కష్టాలు దాటి.. సంగీత దర్శకుడిగా మారి

ఆయన తొలి ఆల్బమే ఎంతో ‘కిక్‌’ ఇచ్చింది. ఆయన పాటల్లో ‘రేసుగుర్రం’ మించిన ‘దూకుడు’ కనిపిస్తుంది. అదీ ఆయన సంగీతంలోని ‘పవర్’. నేపథ్య సంగీతంలోనూ ‘సరైనోడు’ అనిపించుకున్నాడు. నటుడిగా, గాయకుడిగా, డ్రమ్‌ ప్లేయర్‌ (డ్రమ్మర్‌)గా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల్నిఅలరిస్తున్న ఆయనెవరో కాదు ఎస్‌.ఎస్‌.థమన్‌. నేడు (నవంబరు 16 ) థమన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మీ కోసం...


అలా ఆసక్తి పెరిగింది...

తమన్‌ పూర్తి పేరు సాయిశ్రీనివాస్‌ తమన్‌. ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. స్వస్థలం నెల్లూరు.. పెరిగిందంతా చెన్నైలో. తండ్రి అశోక్‌ కుమార్‌ ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద డ్రమ్ములు వాయించేవారు. అమ్మ సావిత్రి గాయిని. దీంతో చిన్నతనం నుంచీ తమన్‌కు సంగీతంపై మక్కువ పెరిగింది. ఆ స్ఫూర్తితో ఆరేళ్లకే డ్రమ్ములు వాయించడం మొదలుపెట్టాడు తమన్‌. అమ్మ, నాన్న వెళ్లే ప్రతి స్టూడియోకి‌ వెళ్లేవాడు. అక్కడున్న వాయిద్య కళాకారుల్ని గమనించేవాడు.

హాబీనే వృత్తిగా మారింది..

తమన్‌కి 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన మొదటి సినిమా రికార్డింగ్‌ జరిగింది. మాధవపెద్ది సురేశ్‌.. తమన్‌ని ‘భైరవద్వీపం’ సినిమాకు డ్రమ్మర్‌గా తీసుకున్నారు. తొలి పారితోషికంగా రూ.30 అందుకున్నాడు తమన్‌. ఆ తరువాత కొంతకాలానికి తండ్రి చనిపోవడంతో ఆరో తరగతి చదువుతున్న తమన్‌ విద్యకు దూరమయ్యారు. ఈ సమయంలో తమన్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే తన జీవితం సంగీతంతో ముడిపడి ఉందని తెలుసుకున్నాడు. హాబీగా నేర్చుకున్న సంగీతం వృత్తిగా మార్చుకున్నారు. ఆయన తండ్రి ఎల్‌ఐసీ డబ్బులురాగా వాటితో ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ పరికరాలు కొని, వాటితో జీవితం సాగించాడు.

రూ.30 నుంచి రూ.3 వేల వరకు..

తండ్రి మరణంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమన్‌ని ప్రోత్సహించారు. వారి సాయంతో విశ్రాంతి లేకుండా అనేక కార్యక్రమాలు చేశాడు. అతి తక్కువ కాలంలో రిథమ్‌ డ్రమ్స్‌ ప్లేయర్‌ అయిపోయాడు. రూ.30తో ప్రారంభమైన ఆయన పారితోషికం రోజుకి రూ.3 వేలకు చేరుకుంది. ‘1994 నుంచి 1997 వరకు నాకు అతి కష్టమైన రోజులు. ఆ సమయంలో రాజ్‌కోటి, మాధవపెద్ది, బాలసుబ్రమణ్యం, గంగై అమరన్‌, శివమణిగారు నన్ను ఆదుకున్నారు. వాళ్ల దగ్గరే ఎక్కువ పనిచేశా. నాలుగేళ్లలో దాదాపు 4 వేల స్టేజ్‌ షోలు చేశా. డ్రమ్మర్‌గా నా కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి..’ అని తమన్‌ చెప్పారు.

అందుకే మళ్లీ నటించలేదు..

దర్శకుడు శంకర్‌ వినూత్నంగా ఆలోచించి తీసిన సినిమా ‘బాయ్స్‌’. ఈ సినిమాలో కథానాయకుడు సిద్ధార్థ్‌ స్నేహితుడిగా డ్రమ్ములు వాయించే వ్యక్తి కావాలని దాదాపు 200 మందికి తెర పరీక్ష చేశారు. కానీ శంకర్‌కు ఎవరూ నచ్చలేదు. తమన్‌ అప్పటికే డ్రమ్ములు వాయిస్తున్న విధానాన్ని రెహమాన్‌ చెప్పడంతో శంకర్‌ ఆయన్ను తీసుకున్నాడు. దీని తర్వాత కూడా తమన్‌కు నటించే అవకాశం వచ్చింది.. కానీ ఆయన తిరస్కరించాడు. ‘తెరపై నటించాలంటే చాలా కష్టమండీ బాబూ.. అందుకే ‘బాయ్స్‌’ తర్వాత మళ్లీ దాని జోలికి వెళ్లలేదు..’ అని ఓ సారి తమన్‌ పేర్కొన్నాడు.

‘ఒక్కడు’తో జీవితం మారింది..

మణిశర్మ దగ్గర ‘ఒక్కడు’ కోసం పనిచేయడం తన జీవితాన్ని మార్చేసిందని తమన్‌ అంటుంటారు. ఆయన వద్ద పనిచేస్తూ ఎనిమిదేళ్లు ఉండిపోయారు. తమన్‌కు 24 ఏళ్లు వచ్చే సరికీ 64 మంది సంగీత దర్శకులతో 900 సినిమాలకు పనిచేశారు. తెలుగు, మరాఠీ, ఒరియా, మలయాళం, తమిళ్‌, కన్నడ.. ఇలా వివిధ భాషల్లో నెంబరు 1 ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో రోజుకు రూ.40 వేలు చార్జ్‌ చేసేవారు.

సంగీత దర్శకుడిగా అవకాశం..

24 ఏళ్ల వయసులో తమన్‌కు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అది తమిళ సినిమా. ఆ తర్వాత రవితేజ ‘కిక్‌’ సినిమాతో సిక్స్‌ కొట్టారు. ఆ సమయంలో టెన్షన్‌తో 11 కిలోలు తగ్గానని తమన్‌ అంటుంటారు. ఆపై ‘బృందావనం’, ‘రగడ’, ‘మిరపకాయ్‌’, దూకుడు’, ‘బాడీగార్డ్‌’, ‘బిజినెస్‌మెన్‌’, ‘బాద్‌షా’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘భాగమతి’.. ఇలా అతి తక్కువ కాలంలోనే 72 సినిమాలకు సంగీతం అందించారు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’ ఆయన వందో సినిమా. ఈ ప్రయాణంలో తమన్‌ ఎన్నో ఫ్లాప్‌లు అందుకున్నారు.. ‘అల వైకుంఠపురములో..’లాంటి హిట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ‘క్రాక్‌’, ‘వకీల్‌ సాబ్‌’, ‘టక్‌ జగదీష్‌’, ‘సర్కారు వారి పాట’ వంటి క్రేజీ ప్రాజెక్టులకు బాణీలు అందిస్తున్నారు.

చివరి ఫొటో..

అక్టోబరు 9 తమన్‌ సోషల్‌మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ యూ నాన్న.. 25 ఏళ్ల క్రితం 1995లో నేను నా ప్రియమైన తండ్రితో తీసుకున్న చివరి ఫొటో. నువ్వు మా వెంటే ఉన్నామని, ఉంటావని నాకు తెలుసు’ అని భావోద్వేగానికి గురయ్యారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.