుకు రామమూర్తి “సరే”అన్నారు. ఆ వెంటనే ‘చార్లీ చాప్లి ఆఫ్ ఇండియా’ గా ఆరోజుల్లో పేరుతెచ్చుకున్న ప్రముఖ హాస్యనటుడు, రచయిత, నేపథ్య గాయకుడు, దర్శకుడు, అన్నిటినీ మించి సుబ్బురామన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఎన్.ఎస్. కృష్ణన్ విశ్వనాథన్-రామమూర్తి లను జంటగా కలిపి వారిని సంగీత దర్శకులుగా పరిచయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలా ఎన్.ఎస్. కృష్ణన్ తను నటిస్తూ దర్శకత్వం వహించిన మద్రాస్ పిక్చర్స్ వారి ‘పణమ్’ (1952) చిత్రంలో విశ్వనాథన్- రామమూర్తి లను తొలిసారి సంగీతదర్శకులుగా పరిచయం చేశారు. అలా వారి తొలి చిత్రమే పెద్ద హీరో శివాజీ గణేశన్ తో మొదలవడం వారి అదృష్టం. అందులో పద్మిని, ఎన్.ఎస్. కృష్ణన్, ఎస్.ఎస్. రాజేంద్రన్, టి.ఎ. మధురం, తంగవేలు వంటి భారీ తారాగణం తోబాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఎం. కరుణానిధి (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)సమకూర్చడం మరో విశేషంగా చెప్పుకోవాలి. సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో ఎన్.ఎస్. కృష్ణన్, ఎం.ఎల్. వసంతకుమారి, టి.ఎ. మధురం చేత పాడించిన పాటలు సూపర్ డూపర్ హిట్లుగా నిలవడంతో సంగీత దర్శకులుగా విశ్వనాథన్- రామమూర్తి జంట నిలదొక్కు కున్నారు. అందులో కణ్ణదాసన్ రాయగా యమ్మెల్. వసంతకుమారి పాడిన “కుడుంబత్తిన్ విళక్కు” అనే పాట వీరికి తొలి రికార్డు. అయితే వీరిద్దరూ తొలిసారి పనిచేసిన ‘పణమ్’ చిత్రంలో వీరి పేర్లు “రామ్మూర్తి-విశ్వనాథన్” అని టైటిల్స్ లో వుంటుంది. నిజానికి రామమూర్తి విశ్వనాథన్ కన్నా ఆరేళ్ళు పెద్దవాడైనా ఎన్.ఎస్. కృష్ణన్ వారి జంటకు ఈ చిత్రం తరవాత ‘విశ్వనాథన్- రామమూర్తి’ అనే నామకరణం చేశారు. అందుకు విశ్వనాథన్ కంపోజర్ గా మంచి నైపుణ్యత కలిగినవాడని అతని పేరు ముందుకు తెచ్చారు. అలా ఇద్దరూ కలిసి 1965 దాకా వంద సినిమాలకు పైగా ‘విశ్వనాథన్-రామమూర్తి’ పేరుతో కలిసి పనిచేశారు. వీరిద్దరూ కలిసి పనిచేసిన ఆఖరి సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’. ఇద్దరూ విడిపోయాక దాదాపు 30 సంవత్సరాలవరకు కలుసుకోక పోవడం విచిత్రమే! ఆ తరువాత ఇద్దరూ జతకట్టి 1995లో సత్యరాజ్ నటించిన ‘ఎంగిరంధో వందాన్’ సినిమాకు పనిచేశారు. తమిళంలో రామమూర్తితో కలిసి సంగీత దర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో పుదయ్యళ్, భాగ పిరివినై, తంగ పథుమై, మన్నోడి మణ్ణన్, పాలుమ్ పళముమ్, పాశమలర్, ఆలయమణి, నెంజిల్ ఒరు ఆలయం, పాశం, వీరతిరుమగణ్, నెంజం మరప్పతిల్లై, సర్వర్ సుందరం, కర్ణన్, కాదలిక్క నేరమిల్లై, పణక్కార కుటుంబం, పుదియ పార్వై, ఎంగవీట్టు పిళ్ళై, అన్బే వా, వెన్నీరాడై వంటివి మచ్చుకు కొన్నిమాత్రమే. తెలుగు సినిమాల విషయానికొస్తే సంతోషం, మాగోపి, తెనాలి రామకృష్ణ, కుటుంబ గౌరవం, రాజా మలయసింహ, పెళ్లితాంబూలం మొదలైన సినిమాలకు ఇద్దరూ కలిసి పనిచేశారు.


విడిపోయిన సం(గీత)బంధం...
రామమూర్తితో పరిచయం యేర్పడినప్పుడు విశ్వనాథన్ వయసు పదిహేనేళ్ళయితే రామ్మూర్తికి ఇరవయ్యేళ్ళు. ఏ ముహూర్తాన ఇద్దరూ కలిసి సంగీతదర్శకత్వ పయనం మొదలెట్టారోగానీ వారు పట్టిందల్లా సంగీతామృతంలా ప్రవహించి అద్భుతాలు సృష్టించింది. అయితే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరమైన విషయమే! అందుకు వేదిక మద్రాసులోని ట్రిప్లికేన్ కల్చరల్ అకాడెమీ కావడం దురదృష్టం. జూన్ 16, 1963న విశ్వనాథన్-రామ్మూర్తి లకు నటుడు శివాజీ గణేశన్ “మెల్లిసై మన్నార్” (లలిత సంగీత సామ్రాట్) అనే బిరుదులను ప్రదానం చేశారు. హిందూ గ్రూప్ శ్రీనివాసన్, దర్శకుడు శ్రీధర్, చిత్రాలయ గోబు, రామచంద్రన్ ఈ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ జంట సాన్నిహిత్యాన్ని మాత్రం కొందరు ఈర్ష్యాపరులు జీర్ణించుకోలేకపోయారు. తరవాత 1964లో దర్శకుడు శ్రీధర్ నిర్మించిన ‘కలై కోవిల్’ సినిమా పెద్ద ఫ్లాపయింది. ‘కల్కి’ అనే పత్రిక ఈ సినిమాపై సమీక్ష రాస్తూ విశ్వనాథన్-రామమూర్తి ‘కాపీ’ సంగీతం కూడా సినిమా ఫెయిల్యూరుకు కారణమని ఘాటుగా విమర్శించింది. దానికి తోడు 1964 చివర్లో వచ్చిన ‘సర్వర్ సుందరం’ సినిమా అగ్నికి ఆజ్యం పోసింది. ఆ సినిమాలో ఇంటర్వల్ అవగానే వచ్చే “ఆవళి కణ్ణా... అళయిఘ ముఘం ఆవళి కణ్ణా” అనే పాట పల్లవిని విశ్వనాథన్- రామమూర్తి మ్యూజిక్ కండక్ట్ చేస్తుండగా చిత్రీకరించి, చరణాలను నగేష్, రమణి తిలకం మీద తీయాల్సి వుంది. ఏవియం స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ తిలకించేందుకు ప్రఖ్యాత హిందీ చలనచిత్ర సంగీతదర్శకుడు నౌషాద్ వచ్చి స్టూడియో అధినేత మెయ్యప్ప చెట్టియార్ సరసన కూర్చున్నారు. చిత్రీకరణ సమయానికి రామమూర్తి రాలేదు. అప్పటికే విశ్వనాథన్ సూట్ ధరించి షాట్ కు రెడీగా వున్నారు. నౌషాద్ కు సమయం తక్కువ ఉండడంతో మెయ్యప్ప చెట్టియార్ షూటింగు మొదలు పెట్టించారు. దాంతో మ్యూజిక్ కండక్టర్ గా విశ్వనాథన్ ఒక్కడే నటించాల్సి వచ్చింది. రామమూర్తి స్టూడియోకి చేరుకునే సమయానికి షూటింగు పూర్తవడం, నౌషాద్, మెయ్యప్ప చెట్టియార్ లు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. చెప్పుడు మాటలువినిన రామమూర్తి విశ్వనాథన్ కావాలనే తనను తప్పించాడని నమ్మారు. తరవాత యమ్జీఆర్ నటించిన బిఆర్. పంతులు సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’ తో విభేదాలు తారాస్థాయికి చేరాయి. విశ్వనాథన్ ఎక్కువగా ఎల్.ఆర్. ఈశ్వరికి పాడే అవకాశాలు ఇస్తున్నారని రామమూర్తి సన్నిహితులు చాడీలు చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పైగా హిందీలో శంకర్-జైకిషన్ జంటలోని శంకర్ శారద అనే గాయానికి అవకాశాలు ఇస్తున్న సంగతిని పోలికగా చూపి విశ్వనాథన్ మీద తప్పుడు అభిప్రాయాన్ని కలిగేలా చేయడంలో రామమూర్తి బృత్యులు సఫలీకృతయ్యారు. దాంతో ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. అలా ఒక గొప్ప సంగీత దర్శక ద్వయం విడిపోవడం సంగీత ప్రేమికులను బాధించే విషయమే.


మరిన్ని విశేషాలు...
విశ్వనాథన్ బృందంలో తను ఒక వయోలినిస్టుగా కొనసాగాలని మాత్రమే రామమూర్తి ఆశించారు. కానీ విశ్వనాథన్, రామమూర్తి పెద్దరికాన్ని గౌరవిస్తూ తనకు జంట సంగీతదర్శకునిగా ఉండాల్సిందిగా కోరడం విశేషం. వీరిద్దరూ సంగీత దర్శక పగ్గాలు పట్టిన నాటికి జి. రామనాథన్, కె.వి. మహదేవన్, సుబ్బయ్య నాయుడు, టి.జి. లింగప్ప, టి.ఆర్. పాప వంటి నిష్ణాతులైన సంగీత దర్శకులు తమిళ చిత్రసీమను ఏలుతూ వున్నారు. వారిని తట్టుకొని తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వీరిద్దరూ నిలుపుకోవడం గొప్పవిషయం. విశ్వనాథన్-రామమూర్తి జంట విడిపోయాక విశ్వనాథన్ విజయవనతమైన సంగీత దర్శకునిగా ఎనిమిది వందలకు పైగా సినిమాలకు అద్భుత సంగీతం అందించారు. కానీ రామమూర్తి మాత్రం 1966-86 మధ్యకాలంలో కేవలం 19 చిత్రాలకు మాత్రమే సంగీతదర్శకత్వం వహించగలిగారు. అందుకు కారణం సక్సస్ రేటు తక్కువగా ఉండడమే. రామమూర్తి మంచి వయోలినిస్టు, మంచి కండక్టరు కానీ కంపోజర్ మాత్రం కాదు. ఆయన సంగీత దర్శకుడుగా రాణించకపోవడానికి అదే ప్రధాన కారణం. 2006 లో సత్యభామ విశ్వవిద్యాలయం రామమూర్తికి విశ్వనాథన్ తో కలిపి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రిణి జయలలిత రామమూర్తికి ‘తిరై ఇసై చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు. ఈ బిరుదుతోబాటు రామమూర్తికి అరవై బంగారు నాణేలతోబాటు ఒక నూతన కారును కూడా బహుమానం గా ఇచ్చారు. విశ్వనాథన్ తో విడిపోయాక రామమూర్తి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో భీంసింగ్ దర్శకత్వం వహించిన ‘సాధు మిరండాళ్’, ‘ఆలయం’, మురసోలి మారన్ దర్శకత్వం వహించిన ‘మరక్క ముడియుమా?’, విన్సెంట్ దర్శకత్వం వహించిన ‘ఎంగళ్లుక్కుం కాలం వరుం’, ఎస్. రామనాథన్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టత్తు రాణి’, టి.,ఆర్. రామన్న దర్శకత్వంలో నిర్మించిన ‘నాన్’, ‘మూండ్రెళేత్తు’, ‘ఆవళుక్కు ఆయిరం కంగై’ సినిమాలున్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా వున్నప్పుడు విశ్వనాథన్-రామమూర్తి లకు పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున సిఫారసు చేసినా ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు. 2002 లో చెన్నై లోని కామరాజ్ మెమోరియల్ హాల్లో విశ్వనాథన్-రామమూర్తి కలిసి ‘నినైత్తలే ఇణిక్కుమ్’ పేరిట ఒక అద్భుతమైన సంగీత విభావరిని సంయుక్తంగా నిర్వహించడం కొసమెరుపు. “ఎంగె నిమ్మత్తి” అనే పాటకు రామమూర్తి సోలో వయోలిన్ తో అందించిన అద్భుత సంగీతం మరపురానిది అని జయలలిత ఎన్నోసార్లు గుర్తుచేస్తుండేవారు. రామమూర్తికి నలుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు. శాస్త్రీయ సంగీతంలోని 72 మేళకర్త రాగాలను అద్భుతంగా పలికించగల రామమూర్తి జ్వరంతో బాధపడుతూ ఏప్రిల్ 17 2013 న తన 91 వ ఏట చెన్నై లో కన్ను మూశారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.